Skip to main content

కెరీర్ గైడెన్స్.. ఎయిర్‌మెన్

సవాళ్లతో కూడుకున్న కెరీర్‌ను ఇష్టపడే వారికి అనువైన వేదిక.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. యువతకు ఎన్నో ఉపాధి అవశాలు కల్పిస్తున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని ఒక వినూత్న విభాగం..ఎయిర్‌మెన్. ఈ పోస్టుకు సంబంధించిన ఎంపిక విధానం, తదితర వివరాలతో కెరీర్ గెడైన్స్.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పర్సనల్- బి విభాగంలో ఆఫీసర్ ర్యాంక్ (పీబీఓఆర్) కేడర్ ఉండే ఎయిర్‌మెన్ పోస్టులను..జాతీయ సెలెక్షన్ టెస్టులు, రిక్రూట్‌మెంట్ ర్యాలీల ద్వారా భర్తీ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియను సెంట్రల్ ఎయిర్‌మెన్ సెలెక్షన్ బోర్డు (సీఏఎస్‌బీ) పర్యవేక్షిస్తుంది. సెలెక్షన్ టెస్టులను ఎయిర్‌మెన్ సెలెక్షన్ సెంటర్‌లలో నిర్వహిస్తారు. ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు.

కేటగిరీలు-అర్హతలు:
ఎయిర్‌మెన్ పోస్టుల్లో..గ్రూప్-ఎక్స్ (టెక్నికల్ ట్రేడ్), గ్రూప్-ఎక్స్ (ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్), గ్రూప్-వై (నాన్-టెక్నికల్ ట్రేడ్), గ్రూప్-వై (మిడ్ అసిస్టెంట్ ట్రేడ్), గ్రూప్-వై (మ్యూజిషియన్ ట్రేడ్) అనే కేటగిరీలు ఉంటాయి.

గ్రూప్-ఎక్స్ (టెక్నికల్ ట్రేడ్):
అర్హత:
50 శాతం మార్కులతో 10+2/తత్సమానం (మ్యాథమెటిక్స్ /ఫిజిక్స్) లేదా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి 50 శాతం మార్కులతో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/కంప్యూటర్ సైన్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ).

వయసు: 17-21 ఏళ్లు. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఈ కేడర్ ద్వారా రిక్రూట్ అయ్యే వారికి టెక్నికల్ ట్రేడ్‌లో అవకాశం కల్పిస్తారు.
ఇందులో ఉండే విభాగాలు: ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్, ఎలక్ట్రికల్ ఫిట్టర్, స్ట్రక్చర్స్ ఫిట్టర్, ప్రపల్షన్ ఫిట్టర్, ఆటోమొబైల్ ఫిట్టర్, మెకానికల్ సిస్టమ్ ఫిట్టర్, వెపన్ ఫిట్టర్, వర్క్‌షాప్ ఫిట్టర్ (స్మిత్), వర్క్‌షాప్ ఫిట్టర్ (మెకానిక్)

గ్రూప్-ఎక్స్ (ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్):
అర్హత: గ్రాడ్యుయేషన్ (ఆర్ట్స్/కామర్స్/సైన్స్)తోపాటు బీఈడీ లేదా గుర్తింపు పొందిన స్కూల్/కాలేజీ నుంచి ఏదైనా డిగ్రీ, బీఈడీతోపాటు రెండేళ్ల అనుభవం.
వయసు: 20-25 ఏళ్లు.
(లేదా) ఎంఏ (ఇంగ్లిష్)/ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్)/ఎంసీఏతోపాటు బీఈడీ లేదా గుర్తింపు పొందిన స్కూల్/కాలేజీ నుంచి రెండేళ్ల అనుభవం.
వయసు: 20-28 ఏళ్లు.

గ్రూప్-వై (నాన్-టెక్నికల్ ట్రేడ్):
అర్హత
: 50 శాతం మార్కులతో 10+2/తత్సమానం లేదా సీబీఎస్‌ఈ, కేరళ బోర్డు, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే వొకేషనల్ కోర్సులు.
వయసు: 17-21 ఏళ్లు. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఈ కేడర్ ద్వారా రిక్రూట్ అయ్యే వారికి మ్యూజిషియన్ ట్రేడ్ మినహా అన్ని ట్రేడ్‌లలో అవకాశం కల్పిస్తారు.

