Skip to main content

ఉపాధికి ఊతమిచ్చే డిప్లొమాలు ఇవే..

అనేక ఇంజనీరింగ్/ నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ఏది బెస్ట్? జాబ్ మార్కెట్లో డిమాండ్ కలిగిన బ్రాంచ్‌లు ఏవి?! ఆయా డిప్లొమా కోర్సులతో ఉద్యోగాలు, ఉన్నత విద్యావకాశాల గురించి తెలుసుకుందాం...
 

పదోతరగతి అర్హతతోనే ఉపాధికి మార్గం వేసే కోర్సులు.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ముఫ్పైకిపైగా ఇంజనీరింగ్/నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రత్యేక డిప్లొమా కోర్సులకు మరింత డిమాండ్ పెరుగుతోంది. మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధిలో ఉండే ఈ డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకుంటూనే.. ఆయా పరిశ్రమల్లో ఉపాధి లభిస్తోంది.

ప్యాకేజింగ్ టెక్నాలజీ
ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగం.. ప్యాకేజింగ్. ఈ-కామర్స్ రంగం విస్తరించడం, ప్యాకేజ్డ్ ఐటమ్స్‌కు ప్రాధాన్యం పెరగడమే ఇందుకు కారణం. ఒక వస్తువును ఉత్పత్తి చేశాక.. అది వినియోగదారుడికి చేరేవరకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా అందించడానికి పెద్ద కసరత్తే చేయాలి. ఆ క్రమంలో ఆకట్టుకునేలా ప్యాకింగ్ చేయడం కూడా ప్రధానమే. ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యాలు కావాలి. ఈ నైపుణ్యాలను అందించే కోర్సు.. డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ. ప్యాకేజింగ్ రంగం 2020 నాటికి 32 బిలియన్ డాలర్ల పరిశ్రమగా అవతరించనుందని అంచనా. దాంతో ప్యాకేజింగ్ డిప్లొమా పూర్తిచేసుకున్న విద్యార్థులు దాదాపు అన్ని రంగాల్లోని పరిశ్రమల్లో ఉపాధి పొందే వీలుంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, ఫుడ్, బెవరేజెస్, పేపర్, రిటైల్ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలం. ప్రారంభంలో నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వేతనం లభిస్తోంది. సూపర్ వైజర్, టెస్టర్, లేబిలింగ్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాలు సొంతం చేసుకోవచ్చు. ఉన్నతవిద్య పరంగా బీటెక్‌లో మెకానికల్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకట్రానిక్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో చేరొచ్చు.

లెదర్ టెక్నాలజీ
డిప్లొమా ఇన్ లెదర్ టెక్నాలజీ కోర్సుకు ఉపాధి అవకాశాలకు కొదవలేదు. లెదర్ ఇండస్ట్రీ రోజురోజుకీ విస్తరిస్తుండటమే ఇందుకు కారణం. ఈ కోర్సు వ్యవధి మూడున్నరేళ్లు. ఇందులో ఆరునెలల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. దీంతో ఈ డిప్లొమా కోర్సు పూర్తిచేసుకున్న వారికి ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. ఈ కోర్సులో చేరిన వారికి లెదర్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్, డిజైన్ టెక్నిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ వంటి నైపుణ్యాలు లభిస్తాయి. వీరికి ప్రస్తుతం ఫుట్‌వేర్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. డిప్లొమా ఇన్ లెదర్ టెక్నాలజీ కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు స్వయం ఉపాధి సైతం పొందొచ్చు. కంపెనీల్లో ఎంట్రీ లెవల్‌లో టెక్నికల్ అసిస్టెంట్, లెదర్ టెక్నీషియన్, ప్యాట్రన్ మేకర్, సైంటిఫిక్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. నెలకు రూ.15వేల నుంచి రూ.18 వేల వేతనం ఖాయం.

కెమికల్ ఇంజనీరింగ్
ప్రస్తుత ఆర్ అండ్ డీ యుగంలో ఉద్యోగ కల్పన పరంగా మరో ఉత్తమ డిప్లొమా కోర్సు.. కెమికల్ ఇంజనీరింగ్. ఇటీవల కాలంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం అధికం కావడం, పెట్రో కెమికల్స్ ఉత్పత్తులు పెరుగుతుండటం, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కి ఆదరణ తదితర కారణాలతో కెమికల్ ఇంజనీరింగ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. రిఫైనరీలు, రసాయన పరిశ్రమలు, ఇంధన సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు, పెట్రోలియం సంస్థలు, ఫ్లాస్టిక్ పరిశ్రమలు, షుగర్, ఫార్మాస్యూటికల్ సంస్థల్లో కొలువులు ఖాయం. ప్రారంభంలో ప్రాసెసింగ్ అసిస్టెంట్, ప్రాసెసింగ్ సూపర్‌వైజర్, టెక్నికల్ సర్వీస్ రిప్రజెంటేటివ్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. వీరికి నెలకు రూ.15వేల వరకు వేతనం లభిస్తుంది. ఉన్నతవిద్య పరంగా బీటెక్‌లో కెమికల్ ఇంజనీరింగ్, పెట్రో కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, పెట్రోలియం టెక్నాలజీ వంటి కోర్సుల్లో చేరొచ్చు.

