Skip to main content

ఇంటర్‌తోనే.. త్రివిధ దళాల్లో సుస్థిర కొలువులు

దేశ రక్షణ కోసం సాహసించే తెగువ.. దేశ సేవ చేయాలనే తపన కలిగిన యువతకు చక్కటి అవకాశం... ఎన్‌డీఏ, ఎన్‌ఏ. ఈ పరీక్షలో విజయం సాధిస్తే.. త్రివిధ దళాల్లో.. పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాలో సుస్థిర కొలువు సొంతమవుతుంది. దాంతోపాటే ఉన్నత విద్య పరంగా బీఏ/బీఎస్సీ/బీటెక్ డిగ్రీ కూడా అందుకోవచ్చు. ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఉజ్వల కెరీర్‌కు మార్గం వేసే ఎన్‌డీఏ, ఎన్‌ఏ (2)-2019 నోటిఫికేషన్ వివరాలు.. ఎంపిక ప్రక్రియ.. పరీక్ష విధానం.. ప్రిపరేషన్ గెడైన్స్...
ఎన్‌డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ), ఎన్‌ఏ (నేవల్ అకాడమీ).. ఈ రెండూ కూడా దేశ భద్రతలో కీలక పాత్ర పోషించే త్రివిధ దళాల్లో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు అభ్యర్థులకు శిక్షణనిచ్చే వేదికలు. వీటిలో ప్రవేశించడానికి నిర్వహించే పరీక్షే.. ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామినేషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఎన్‌డీఏ, ఎన్‌ఏ నోటిఫికేషన్‌ను ఏటా రెండుసార్లు విడుదల చేస్తుంది.

మూడంచెల ఎంపిక ప్రక్రియ :
ఎన్‌డీఏ, ఎన్‌ఏకు అభ్యర్థులను ఎంపికచేసే ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. తొలిదశలో యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఈ రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు మలిదశ ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

పీఏటీ, ఇంటెలిజెన్స్ టెస్ట్ :
మలిదశలో సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఆధ్వర్యంలో.. ఫిజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పీఏటీ), ఇంటెలిజెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ముందుగా ఫిజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో రాణించిన వారికి తర్వాత దశలో ఇంటెలిజెన్స్ టెస్ట్ జరుగుతుంది. అయిదు రోజులపాటు జరిగే ఈ ఎంపిక ప్రక్రియలో వివిధ నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందుకోసం ఇంటెలిజెన్స్ టెస్ట్, మానసిక సామర్థ్యం, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత సంభాషణలు వంటి టాస్క్‌లను అభ్యర్థుల ముందుంచుతారు. ఎయిర్‌ఫోర్స్ విభాగాన్ని ప్రాథమ్యంగా ఎంచుకున్న అభ్యర్థులు కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ పేరుతో మరో ప్రత్యేక పరీక్షలో విజయం సాధించాల్సి ఉంటుంది.

నిర్ణీత వ్యవధిలో శిక్షణ.. బ్యాచిలర్ డిగ్రీ :
ఇలా అన్ని దశల్లోనూ (రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలలో) విజయం సాధించిన అభ్యర్థులకు వారు ఎంపికైన విభాగం(ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్/నేవల్ అకాడమీ)లో నిర్ణీత వ్యవధిలో శిక్షణ ఇస్తారు.
  • నేషనల్ డిఫెన్స్ అకాడమీ-పుణెలో శిక్షణ ఉంటుంది. వ్యవధి మూడేళ్లు. ఈ శిక్షణ ఆసాంతం అకడమిక్‌గా, ఫిజికల్ ఫిట్‌నెస్‌పైనే జరుగుతుంది. మొదటి రెండున్నరేళ్లు మూడు విభాగాల అభ్యర్థులకు ఒకే తరహా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ పూర్తిచేసుకున్న వారికి బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్‌లు సైతం అందజేస్తారు.
  • ఆర్మీ కేడెట్స్‌కు బీఎస్సీ/బీఎస్సీ(కంప్యూటర్స్)/బీఏ సర్టిఫికెట్ లభిస్తుంది. నేవల్ కేడెట్స్, ఎయిర్‌ఫోర్స్ కేడెట్స్‌కు బీటెక్ డిగ్రీ అందిస్తారు.
  • నేవీ,నేవల్ క్యాడెట్స్‌కు ఇండియన్ నేవల్ అకాడమీ(ఎజిమల)..ఆర్మీ క్యాడెట్స్‌కు ఇండియన్ మిలటరీ అకాడమీ(డెహ్రాడూన్), ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్స్‌కు ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(హైదరాబాద్)లలో మరోసారి శిక్షణ ఉంటుంది. 18 నెలలపాటు కొనసాగే ఈ శిక్షణ పూర్తి చేసుకుంటే.. ఆయా విభాగాల్లో లెఫ్ట్‌నెంట్, సబ్ లెఫ్ట్‌నెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాల్లో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకుతో కొలువులో చేరొచ్చు. శిక్షణ సమయంలోనే నెలకు రూ.56,100 స్టైపెండ్ అందుతుంది.

