Skip to main content

ఎంబీఏ, ఎంసీఏ.. ఎంపిక ఎలా?

ఎంబీఏ, ఎంసీఏ... వీటిలో ఏ కోర్సులో చేరాలి? కోర్సు ఎంపికలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి? ఏ కోర్సు ఎవరికి సరిపోతుంది? ఏ కోర్సును ఎంచుకుంటే చక్కటి కెరీర్ దిశగా అడుగులు వేయొచ్చు? తదితర సందేహాలతో ఊగిసలాడే ఔత్సాహికులు ఎందరో..ఈ నేపథ్యంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల స్వరూపం, అవకాశాలు, అలవర్చుకోవాల్సిన అకడమిక్ స్కిల్స్, తదితర అంశాలపై ఫోకస్..

 ఎంబీఏ
సమర్థవంతమైన బిజినెస్ లీడర్లను తీర్చిదిద్దే ఉద్దేశంతో 20వ శతాబ్దంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) కోర్సులను రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో మేనేజర్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా స్థిరపడడానికి అర్హతగా ఎంబీఏ కోర్సులను పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంబీఏ కోర్సు ఎవరికి సరిపోతుంది? కోర్సు స్వరూపం ఏ విధంగా ఉంటుంది? కెరీర్‌లో రాణించాలంటే అనుసరించాల్సిన వ్యూహాలు, సంబంధిత అంశాలను పరిశీలిస్తే..

ఈ స్కిల్స్ ఉండాలి:
ఎంబీఏ గ్రాడ్యుయేట్ల కెరీర్ ఏదైనా సంస్థ/కంపెనీలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా ప్రారంభమవుతుంది. అందులో భాగంగా వివిధ విభాగాల మధ్య సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. కాబట్టి ఇంటర్ పర్సనల్, టీం మేనేజ్‌మెంట్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఎంబీఏ కోర్సు చక్కగా సరిపోతుంది. దానికితోడు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, బృందంగా పనిచేసే నేర్పు, నిర్వహణ సామర్థ్యం, ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం, పని తీరును అంచనా వేసే సామర్థ్యం, భవిష్యత్ పరిణామాలను ఊహించే నేర్పు, సమన్వయంతో వ్యవహరించడం, ఒక సమస్య ఏర్పడితే దానికి కచ్చితమైన కారణాన్ని అన్వేషించడం వంటి నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు ఎంబీఏ కోర్సును ఎంచుకోవచ్చు. అంతేకాకుండా విషయాన్ని లోతుగా అధ్యయనం చేసే తత్త్వం కూడా ఎంతో అవసరం.
కోర్సు ఇలా:
గ్లోబలైజేషన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, భవిష్యత్‌లో చోటు చేసుకునే మార్పులు, సంబంధిత అంశాల ప్రాతిపదికగా.. వ్యాపార నిర్వహణకు కావల్సిన పరిజ్ఞానం, నైపుణ్యాలు, తదితర అంశాలపై ఎంబీఏ కోర్సులో అవగాహన కల్పిస్తారు. ఎంబీఏ కోర్సు వ్యవధి రెండేళ్లు. సెమిస్టర్ పద్ధతిలో నిర్వహిస్తారు. మొదటి సంవత్సరం సబ్జెక్ట్‌లు కామన్‌గా ఉంటాయి. ఇందులో అకౌంట్స్, మేనేజ్‌మెంట్ థియరీ, స్టాటిస్టిక్స్, బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, ఐటీ వంటి బేసిక్ సబ్జెక్ట్‌లను బోధిస్తారు. రెండో సెమిస్టర్‌లో మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్, ఓఆర్ వంటి ఫంక్షనల్ ఏరియాస్ ఉంటాయి. మూడో, నాలుగో సెమిస్టర్‌లలో ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్, ఐటీ, టూరిజం, హాస్పిటల్ మేనేజ్‌మెంట్ తదితర స్పెషలైజేషన్స్ ఉంటాయి. నాలుగో సెమిస్టర్ చివ ర ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. విద్యార్థులు తమ స్వీయ ఆసక్తి, అభిరుచి, పరిజ్ఞానం ఆధారంగా ఏదో ఒక స్పెషలైజేషన్‌ను తప్పనిసరిగా ఎంచుకోవాల్సి ఉంటుంది.

