Skip to main content

ఎన్‌డీఏ-ఎన్‌ఏ (II)-2018 విజయానికి మార్గాలు...

దేశసేవకు చిరునామాగా భావించే ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీల్లో చేరడానికి వీలు కల్పించే పరీక్ష.. నేషనల్ డిఫెన్‌‌స అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ-ఎన్‌ఏ). యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 9న ఎన్‌డీఏ-ఎన్‌ఏ పరీక్షను నిర్వహించనుంది. రాత పరీక్షలో రాణిస్తే త్రివిధ దళాల్లో చేరేందుకు వీలు కల్పించే ఎంపిక ప్రక్రియలో ముందడుగు పడినట్లే! ఘనమైన కెరీర్‌కు మార్గం వేసే ఈ పరీక్షలో విజయానికి మార్గాలు..
పోస్టులు: త్రివిధ దళాల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు.
ఖాళీల సంఖ్య: 383
ఎంపిక విధానం: రెండు దశల్లో (రాత పరీక్ష, ఇంటర్వ్యూ).
అర్హతలు: ఇంటర్మీడియెట్/10+2
రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్9, 2018.
నిర్వహణ సంస్థ: యూపీఎస్సీ
ఎన్‌డీఏ-ఎన్‌ఏ పరీక్షకు దేశవ్యాప్తంగా లక్షల్లోనే పోటీ. మొదటి దశలో మాత్రం ఏడువేల మంది లోపే ఉత్తీర్ణత సాధిస్తారు. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల అనంతరం తుది జాబితాలో నిలిచేది 383 మంది. ఎంపిక ప్రక్రియలో ప్రతి దశా ఎంతో కీలకం. ఎంపిక విధానంలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తే.. రెండో దశలో ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు, మెడికల్ టెస్టులు ఉంటాయి. ఈ రెండు దశలకు కలిపి మొత్తం మార్కులు 1800 కేటాయించారు. వీటిలో రాత పరీక్షకు 900 మార్కులు, ఎస్‌ఎస్‌బీ టెస్ట్/ఇంటర్వ్యూకు 900 మార్కులు ఉంటాయి.

రాత పరీక్ష :
పరీక్షలో రెండు పేపర్లుంటాయి. పేపర్-1లో మ్యాథమెటిక్స్‌కు 300 మార్కులు (రెండున్నర గంటలు); పేపర్-2 జనరల్ ఎబిలిటీ టెస్ట్‌కు 600 మార్కులు (రెండున్నర గంటలు) కేటాయించారు. ఈ రెండు పేపర్లలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. రుణాత్మక మార్కులు కూడా ఉంటాయి కాబట్టి తెలిసిన వాటికి మాత్రమే సమాధానాలు గుర్తించడం మేలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది. జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో పార్ట్-ఎ.. ఇంగ్లిష్ 200 మార్కులకు, పార్ట్-బిలో జనరల్ నాలెడ్‌‌జ 400 మార్కులకు ఉంటుంది.

ప్రిపరేషన్ టిప్స్...
మ్యాథమెటిక్స్ :
  1. ఈ సబ్జెక్టు నుంచి 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2.5 మార్కులు కేటాయించారు.
  2. ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, మాత్రికలు, అనలిటికల్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్‌‌స, వెక్టర్ అల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
  3. ప్రిపరేషన్ కోసం ఆరు నుంచి పదోతరగతి వరకు మ్యాథ్స్ పుస్తకాల్లోని అంశాలపై సమగ్ర అవగాహన ఏర్పరచుకోవాలి. ఏ చాప్టర్ల నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో చూసుకొని, దానికి అనుగుణంగా సన్నద్ధమవడం మేలు. ఉదాహరణకు సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ నుంచి 13 ప్రశ్నల వరకు వచ్చే అవకాశముంది. కాబట్టి వీటిపై ఎక్కువ దృష్టిసారించాలి. ఇందులోనూ సెట్స్‌పైనే 9 ప్రశ్నల వరకు అడుగుతున్నట్లు గత ప్రశ్నపత్రాన్ని గమనిస్తే తెలుస్తుంది.
  4. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 6 ప్రశ్నలు, సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి 3 ప్రశ్నలు అడుగుతున్నారు. మిగిలిన అంశాల నుంచి ఒకటి నుంచి మూడు ప్రశ్నలు చొప్పున ఉండేలా ప్రశ్నపత్రం రూపొందిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు అన్ని చాప్టర్లను అధ్యయనం చేయాలి.
  5. పేపర్-1, 2ల్లో వేర్వేరుగా కనీసం 25 శాతం మార్కులు పొందాలనే నిబంధన ఉంది.
  6. మ్యాథ్స్ ప్రశ్నలు చాలా వరకు సూత్రాల ఆధారంగా అడుగుతున్నారు. కాబట్టి ఫార్ములాలను కంఠతా చేయాలి. సమయం తక్కువ ఉంటుంది కాబట్టి వేగంగా సరైన సమాధానాలు గుర్తించేలా ప్రాక్టీస్ చేయాలి.
  7. గత ప్రశ్నపత్రాల సాధన ప్రిపరేషన్‌కు ఉపయోగపడుతుంది. మోడల్ టెస్టులు రాయడం కూడా మేలు చేస్తుంది. షార్ట్‌కట్స్ ద్వారా తక్కువ సమయంలోనే సరైన సమాధానాలు గుర్తించేలా ప్రాక్టీస్ చేయాలి.

