Skip to main content

మిలటరీ స్కూల్స్... ఇండియన్ మిలిటరీలో చేరేందుకు మార్గం

ఇండియన్ మిలటరీ.. ధైర్య సాహసాలు, దేశ భక్తి ఉన్న యువతకు స్వప్న సౌధం.. అందులో అడుగుపెట్టడం ఓ ఆశయం.. అలాంటి ఆశకు.. ఆశయ సాధనకు పిన్న వయసులోనే శ్రీకారం చుట్టవచ్చు.. వాటికి మార్గమే రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్...‘సైనిక్ స్కూల్స్’పై కె రీర్ గెడైన్స్.

రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్
నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో అడుగు పెట్టేందుకు తొలి మెట్టుగా ఈ రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్‌ను పేర్కొనవచ్చు. ఇందులో 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోధిస్తారు. 12వ తరగతి పూర్తయ్యాక నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో ప్రవేశం కూడా లభించినట్లే.

ఏటా రెండుసార్లు:
అడ్మిషన్ కోసం ఏటా రెండు సార్లు (జనవరి, జూలై) ప్రవేశ ప్రక్రియ నిర్వహించడం ఈ మిలటరీ కాలేజ్ ప్రత్యేకత. ప్రతి సెషన్ ప్రవేశానికి దాదాపు ఏడాది ముందుగా నోటిఫికేషన్ వెలువడుతుంది. నిర్దేశిత అకడెమిక్ సెషన్ ప్రారంభం నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా పూర్తి చేసిన విద్యార్థులు మాత్రమే అర్హులు. అంతేకాకుండా ఆ సమయానికి విద్యార్థి వయస్సు 11 1/2 నుంచి 13 సంవత్సరాల మధ్యలో మాత్రమే ఉండాలి. నోటిఫికేషన్, దరఖాస్తుల విక్రయాలను రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్‌తోపాటు ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా చేపడతాయి. ఇక.. ప్రవేశ పరీక్షను ప్రతి ఏటా జూన్, జనవరి నెలల్లో నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్‌లు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. ఇలా ప్రతి సెషన్‌కు 25 మందికి ప్రవేశం లభిస్తుంది.

పరీక్ష ఇలా:
మొత్తం నాలుగు వందల మార్కులకు ఇంగ్లిష్ (125), మ్యాథమెటిక్స్ (200), జనరల్ నాలెడ్జ్ (75) సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ పేపర్‌ను ఇంగ్లిష్ లేదా హిందీలో రాసే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా జనరల్ నాలెడ్జ్ పేపర్‌ను ప్రాంతీయ భాషల్లో రాయవచ్చు. ప్రశ్నల స్థాయి ఏడో తరగతి సిల బస్ మేరకే ఉంటుంది. అయితే ఇంటర్వ్యూ(వైవా) దశకు చేరు కోవాలంటే మాత్రం ప్రతి సబ్జెక్టులో కచ్చితంగా 50 శాతం మార్కులు సాధించాలి.

స్కాలర్‌షిప్ సదుపాయం:
రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ స్కూల్‌లో ప్రవేశం పొంది న విద్యార్థులకు వారికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూ.10 వేల నుంచి 20 వేల వరకు స్కాలర్‌షిప్ లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో మన రాష్ట్రం రూ. 14 వేల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. దీంతోపాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఎన్నో రకాలుగా ఆర్థికంగా చేయూతనందిస్తున్నాయి.

ఎన్నెన్నో ఎక్స్‌ట్రా కరిక్యులర్స్:
రాష్ట్రీయ మిలటరీ అకాడెమీలో అడుగుపెట్టిన విద్యార్థులకు క్లాస్ రూం టీచింగ్‌తోపాటు ఎన్నో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. రైఫిల్ షూటింగ్, రైడింగ్, మ్యూజిక్, ఆర్ట్, జర్నలిజం కరెంట్ అఫైర్స్ తదితర అంశాల్లో కూడా శిక్షణనిస్తారు. ముఖ్యం గా దేహధారుడ్యతను పెంచే అంశాలకు ప్రాధాన్యమిస్తారు. ఫలితంగా విద్యార్థి 12వ తరగతి పూర్తి చేసుకునే సమయానికి రక్షణ శాఖకు అవసరమయ్యే నైపుణ్యాలన్నీ సొంతం చేసుకుంటాడు.

