Skip to main content

పది, ఇంటర్‌తోనే...రక్షణ దళాల్లో కొలువులు

దేశ సేవ చేయాలనే ఆసక్తి, సవాళ్లకు వెరువని నైజం ఉంటే.. పదోతరగతి, ఇంటర్, ఇంజనీరింగ్‌తో రక్షణ దళాల్లో ఉజ్వల కెరీర్ ఖాయం చేసుకోవచ్చు.
  యువతకు రక్షణ రంగంలో లక్షణమైన కొలువులు అందించేందుకు ఆర్మీ, కోస్ట్ గార్డ్ తాజాగా నోటిఫికేషన్‌లు విడుదల చేశాయి. పదోతరగతితో నావిక్ ఎన్‌బీ పోస్టులు, ఇంటర్‌తో ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతతో టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.

సాధించాలనే పట్టుదల, పరిశ్రమించే తత్వం ఉంటే.. రక్షణ దళాల్లో కొలువు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. భద్రతా దళాల్లో చాలెంజింగ్ కెరీర్ కోరుకునే యువతకు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ (భారతీయ తీరగస్తీ దళం) ఆహ్వానం పలుకుతున్నాయి. అర్హులకు పరీక్షలను, ఇంటర్వ్యూలను నిర్వహించి.. అందులో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఉన్నత ఉద్యోగాలను అందిస్తున్నాయి. ఆర్మీ, కోస్ట్‌గార్డ్‌కు ఎంపికైతే ఆకర్షణీయ వేతనాలతోపాటు ఉన్నత హోదాలను అందుకోవచ్చు.

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు:
దేశ రక్షణ, సముద్ర తీర భద్రత కోసం నిత్యం పహార కాసే ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగమంటే చక్కటి కేరీర్ సొంతమైనట్లే. ఆకర్షణీయమైన జీతాలు, అలవెన్సులు, ప్రమోషన్లు పొందొచ్చు. పదోతరగతి విద్యార్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టులు:
నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్-స్టీవార్డ్ (ఎన్‌బీ) అంటే ఫుడ్ ప్రిపేర్ చేయడం, మెను తయారు చేయడం, హౌస్ కీపింగ్, స్టోర్ కీపర్ సహా అవసరమైన ఏ డ్యూటీలకైన కేటాయించవచ్చు.
అర్హతలు:
నావిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ కేటగిరీ 50శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు :
18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. 01.04.1998 నుంచి 31.03.2002 మధ్య జన్మించిఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయో పరిమితి సడలింపు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ:
నావిక్ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌లను నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని మాత్రమే ఉద్యోగంలోకి తీసుకుంటారు.
పరీక్ష విధానం:
నావిక్ పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. సిలబస్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్‌లో ముఖ్యంగా వెర్బల్, నాన్ వెర్బల్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
జీతభత్యాలు:
నావిక్ పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభ వేతనం 7వ పే కమిషన్ 3వ లెవల్ ప్రకారం నెలకు రూ.21,700 అందిస్తారు. వీటికి అదనంగా అలవెన్సులు, భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయి. ప్రమోషన్ తర్వాత ప్రధాన అధికారి హోదాలో డీఏతోపాటు రూ.47,600 (8వ పే లెవల్) అందిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 30.10. 2019
దరఖాస్తు ముగింపు తేదీ: 08.11.2019
అడ్మిట్ కార్డ్: 17-22 నవంబర్ 2019
పరీక్ష: నవంబర్ నెలాఖరులో ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in

ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టులు :
భారత రక్షణ ద ళాల్లో ఒకటైన ఆర్మీలో పనిచేయడం ఎంతో మంది విద్యార్థుల కల. ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ద్వారా ఇంజనీరింగ్ అర్హతతో అత్యున్నతస్థాయి ఉద్యోగం పొందే అవకాశం లభిస్తుంది. ఉన్నతస్థాయి హోదాతోపాటు, ఆకర్షణీయమైన జీతభత్యాలు, అలవెన్సులు అందుకోవచ్చు.
పోస్టులు:
ఇండియన్ ఆర్మీ 131వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 40 పోస్టులు భర్తీ చేయనుంది.
అర్హతలు:
  • భారతీయ పౌరుడై ఉండాలి.
  • అవివాహిత పురుష అభ్యర్థులై ఉండాలి.
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందాలి. కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎత్తు :
ఆర్మీ నిబంధనలకు అనుగుణంగా 157.5 సెం. మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.
వయసు:
  • టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20-27 ఏళ్లు ఉండాలి. జూలై 2, 1993 నుంచి జూలై 1, 2000 మధ్య జన్మించినవారై ఉండాలి.
  • పదోతరగతి, 12వ తరగతి మెమోలో ఉన్న పుట్టిన తేదీని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఎటువంటి వయోపరిమితి సడలింపు లేదు.
ఎంపిక ప్రక్రియ :
 ఇంజనీరింగ్‌లో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి రెండు దశల్లో ఇంటర్వ్యూ, పరీక్షలను నిర్వహిస్తారు. మొదటి దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను రెండో దశకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఐదు రోజుల పాటు అలహాబాద్, బోపాల్, బెంగళూర్, కపుర్తలా అభ్యర్థులకు కేటాయించిన ఏదో ఒక ప్రదేశంలో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్యూలను నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపించిన అభ్యర్థులకు చివరిగా మెడికల్ టెస్ట్ ఉంటుంది.
 శిక్షణ:
 ఫైనల్‌గా ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తిచేసినవారికి ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం ఖాయమవుతుంది.
 జీతభత్యాలు :
 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైఫండ్‌గా అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్ హోదాలో పే బ్యాండ్ ప్రకారం రూ.56,100-77,500 జీతాన్ని చెల్లిస్తారు. వీటికి ఆదనంగా గ్రూప్ ఇన్సూరెన్స్, వసతి, భోజన సౌకర్యాలు, ఇంకా అదనపు ప్రోత్సాహాకాలు కూడా ఉంటాయి.
  లెఫ్టినెంట్ నుంచి కల్నల్, లెఫ్టినెంట్ జనరల్, అత్యంత ఉన్నత పదవీ అయిన సీఓఎస్ (చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్) వరకు గల హోదాలలో ప్రమోషన్లు పొందేకొద్ది వాటికి అనుగుణంగా జీతభత్యాలు, ప్రోత్సాహకాలు పెరుగుతూ ఉంటాయి.
 ముఖ్యమైన తేదీలు :
 దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
 పరీక్ష ఫీజు: ఎటువంటి పరీక్ష ఫీజు లేదు.
 దరఖాస్తు ముగింపు తేదీ: 14.11.2019
 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
 
 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్:
 ఇండియన్ ఆర్మీ.. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు-43కు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల శిక్షణ అనంతరం ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు పర్మనెంట్ కమిషన్‌లో ఆఫీసర్లుగా నియమిస్తారు.
 ఖాళీలు: 90
 కోర్సు ప్రారంభం: జులై 2020.
 అర్హత: కనీసం 70 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్)ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
 వయసు:16½ నుంచి 19½ ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తుకు చివరితేదీ: నవ ంబర్ 13, 2019.
 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
Published date : 24 Oct 2019 03:43PM

Photo Stories