Skip to main content

సరికొత్త అవకాశాలకు...సీఏ

ప్రస్తుతం సమాజంలో సీఏను ఓ గౌరవప్రదమైన వృత్తిగా చెప్పొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు ఆకర్షణీయ వేతన ప్యాకేజీలతో అవకాశాలు లభిస్తున్నాయి.

డిజిటలైజేషన్ వల్ల సీఏలకు ప్రాక్టీస్‌తోపాటు ఉద్యోగ పరంగా రోజురోజుకూ అవకాశాలు విస్తృతమవుతున్నాయి. సంప్రదాయ ఆడిటింగ్, ట్యాక్సేషన్ తదితర విభాగాలతో పాటు ఎన్నో వినూత్న వేదికలు అవకాశాలకు రాచబాట పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఏలకు అందుబాటులో ఉన్న సరికొత్త అవకాశాలపై ప్రత్యేక కథనం...

ఫోరెన్సిక్ ఆడిట్ :
ఏదైనా ఒక కేసులో వ్యక్తి లేదా సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించి స్పష్టమైన అభిప్రాయాన్ని కోర్టుకు సాక్ష్యంగా సమర్పించడాన్ని ఫోరెన్సిక్ ఆడిట్‌గా చెప్పొచ్చు. ఓ సంస్థ లేదా వ్యక్తి ఆర్థిక నేరాలకు పాల్పడినప్పుడు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తారు. పెద్దపెద్ద అకౌంటింగ్ సంస్థల్లో ఫోరెన్సిక్ ఆడిటింగ్ విభాగాలు ఉంటున్నాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.

  • ఓ సీఏ ఫోరెన్సిక్ ఆడిటర్‌గా ప్రాక్టీస్ చేయాలంటే సీఏ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఫోరెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ సర్టిఫికెట్ కోర్సు చేయాల్సి ఉంటుంది.
  • ఆర్‌బీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్, జీఎస్‌టీ విభాగం, పోలీసుశాఖలు కూడా ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిపుణుల సేవలను ఉపయోగించుకుంటున్నాయి.


విలువ లెక్కింపు :
విలువ లెక్కింపు (Valuation) పరిధి రోజు రోజుకూ విస్తృతమవుతోంది. ప్రపంచీకరణ, సరళీకరణల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సంస్థల విలీనం, స్వాధీనం, భాగస్వామ్యాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సంస్థ అసలు మార్కెట్ విలువ ఎంతో గణించడం అనేది అవసరంగా మారింది. దీంతోనే విలువ లెక్కింపు నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది.

  • క్రెడిట్ రేటింగ్ సంస్థలైన మూడీస్, క్రిసిల్ అదే విధంగా ఆర్థిక సంస్థలైన టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఆదిత్యా బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్; బ్యాంకింగ్ సంస్థల్లో విలువ లెక్కింపు విభాగాల్లో సీఏలకు అవకాశాలు లభిస్తున్నాయి.
  • ప్రాక్టీస్ చేస్తున్న ఓ సీఏ విలువ లెక్కింపు సేవలు అందించాలంటే ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్‌్లస్రీ బోర్డ్ ఆఫ్ ఇండియా నిర్వహించే Registered valuer సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేయాల్సి ఉంటుంది.


ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిస్ప్యూట్ సర్వీసెస్ (ఎఫ్‌ఐడీఎస్) :
ఎఫ్‌ఐడీఎస్ అనేది బిగ్ ఫోర్ ఆడిట్ సంస్థల్లో ఒకటైన EY Audit లో ప్రత్యేక విభాగం. దాదాపు ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఉన్న అంశాలే ఎఫ్‌ఐడీఎస్‌లోనూ ఉంటాయి. ఆర్థిక, సమాచార వ్యవస్థలను పరీక్షించడం, క్లయింట్స్‌పై ప్రభావం చూపుతున్న ప్రపంచవ్యాప్త పరిణామాలు తెలుసుకోవడం తదితర పనులను కూడా ఎఫ్‌ఐడీఎస్ ఆడిటర్స్ చేస్తుంటారు.