వెబ్‌సైట్: www.rimc.org

సైనిక్ స్కూల్స్
నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో ప్రవేశించడానికి అవసర మయ్యే అన్ని అర్హతలను ‘రేపటిపౌరులకు’ అందించాలనే సమున్నత ఆశయంతో వీటిని 1961లో ప్రారంభించారు. దేశంలో ఇప్పటి వరకు 24 సైనిక్ స్కూల్స్ స్థాపించారు. ఇందులో దాదాపు 12 వేల మందికి పైగా విద్యా ర్థులు ఆరు నుంచి 12వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. మన రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కోరు కొండ సైనిక్ స్కూల్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

ప్రవేశ విధానమిదే:
సైనిక్ స్కూల్స్‌లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి.. ఎంట్రన్స్‌టెస్ట్ నిర్వహిస్తారు. ఎంట్రెన్స్‌టెస్ట్ తర్వాత నిర్వహించే ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్‌లలో రాణిస్తేనే ప్రవేశం లభిస్తుంది. పదకొండో తరగతిలో ప్రవేశానికి మాత్రం పదో తరగతిలో సాధించిన మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు. సైనిక్ స్కూల్స్ ప్రధాన ప్రత్యేకత హోం స్టేట్ విద్యార్థులకు సీట్ల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇవ్వడం. నిర్దేశిత స్కూల్ ఏర్పాటైన రాష్ట్రంలోని విద్యార్థులకు ఆ స్కూల్ మొత్తం సీట్లలో 67 శాతం కేటాయిస్తారు.

పరీక్ష తీరు తెన్నులు:
సైనిక్ స్కూల్స్‌లో ఆరో తరగతిలో ప్రవేశానికి 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్, లాంగ్వేజ్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్ టెస్ట్ అంశాలు వంద మార్కులకు చొప్పున ఉంటాయి. లాంగ్వేజ్ ఎబి లిటీ టెస్ట్‌లో ఇంగ్లిష్‌లోని బేసిక్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. ఈ మూడు విభాగాల ప్రశ్నలు కూడా సాధారణ స్థాయిలోనే ఒక యావరేజ్ విద్యార్థి కూడా సాధించేలా ఉంటాయి.

తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష మాత్రం 450 మార్కులకు ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్(200 మార్కులు), సైన్స్ (75 మార్కులు), ఇంగ్లిష్ (100 మార్కులు), సోషల్ స్టడీస్ (75 మార్కులు) పేపర్లు ఉంటాయి. ఇవి కూడా విద్యార్థులు తాము ప్రస్తుతం చదువుతున్న తరగతి స్థాయిలోనే ఉంటాయి.

దరఖాస్తు ఇలా:
సైనిక్ స్కూల్స్‌లో ప్రవేశానికి సాధారణంగా ప్రతి ఏటా నవంబర్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల వ్యవధి ఉంటుంది. నిర్దేశిత సైనిక్ స్కూల్ వెబ్‌సైట్ నుంచి లేదా సంబంధిత స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి దరఖాస్తు పొందవచ్చు.

వయో నిబంధనలు:
ఆరో తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు 10 నుంచి 11 ఏళ్లలోపు.. తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు 13 నుంచి 14 ఏళ్లలోపు ఉండాలి.

సబ్సిడీ.. స్కాలర్‌షిప్
సైనిక్ స్కూల్స్‌లో ప్రవేశం ఖరారు చేసుకున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్ సౌకర్యం కూడా ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించే స్కాలర్‌షిప్‌లకు వీరు కూడా అర్హులే. అన్నిటికంటే ముఖ్యమైంది సబ్సిడీ. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక్ స్కూల్స్‌లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఏటా రూ. పదివేల సబ్సిడీ అందిస్తోంది.

