Skip to main content

సరికొత్త రూపంలో సీఏ కోర్సు..

చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ)... అత్యుత్తమ ప్రమాణాలతో కామర్స్ ప్రొఫెషనల్ కోర్సుల్లో సీఏ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ)... అత్యుత్తమ ప్రమాణాలతో కామర్స్ ప్రొఫెషనల్ కోర్సుల్లో సీఏ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) సీఏ కోర్సును నిర్వహిస్తోంది. ఇది ఎప్పటికప్పుడు సిలబస్, బోధన పద్ధతుల్లో మార్పులు తీసుకువస్తూ వాస్తవ అవసరాలకు తగ్గట్టు సీఏ గ్రాడ్యుయేట్లను తయారుచేస్తుంది. తాజాగా మరోసారి ఐసీఏఐ సీఏ కోర్సులో మార్పులు తీసుకురానుంది. 2016 అమల్లోకి రానున్న కొత్త విధానంతో విద్యార్థుల్లో ప్రాక్టికల్ దృక్పథం, వాణిజ్య, వ్యాపార రంగాల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణమైన నైపుణ్యాలు అలవడతాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చార్టర్డ్ అకౌంటెన్సీ కొత్త సిలబస్‌పై విశ్లేషణ...

కామర్స్ రంగంలో కాంతులీనే కెరీర్‌కు కేరాఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ. ఒకప్పుడు కామర్స్ విద్యార్థులు మాత్రమే సీఏ కోర్సును లక్ష్యంగా చేసుకునేవారు. ప్రస్తుతం అన్ని నేపథ్యాల వారు ఈ కోర్సు వైపు దృష్టిసారిస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలతో సీఏ ఉత్తీర్ణులకు డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో కోర్సు ఉత్తీర్ణుల్లో వాస్తవ పరిస్థితులపై పూర్తి స్థాయి అవగాహన ఉండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. దాంతో ఐసీఏఐ సీఏలో మార్పులకు శ్రీకారం చుట్టింది. కొత్త సిలబస్‌ను 2016 నుంచి అమలు చేయనుంది.

విద్యార్థులు రెండు పద్ధతుల్లో సీఏ కోర్సును చదివేందుకు అవకాశం ఉంది. అవి... కామన్ ప్రొఫిసియస్సీ టెస్ట్ (సీపీటీ), డైరక్ట్ ఎంట్రీ స్కీం.

కొత్త సీఏ కోర్సు స్ట్రక్చర్:
Bavitha

ఫౌండేషన్ కోర్సుగా సీపీటీ:
కొత్త విధానంలో కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్(సీపీటీ)ను ఫౌండేషన్ కోర్సుగా పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు కామన్ ప్రొఫిసియన్సీ కోర్సు(సీపీసీ)కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్ కోర్సులో నాలుగు పేపర్లు ఉంటాయి.

పరీక్ష విధానం:
ఫౌండేషన్ కోర్సు పరీక్ష మొత్తం 400 మార్కులకు ఉంటుంది. రెండు పేపర్లు మల్టిపుల్ చాయిస్ విధానంలో మిగిలిన పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. ప్రస్తుతం ఉన్న సీపీటీ పరీక్ష ప్రశ్న పత్రం రెండు విభాగాలుగా 200 మార్కులకు ఉంటుంది. ప్రపంచీకరణ, మారుతున్న బిజినెస్ ట్రెండ్స్ అనుగుణంగా కొత్తగా జనరల్ ఇంగ్లిష్, బిజినెస్ కమ్యూనికేషన్ పేపర్లను ప్రవేశపెట్టారు.

పేపర్స్

మార్కులు

ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ (పేపర్-1)

100 (ప్రస్తుతం 60)

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (పేపర్-2)

100 (ప్రస్తుతం 50)

మర్కంటైల్ లా (పేపర్-3ఎ)

60

జనరల్ ఎకానమిక్స్ (పేపర్-3బీ)

40

జనరల్ ఇంగ్లిష్ (పేపర్-4ఎ)

50

బిజినెస్ కమ్యూనికేషన్ (పేపర్-4బీ)

50

మొత్తం

400



తొలిసారిగా డిస్క్రిప్టివ్ పేపర్లు:
ప్రస్తుతం సీపీటీ పరీక్ష మొత్తం మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంది. దీంతో విద్యార్థుల్లో ‘గెస్సింగ్’ అనే అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రస్తుత పరీక్షా విధానం వల్ల విద్యార్థుల్లోని రైటింగ్ స్కిల్స్‌ని పరీక్షించే అవకాశం లేదు. నాణ్యమైన, ఉన్నత ప్రమాణాలు ఉన్న విద్యను అందించే క్రమంలో భాగంగా డిస్క్రిప్టివ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో బాగంగా జనరల్ ఎకనామిక్స్, జనరల్ ఇంగ్లిష్ పేపర్లను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించనున్నారు.

