Skip to main content

ప్రైవేటు బ్యాంకుల్లో ‘పీవో’ కొలువుసాధించేందుకు..సరైన మార్గం ఇదే

ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) కొలువు.. బ్యాంకుల్లో కీలక హోదా.ఐబీపీఎస్ / ఎస్‌బీఐ నిర్వహించే.. ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా పీవో పోస్టు సొంతం చేసుకోవచ్చు. మరి.. ప్రైవేటు బ్యాంకుల్లో.. పీవో పోస్టుకు మార్గం ఏమిటి? నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది..
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?! బ్యాంకింగ్ రంగంలో కెరీర్ కోరుకుంటున్న లక్షల మంది యువతలో మెదిలే సందేహం ఇది. పలు ప్రైవేటు బ్యాంకులు మొదట పీజీ డిప్లొమా కోర్సు ద్వారా శిక్షణ ఇచ్చి.. ఆ తర్వాత పీవో కొలువు ఖాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో... ప్రైవేటు రంగ బ్యాంకులు అనుసరిస్తున్న నియామక విధానాలు.. కోర్సులకు ఎంపిక ప్రక్రియ...శిక్షణ... కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకులు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా. బ్యాంకింగ్ కార్యకలాపాల పరంగా రోజురోజుకీ విస్తరిస్తున్న బ్యాంకులు ఇవి. తమ కార్యకలాపాలు, శాఖలు విస్తరిస్తూ మార్కెట్లో ముందంజలో ఉండేందుకు యత్నిస్తున్నాయి. క్లర్క్ నుంచి పీవో, స్పెషలిస్ట్ స్థాయి వరకు నియామకాలు చేపడుతున్నాయి.

కోర్సు తర్వాతే కొలువు
  • ప్రస్తుతం ప్రైవేటు రంగ బ్యాంకులు పీవో స్థాయి హోదా ఉద్యోగాల భర్తీకి అనుసరిస్తున్న విధానం వినూత్నంగా ఉంటోంది. రియల్ టైమ్ నైపుణ్యాలు అందించేలా ప్రత్యేకంగా పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్/ పీజీ ప్రోగ్రామ్ ఫర్ పీవో పేరిట కోర్సులను నిర్వహిస్తున్నాయి. దీనికోసం ప్రైవేటు యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుంటున్నాయి.ఈ కోర్సుల వ్యవధి ఒక సంవత్సరం.
  • కోర్సులో భాగంగా తరగతి గది బోధనతోపాటు, ఇంటర్న్‌షిప్ కూడా ఉంటుంది. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, అకౌంటింగ్, రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, రిస్క్ అనాలిసిస్ తదితర కోర్ అంశాలతోపాటు.. సదరు బ్యాంకుకు సంబంధించి సేవలు, విధి విధానాలపై అవగాహన కల్పిస్తారు. వీటిపై ప్రత్యక్ష అవగాహన దిశగా ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. ఆ తర్వాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే పీజీ డిప్లొమా సర్టిఫికెట్‌తోపాటు పీవోకు సమానమైన హోదాలో కెరీర్ ప్రారంభించొచ్చు.

డిగ్రీ అర్హతతోనే..
బ్యాంకులు అందిస్తున్న పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత.. కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. జనరల్ కేటగిరీకి వయో పరిమితి 27ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఆయా బ్యాంకుల విధివిధానాలకు అనుగుణంగా ఎంపిక జరుగుతుంది. తొలిదశలో రాత పరీక్షను, ఆ తర్వాత దశలో గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. వీటిలో ప్రతిభ చూపిన వారికి కోర్సులో ప్రవేశం లభిస్తుంది.

రుణ సదుపాయం :
కోర్సుల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి సదరు కోర్సు ఫీజుకు బ్యాంకులే రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసుకొని బ్యాంకులో కొలువుదీరాక నిర్ణీత వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంది. బ్యాంకుల్లో కొలువు సొంతం చేసుకున్న అభ్యర్థులు.. సర్వీస్ అగ్రిమెంట్ రాయాల్సి ఉంటుంది. ఇది ఆయా బ్యాంకుల విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో అర్హత సాధించి కోర్సుల్లో చేరిన అభ్యర్థులకు స్టయిఫండ్ అందిస్తారు.
వెబ్‌సైట్‌లో..
బ్యాంకులు అందిస్తున్న పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఆయా బ్యాంకుల వెబ్‌సైట్‌లోని కెరీర్స్ కాలమ్ ద్వారా తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ ఏటా జూలై నుంచి డిసెంబర్ మధ్య వెలువడుతోంది.