కన్సాలిడేషన్ (క్రోడీకరణ) :
ఓ సంస్థకు సంబంధించి నివేదిక రూపకల్పనకు ఆ సంస్థ కార్యకలాపాలన్నింటినీ క్రోడీకరించడాన్ని కన్సాలిడేషన్ అంటారు. ఓ వ్యక్తి కొనబోతున్న కంపెనీ మౌఖిక విలువను తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో కన్సాలిడేషన్ ప్రక్రియలు విస్తృతమవుతున్నాయి.

  • ఐటీసీ, వేదాంత, రిలయెన్స్, ఆదిత్యా బిర్లా, గూగుల్ తదితర ప్రముఖ సంస్థలు సీఏలను కన్సాలిడేషన్ డిప్యూటీ మేనేజర్లుగా, అకౌంట్స్ మేనేజర్లుగా నియమించుకుంటున్నాయి. అయిదేళ్ల అనుభవం ఉన్నవారికి మంచి పే ప్యాకేజీలు లభిస్తున్నాయి.

రికార్డు టు రిపోర్ట్/ప్రొక్యూర్ టు పే (ఆర్ టూ ఆర్/పీ టూ పీ) :

  • ఓ సంస్థకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, పరీక్షించి ఆ కంపెనీ పనితీరును విశ్లేషించడాన్ని ఆర్ టూ ఆర్ విధానమంటారు. ఓ సంస్థ ఉత్పత్తి/సేవలు అందించేందుకు అవసరమైన ముడి సరుకులను సేకరించే విధానాన్ని పీ టూ పీ విధానమంటారు.
  • ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్‌పీ)ను అనుసరించే అన్ని సంస్థలూ సీఏలను అకౌంట్ మేనేజర్లుగా నియమించుకుంటున్నాయి. ఎస్‌ఏపీ వంటి ఈఆర్‌పీ మాడ్యూల్స్ నేర్చుకున్న వారికి అవకాశాలు విస్తృతమవుతున్నాయి.

హెడ్జ్/ఫారెక్స్ మేనేజ్‌మెంట్ :

  • అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార నిర్వహణకు విదేశీ మారక ద్రవ్యం చాలా అవసరం. దేశాల మధ్య వ్యాపార లావాదేవీల్లో కరెన్సీ మార్పిడి జరుగుతుంది. ఈ మార్పిడి సంబంధిత వివరాలను పర్యవేక్షించే విధానాన్ని హెడ్జ్ అని అంటారు.
  • కరెన్సీ ట్రేడింగ్ కంపెనీలైన గోల్డ్‌మ్యాన్ శాచ్, జేపీ మోర్గాన్ అండ్ మోర్గాన్ స్టాన్లీ తదితర సంస్థల్లో ఫారెక్స్ మేనేజర్లుగా, ఫారెక్స్ అనలిస్టులుగా, ఫారెక్స్ అసిస్టెంట్ మేనేజర్లుగా సీఏలు స్థిరపడొచ్చు.

ఖజానా నిర్వహణ :

  • ఓ సంస్థ ఆర్థిక లావాదేవీల్లో చెల్లింపులు కీలకపాత్ర పోషిస్తాయి. సంస్థ పేరుప్రఖ్యాతలకు నష్టం వాటిల్లకూడదంటే చెల్లింపులు సక్రమంగా జరగాలి. ఇలా జరగడంలో ద్రవ్య నిర్వహణ కీలకపాత్ర పోషిస్తోంది. ట్రెజరీ మేనేజ్‌మెంట్‌లో ఇదో ముఖ్యాంశం.
  • సంస్థ ఆదాయాలు, చెల్లింపులు, పెట్టుబడులు, కేటాయింపులు, విరాళాలు ఇవన్నీ ట్రెజరీ మేనేజ్ మెంట్ పరిధిలోకే వస్తాయి. ఖాతాదారుల అవస రాల దృష్ట్యా చాలా బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు ట్రెజరీ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేక శాఖలు నడుపుతున్నాయి. వీటిలో సీఏలకు ఫైనాన్స్ అనలిస్టు, డిప్యూటీ మేనేజర్, ట్రెజరీ మేనేజర్ తదితర అవకాశాలు లభిస్తున్నాయి.

