CMA Course: అకౌంటింగ్ రంగంలో చక్కటి కోర్సు.. రూ.10 లక్షల వేతనంతో ఉద్యోగం
సీఎంఏ.. ‘కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్’. ఇది అకౌంటింగ్ రంగంలో కెరీర్ కోరుకునేవారికి సుపరిచితమైన కోర్సు. ఇంటర్మీడియట్ తర్వాత ముఖ్యంగా కామర్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సుల్లో సీఎంఏ ఒకటి. కార్పొరేట్ రంగానికి అవసరమైన బిజినెస్ లీడర్స్‌ను తయారు చేసే ఉద్దేశంతో ఈ కోర్సును రూపొందించారు. ప్రస్తుతం 2022 జూన్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. సీఎంఏలో చేరేందుకు అర్హతలు, కోర్సు తీరుతెన్నులు, సబ్జెక్టులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
- అకౌంటింగ్ రంగంలో చక్కటి కెరీర్‌కు మార్గం సీఎంఏ
- 2022 జూన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
- ఇంటర్మీడియెట్ అర్హతతో పరీక్షలు రాసుకోవచ్చు
ఒకప్పటి ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీడబ్లు్యఏఐ) తన పేరును..‘ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’(ఐసీఏఐ)గా మార్చింది.అలాగే,ఐసీడబ్లు్యఏ కోర్సును సీఎంఏగా మార్చారు. అంటే.. ఐసీడబ్లు్యఏకు సీఎంఏకు మధ్య ఎలాంటి తేడా లేదు.
చదవండి: సీఏ ఫైనల్స్‌కు ఇప్పటి నుంచే ప్రిపేర్.. పరిశీలనతోనే అవగాహన పెంచుకోండిలా..!
మూడు స్థాయిల్లో కోర్సు
మేనేజ్‌మెంట్ అండ్ అకౌంటింగ్ రంగంలో కెరీర్ కోరుకునేవారికి సీఎంఏ సరైన కోర్సుగా నిపుణులు చెబుతున్నారు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులు.. కార్పొరేట్ రంగంలో సంస్థల సమర్థ నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలను పొందుతారు. ముఖ్యంగా వాల్యుయేషన్ ఇష్యూస్, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అనాలసిస్, వర్కింగ్ క్యాపిటల్ పాలసీలు, ఎక్స్‌టర్నల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ వంటి అంశాలను నేర్చుకుంటారు. సీఎంఏ కోర్సు ప్రధానంగా మూడు స్థాయిల్లో ఉంటుంది. అవి.. ఫౌండేషన్ కోర్సు, ఇంటర్మీడియెట్ కోర్సు, ఫైనల్ కోర్సు.
అర్హతలు
- ఫౌండేషన్ కోర్సు: పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఫౌండేషన్ పరీక్షలు రాయాలంటే.. ఇంటర్మీడియట్/ 10+2 ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది.
- ఇంటర్మీడియట్ కోర్సు: ఏదైనా విభాగంలో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.
- ఫైనల్ లెవెల్: సీఎంఏ కోర్సులో ఇదే ఆఖరు దశ. ఫైనల్ స్థాయి పరీక్షలు రాయాలంటే.. సీఎంఏ ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని ఉండాలి. అభ్యర్థి మూడేళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్ కాంపోనెంట్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. సీఎంఏ ఫైనల్‌కు దరఖాస్తు చేయడానికి ముందు కనీసం ఆరు నుంచి 15 నెలల ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి.
చదవండి: ఈ కోర్సులతో సర్కారీ కొలువులూ.. అధ్యాపక వృత్తిలోకి వెళ్తే రూ. 60వేల వరకు ప్రారంభం వేతనం..
కోర్సు ఫీజు
సీఎంఏ కోర్సు ఫీజు మూడు స్థాయిలకు వేర్వేరుగా ఉంటుంది. ఫౌండేషన్ కోర్సుకు రూ.6 వేలు, ఇంటర్మీడియట్ లెవెల్‌కు రూ.23,100, ఫైనల్ కోర్సుకు రూ.25 వేలుగా ఫీజు ఉంది. ఇంటర్/ఫైనల్ ఫీజులను రెండు విడతల్లో చెల్లించవచ్చు. ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.. 2022 జూన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గలవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సీఎంఏ సబ్జెక్టులు
మొదటి దశ ఫౌండేషనలో నాలుగు పేపర్లు ఉండగా.. ఇంటర్మీడియెట్, ఫైనల్‌లలో రెండు గ్రూపులుగా ఎనిమిది పేపర్లు చొప్పున ఉంటాయి. అంటే.. సీఎంఏ కోర్సు పూర్తిచేసుకోవాలంటే.. మొత్తం 20 పేపర్లు ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. పరీక్షలు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. ఒక్కో పేపర్‌కు గరిష్టంగా 100 మార్కులు కేటాయించారు. మూడు గంటల్లో పూర్తిచేయాలి.