వెబ్‌సైట్: www.sainikschoolsociety.org, http://sainikschoolkorukonda.org

రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్
ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులను రక్షణ రంగం దిశగా అడుగులు వేయిస్తున్నాయి రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్. దాదాపు అర్ధశతాబ్దం చరిత్ర కలిగిన ఈ మిలటరీ స్కూల్స్ లో విద్యనభ్యసించిన వేలాది మంది విద్యార్థులు రక్షణ శాఖలో వివిధ హోదాల్లో ఆధికారులుగా దేశానికి సేవలందిస్తున్నారు. మొదట్లో కేవలం రక్షణ శాఖ ఉద్యోగుల పిల్లల కోసం స్థాపించిన ఈ స్కూల్స్.. తర్వాత సాధారణ పౌరులకు సైతం ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ మిలటరీ స్కూల్స్‌లో సీబీఎస్‌ఈ సిలబస్ బోధిస్తారు.

ఆరు నుంచి 12 వరకు..
అత్యున్నత భవితకు బాటలు వేసే ఈ రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్‌లో ఆరో తరగతిలోనే ప్రవేశించవచ్చు. ఇందు కోసం ప్రతి ఏటా నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్‌కు హాజరు కావాలి. వీటిలో హైస్కూల్ స్థాయి నుంచి 12వ తరగతి వరకు చదివే సదుపాయం ఉంది. సీట్ల కేటాయింపులో త్రివిధ దళల ఉద్యోగుల సంతతికి ప్రాధాన్యం ఇస్తారు. దాదాపు 67 శాతం సీట్లను త్రివిధ దళ ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తారు. మరో 20 శాతం సీట్లను త్రివిధ దళాల్లో ఆఫీసర్ ర్యాంకు అధికారుల పిల్లలకు కేటాయిస్తారు. సాధారణ పౌరులకు 13 శాతం సీట్లు అందుబాటులో ఉంటాయి.

ప్రవేశ పరీక్షలు
రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్‌లో మూడు తరగతుల్లో ప్రవేశాలకు మాత్రమే ఓపెన్ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. అవి ఆరు, తొమ్మిది, పదకొండు తరగతులు. ఆరో తరగతి ప్రవేశానికి దేశవ్యాప్తంగా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. పదో తరగతిలో సాధించిన మార్కులాధారంగా పదకొండో తరగతిలో అడ్మిషన్ కల్పిస్తారు. తొమ్మిదో తర గతిలో ప్రవేశం మాత్రం కొంత భిన్నంగా ఉంటుంది. ఇందుకోసం దేశంలోని ఐదు మిలటరీ స్కూల్స్ వేర్వేరు నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. ఈ క్రమంలో విద్యార్థులు తాము చేరదలచుకున్న స్కూల్స్‌కు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం మూడు దశల్లో నిర్వహించే ప్రక్రియ ద్వారా ఇందులో ప్రవేశం కల్పిస్తారు. తొలి దశలో ఎంట్రెన్స్ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ రెండు దశల్లో విజయం సాధించినా.. మలి దశలో నిర్వహించే మెడికల్ టెస్ట్‌లో రాణించిన వారికే మాత్రమే ప్రవేశం లభిస్తుంది.

సాధారణ స్థాయిలోనే:
మిలటరీ స్కూల్స్‌ల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్‌లు సాధారణ స్థాయిలోనే ఉంటాయి. విద్యార్థులు ప్రస్తుతం తాము చదువుతున్న తరగతుల స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు. జనరల్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, మ్యాథ్స్,ఇంగ్లిష్ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. బేసిక్ గ్రామర్, వ్యక్తులు- పదవులు, ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుంటే ఇంగ్లిష్, జీకేల్లో సులువుగా రాణించవచ్చు.

దరఖాస్తు విధానం:
రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్‌లో ప్రవేశానికి ప్రతి ఏటా జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడుతుంది. అన్ని ప్రముఖ దిన పత్రికలు, ఎంప్లాయ్ మెంట్ న్యూస్‌లో దీనిని ప్రచురిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల వ్యవధి ఉంటుంది. పరీక్ష సాధారణం గా డిసెంబర్ చివరివారంలో నిర్వహిస్తారు.

రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్
చెయిల్ (హిమాచల్ ప్రదేశ్), అజ్మీర్ (రాజస్థాన్), బెల్గాం (కర్నాటక), బెంగళూరు(కర్నాటక), ధోల్‌పూర్ (రాజస్థాన్)

వెబ్‌సైట్: www.rashtriyamilitaryschools.in
Published date : 21 May 2012 05:15PM

Photo Stories