Skip to main content

ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న ‘ఆయుష్‌’తో.. మంచి కెరీర్‌ అందుకోండిలా!

ఆయుర్వేదం, యోగా అండ్‌ నేచురోపతి, యునానీ, సిద్ధ వైద్యం, హోమియోపతి.. వీటినే సంక్షిప్తంగా ‘ఆయుష్‌’గా పిలుస్తారు.

ఇవి మన దేశంలో దశాబ్దాలుగా సంప్రదాయ వైద్య విధానాలుగా పేరొందాయి. ఇటీవల కాలంలో ఈ వైద్య రీతులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది! ముఖ్యంగా కరోనా పరిణామాలతో ఆయుష్‌ వైద్య విధానాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఈ విభాగాల్లోని వైద్యులకు డిమాండ్‌ పెరుగుతోంది. బ్యాచిలర్‌ నుంచి పీహెచ్‌డీ వరకూ...ఆయుష్‌ విభాగాలకు సంబంధించి నైపుణ్యాలు అందుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ఆయుష్‌ కోర్సులు, అర్హతలు, కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం..

‘ఇంట్లోనే లభించే చిరుధాన్యాలతో, ఔషధ మొక్కల ఆకులతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మనకు అందుబాటులోనే ఉండే ప్రకృతి వనరులతో ఆయుర్వేద విధానంలో,యోగా సాధన వంటి వాటితో శారీరక ద్రుఢత్వాన్ని సొంతం చేసుకోవచ్చు’. ఇటీవల కాలంలో.. తరచూ వినిపిస్తున్న మాటలు!!వీటిని వ్యక్తులు ఎవరికివారు సొంతంగా చేసుకుంటే.. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే ఆస్కారముంది. అందుకే ఆయా వైద్య విధానాలను శాస్త్రీయ పద్ధతిలో అభ్యసించి.. చిక్సిత అందించేందుకు మార్గం ఆయుష్‌ కోర్సులు. ఈ కోర్సుల్లో ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే అడుగుపెట్టి.. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు.

ఇంటర్‌తో ప్రవేశం..
ఇంటర్మీడియెట్‌ బైపీసీతో.. బ్యాచిలర్‌ స్థాయి కోర్సులైన బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఎన్‌వైఎస్, బీయూఎంఎస్‌ల్లో అడుగు పెట్టొచ్చు. ఈ కోర్సులు ఉత్తీర్ణులయ్యాక పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేసుకుంటే.. సంబంధిత విభాగాల్లో వైద్యులుగా రాణించే అవకాశముంది.

బీఏఎంఎఎస్‌..
ఆయుర్వేదానికి సంబంధించి శాస్త్రీయ పద్ధతుల్లో చికిత్సను అందించే మెళకువలను నేర్పే కోర్సు.. బీఏఎంఎస్‌(బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ). ఇది అయిదున్నరేళ్ల కోర్సు. ఎంబీబీఎస్‌లో మాదిరిగానే ఇందులో అనాటమీ, ఫిజియాలజీ, పెడియాట్రిక్స్, జనరల్‌ మెడిసిన్‌ తదితర సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. ఎండీ– ఆయుర్వేద, ఎంఎస్‌–ఆయుర్వేద వంటి ఉన్నత విద్య కోర్సుల్లో చేరొచ్చు. ఎంబీబీఎస్‌లోని జనరల్‌ మెడిసిన్‌కు సరితూగే కాయ చికిత్స, జనరల్‌ సర్జరీకి సమానమైన శల్యతంత్ర కోర్సులు పీజీ స్పెషలైజేషన్లుగా ఉన్నాయి. కోర్సులు పూర్తయ్యాక ఆయుష్‌ విభాగాల్లో, ప్రైవేటు ఆయుర్వేద ఆస్పత్రుల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.

బీహెచ్‌ఎంఎస్‌..
అల్లోపతికి దీటుగా ఆదరణ పొందుతున్న మరో సంప్రదాయ వైద్య విధానం.. హోమియోపతి. బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ(బీహెచ్‌ఎంస్‌) ద్వారా హోమియోపతి చికిత్సపై అవగాహన పెంచుకోవచ్చు. ఇది కూడా ఐదున్నరేళ్ల కోర్సు. ఇందులోనూ ఎంబీబీఎస్‌ కరిక్యులంలో మాదిరిగా అనాటమీ, ఫిజియాలజీ తదితర విభాగాలు ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రస్తుతం విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. పలు కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ సైతం ప్రత్యేకంగా హోమియోపతి వైద్యాన్ని అందిస్తున్నాయి. ఫలితంగా బీహెచ్‌ఎంఎస్‌తో నెలకు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు వేతనం అందుతోంది. ఉన్నత విద్యలో.. మెటీరియా మెడికా, హోమియోపతిక్‌ ఫిలాసఫీ వంటి స్పెషలైజేషన్లకు డిమాండ్‌ నెలకొంది.

బీఎన్‌వైఎస్‌..
బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సైన్సెస్‌..బీఎన్‌వైఎస్‌. ఇది ఐదున్నరేళ్ల కోర్సు. ప్రజల్లో ప్రకృతి వైద్యం పట్ల పెరుగుతున్న ఆసక్తి కారణంగా ఈ కోర్సుకు డిమాండ్‌ నెలకొంది. బీఎన్‌వైఎస్‌ను పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి.

యునానీ(బీయూఎంఎస్‌)..
బీయూఎంఎస్‌.. బ్యాచిలర్‌ ఆఫ్‌ యునానీ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ. ఇది పూర్తిగా ప్రకృతి వైద్యం. ఇది ఐదేళ్ల కోర్సు. బీయూఎంఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులకు పీజీ స్థాయిలో గైనకాలజీ, సోషల్‌ అండ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, ఫార్మకాలజీలకు సరితూగే ఎండీ, ఎంఎస్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే మరో ఆయుష్‌ కోర్సు.. బ్యాచిలర్‌ ఆఫ్‌ సిద్ధా మెడిసిన్‌ అండ్‌ సర్జరీ (బీఎస్‌ఎంఎస్‌)ని కూడా అభ్యసించొచ్చు.

ఇంకా చదవండి : part 2: ఆయుష్‌లో నీట్‌ స్కోర్‌ ఆధారంగా.. ఆల్‌ఇండియా, రాష్ట్రాల కోటాల్లో సీట్ల భర్తీ ఇలా..

Published date : 29 Jun 2021 05:43PM

Photo Stories