ఫౌండేషన్ పేపర్స్
- ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్‌మెంట్;
- ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్;
- ఫండమెంటల్స్ ఆఫ్ లాస్ అండ్ ఎథిక్స్;
- ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్.
చదవండి: Inter Exams Best Tips: ఇలా రాస్తే ‘ఇంటర్’ యమ ఈజీ..పాస్ గ్యారెంటీ..
ఇంటర్మీడియట్ కోర్సు
ఇందులో రెండు గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూప్‌లోను నాలుగు సబ్జెక్టులు/పేపర్లు ఉంటాయి. అవి..
- గ్రూప్–1: 1. ఫైనాన్షియల్ అకౌంటింగ్; 2. లాస్ అండ్ ఎథిక్స్; 3. డైరెక్ట్ ట్యాక్సేషన్; 4. కాస్ట్ అకౌంటింగ్.
- గ్రూప్–2: 1. ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్; 2. కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; 3. ఇన్‌డైరెక్ట్ ట్యాక్సేషన్; 4. కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్.
ఫైనల్ కోర్సు
- గ్రూప్–3 సబ్జెక్టులు: 1. కార్పొరేట్ లాస్ అండ్ కంప్లయిన్స్; 2. స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; 3. స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్‌మెంట్–డెసిషన్ మేకింగ్; 4. డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్.
- గ్రూప్–4లో సబ్జెక్టులు: 1. కార్పొరేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్; 2. ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ప్రాక్టీస్; 3. కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ ఆడిట్; 4. స్ట్రాటజిక్ పెర్‌ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ బిజినెస్ వాల్యూయేషన్.
అన్నీ రాయాల్సిందే
- ఫౌండేషన్ ఉత్తీర్ణులవ్వాలంటే.. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు సాధించడంతోపాటు, అన్ని సబ్జెక్టులకు కలిపి సగటున 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందాలి. ఏ ఒక్క పేపర్‌లోనైనా 40 శాతం కంటే తక్కువ మార్కులు వచ్చి ఫెయిలైతే.. తిరిగి అన్ని పేపర్లు రాయాల్సి ఉంటుంది.
- ఇంటర్మీడియెట్/ఫైనల్ కోర్సుకు కూడా ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులతోపాటు ఆయా గ్రూప్ సబ్జెక్టుల్లో సగటున కనీసం 50 శాతం మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్లు ప్రకటిస్తారు.
- ఒకవేళ అభ్యర్థి గ్రూప్ క్లియర్ చేయడంలో విఫలమైనప్పటికీ.. ఏదైనా పేపర్ లేదా పేపర్లలో 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందినట్లయితే.. తదుపరి ప్రయత్నంలో పరీక్ష రాసేప్పుడు 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన పేపర్లకు మినహాయింపునిస్తారు.
ఉత్తీర్ణత శాతం తక్కువే
సీఎంఏ కోర్సు ఉత్తీర్ణత శాతం తక్కువగానే ఉంటోంది. గత ఫలితాలను పరిశీలిస్తే.. ఇది అవగతమవుతుంది. ఫౌండేషన్ కోర్సు ఉత్తీర్ణత శాతం 75 నుంచి 76 శాతం ఉండగా.. ఇంటర్మీడియెట్ లెవెల్‌లో అది 51 శాతంగా ఉంటోంది. కాని ఫైనల్ కోర్సుకు వచ్చేసరికి 38 శాతం మంది మాత్రమే పూర్తిచేయగలుగుతున్నారు
వేతనాలు ఆకర్షణీయం
ఈ రంగంలో కెరీర్ కోరుకునేవారు దీక్ష, పట్టుదలతో ప్రయత్నిస్తే.. సీఎంఏ కోర్సు అన్నిస్థాయిలను మూడు నుంచి నాలుగేళ్లల్లోనే పూర్తిచేసుకోవచ్చు. సీఎంఏ ఉత్తీర్ణులైన వారు ఫైనాన్స్ మేనేజర్, ఫైనాన్స్ అనలిస్ట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ), ఫైనాన్షియల్ కంట్రోలర్, కార్పొరేట్ కంట్రోలర్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, కాస్ట్ అకౌంటెంట్ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. వీరి ప్రారంభ వేతనం నైపుణ్యాలను బట్టి ఏడాదికి రూ.7లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటోంది .
వివరాలకు వెబ్‌సైట్: https://eicmai.in/students-new/Home.aspx