ఎంఐఎస్-రిపోర్టింగ్ :

  • మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) అనేది కంప్యూటర్ ఆధారిత ప్రక్రియ. వ్యాపారంలో వివిధ శాఖల పనితీరును మదించేందుకు, నివేదికల రూపకల్పనకు, నిర్ణయాలు తీసుకునేందుకు ఎంఐఎస్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు.
  • ప్రాక్టీస్‌లో ఉన్న సీఏలు ఎంఐఎస్ రిపోర్టింగ్ కన్సల్టెంట్‌గా సేవలందించొచ్చు. సాఫ్ట్‌వేర్, లాజిస్టిక్స్ కంపెనీల్లో ఎంఐఎస్ రిపోర్టింగ్ విభాగంలో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, రిపోర్టింగ్ అనలిస్టు, ఫైనాన్స్ మేనేజర్ హోదాల్లో సీఏలు స్థిరపడొచ్చు.

ఇన్‌సాల్వెన్సీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ :

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌సాల్వెన్సీ ప్రొఫెషనల్స్.. ఇన్‌సాల్వెన్సీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సు ద్వారా ప్రాక్టీస్‌లో ఉన్న సీఏ, సీఎంఏ, సీఎస్, న్యాయవాదులు ఇన్‌సాల్వెన్స్ ప్రొఫెషనల్ అసిస్టెంట్‌గా మారొచ్చు.
  • విధులు: క్లయింట్ తరఫున ఆస్తులు అమ్మి.. రుణదాతలకు చెల్లిస్తాడు. మిగిలిన మొత్తాన్ని వాటాదారులకు పంచుతాడు. రావాల్సిన ఆదాయాన్ని వచ్చేలా చేస్తాడు.
  • దేశవ్యాప్తంగా దివాలా దిశగా నడుస్తున్న సంస్థల్లో సీఏలకు అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఇన్‌సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అవసరం పెరుగుతోంది.

రిస్క్ అడ్వైజరీ :

  • సంస్థలు ఇప్పుడిప్పుడే రిస్క్ అడ్వైజరీ సేవలను ఉపయోగించడం ప్రారంభిస్తున్నాయి. ప్రతి వ్యాపారానికి అంతర్గత, బాహ్య ముప్పులు ఉంటాయి. వీటిని విశ్లేషించి, సంస్థకు సలహాలు ఇవ్వడం రిస్క్ అడ్వైజర్ ముఖ్య విధి. అదే విధంగా ముందుగానే ప్రమాదాలను అంచనా వేసి, తగిన నివారణ చర్యలను సూచించాలి.
  • బిగ్ 4 ఆడిట్ సంస్థల్లో సీఏలకు రిస్క్ అడ్వైజర్‌గా, జనరల్ రిస్క్ అడ్వైజరీ మేనేజర్‌గా అవకాశాలున్నాయి.

నిధుల సమీకరణ :

  • ఓ ప్రాజెక్టు గురించి మదుపర్లు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు వివరించి పెట్టుబడులను ఆకర్షించే ప్రక్రియను ఫండ్ రైజింగ్ (నిధుల సమీకరణ) అంటారు. ఇటీవల కాలంలో వెంచర్ క్యాపిటల్ ఫైనాన్షింగ్ కూడా నిధుల సమీకరణలో భాగమైంది. ఈ వెంచర్ క్యాపిటల్ ఫైనాన్షింగ్‌లో సీఏల పాత్ర కీలకం.
  • జె.పి.మోర్గాన్, బీఎన్‌పీ పరిబాస్ వంటి పెట్టుబడులు పెట్టే సంస్థలతో పాటు ఐడీజీ వెంచర్స్, క్వాల్‌కామ్ తదితరాల్లో సీఏలకు ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, లీడ్ అనలిస్ట్ తదితర హోదాల్లో అవకాశాలు లభిస్తున్నాయి.