జనరల్ ఎబిలిటీ టెస్ట్ :
  1. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నలు; రెండో విభాగంలో జనరల్ నాలెడ్జ్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తాయి. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1.33 మార్కులు కోత వేస్తారు.
  2. మొదటి విభాగంలో ఇంగ్లిష్‌కు కేటాయించిన మార్కులు 200. ఇందులో గ్రామర్, వొకాబ్యులరీ, కాంప్రెహెన్షన్, ఇంగ్లిష్ యూసేజ్, ఇంగ్లిష్ ప్రొఫీషియెన్సీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వొకాబ్యులరీలో సినానిమ్స్, యాంటోనిమ్స్‌లో ఒక్కో దాన్నుంచి 8 ప్రశ్నల వరకు అడిగే అవకాశముంది. అదేవిధంగా ప్రొఫీషియెన్సీలో ఆర్డరింగ్ ఆఫ్ సెంటెన్సెస్, పారా జంబుల్ సెక్షన్ల నుంచి 5 చొప్పున ప్రశ్నలు రావొచ్చు. స్పాటింగ్ ద ఎర్రర్, రీడింగ్ కాంప్రెహెన్షన్, ఇడియమ్స్, ప్రేజెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  3. అభ్యర్థులు ఇంటర్ వరకు నేర్చుకున్న ఇంగ్లిష్‌ను మరోసారి రివిజన్ చేసుకోవాలి. రోజూ ఇంగ్లిష్ పత్రికల్లో వచ్చే ఎడిటోరియల్స్ చదువుతూ వొకాబ్యులరీ పెంచుకునేందుకు కృషిచేయాలి. ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని సేకరించుకొని బిట్స్ ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది.
  4. రెండో విభాగంలో జనరల్ నాలెడ్‌‌జ ఉంటుంది. దీనికి 400 మార్కులు కేటాయించారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమం తదితర; జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలుంటాయి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ద్వారా ఈ సబ్జెక్టులపై పట్టుసాధించాలి.
  5. దైనందిన జీవితంలో కెమిస్ట్రీ వినియోగం ఏ మేరకు ఉంటుందనే దాన్నుంచి ఆరు ప్రశ్నల వరకు రావొచ్చు. మిగిలిన అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యమిస్తూ ప్రశ్నలు అడుగుతారు.
  6. కరెంట్ ఈవెంట్స్, జీకే కోసం బడ్జెట్, వార్తల్లో వ్యక్తులు, క్రీడలు, కమిటీలు-చైర్మన్లు; పుస్తకాలు-రచయితలు; కళలు, సంస్కృతి తదితర అంశాలపై దృష్టిసారించాలి.

ఇంటర్వ్యూకు 900 మార్కులు :
  1. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) నిర్వహించే ఇంటెలిజెన్‌‌స అండ్ పర్సనాలిటీ టెస్ట్‌కు 900 మార్కులు కేటాయించారు. ఇది రెండుదశల్లో ఉంటుంది. స్టేజ్-1లో ఉత్తీర్ణత సాధించిన వారిని రెండో దశకు ఆహ్వానిస్తారు.
  2. స్టేజ్-1లో పిక్చర్ పెర్‌సెప్షన్, డిస్క్రిప్షన్ టెస్టు (పీపీ అండ్ డీటీ) ఉంటాయి. వీటిలో ప్రతిభ ఆధారంగా రెండో స్టేజ్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ దశలో నాలుగు రోజుల పాటు వివిధ టెస్టులు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్స్, సైకాలజీ టెస్టులు, కాన్ఫరెన్సులు ఉంటాయి.
  3. చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే వారు ఎంపిక చేసుకున్న విభాగాన్ని కేటాయిస్తారు.
Published date : 07 Aug 2018 05:34PM

Photo Stories