నిరంతర అధ్యయనం:
ఎంబీఏ కోర్సులో రాణించాలంటే.. కరిక్యులంకు అనుగుణంగా నిరంతర అధ్యయనం సాగిస్తూ సంబంధిత అంశాలపై కేస్ స్టడీలను పరిశీలించాలి. సంబంధిత విభాగంలోని పరిణామాలను తెలుసుకోవాలి. ఇలా కరిక్యులంలోని అంశాలను అనుభవాలతో అన్వయం చేసుకోవాలి. జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలి. ఇంగ్లిష్ భాష నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ కోర్సులో ఉండే ప్రత్యేక పదజాలంపై పట్టు సాధించాలి. ఎంచుకున్న స్పెషలైజేషన్‌లో మరింత ‘స్పెషలైజ్డ్’ నాలెడ్జ్ కోసం ఆ విభాగంలో ప్రస్తుత పరిణామాలను నిరంతరం అధ్యయనం చేయాలి. సంబంధిత జర్నల్స్‌ను చదవాలి. ప్రాజెక్ట్ వర్క్‌కు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. ఫేక్ ప్రాజెక్ట్‌లు కాకుండా సంబంధిత సంస్థల్లో స్వయంగా ప్రాజెక్ట్ వర్క్ చేయడం ప్రయోజనకరం. ఎంబీఏ తర్వాత ఐఐఎం(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్)ల్లో ఫెలో ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌పీఎం), లేదా నెట్ రాసి మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేయొచ్చు.

కెరీర్‌లో రాణించాలంటే:
ఎంబీఏ అభ్యర్థులు కెరీర్‌లో రాణించాలంటే.. చేరిన కంపెనీ/సంస్థ/వ్యాపార నిర్వహణలో సంబంధిత అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏదో ఒక రంగానికే పరిమితం కాకుండా.. కంపెనీ/వ్యాపార నిర్వహణలో సంబంధిత అన్ని రకాల బాధ్యతల స్వీకరణకు సిద్ధపడడం.. సమష్టి తత్వాన్ని అలవర్చుకోవడం, చొరవగా వ్యవహరించడం, వివిధ రకాల వ్యక్తులతో వ్యవహారాలు నిర్వర్తించడం, ఒత్తిడిలోనూ సమగ్రంగా పనిచేసే గుణం, ప్రభావవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, జట్టుగా పనిచేసే సామర్థ్యం, అవసరమైనప్పుడు బాధ్యతలు తీసుకునే నేర్పు, సాధించాలన్న తపన, లక్ష్యాలను అధిగమించేలా కష్టపడే తత్వం వంటి లక్షణాలను పెంపొందించుకోవాలి. అంతేకాకుండా కొన్నిసార్లు ఊహించని పరిణామాలు, రిస్క్‌తో కూడుకున్న పనులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు సిద్ధంగా ఉండాలి.

సాఫ్ట్ స్కిల్స్ కూడా కీలకం
దేశ వ్యాప్తంగా రెండు వేలకు పైగా మేనేజ్‌మెంట్ స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లోని ఎంబీఏ, పీజీడీబీఎం వంటి కోర్సుల ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు మూడు లక్షల మంది మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తున్నారు. అసోచామ్, ఫిక్కీ, నాస్కామ్ వంటి సంస్థల అంచనాల ప్రకారం వీరిలో పరిశ్రమ కోరుకుంటున్న నైపుణ్యాలు ఉన్న వారి సంఖ్య 20 శాతం మాత్రమే. కాబట్టి చదువుతో సమాంతరంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. ఈ క్రమంలో విద్యార్థులు విశ్లేషణ సామర్థ్యం, చొరవగా వ్యవహరించడం, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ భాష పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుత జాబ్ మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుంటే ఎంబీఏ విద్యార్థులు కెరీర్‌లో రాణించాలంటే అకడమిక్ పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలతోపాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా కెరీర్ ఉన్నతికి దోహదం చేసే విధంగా సాప్, ఈ-కామర్స్, ట్యాక్సేషన్ వంటి అదనపు కోర్సులను చేయొచ్చు. ఎంబీఏ వారికి బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్, అగ్రికల్చర్, ఫార్మా, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్, ఎఫ్‌ఎంసీజీ వంటి రంగాల్లో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి.

