Skip to main content

‘సీఎంఏ’ కోర్సు పూర్తి చేసిన వారికి అపార అవకాశాలు

ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాల పరంగా చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) తర్వాత ఎక్కువగా వినిపించే కోర్సు.. కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ). ఇటీవల కాలంలో సీఎంఏ కోర్సు పూర్తిచేసిన వారికి ఆకర్షణీయ వేతన ప్యాకేజీలతో ఉన్నత కొలువులు లభిస్తున్నాయి.
 విస్తృతమవుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సీఎంఏలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎంఏ కోర్సు వివరాలు...
సీఎంఏ కోర్సును కామర్స్ కోర్సు అనడం కంటే మేనేజ్‌మెంట్ కోర్సు అనడం బాగుంటుంది. ఎందుకంటే ఎంబీఏ పూర్తిచేసిన వారికి సంస్థల్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయో.. సీఎంఏ చేసిన వారికి అంతకంటే ఉన్నత అవకాశాలుంటాయి. సీఎంఏ కోర్సుకు సంబంధించిన అన్ని వ్యవహారాలనూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తోంది. పదో తరగతి తర్వాత కేవలం నాలుగేళ్లలోనూ, ఇంటర్ ఎంఈసీతో పాటు చదివితే దాని తర్వాత రెండేళ్లలో కోర్సును పూర్తిచేయొచ్చు. ఇంటర్ తర్వాత చదవడం ప్రారంభించిన విద్యార్థులకు రెండున్నరేళ్ల సమయం పడుతుంది. ఇంటర్ లేదా డిగ్రీలో ఏ గ్రూపు చదివిన వారైనా సీఎంఏ చేయొచ్చు. డిగ్రీ/ఇంజనీరింగ్ తర్వాత కోర్సు పూర్తిచేసేందుకు రెండేళ్లు అవసరం.

బీటెక్ విద్యార్థులకు..
సాధారణంగా బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులు మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ఎంటెక్/ఎంబీఏ చదువుతుంటారు. అయితే ఆసక్తి ఉన్నవారు బీటెక్ తర్వాత సీఎంఏను చదివి, ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. బీటెక్ పూర్తిచేసిన వారు నేరుగా సీఎంఏలోని రెండో దశ ఎగ్జిక్యూటివ్ కోర్సు చదవొచ్చు. బీటెక్, సీఎంఏ చదివిన వారు తక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రాంగణ నియామకాల్లో వీరికి అధిక ప్రాధాన్యం ఉంటుంది.

సీఎంఏ దశలు :
సీఎంఏ కోర్సులో మూడు దశలు ఉంటాయి. అవి.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్. ఫౌండేషన్ కోర్సులో (2016, ఆగస్టు సిలబస్/విధానం ప్రకారం) ఎనిమిది సబ్జెక్టులను నాలుగు పేపర్లుగా విభజించారు. ప్రతి పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే మొత్తంమీద కనీసం 50 శాతం మార్కులు, ప్రతి పేపర్‌లోనూ కనీసం 40 శాతం మార్కులు రావాలి. పరీక్షను ఏటా జూన్, డిసెంబర్‌లో రెండుసార్లు నిర్వహిస్తారు.

ఫౌండేషన్ పరీక్ష విధానం :
పేపర్ మార్కులు
ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్‌మెంట్ 100
ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ 100
ఫండమెంటల్స్ ఆఫ్ లాస్ అండ్ ఎథిక్స్ 100
ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ 100
మొత్తం మార్కులు 400

సీఎంఏ ఇంటర్ (ఎగ్జిక్యూటివ్) :
  • సీఎంఏ ఫౌండేషన్‌ను పూర్తిచేసిన వారు సీఎంఏ ఇంటర్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఏడాది తర్వాత పరీక్ష రాసేందుకు అర్హులు. ఏటా జూన్, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలో రెండు గ్రూపులుంటాయి. గ్రూప్-1లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, లాస్ అండ్ ఎథిక్స్, డెరైక్ట్ ట్యాక్సేషన్, కాస్ట్ అకౌంటింగ్ పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. మొత్తంమీద 50 శాతం, ఒక్కో పేపర్‌లో 40 శాతం మార్కులు సాధించినవారు ఉత్తీర్ణులవుతారు.
  • గ్రూప్-2లో ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్; కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; ఇన్‌డెరైక్ట్ ట్యాక్సేషన్; కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్ పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. మొత్తంమీద 50 శాతం, ఒక్కో పేపర్‌లో 40 శాతం మార్కులు సాధించినవారు ఉత్తీర్ణులవుతారు. వీలునుబట్టి రెండు గ్రూపులను ఒకేసారి లేదా విడివిడిగా ఆర్నెల్ల వ్యత్యాసంతో రాయొచ్చు.
ప్రాక్టికల్ శిక్షణ :
  • సీఎంఏ ఫైనల్ పరీక్ష రాయాలంటే ఆర్నెల్ల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. సీఎంఏ ఎగ్జిక్యూటివ్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు గుర్తింపు పొందిన సంస్థలో లేదా ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ దగ్గర ఆర్నెల్లపాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ కాలంలో విద్యార్థులు ప్రాంతాన్నిబట్టి నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు స్టైపెండ్ పొందొచ్చు.