ఇందులో ఉండే పోస్టులు: అడ్మిన్ అసిస్టెంట్, యాక్ట్స్ అసిస్టెంట్, లాజిస్టిక్స్ అసిస్టెంట్, మెడికల్ అసిస్టెంట్, మెట్రలాజికల్ అసిస్టెంట్, ఎన్విరాన్‌మెంటల్ సపోర్ట్ సర్వీస్ అసిస్టెంట్, ఓపీస్ అసిస్టెంట్, గ్రౌండ్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, ఎయిర్‌ఫీల్డ్ సేఫ్టీ ఆఫీసర్, టెలిఫోన్/రేడియో ఆపరేటర్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పోలీస్, క్లర్క్ డ్యూటీస్, ఎక్విప్‌మెంట్ అసిస్టెంట్,ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్, కేటరింగ్ అసిస్టెంట్.

గూప్-వై (మిడ్ అసిస్టెంట్ ట్రేడ్):
అర్హత:
50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లతో 10+2/ఇంటర్మీడియెట్/తత్సమానం.
వయసు: 17-21 ఏళ్లు.
ఇందులో ఉండే పోస్టులు: ఆటోమొబైల్ టెక్నిషియన్, కమ్యూనికేషన్ టెక్నిషియన్ (టెక్నికల్ ట్రేడ్).

గ్రూప్-వై (మ్యూజిషియన్ ట్రేడ్):
అర్హత:
మెట్రిక్యులేషన్/పదో తరగతి ఉత్తీర్ణత. అదేవిధంగా ఒక మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్‌లో ప్రావీణ్యత (ట్రాంపెట్/వాయిలిన్/సెక్సాఫోన్/క్లారినెట్ / ఇఫో నియమ్/జాస్-డ్రమ్/పిక్కోలో/బ్రాస్‌ట్రోంబోన్/కీబోర్డు/గిటార్/సరోద్/వయోలో/సెల్లో/కాంట్రాబ్రాస్(స్ట్రింగ్‌బాస్).
వయసు: 17-25 ఏళ్లు. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఈ కేడర్ ద్వారా రిక్రూట్ అయ్యే వారికి ఎయిర్‌ఫోర్స్ బ్యాండ్‌లో అవకాశం కల్పిస్తారు.

శిక్షణ:
ఎయిర్ మెన్‌గా ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ ట్రైనింగ్ సెంటర్ (బీటీఐ)-బెల్గాం (కర్నాటక)లో 12 నెలలపాటు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి వారి ట్రేడ్‌లకు అనుగుణంగా పోస్టులను కేటాయిస్తారు.

కెరీర్‌గ్రోత్:
ఎయిర్‌మెన్‌గా ఎంపికైన అభ్యర్థికి కెరీర్ పరంగా ఎదగాడినికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఈక్రమంలో లభించే హోదాలు.. ఎయిర్ క్రాఫ్ట్‌మ్యాన్, లీడింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌మ్యాన్, కార్పరోల్, సెర్జెంట్, జూనియర్ వారంట్ ఆఫీసర్, వారంట్ ఆఫీసర్, మాస్టర్ వారంట్ ఆఫీసర్. గ్రూప్-ఎక్స్ (ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్) ఎంపికైన అభ్యర్థులకు సెర్జెంట్ హోదా ఇస్తారు. అంతేకాకుండా నిబంధనల మేరకు సర్వీస్ ఎంట్రీ కమిషన్ ద్వారా కమిషన్డ్ ఆఫీసర్ హోదాను కూడా దక్కించుకోవచ్చు. ఎంపిక చేసిన వారంట్ ఆఫీసర్, మాస్టర్ వారంట్ ఆఫీసర్లకు తమ సర్వీస్‌లో చివరి సంవత్సరంలో హానరీ కమిషన్ హోదా ఇస్తారు. తద్వారా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే పరేడ్‌లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.

ఎంపిక విధానం:
ఎంపిక విధానంలో..రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్..అనే దశలు ఉంటాయి.

రాత పరీక్ష ఇలా:
ఎంచుకున్న కేటగిరీ ఆధారంగా రాత పరీక్ష వేర్వేరుగా ఉంటుంది. వివరాలు..
గ్రూప్-ఎక్స్ (టెక్నికల్ ట్రేడ్): ఈ విభాగం కోసం నిర్వహించే రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. సమాధానాలను గుర్తించడానికి 60 నిమిషాలు కేటాయిస్తారు.