 ఎంసీఏ
ప్రస్తుత తరుణంలో ఇంజనీరింగ్‌తో సమ ప్రాధాన్యత కలిగిన కోర్సుగా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) ను పరిగణిస్తున్నారు. ఇంజనీరింగ్ కోర్సుకు దీటుగా సంప్రదాయ డిగ్రీ విద్యార్థులను కూడా సాఫ్ట్‌వేర్ నిపుణులుగా తయారు చేసే ఉద్దేశంతో ఈ కోర్సును రూపొందించారు.. నిరంతరం టెక్నాలజీ అంశాల అధ్యయనంతో ముడిపడిన ఈ కోర్సును ఎంచుకోవడానికి ఎటువంటి నైపుణ్యాలు అవసరం? తదితర అంశాలపై ఫోకస్..

ఈ స్కిల్స్ ఉండాలి:
మ్యాథమెటిక్స్, సైన్స్ పట్ల ఆసక్తి, ప్రాక్టికల్ ఓరియెంటేషన్, సమస్య పరిష్కార సామర్థ్యం వంటి నైపుణ్యాలున్న విద్యార్థులకు చక్కగా సరిపోయే కోర్సు ఎంసీఏ. సాఫ్ట్‌వేర్ అంటే టెక్నాలజీతో పూర్తికాలం పనిచేయూల్సిందే. కాబట్టి కొత్త విషయూలపై నిరంతరం అప్‌డేట్‌గా ఉండడం, అన్వయించే సామర్థ్యం, ఏదైనా విషయాన్ని వేగంగా అవగాహన చేసుకునే నేర్పు, విస్తృతంగా అధ్యయనం చేసే గుణం ఉన్న విద్యార్థులు ఎంసీఏ కోర్సును ఎంచుకోవచ్చు. అంతేకాకుండా ఇంకో కీలక విషయం.. కెరీర్‌లో ఉన్నన్నాళ్లూ స్వతహాగా నేర్చుకోవడానికి సిద్ధపడాలి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్స్‌పై నిరంతరం అప్‌డేట్‌గా ఉండాలి, నిర్మాణాత్మక ఆలోచన, విశ్లేషణా సామర్థ్యం చాలా ముఖ్యం. ప్రస్తుతం జాబ్ మార్కెట్‌కనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్, టీం మేనేజ్‌మెంట్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఇంటరాక్షన్ స్కిల్స్ వంటివి కూడా అవసరం.

కోర్సు ఇలా:
ఎంసీఏ మూడేళ్ల వ్యవధి గల కోర్సు. ప్రథమ సంవత్సరం సెమిస్టర్లు ఉండవు. ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో సెమిస్టర్ల విధానం ఉంటుంది. చివరి సెమిస్టర్‌లో ప్రాజెక్టు వర్క్.. స్థూలంగా ఇదీ కోర్సు స్వరూపం. సాఫ్ట్‌వేర్ నిపుణులకు, ఐటీ కంపెనీల అవసరాలకు సరిపడేలా ఎంసీఏ సిలబస్‌ను రూపొందించారు. ఐటీలో అన్ని విభాగాలకూ చెందిన ప్రాథమికాంశాలను సిలబస్ కవర్ చేస్త్తుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్‌వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, డిజైన్ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యూనిమేషన్, వెబ్ ప్రోగ్రామింగ్... ఉంటాయి.