ఎన్‌పీఏ మేనేజ్‌మెంట్ :
పలు కుంభకోణాల నేపథ్యంలో ప్రభుత్వం నిరర్థక ఆస్తుల(ఎన్‌పీఏ) రికవరీ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ క్రమంలో బ్యాంకుల్లో సీఏలకు క్రెడిట్ మేనేజర్, రిస్క్ మేనేజర్‌గా అవకాశాలు లభిస్తున్నాయి.


జీఎస్‌టీ ప్లానింగ్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ :
వస్తువులు, సేవల ప్రవాహాల నిర్వహణను సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ అంటారు. వస్తువులు, సేవల ఉత్పత్తి క్రమంలో వివిధ విభాగాల మధ్య వస్తువులు, సేవల రాకపోకలు జరుగుతుంటాయి. జీఎస్‌టీ వచ్చాక సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ అనేది వినియోగదారుల సేవలు, లాజిస్టిక్ ఖర్చులపై ఆధారపడి ఉంటోంది.

  • జీఎస్‌టీ ప్లానింగ్, కాస్ట్ అకౌంటింగ్; కాస్ట్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, బడ్జెటింగ్, రిస్క్ అసెస్‌మెంట్ తదితర సేవల ద్వారా సీఏలు ఓ సంస్థలో సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌ను సమర్ధంగా నిర్వహిస్తారు.
  • జీఎస్‌టీ అమలు వల్ల సప్లయ్ చైన్ ఆడిట్ రంగం అనేది సీఏలకు అత్యంత ఆకర్షణీయ ఆడిట్ రంగంగా మారింది. సీమెన్స్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్; యాక్సెంచర్ సొల్యూషన్స్, మహీంద్రా లాజిస్టిక్స్ తదితర సంస్థల్లో సీఏలకు సప్లయ్ చైన్ ప్రాజెక్టు మేనేజర్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ మేనే జర్‌గా అవకాశాలు లభిస్తున్నాయి.

అంతర్జాతీయంగా వైవిధ్య కెరీర్లు...
 చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు పూర్తిచేసిన వారిలో కొందరు సొంతంగా ప్రాక్టీస్ చేస్తారు. మరికొందరు ఏదైనా ఆడిట్ సంస్థ లేదా కంపెనీలో పనిచేస్తారు. ఇంతేకాకుండా కంపెనీ డెరైక్టర్, సీఈవో, ఆడిటర్, మేనేజర్ తదితర హోదాల్లో స్థిరపడుతుంటారు. అయితే వీటికి భిన్నంగా సీఏలు రకరకాల సర్టిఫికెట్ కోర్సులు చేసి లేదా నైపుణ్యాలు పెంపొందించుకొని వైవిధ్య కెరీర్‌లను అందుకునేందుకు అవకాశముంది. ప్రపంచీకరణ, సరళీకరణల నేపథ్యంలో ఇలాంటి అవకాశాలు విస్తృతమవుతున్నా యి. అందుకోవాలనే తపన ఉండాలేగానీ సీఏలకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సీఏలు ఆసక్తి మేరకు ఫోరెన్సిక్ ఆడిటర్, రిస్క్ అడ్వైజర్, ట్రెజరీ మేనేజర్, లీడ్ అనలిస్ట్, క్రెడిట్ మేనేజర్, సప్లయ్‌చైన్ ప్రాజెక్టు మేనేజర్ తదితర హోదాలను అందుకొని, కెరీర్‌ను సుస్థిరం చేసుకోవచ్చు.
     - ఎం.ఎస్.ఎస్.ప్రకాశ్ డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్‌
Published date : 08 Jan 2024 05:07PM

Photo Stories