ఐఐటీల్లో చేరాలనే కల.. అడ్వాన్స్‌డ్ వైపు అడుగులు వేయండిలా!
ఇటీవల జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు వెలువడ్డాయి. మెయిన్ ముగిసిన నెల రోజుల్లోపే అడ్వాన్స్‌డ్ నిర్వహించే అవకాశముంది. మరోవైపు ఈ పరీక్ష నిర్వాహక ఇన్‌స్టిట్యూట్.. ఐఐటీ–ఖరగ్‌పూర్ తాజాగా వెబ్‌సైట్‌ను, ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. జేఈఈ–అడ్వాన్స్‌డ్–2021 తాజా సమాచారం, అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ టిప్స్...
ఐఐటీల్లో చేరాలనే కలతో దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ తొలి రోజు నుంచే దృష్టిపెట్టే పరీక్ష.. జేఈఈ అడ్వాన్స్‌డ్. తాజాగా ఐఐటీ–ఖరగ్‌పూర్.. అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి వెబ్‌సైట్‌ను, పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఇది విద్యార్థులకు ఎంతో ఉపశమనం కలిగించే పరిణామంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో పేర్కొన్న అర్హత ప్రమాణాలు, పరీక్ష విధానం, సిలబస్ వంటి వివరాల ఆధారంగా విద్యార్థులకు పరీక్షపై స్పష్టత లభిస్తుంది.
మార్పులు ఉంటాయా?
అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులకు పరీక్ష సిలబస్, ప్యాట్రన్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా అనే సందేహం ఎదురవుతుంది. గత ఏడాది రెండు పేపర్లలో.. ప్రతి పేపర్‌లో 54 ప్రశ్నలు, 198 మార్కులు చొప్పున మొత్తం రెండు పేపర్లు కలిపి 396 మార్కులకు పరీక్ష జరిగింది. ప్రతి పేపర్‌లోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 18 చొప్పున ప్రశ్నలు అడిగారు. ఈసారి కూడా ఇదే విధానంలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం ఉంటుందని స్పష్టం చేశారు. దాంతో గత ఏడాది మాదిరిగానే పరీక్ష జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే పరీక్ష ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో జరుగుతుంది.
అర్హతలు వెసులుబాట్లు..
కరోనా కారణంగా సీబీఎస్‌ఈతోపాటు దాదాపు అన్ని రాష్ట్రాల బోర్డులు వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే ఫలితాలు వెల్లడించే పరిస్థితి నెలకొంది. దాంతో అడ్వాన్స్‌డ్ అభ్యర్థులకు ఉపశమనం కల్గించేలా.. అర్హత నిబంధనల్లో పలు వెసులుబాట్లు కల్పించారు.
75 శాతం మార్కుల నిబంధన తొలగింపు..
జేఈఈ–అడ్వాన్స్‌డ్–2021లో 10+2/ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను తొలగించారు. గత ఏడాది కూడా ఈ నిబంధనను తొలగించి.. ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించిన వారంతా అడ్వాన్స్‌డ్‌కు అర్హులేనని పేర్కొన్నారు. వాస్తవానికి గతంలో అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావాలంటే.. జేఈఈ–మెయిన్‌లో అర్హతతోపాటు ఇంటర్మీడియెట్ తత్సమాన బోర్డ్ పరీక్షల్లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉంది. కరోనా కారణంగా అడ్వాన్స్‌డ్–2020లో ఈ నిబంధన తొలగించారు. ఈ ఏడాది కూడా ఇదే విధంగా మినహాయింపు కల్పించారు.
2020 అడ్వాన్స్‌డ్‌కు హాజరుకాకుంటే నేరుగా..
2020లో జేఈఈ–మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించి.. అనివార్య కారణాల వల్ల అడ్వాన్స్‌డ్‌కు హాజరు కాని విద్యార్థులు.. ఈ ఏడాది నేరుగా అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావచ్చు. వారంతా జేఈఈ–మెయిన్–2020 స్కోర్ ఆధారంగానే అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితంగా అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య కొంత పెరిగే అవకాశముంది. గతేడాది మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించి.. అడ్వాన్స్‌డ్‌కు హాజరు కాని విద్యార్థులు దేశ వ్యాప్తంగా పది వేల మంది వరకు ఉంటారని అంచనా. వీరంతా అడ్వాన్స్‌డ్‌కు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
2.5 లక్షల జాబితాలో నిలవాల్సిందే..
జేఈఈ–మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించి.. టాప్ 2.5 లక్షల మంది జాబితాలో నిలిచిన వారినే ఐఐటీల్లో సీట్ల కేటాయింపులో పరిగణనలోకి తీసుకుంటారు. అంటే.. జేఈఈ ఉత్తీర్ణుల్లో 2.5 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పించనున్నారు. అలాగే సీట్ల కేటాయింపులో టాప్–20 పర్సంటైల్ నిబంధన కూడా కొనసాగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
20 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు..
ఐఐటీల్లో మహిళా విద్యార్థుల కోసం 20 శాతం సూపర్ న్యూమరరీ సీట్ల విధానాన్ని కొనసాగించనున్నారు. గత నాలుగేళ్లుగా అమలవుతున్న ఈ విధానంతో ఐఐటీల్లో మహిళా విద్యార్థుల సంఖ్య కొంత పెరిగింది. దీంతో దీన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని నిర్ణయించారు.
జేఈఈ–అడ్వాన్స్‌డ్ సమాచారం..
అర్హత: 10+2/ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత.
- అడ్వాన్స్‌డ్ పరీక్షలో ప్రతిభ, ఇతర ఉత్తీర్ణత నిబంధనల ఆధారంగా 23 ఐఐటీల్లో అడుగుపెట్టే అవకాశం.
- అడ్వాన్స్‌డ్ ర్యాంకు ఆధారంగా ఐఐటీలతోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ (ఐఐపీఈ)–విశాఖపట్నం, ఐఐఎస్‌సీ–బెంగళూరు, ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌లు,ఐఐఎస్‌టీ–తిరువనంతపురం, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ(రాయ్‌బరేలి)లలో కూడా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
- ఐఐటీల్లో గత ఏడాది గణాంకాల ప్రకారం– నాలుగేళ్ల బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ కోర్సుల్లో మొత్తం 14,770 సీట్లు. వీటికి అదనంగా మహిళలకు 20 శాతం మేరకు సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయించే అవకాశం.
- జేఈఈ–మెయిన్ ద్వారా అర్హత లభించే ఎన్‌ఐటీలు 32. వీటిలో అందుబాటులో ఉన్న సీట్లు 22,655.
- జేఈఈ–మెయిన్ ర్యాంకు ఆధారంగా 26 ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం లభిస్తుంది.
- జేఈఈ–మెయిన్ ర్యాంకు ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మరో 29 ఇన్‌స్టిట్యూట్‌లలో సీటు పొందొచ్చు.
- వీటిలో అందుబాటులో ఉన్న సీట్లు.. 5,620
- జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 వెబ్‌సైట్: http://jeeadv.ac.in/
ఇంకా చదవండి: part 2: జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రిపరేషన్ పటిష్టంగా సాగించండిలా..