సీఎంఏ ఫైనల్ :
ఆర్నెల్ల ప్రాక్టికల్ శిక్షణ పూర్తయిన విద్యార్థులు ఫైనల్ పరీక్ష రాయొచ్చు. సీఎంఏ ఫైనల్లోనూ రెండు గ్రూపులు (గ్రూప్-3, గ్రూప్-4) ఉంటాయి. వీలునుబట్టి రెండు గ్రూపులను ఒకేసారి లేదా విడివిడిగా ఆర్నెల్ల వ్యత్యాసంతో రాయొచ్చు. ఏటా జూన్, డిసెంబర్‌లో ఫైనల్ పరీక్షలు జరుగుతాయి.
  • గ్రూప్-3లో కార్పొరేట్ లాస్ అండ్ కంప్లయిన్స్; స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్‌మెంట్-డెసిషన్ మేకింగ్; డెరైక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు.
  • గ్రూప్-4లో కార్పొరేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్; ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ప్రాక్టీస్; కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ ఆడిట్; స్ట్రాటజిక్ పెర్‌ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ బిజినెస్ వాల్యూయేషన్ పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు.
  • సీఎంఏ ఫైనల్ తర్వాత ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే కంప్యూటర్ శిక్షణను పూర్తిచేసిన వారిని అర్హత పొందిన కాస్ట్ అకౌంటెంట్‌లుగా పరిగణిస్తారు. సీఎంఏ ఫైనల్ తర్వాత ఉద్యోగం చేయాలనుకుంటే నేరుగా ఉద్యోగంలో చేరొచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే మాత్రం అదనంగా రెండున్నరేళ్ల ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాలి. ఈ ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేసిన వారికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.. సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీవోపీ) అందజేస్తుంది.

సీఎంఏలకు అపార అవకాశాలు..
సంస్థల కార్యకలాపాలు విస్తృతమవుతుండటంతో సీఎంఏ కోర్సు పూర్తిచేసిన వారికి అపార అవకాశాలు లభిస్తున్నాయి.
విధులు :
  • ఆర్థిక నిర్వహణ ప్రణాళికలు, ఆర్థిక విధాన నిర్ణయాల రూపకల్పన.
  • వ్యయ నిర్వహణ ప్రణాళికలు, వ్యయ విధాన నిర్ణయాల రూపకల్పన.
  • నిర్వహణ మూలధన యాజమాన్యం.
  • ప్రాజెక్టు రిపోర్టుల తయారీ.
  • క్యాష్ బడ్జెట్, క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ తయారీ.
  • క్యాపిటల్, రెవెన్యూ బడ్జెట్‌ల రూపకల్పన.
  • మేనేజ్‌మెంట్ అకౌంటింగ్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, కార్పొరేట్ ప్లానింగ్, బిజినెస్ పాలసీ, సంస్థ అభివృద్ధి, విస్తరణ తదితర అంశాలకు సంబంధించి సూచనలివ్వడం.
ఉపాధి విభాగాలు..
  • కాస్ట్ అకౌంటింగ్ రంగంలో స్థిరపడొచ్చు.
  • అకౌంటెంట్‌గా సేవలందించొచ్చు.
  • ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి వ్యవహారాలను పర్యవేక్షించొచ్చు.
  • ఫైనాన్షియల్, బిజినెస్ అనలిస్ట్‌లుగా అవకాశాలు ఉంటాయి.
  • డెరైక్ట్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్సేషన్ నిర్వహించొచ్చు.
  • సిస్టమ్ అనాలిసిస్, సిస్టమ్ మేనేజ్‌మెంట్ చేయొచ్చు.
  • ఈఆర్‌పీ మేనేజ్‌మెంట్‌లో ఫైనాన్షియల్ కన్సల్టెన్సీగా సేవలు అందించొచ్చు.
  • బీపీవో హౌజెస్‌లో ప్రాసెస్ అకౌంటెంట్‌గా స్థిరపడొచ్చు.
  • కాలేజీలు, మేనేజ్‌మెంట్ సంస్థల్లో అకడమీషియన్‌గా స్థిరపడొచ్చు.
- ఎంఎస్‌ఎస్ ప్రకాశ్, డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్
Published date : 19 Jul 2019 06:56PM

Photo Stories