గార్మెంట్ టెక్నాలజీ
నైపుణ్యాలు సొంతం చేసుకుంటే అవకాశాలకు కొదవే లేని బ్రాంచ్.. గార్మెంట్ టెక్నాలజీ. ఎన్‌ఎస్‌డీసీ అంచనాల ప్రకారం 2022 నాటికి గార్మెంట్ టెక్నాలజీలో డిప్లొమా అర్హతతో లభించే ఉద్యోగాలు 25 లక్షలు. కాబట్టి గార్మెంట్ టెక్నాలజీలో డిప్లొమా పూర్తిచేసిన వారికి కొలువులు స్వాగతం పలకడం ఖాయం. ఈ కోర్సులో భాగంగా నేర్పించే అపెరల్ డిజైనింగ్, స్యూయింగ్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ ప్యాట్రన్ మేకింగ్ వంటి ఆధునిక నైపుణ్యాలు సొంతం చేసుకుంటే జాబ్ మార్కెట్లో మరింత ముందంజలో నిలవొచ్చు. వీరికి టెక్స్‌టైల్ మిల్స్, రెడీమేడ్ గార్మెంట్ ఇండస్ట్రీస్ ప్రధాన ఉపాధి వేదికలు. ప్రారంభంలో ఫ్యాబ్రిక్ టెక్నాలజిస్ట్, టెక్నికల్ సూపర్‌వైజర్, ప్రొడక్షన్ సూపర్‌వైజర్, స్టోర్ ఇన్‌ఛార్జ్ వంటి ఉద్యోగాలు అందుకోవచ్చు.

టెక్స్‌టైల్ టెక్నాలజీ
డిప్లొమా ఇన్ టెక్స్‌టైల్ టెక్నాలజీకి కూడా ఇప్పుడు జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొంది. ఒక విధంగా గార్మెంట్ ఇండస్ట్రీకి అనుసంధానంగా పేర్కొనే టెక్స్‌టైల్ రంగంలో ఇప్పుడు ఎన్నో కొత్త సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ఫైబర్ టెక్నిక్స్, టెక్స్‌టైల్ అండ్ అపెరల్ ప్రాసెస్, ప్రొడక్ట్స్ ఐడెంటిఫికేషన్, మెషినరీ టెక్నిక్స్ వంటి కీలక సబ్జెక్ట్‌లు ఈ కోర్సులో బోధిస్తారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి టెక్స్‌టైల్ పరిశ్రమల్లో ఉపాధి ఖాయం. క్వాలిటీ సూపర్‌వైజర్, టెక్స్‌టైల్ టెక్నాలజీ సూపర్‌వైజర్, ప్రొడక్షన్ సూపర్‌వైజర్ వంటి హోదాలతో ఎంట్రీ లెవల్‌లో ఉద్యోగాలు లభిస్తాయి.

కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్
విద్యార్థులు ముఖ్యంగా ఆయా సంస్థల్లో పరిపాలన విభాగాల్లోనూ కొలువుదీరేలా అందుబాటులోకి తెచ్చిన బ్రాంచ్.. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్. ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి ఎగ్జిక్యూటివ్, ఆఫీసర్ హోదాల్లో నిర్ణీత అర్హత గల ఉద్యోగులు లభిస్తున్నారు. కానీ, కాస్త కిందిస్థాయి సిబ్బంది విషయంలో సంస్థలు మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్నాయి. కాబట్టి కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ డిప్లొమా కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ఉపాధి ఖాయమని చెప్పొచ్చు. ఈ బ్రాంచ్‌లో భాగంగా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అవసరమైన టైపింగ్, షార్ట్ హ్యాండ్, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంఎస్ వర్డ్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్‌పై శిక్షణ ఇస్తారు. దీంతో ఈ కోర్సు పూర్తిచేసుకున్న వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో స్టెనోలు, టైపిస్ట్‌లు, కంప్యూటర్ ఆపరేటర్స్‌గా ఉద్యోగాలు లభిస్తాయి. నెలకు కనీసం రూ.10వేల నుంచి రూ.12 వేలతో ఉద్యోగం లభిస్తుంది. ఉన్నతవిద్య పరంగా బీకాం, సీఏ, ఐసీడబ్ల్యుఏ, సీఎస్ వంటి కోర్సుల్లో చేరొచ్చు.

హోమ్‌సైన్స్
ఇటీవల కాలంలో డిమాండ్ పెరుగుతున్న మరో కోర్సు.. హోమ్‌సైన్స్. ఆహారం, ఆతిథ్యానికి సంబంధించిన నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. పాలిటెక్నిక్ హోంసైన్స్ డిప్లొమా పూర్తిచేసుకున్న వారికి హోటల్స్, రెస్టారెంట్స్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నతవిద్య కోణంలో హోమ్‌సైన్స్, ఫ్యాషన్ గ్రూప్‌లతో బీఎస్సీలో చేరొచ్చు.

