Skip to main content

సైన్స్ విద్యార్థులకూ సరైన దారి.. సీఏ!

ప్రస్తుతం ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు, జీఎస్‌టీ కార్యకలాపాలు తదితరాల నేపథ్యంలో కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులకుముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) కు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. పదో తరగతి తర్వాత ఇంటర్ ఎంఈసీ పూర్తి చేసి, సీఏలో చేరడం సరైన పద్ధతి. అయితే వివిధ కారణాల వల్ల ఇంటర్ ఎంపీసీ/బైపీసీలో చేరి, అది పూర్తయ్యాక సీఏలో ప్రవేశించి మంచి ర్యాంకులు సాధిస్తున్నవారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ పూర్తయి, సీఏ గురించి ఆలోచిస్తున్న వారికి ఉపయోగపడేలా కోర్సు వివరాలు...
కోర్సు: చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ).
నిర్వహణ సంస్థ: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ).
కోర్సు వ్యవధి: నాలుగున్నరేళ్లు (ఇంటర్ తర్వాత).
కోర్సులోని దశలు-వ్యవధి: సీఏ ఫౌండేషన్ (ఆరు నెలలు); సీఏ ఇంటర్ (ఎనిమిది నెలలు); సీఏ ఫైనల్ (మూడేళ్లు-ప్రాక్టికల్ శిక్షణతో కలిపి).
పరీక్షల సమయం: ఏటా మే, నవంబర్ నెలలో జరుగుతాయి.
ప్రశ్నల విధానం: ఫౌండేషన్ (ఆబ్జెక్టివ్+డిస్క్రిప్టివ్); ఇంటర్ (డిస్క్రిప్టివ్); ఫైనల్ (డిస్క్రిప్టివ్).

సీఏ ఫౌండేషన్ :

పేపర్

సబ్జెక్టులు

మార్కులు

1

ప్రిన్సిపుల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్

100

2

బిజినెస్ లాస్ (60 మా.) బిజినెస్ కరస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్ (40 మా.)

100

3

బిజినెస్ మ్యాథమెటిక్స్ (40 మా.) లాజికల్ రీజనింగ్ (20 మా.) స్టాటిస్టిక్స్ (40 మా.)

100

4

బిజినెస్ ఎకనామిక్స్ (60 మా.) బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్ (40 మా.)

100

  • ప్రతి పేపర్‌కు మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.

సీఏ ఇంటర్ :
  • సీఏ-ఇంటర్మీడియెట్‌లో గ్రూప్-1లో నాలుగు పేపర్లు, గ్రూప్-2లో నాలుగు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.
  • గ్రూప్-1లో అకౌంటింగ్; కార్పొరేట్ చట్టాలు, ఇతర చట్టాలు; కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్; ట్యాక్సేషన్ (ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్) ఉంటాయి.
  • గ్రూప్-2లో అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్, ఆడిటింగ్ అండ్ అస్యూరెన్స్; ఎంటర్‌ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్; ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ సబ్జెక్టులు ఉంటాయి.

సీఏ ఫైనల్ :
  • సీఏ-ఫైనల్‌లో గ్రూప్-1లో నాలుగు పేపర్లు, గ్రూప్-2లో నాలుగు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు.
  • గ్రూప్-1లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్; కార్పొరేట్ లాస్, ఎకనామిక్ లాస్ సబ్జెక్టులు ఉంటాయి.
  • గ్రూప్-2లో స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ పెర్‌ఫార్మెన్స్ ఎవల్యూషన్; డెరైక్ట్ ట్యాక్స్ లాస్, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్; ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ లాస్ (జీఎస్‌టీ, కస్టమ్స్ అండ్ ఎఫ్‌టీపీ) సబ్జెక్టులు ఉంటాయి. వీటితో పాటు ఎలక్టివ్ పేపర్ (రిస్క్ మేనేజ్‌మెంట్/ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్/ఎకనామిక్ లాస్/ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్/గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్/మల్టీ డిసిప్లినరీ కేస్‌స్టడీ) పేపర్ ఉంటుంది.