ఎన్‌డీఏ, ఎన్‌ఏ.. ఎంపిక విధానం :
ఎన్‌డీఏ-ఎన్‌ఏ ఎంపిక రెండంచెలుగా ఉంటుంది. అవి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ. రాత పరీక్ష రెండు విభాగాల్లో నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్ 300 మార్కులకు రెండున్నర గంటలపాటు జరుగుతుంది. అలాగే జనరల్ ఎబిలిటీ టెస్ట్ పరీక్ష 600 మార్కులకు రెండున్నర గంటలు ఉంటుంది. మొత్తంగా రాత పరీక్షకు 900 మార్కులు ఉంటాయి. రాత పరీక్ష తర్వాత ఎస్‌ఎస్‌టీ టెస్ట్/ఇంటర్వ్యూ 900 మార్కులకు జరుగుతుంది.

రాత పరీక్షలో విజయానికి...
రాత పరీక్ష మ్యాథమెటిక్స్ పేపర్‌లో రాణించాలంటే.. పదో తరగతి వరకు మాత్రికలు, ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, అనలిటికల్ జామెట్రీ, స్టాటిస్టిక్స్, అర్థమెటిక్ తదితర విభాగాలపై పట్టు సాధించాలి. ముఖ్యంగా జామెట్రీ నుంచి టు, త్రీ డెమైన్షన్లు, స్టాటిస్టిక్స్ నుంచి మీన్, మీడియంకు సంబంధించిన అంశాలు.. అర్థమెటిక్‌లో కాలాలు, సగటు, శాతాలు, నిష్పత్తులపై దృష్టిసారించాలి.

జనరల్ ఎబిలిటీ టెస్ట్‌కు ఇలా..
  • అభ్యర్థుల్లో సమకాలీన అంశాలు, లాంగ్వేజ్ నైపుణ్యాలను పరీక్షించే పేపర్.. జనరల్ ఎబిలిటీ టెస్ట్. మొత్తం ఆరు వందల మార్కులకు నిర్వహించే ఈ పేపర్‌ను రెండు పార్ట్‌లు (పార్ట్-ఎ, పార్ట్-బి)గా వర్గీకరించారు.
  • పార్ట్-ఎ.. ఇంగ్లిష్ నైపుణ్యాలకు సంబంధించింది. దీనికి కేటాయించిన మార్కులు 200. ఇందులో మంచి మార్కుల కోసం బేసిక్ గ్రామర్, యాంటానిమ్స్, సినానిమ్స్, కరక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌పై చక్కని అవగాహనతో పాటు ఇంగ్లిష్‌ను అర్థం చేసుకునే పరిజ్ఞానం తప్పనిసరి.
  • పార్ట్-బి జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, జాగ్రఫీ, కరెంట్ ఈవెంట్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-బికి కేటాయించిన మార్కులు 400. పార్ట్-బిలో పేర్కొన్న సబ్జెక్ట్‌లకు సంబంధించి ఒక్కో టాపిక్‌కు ప్రశ్నల పరంగా నిర్దిష్ట వెయిటేజీ ఉంటుంది. ఫిజిక్స్‌కు 25 శాతం; కెమిస్ట్రీకి 15 శాతం; జనరల్ సైన్స్‌కు 10 శాతం; సోషల్ స్టడీస్‌కు 20 శాతం; జాగ్రఫీకి 20 శాతం; కరెంట్ ఈవెంట్స్‌కు 10 శాతం చొప్పున వెయిటేజీ ఉంది. ఈ పేపర్‌లో మెరుగైన మార్కులు సాధించాలంటే.. సోషల్ స్టడీస్ కోసం 6 నుంచి పదో తరగతి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జాగ్రఫీ కోసం 8 నుంచి పదో తరగతి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవడం ఉపకరిస్తుంది. సోషల్ స్టడీస్‌లో ప్రధానంగా స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన ఘటనలపై పట్టు సాధించాలి.