ఐపీసీసీ ఇకపై ఇంటర్మీడియెట్:
సీపీటీ తర్వాత దశగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్సు (ఐపీసీసీ)ను ఇంటర్మీడియెట్ కోర్సుగా మార్చారు. ఐపీసీసీలో రెండు గ్రూపుల్లో ఏడు సబ్జెక్ట్‌లు ఉండగా.. తాజాగా ప్రతిపాదించిన ఇంటర్మీడియెట్‌లో రెండు గ్రూపుల్లో ఎనిమిది సబ్జెక్ట్‌లను పొందుపరిచారు. ప్రతి సబ్జెక్ట్‌కు వంద మార్కులు కేటాయించారు.

గ్రూప్-1

పేపర్లు

మార్కులు

అకౌంటింగ్ (పేపర్-1)

100

కంపెనీ లా అండ్ అదర్ ‘లా’స్ అండ్ ఎథిక్స్ (పేపర్-2) పార్ట్-1, కంపెనీ లా

60 (ప్రస్తుతం 30)

పార్ట్-2, అదర్ లాస్

20

పార్ట్-3, ఎథిక్స్

20

కాస్ట్ అకౌంటింగ్ (పేపర్-3)

100

డెరైక్ట్ టాక్సెస్ (పేపర్-4)

100

మొత్తం

400











గ్రూప్-2

పేపర్లు

మార్కులు

అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్(పేపర్-5)

100

ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్(పేపర్-6)

100

ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్(పేపర్-7)

100

ఇన్ డెరైక్ట్ ట్యాక్సెస్(పేపర్-8)

100

మొత్తం

400



ప్రస్తుత ఐపీసీసీలో ఏడో పేపర్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్‌ను తొలగించి ఆ స్థానంలో ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ పేపర్‌ను ప్రవేశ పెట్టడంతోపాటు కొత్తగా ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్ పేపర్‌ను చేర్చారు. ఈ మార్పులకు ప్రధాన కారణం.. సీఏ కోర్సులో భాగంగా అభ్యర్థులు ఇప్పటికే వంద గంటల వ్యవధిలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్‌ను పూర్తి చేయాల్సిన విధానం ఉంది. దీంతో అదే స్వరూపం ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్‌ను తొలగించనున్నారు. అదే విధంగా కంపెనీల ఆడిటింగ్ సమయంలో ఉపయోగపడే సర్వీస్ ట్యాక్స్‌లు, ఎక్సైజ్ సుంకాలు, కస్టమ్స్ సుంకాల గురించి అవగాహన పెంచేందుకు ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్ పేపర్‌ను కొత్తగా పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టారు.

ఫెనల్.. ఫైనల్‌గానే.. కానీ:
సీఏ కోర్సులో చివరి దశ ఫైనల్ కోర్సు. పేరు మార్చనప్పటికీ.. రెండు గ్రూపులుగా 8 పేపర్లుగా ఉండే ఈ కోర్సు స్వరూపంలో మాత్రం మార్పులు చోటు చేసుకున్నాయి. అవి..
గ్రూప్-1
పేపర్-1:
ఫైనాన్షియల్ రిపోర్టింగ్
పేపర్-2: స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్
పేపర్-3: అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్
పేపర్-4: కమర్షియల్ అండ్ అదర్ ఎకనామిక్ ‘లా’స్

గ్రూప్-2
పేపర్-5:
అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్
పేపర్-6: ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్
పేపర్-7: అడ్వాన్స్‌డ్ ట్యాక్స్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్
పేపర్-8: ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ ‘లా’స్

ప్రస్తుతం ఫైనల్ కోర్సులో ఉన్న పేపర్లతో పోల్చితే గ్రూప్-1లోని నాలుగో పేపర్(కార్పొరేట్ అండ్ అల్లయిడ్ లాస్)ను కమర్షియల్ అండ్ అదర్ ఎకనామిక్ లాస్‌గా మార్చారు. అదే విధంగా గ్రూప్-2లోని ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్ పేపర్ స్థానంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ పేపర్‌ను; డెరైక్ట్ ట్యాక్స్ ‘లా’స్ పేపర్ స్థానంలో అడ్వాన్స్‌డ్ ట్యాక్స్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ పేపర్లను చేర్చారు. విద్యార్థుల్లో క్యాపిటల్ మార్కెట్స్‌పై అవగాహన మరింత పెంపొందించాలనే ఉద్దేశంతో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ పేపర్‌ను చేర్చారు. భారతీయ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలోనూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీనికి అనుగుణంగా వారు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రమాణాలను పాటించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దాంతో దీనికి సంబంధించిన నైపుణ్యాలు అందించేందుకు అడ్వాన్స్‌డ్ ట్యాక్స్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ పేపర్‌ను కొత్తగా ప్రవేశపెట్టారు.