విస్తృత అధ్యయనం:
ఎంసీఏలో చేరిన నాటినుంచే సాఫ్ట్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. కోర్సులో చేరాక కేవలం పుస్తకాల్లోని అంశాలను చదవడానికో లేదా పరీక్షలో పాసైతే చాలు అనే కోణంలో.. కాకుండా ఆయా అంశాలకు సంబంధించి ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవాలి. సాఫ్ట్‌వేర్ లేదా సంబంధిత రంగంలో నూతన ఆవిష్కరణలను, పరిశోధనలను లోతుగా అధ్యయనం చేయాలి. ఎంసీఏ అభ్యర్థులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లతో పోటీ పడాల్సి ఉంటుంది. కాబట్టి తదనుగుణంగా కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే అకడెమిక్స్‌తోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకునేందుకు కృషి చేయాలి. ఈ క్రమంలో ముఖ్యంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్‌వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ సిస్టమ్స్, డిజైన్ అండ్ అనాలిసిస్, అల్గారిథమ్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్, వెబ్ ప్రోగ్రామింగ్ వంటి సిలబస్‌లోని ప్రతి అంశంపైనా లోతైన అవగాహన ఏర్పరచుకోవాలి. సెల్ఫ్ లెర్నింగ్, ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యత నివ్వాలి. కెరీర్ పరంగా ప్రాజెక్ట్ వర్క్ చాలా కీలకం. కాబట్టి ఫేక్ ప్రాజెక్ట్ వర్క్ కాకుండా ఏదైనా కంపెనీలో దీన్ని పూర్తి చేయడం ప్రయోజనకరంగా ఉండడంతోపాటు రియల్ టైమ్ ఎన్విరాన్‌మెంట్ అర్థ్ధమవుతుంది. అంతేకాకుండా ఆయా విభాగాల్లో ప్రచురితమైన జర్నల్స్‌ను పరిశీలించాలి. పరిశ్రమ అవసరాలకనుగుణంగా డాట్‌నెట్, అడ్వాన్స్‌డ్ జావా, ఎస్‌ఏపీ, ఒరాకిల్ డీబీఎం, మెయిన్‌ఫ్రేమ్స్, నెట్‌వర్కింగ్ అంశాలపై ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫర్ చేసే స్వల్పకాలిక కోర్సులను చేయడం కూడా కెరీర్ పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆండ్రాయిడ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఈఆర్‌పీ వంటి అంశాల్లో యాడ్ ఆన్ కోర్సులను చేయొచ్చు. వెబ్‌డిజైనింగ్, యానిమేషన్ వంటి రంగాలవైపు కూడా దృష్టి సారించవచ్చు. ఎంసీఏ తర్వాత గేట్ రాసి ఎంటెక్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేయొచ్చు.

ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి
గణితంలో ప్రావీణ్యం, అనలిటికల్ స్కిల్స్ ఉన్నవారికి ఎంసీఏ కోర్సు సరిగ్గా సరిపోతుంది. ఎంసీఏలో చేరిన నాటి నుంచే సాఫ్ట్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తమ భావవ్యక్తీకరణ నైపుణ్యాలను, ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోవడానికి కృషి చేయాలి. కాలేజీ ఎంపికలో నేర్పుగా వ్యవహరించాలి. బోధనా సిబ్బంది, వసతులు, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలను పరిశీలించి కళాశాలను ఎంపిక చేసుకోవాలి. ఎంసీఏ ఔత్సాహికులు ఏదైనా ఇంజనీరింగ్ కళాశాలలకు అనుబంధంగా ఉండే కళాశాలను ఎంపిక చేసుకోవడం మంచిది. ఎందుకంటే అక్కడి మౌలిక వసతులు, బోధనా సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారు. ఎంసీఏలో బోధించే అంశాలు 80 శాతం వరకు ఇంజనీరింగ్ విద్యార్థులకు బోధించేవే ఉంటాయి. కాబట్టి వీరు ప్రధానంగా ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఇంజనీరింగ్ విద్యార్థులకు దీటైన పోటీ ఇవ్వగలరు. మనం నేర్చుకున్న అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించడానికి ప్రయత్నించాలి. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఆండ్రాయిడ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఈఆర్‌పీ వంటి అంశాలపై యాడ్ ఆన్ కోర్సులను చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
Published date : 12 Jul 2013 12:42PM

Photo Stories