గ్రూప్-ఎక్స్ (ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్): ఈ విభాగం కోసం నిర్వహించే పరీక్షలో రెండు పేపర్లు..ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటాయి. ఆబ్జెక్టివ్ పేపర్‌లో జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఆవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ అంశాలు వస్తాయి. డిస్క్రిప్టివ్ పేపర్‌లో లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్, రైటింగ్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. సమాధానాలను గుర్తించడానికి రెండు విభాగాలకు కలిపి మొత్తం 75 నిమిషాలు (ఆబ్జెక్టివ్ 40 నిమిషాలు, డిస్క్రిప్టివ్ 35 నిమిషాలు) కేటాయిస్తారు.

గ్రూప్-వై (నాన్-టెక్నికల్ ట్రేడ్): ఈ విభాగం కోసం నిర్వహించే రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ అంశాలు ఉంటాయి.
సమాధానాలను గుర్తించడానికి 45 నిమిషాలు కేటాయిస్తారు.

గ్రూప్-వై (మ్యూజిషియన్ ట్రేడ్): ఈ విభాగం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంగ్లిష్‌లో డిక్‌టేషన్ (విని రాయటం) ఉంటుంది. దీంతోపాటు ఒక మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్‌లో ప్రావీణ్యతను పరీక్షిస్తారు.

సంబంధిత సిలబస్‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. సిలబస్ సీబీఎస్‌ఈ 12వ తరగతి స్థాయిలో ఉంటుంది. రాత పరీక్షను నిర్వహించిన రోజే ఫలితాలను వెల్లడిస్తారు.

తర్వాతి దశ :
రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌కు హాజరు కావాలి. ఇందులో నిర్దేశించిన సమయంలో 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఎయిర్‌ఫోర్స్ (పోలీస్), ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (సెక్యూరిటీ) ట్రేడ్‌లకు 5 కిలోమీటర్ల దూరం..30 నిమిషాల్లో, 2.4 కిలోమీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దశలో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూ పూర్తిగా ఇంగ్లిష్‌లో ఉంటుంది. టెక్నికల్ ట్రేడ్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ తర్వాత ట్రేడ్ అలోకేషన్ టెస్ట్ నిర్వహిస్తారు. దీని తర్వాత ఉండే మెడికల్ టెస్ట్ ఆధారంగా నియామకం ఖరారు చేస్తారు. 27 ఏళ్లపైబడిన అభ్యర్థులకు నిబంధనల మేరకు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో నిర్దేశించిన సమయం నుంచి మినహాయింపునిస్తారు.

సమాచారం:
నిర్దేశించిన తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న 14 ఎయిర్‌మెన్ సెలెక్షన్ సెంటర్లలో
రిక్రూట్‌మెంట్ ర్యాలీలు ఉంటాయి. మన రాష్ట్రంలో సికింద్రాబాద్‌లో ఈ సెంటర్ ఉంది. ఇందుకు సంబంధించి ఎంప్లాయిమెంట్ న్యూస్/రోజ్‌గార్ సమాచార్ జాతీయ/ స్థానిక దినపత్రికలలో నోటిఫికేషన్ ప్రచురితమవుతుంది.

వేతనాలు:
ఎయిర్ క్రాఫ్ట్స్‌మ్యాన్ -
రూ. 5,200 -20,200+ రూ. 2,000 (గ్రేడ్ పే)
లీడింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్‌మ్యాన్- రూ. 5,200 -20,200+ రూ. 2,000 (గ్రేడ్ పే)
కార్పరోల్- రూ. 5,200 -20,200+ రూ. 2,400 (గ్రేడ్ పే)
సెర్జెంట్- రూ. 5,200 -20,200+ రూ. 2,800 (గ్రేడ్ పే)
జూనియర్ వారంట్ ఆఫీసర్- రూ. 9,300 - 34,800 + రూ. 4,200 (గ్రేడ్ పే)
వారంట్ ఆఫీసర్ రూ. 9,300 - 34,800 + రూ. 4,600 (గ్రేడ్ పే)
మాస్టర్ వారంట్ ఆఫీసర్- రూ. 9,300 - 34,800 + రూ. 4,800 (గ్రేడ్ పే)

వివరాలకు: https://indianairforce.nic.in/
Published date : 30 Sep 2013 04:09PM

Photo Stories