ఆర్టికల్‌షిప్ తప్పనిసరి:
సిలబస్ పరంగా మార్పులు చేసినప్పటికీ.. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంచే ఆర్టికల్ షిప్ విషయంలో ఎలాంటి మార్పులు లేవు. కొత్త విధానంలోనూ తప్పనిసరిగా మూడేళ్ల ఆర్టికల్ షిప్ చేయాల్సిందే. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ కోర్సుకు రిజిస్టర్ చేసుకున్న తర్వాత నాలుగు వారాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్‌స్కిల్స్ ట్రైనింగ్‌ను పూర్తి చేస్తేనే ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసేందుకు అర్హత లభిస్తుంది. అదే విధంగా వంద గంటల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ కూడా యథాతథంగా ఉంటుంది.

సీఏలో అడుగు పెట్టాలంటే:
సీఏ కొత్త విధానంలో భాగంగా తొలి దశ ఫౌండేషన్, తర్వాత దశ ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసేందుకు అవసరమైన నిర్ణీత కాలవ్యవధిని కూడా పెంచనున్నారు. ఈ క్రమంలో ఫౌండేషన్ విద్యార్థులు పరీక్ష రాయలనుకున్న సమయానికి తొమ్మిది నెలల ముందు తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుత విధానం ప్రకారం- తొలి దశగా ఉన్న సీపీటీకి హాజరు కావాలంటే పరీక్ష సమయానికి ఆరు నెలల ముందు మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంది. అదే విధంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యేందుకు కూడా ప్రస్తుతం ఉన్న తొమ్మిది నెలల సమయాన్ని 12 నెలలకు పెంచడం విద్యార్థులకు లాభించే అంశంగా పేర్కొనవచ్చు.

ప్రాక్టికల్ నైపుణ్యాలు
సీఏ కోర్సులో ప్రతిపాదిత మార్పులన్నీ విద్యార్థుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలు పెంచేందుకు సహకరిస్తాయి. వాస్తవంగా ఆయా సంస్థల్లో నిరంతరం జరిగే వ్యాపార కార్యకలాపాలు, మార్పు, చేర్పులపై నిరంతర అవగాహన అందించడమే తాజా మార్పుల లక్ష్యం. కాబట్టి ఔత్సాహిక విద్యార్థులు పుస్తకాల్లోని అంశాలపై పరిజ్ఞానానికే పరిమితం కాకుండా.. ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే సరైన దిశలో కోర్సు పూర్తవుతుంది.
- ఆర్.చెంగల్‌రెడ్డి, సెక్రటరీ, ఐసీఏఐ-హైదరాబాద్ బ్రాంచ్


అప్లికేషన్ ఓరియెంటేషన్ ముఖ్యం
సీఏలో ఉత్తీర్ణత సాధించాలంటే.. అప్లికేషన్ ఓరియెంటేషన్ ఎంతో అవసరం. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానిని వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ చదివితే త్వరగా అర్థమవుతుంది. కంపేరిటివ్ అప్రోచ్ కూడా ముఖ్యం. ఉదాహరణకు ట్యాక్సేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. డెరైక్ట్ ట్యాక్స్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్ రెండింటినీ బేరీజు వేసుకుంటూ తులనాత్మక అధ్యయనం చేయాలి. కంపెనీ ‘లా’స్, ట్యాక్స్‌లకు సంబంధించి ప్రభుత్వం చేసే మార్పులపై తప్పనిసరిగా రియల్ టైం నాలెడ్జ్ సొంతం చేసుకోవాలి. అప్పుడే సీఏ కోర్సులో విజయం లభిస్తుంది.
- రాహుల్ అగర్వాల్, సీఏ ఫైనల్ మే 2015 ఆల్ ఇండియా టాపర్


ఆర్టికల్‌షిప్‌ను అత్యంత సమర్థనీయంగా
సీఏ కోర్సులో ఆర్టికల్‌షిప్ ట్రైనింగ్ ఉత్తీర్ణత, నాలెడ్జ్ పరంగా ఎంతో ఉపయుక్తమైన అంశం. మూడేళ్ల వ్యవధిలో ఉండే ఈ ఆర్టికల్ షిప్ సమయంలో ఆయా సంస్థలు లేదా ఆడిటర్ల వద్ద పనిచేసే అవకాశం లభిస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పుస్తకాల్లోని అంశాలను ప్రాక్టికల్‌గా ఎలా వినియోగిస్తున్నారో తెలుసుకునే అవకాశం ఆర్టికల్ షిప్ ద్వారా లభిస్తుంది. వ్యాపార, వాణిజ్య పరంగా చోటు చేసుకుంటున్న మార్పులపైనా అవగాహన కలుగుతుంది. కాబట్టి సీఏ కోర్సు ఔత్సాహికులు కోర్సులో భాగమైన ఆర్టికల్‌షిప్‌ను తాము చదువుతున్న అంశాలతో అన్వయించుకుంటూ ముందుకు సాగాలి. ఫలితంగా బుక్ నాలెడ్జ్‌తోపాటు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా సొంతమవుతుంది.
- సీహెచ్.లక్ష్మీ అనూష, సీఏ ఫైనల్ (మే-2015) ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకర్
Published date : 13 Aug 2015 04:46PM

Photo Stories