ఆర్కిటెక్చర్ అసిస్టెంట్‌షిప్
ప్రస్తుతం మౌలిక రంగం శరవేగంగా విస్తరిస్తున్న పరిస్థితుల్లో జాబ్ మార్కెట్లో చక్కటి కొలువులకు వేదికగా నిలుస్తున్న బ్రాంచ్.. ఆర్కిటెక్చర్ అసిస్టెంట్‌షిప్. ముఖ్యంగా రియల్టీ రంగం విస్తరిస్తుండటం, అదే విధంగా ప్రభుత్వ పరంగానూ నిర్మాణ రంగ అభివృద్ధికి పలు పథకాలు అమలవుతున్న నేపథ్యంలో ఆర్కిటెక్చర్ అసిస్టెంట్‌షిప్ పూర్తిచేసుకున్న వారికి కొలువులకు కొదవలేదు. ఈ కోర్సులో భాగంగా కన్‌స్ట్రక్షన్ ప్లాన్స్ డిజైనింగ్, డ్రాయింగ్, డ్రాఫ్టింగ్, బిల్డింగ్ సైన్స్, సర్వేయింగ్, టౌన్ ప్లానింగ్ వంటి కీలకమైన అంశాల్లో శిక్షణ లభిస్తుంది. ఫలితంగా కోర్సు పూర్తిచేసుకున్న అభ్యర్థులు ప్రభుత్వ పరిధిలో టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇరిగేషన్ శాఖల్లో డ్రాఫ్ట్స్‌మెన్‌గా కొలువుదీరొచ్చు. ప్రైవేటు విభాగంలో రియాల్టీ సంస్థల్లోనూ ఈ అవకాశాలు లభిస్తాయి. లెసైన్స్‌డ్ డిజైనర్‌గా స్వయం ఉపాధికి కూడా అవకాశం ఉంది. ఉన్నత విద్య పరంగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(బీఆర్క్) ఇంజనీరింగ్‌లో చేరొచ్చు.

ఆటోమొబైల్ ఇంజనీరింగ్
విస్తృత అవకాశాలకు దోహదం చేసే బ్రాంచ్.. ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ప్రస్తుతం ఆటో మోటివ్ రంగం శరవేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్రాంచ్‌లో అకడమిక్‌గా పొందే నైపుణ్యాల ఆధారంగా.. ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ విభాగంలో రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రైవేటు రంగంలో వాహన తయారీ సంస్థలు, సర్వీస్ సెంటర్లు, వర్క్‌షాప్స్‌లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఎంట్రీ లెవల్‌లో సీనియర్ టెక్నీషియన్, వర్క్‌షాప్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ క్వాలిటీ ఇంజనీర్ వంటి హోదాలు లభిస్తాయి. ఉన్నతవిద్య పరంగా బీటెక్‌లో మెకానికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో చేరేందుకు వీలుంది.

మైనింగ్ ఇంజనీరింగ్
ఉద్యోగావకాశాల పరంగా ముందు నిలుస్తున్న పాలిటెక్నిక్ డిప్లొమా.. మైనింగ్ ఇంజనీరింగ్. మూడేళ్ల వ్యవధిలోని ఈ డిప్లొమా పూర్తిచేసిన వారికి మైనింగ్ సంస్థలు, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్ సంస్థల్లో సూపర్‌వైజర్ స్థాయిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో ఉద్యోగాలు లభిస్తాయి. ఉన్నతవిద్య కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్, మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్‌లో చేరొచ్చు.

ఆ బ్రాంచ్‌లకు ఎప్పుడూ డిమాండే
పైన పేర్కొన్న బ్రాంచ్‌లతోపాటు డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ బ్రాంచ్‌లకు డిమాండ్ నిరంతరం ఉంటుంది. ఈ బ్రాంచ్‌లు పూర్తిచేసుకున్న వారికి ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలతోపాటు స్వయం ఉపాధి అవకాశాలు సైతం అందుబాటులో ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొనొచ్చు.

నేరుగా బీటెక్ రెండో సంవత్సరం
డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు ఉన్నతవిద్య కోణంలో అందుబాటులో ఉన్న మరో సదుపాయం.. బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో అడుగుపెట్టే అవకాశం. అయితే ఇందుకోసం అభ్యర్థులు ఈసెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఇందులో ర్యాంకు ఆధారంగా సంబంధిత బ్రాంచ్‌లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించొచ్చు.

బ్రాంచ్ ఏదైనా నైపుణ్యం కీలకం
డిప్లొమా స్థాయిలో ఏ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకున్నప్పటికీ.. విద్యార్థులు అకడమిక్‌గా నిర్దేశించిన అంశాల్లో నైపుణ్యాలు పొందేందుకు కృషిచేయాలి. అప్పుడే వారు కోర్సులో చేరిన లక్ష్యం నెరవేరుతుంది. దాంతోపాటు బ్రాంచ్ ఎంపికలో ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వడం మేలు.
- వెంకటేశ్వర్లు, సెక్రటరీ,
ఎస్‌బీటీఈటీ-టీఎస్.
Published date : 21 May 2019 05:26PM

Photo Stories