ఐసీఐసీఐ :
ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్ :
 
ప్రైవేటు రంగ ప్రముఖ బ్యాంకు ఐసీఐసీఐ.. పీవో పోస్ట్‌లో నియామకానికి ముందు ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. ఇందుకోసం మణిపాల్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. కోర్సు వ్యవధి ఒక ఏడాది. మొత్తం నాలుగు టర్మ్‌లలో.. టర్మ్-1, టర్మ్-3లలో తరగతి గది బోధన ఉంటుంది. టర్మ్-2లో రెండు నెలలపాటు ఐసీఐసీఐ బ్యాంకులో ఇంటర్‌్ుషిప్ పూర్తిచేయాలి. టర్మ్-4 ‘ఆన్ జాబ్ ట్రైనింగ్’ పేరుతో బ్యాంకుకు సంబంధించిన శాఖల్లో ప్రాక్టికల్ శిక్షణనిస్తారు. వీటన్నిటినీ విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. ప్రారంభంలోనే రూ.4లక్షల వార్షిక వేతనంతో పీవో స్థాయి హోదాతో కొలువు ఖరారవుతుంది.
వివరాలకు వెబ్‌సైట్: https://www.icicicareers.com/website

హెచ్‌డీఎఫ్‌సీ:
ఫ్యూచర్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. ఫ్యూచర్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. మణిపాల్ అకాడమీ భాగస్వామ్యంతో.. ఏడాది వ్యవధిలో క్లాస్ రూమ్ లెక్చర్స్, ఆ తర్వాత ఆన్‌జాబ్ ట్రైనింగ్ ఇస్తోంది. మొదటి ఆరు నెలలు క్లాస్ రూమ్ లెక్చర్స్, తర్వాత ఆరు నెలలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు శాఖల్లో ప్రాక్టికల్ శిక్షణనిస్తారు. వీటిని పూర్తి చేసుకుంటే.. పీజీ డిప్లొమా సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ విధానంలో రానున్న మూడేళ్లలో దాదాపు అయిదు వేల మందిని నియమించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
వివరాలకు వెబ్‌సైట్:
https://www.hdfcbank.com/personal/about-us/careers

కోటక్ మహీంద్రా బ్యాంకు:
సేల్స్ ఆఫీసర్ ప్రోగ్రామ్
:
ప్రైవేటు రంగ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకు.. కోటక్ సేల్స్ ఆఫీసర్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. ప్రాక్టికల్ నైపుణ్యాలు, రియల్ టైమ్ నాలెడ్జ్ అందించేలా మణిపాల్ అకాడమీతో ఒప్పందం చేసుకుంది. కోర్సు వ్యవధి ఏడాది. ఇది పూర్తిచేసుకుంటే.. పీజీ డిప్లొమా ఇన్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ సర్టిఫికెట్‌తోపాటు రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వార్షిక వేతనంతో కొలువు ఖాయం అవుతుంది.
వివరాలకు వెబ్‌సైట్: https://www.kotak.com/en/about-us/careers/students-and-graduates.html

యాక్సిస్ బ్యాంక్:
యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ :

యాక్సిస్ బ్యాంకు యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్, అమిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్స్‌తో ఒప్పందం చేసుకొని... ఏడాది వ్యవధిలో ఉండే పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ కోర్సును నిర్వహిస్తోంది. తొమ్మిది నెలల పాటు క్లాస్ రూమ్ లెక్చర్స్, ఆ తర్వాత మూడు నెలలపాటు బ్యాంకు శాఖల్లో ఉండే ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంటే సర్టిఫికెట్, పీవో కొలువు సొంతమవుతుంది.
వివరాలకు వెబ్‌సైట్:
https://www.axisbank.com/careers/fresher#youngbankerWrap

ఐడీబీఐ:
పీజీడీబీఎఫ్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్ :

ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ (ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా).. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌తో ఒప్పందం ద్వారా కోర్సు + కొలువు విధానానికి శ్రీకారం చుట్టింది. ఏడాది వ్యవధిలో ఉండే పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సును అందిస్తోంది. ఇందులో తొమ్మిది నెలలు తరగతి గది బోధన జరుగుతుంది. మరో మూడు నెలలు ఐడీబీఐ బ్యాంకు శాఖల్లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. వీటిని పూర్తి చేసుకుంటే.. పీజీడీబీఎఫ్ సర్టిఫికెట్‌తోపాటు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ స్థాయిలో బ్యాంకులో కెరీర్ ప్రారంభించొచ్చు.
వివరాలకు వెబ్‌సైట్:
https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.asp


పీజీ డిప్లొమా కోర్సు..
ముఖ్యాంశాలు:
  • బ్యాచిలర్ డిగ్రీ అర్హతతోనే ఈ కోర్సుల్లో ప్రవేశం
  • రాత పరీక్ష, జీడీ/పీఐల్లో సత్తా చాటితే కోర్సులో ప్రవేశం
  • కోర్సు సమయంలో నెలకు రూ.3 వేల నుంచి రూ. ఆరు వేల వరకు స్టయిఫండ్
  • కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత సర్టిఫికెట్‌తోపాటు పీవో స్థాయి హోదాతో కొలువు
  • {పారంభంలో రూ.3.5 లక్షల నుంచి రూ.4లక్షల వార్షిక వేతనం
కొత్త తరహా నియామక విధానం :
ప్రైవేటు రంగ బ్యాంకులు అనుసరిస్తున్న కొత్త తరహా నియామక విధానం.. బ్యాంకింగ్ రంగంలో కొలువు కోరుకుంటూ.. ఐబీపీఎస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి ఎంతో అనుకూలం అని చెప్పొచ్చు. కారణం.. వీటి రాత పరీక్షల్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ కామన్ ఉండటమే. ఫలితంగా అభ్యర్థులు ఒకే సమయంలో రెండు పరీక్షలపై దృష్టి సారించే అవకాశం లభిస్తుంది.
                                   -మనోజ్ సేథి, డెరైక్టర్, బ్యాంక్ ఎగ్జామ్స్ కోచింగ్, టైమ్ ఇన్‌స్టిట్యూట్
Published date : 21 Jan 2020 04:55PM

Photo Stories