త్రివిధ దళాల్లో కెరీర్ గ్రాఫ్ :
ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి.. ఎన్‌డీఏ-పుణెలో అడుగుపెట్టిన అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న విభాగం ఆధారంగా అత్యున్నత స్థానాలకు చేరుకునే అవకాశముంది. 19 ఏళ్ల వయసులోనే ఎన్‌డీఏలో చేరితే త్రివిధ దళాల్లో అత్యున్నత స్థాయిలుగా పేర్కొనే జనరల్, అడ్మిరల్, ఎయిర్ చీఫ్ మార్షల్ వంటి హోదాలను చేరుకోవచ్చు.
  1. ఆర్మీలో కెరీర్: లెఫ్ట్‌నెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్ట్‌నెంట్ కల్నల్, కల్నల్, కల్నల్ (టైమ్ స్కేల్), బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్ట్‌నెంట్ జనరల్, జనరల్ హోదాలను సొంతం చేసుకోవచ్చు.
  2. నేవీ కెరీర్: సబ్ లెఫ్ట్‌నెంట్, లెఫ్ట్‌నెంట్, లెఫ్ట్‌నెంట్ కమాండర్, కమాండర్, కెప్టెన్, కెప్టెన్ (టైమ్ స్కేల్), కమొడోర్, రేర్ అడ్మిరల్, అడ్మిరల్ హోదాలు లభిస్తాయి.
  3. ఎయిర్ ఫోర్స్ కెరీర్ గ్రాఫ్: ఫ్లయింగ్ ఆఫీసర్; ఫ్లయిట్ లెఫ్ట్‌నెంట్, స్క్వాడ్రన్ లీడర్, వింగ్ కమాండర్, గ్రూప్ కెప్టెన్, గ్రూప్ కెప్టెన్ (టైమ్ స్కేల్), ఎయిర్ కమొడోర్, ఎయిర్ వైస్ మార్షల్, ఎయిర్ మార్షల్, ఎయిర్ చీఫ్ మార్షల్.

ఎన్‌డీఏ, ఎన్‌ఏ(2)-2019 నోటిఫికేషన్ వివరాలు..
మొత్తం పోస్టుల సంఖ్య:
ఎన్‌డీఏ:
370 (ఆర్మీ-208; నేవీ-42; ఎయిర్‌ఫోర్స్-120).
నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 45.
అర్హతలు:
ఆర్మీ విభాగం:
10+2 తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
ఎయిర్‌ఫోర్స్, నేవల్ విభాగాలు: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లతో 10+2 ఉత్తీర్ణత.
  • 10+2 ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు 2020, జూన్ 24 లోపు 10+2 ఉత్తీర్ణత సాధించి సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.
    వయసు: అభ్యర్థులు జనవరి 2, 2001, జనవరి 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

దరఖాస్తు విధానం :
  • అభ్యర్థులు www.upsconline.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 3, 2019.
పరీక్ష తేదీ: నవంబర్ 17, 2019.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.upsc.gov.in
ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: www.upsconline.nic.in
Published date : 20 Aug 2019 11:56AM

Photo Stories