ఆర్టికల్‌షిప్ (ప్రాక్టికల్ ట్రైనింగ్) :
  • పాత విధానంలో సీఏ-ఐపీసీసీ రెండు గ్రూపులు పూర్తిచేసినవారు లేదా మొదటి గ్రూపు పూర్తిచేసిన వారికి ఆర్టికల్‌షిప్ చేసేందుకు అర్హత ఉండేది. కానీ, కొత్త విధానంలో రెండు గ్రూపులు/ఏదో ఒక గ్రూపు పూర్తిచేసిన వారు మూడేళ్ల ప్రాక్టికల్ శిక్షణకు అర్హులు.
  • ఏడాది శిక్షణ తర్వాత, సీఏ ఫైనల్ రాసేలోగా నాలుగు వారాల అడ్వాన్స్‌డ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్‌స్కిల్స్ (ఏఐసీఐటీఎస్‌ఎస్)లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.
  • ప్రాక్టికల్ శిక్షణ సమయంలో విద్యార్థులకు ప్రాంతాన్నిబట్టి రూ.2000 నుంచి రూ.7000 స్టైపెండ్ లభిస్తుంది. రెండున్నరేళ్ల ప్రాక్టికల్ శిక్షణ తర్వాత సీఏ ఫైనల్ రాయొచ్చు.

ఉత్తీర్ణత శాతం :
సీఏ కోర్సులో కేవలం రెండు నుంచి మూడుశాతం ఉత్తీర్ణత ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. ఇది అపోహ మాత్రమే. సీఏ కోర్సులో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుందిగానీ మరీ తక్కువేమీ కాదు. అఖిల భారత స్థాయిలో 2019, జనవరి-సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో 46 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదే విధంగా 2019, ఫిబ్రవరి-సీఏ ఇంటర్ ఫలితాల్లో గ్రూప్-1లో దాదాపు 19 శాతం, గ్రూప్-2లో 43 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 2019, జనవరి-సీఏ ఫైనల్ ఫలితాల్లో గ్రూప్-1లో దాదాపు 30 శాతం, గ్రూప్-2లో 23 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులో ఏదో ఒకదశలో ప్రతికూల ఫలితాలు ఎదురైనా కొంచెం పట్టుదలతో, ఓపికతో మళ్లీ కృషిచేస్తే విజయం లభిస్తుంది.

ఆత్మవిశ్వాసంతో అడుగు..
పదో తరగతి తర్వాత ఏ కోర్సులో చేరాలనే దానిపై సరైన అవగాహన లేక ఎం.బైపీసీలో చేరాను. తర్వాత ఏ దిశగా వెళ్లాలనే ప్రశ్న వేధిస్తున్న సమయంలో సీనియర్ల సలహాతో సీఏలో చేరాను. అకౌంట్స్, ఎకనామిక్స్ కొత్తకావడంతో మొదట్లో కొంచెం కష్టమనిపించినా, తర్వాత కాన్సెప్టులపై పట్టుచిక్కే కొద్దీ ఆత్మవిశ్వాసం పెరిగింది. రోజుకు 8 గంటలు చదివాను. చాప్టర్ల వారీ శిక్షణ సంస్థ నిర్వహించే పరీక్షలు రాసి, ప్రిపరేషన్‌లో లోపాలను సరిదిద్దుకున్నాను. దాదాపు 10 మాక్‌టెస్ట్‌లు రాశాను. కాలేజీ మెటీరియల్‌తో పాటు ఐసీఏఐ మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకొని విజయం సాధించాను.
- హేమంత్‌కుమార్, సీఏ-సీపీటీ ఆలిండియా టాపర్.

సరైన ప్రణాళికతోనే సక్సెస్ :
సబ్జెక్టు, చదవాల్సిన చాప్టర్, సమయం తదితర వివరాలతో సమగ్ర టైంటేబుల్ రూపొందించుకోవాలి. ఈ ప్రణాళిక ప్రకారం నిలకడగా ప్రిపరేషన్ కొనసాగించాలి. సందేహాలను ఎప్పటికప్పుడు లెక్చరర్ల సహాయంతో నివృత్తి చేసుకోవాలి. ఎంపీసీ/బైపీసీ విద్యార్థులు సైతం కామర్స్ విద్యార్థులతో సమానంగా సీఏలో రాణించవచ్చు. ప్రస్తుతం సీఏ పూర్తిచేసిన వారికి విస్తృత అవకాశాలున్నాయి. సంస్థల్లో వనరుల సద్వినియోగం, లక్ష్యాల సాధనలో సీఏలది కీలకపాత్ర. సీఏ పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉన్నత వేతనాలతో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ప్రతిభ ఆధారంగా సంస్థల్లో సీఈవో, మేనేజింగ్ డెరైక్టర్, ఫైనాన్స్ డెరైక్టర్, చీఫ్ అకౌంటెంట్ వంటి ముఖ్య స్థానాలకు ఎదగొచ్చు. కొందరు సొంతంగా ప్రాక్టీస్ చేస్తూ సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకుంటున్నారు. మరికొందరు పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు.
- ఎంఎస్‌ఎస్.ప్రకాశ్, డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్.
Published date : 17 Apr 2019 03:17PM

Photo Stories