Skip to main content

పల్లె ప్రగతిపై అధ్యయ‌నం చేయాల‌నుకునే యువ‌త‌కు స‌దావ‌కాశం.. రూ.15వేల‌తో ఎస్‌బీఐ ఫెలోషిప్‌తో..

ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌..! గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అభివృద్ధి కార్యక్రమాల అమలు దిశగా.. ఎస్‌బీఐ ఫౌండేషన్‌ అందించే ఫెలోషిప్‌.

ముఖ్యంగా పల్లెల్లో సమస్యలను యువత అధ్యయనం చేసే లక్ష్యంతో సరిగ్గా పదేళ్ల క్రితం ఈ ఫెలోషిప్‌ ఏర్పాటైంది. ఎస్‌బీఐ ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్‌ విడుదల చేస్తోంది. తాజాగా.. 2021 సంవత్సరానికి సంబంధించి.. ఎంపిక ప్రక్రియ చేపట్టింది. ఈ నేపథ్యంలో.. ఎస్‌బీఐ యూత్‌ ఫెలోషిప్‌ వివరాలు.. ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం, అందించే ప్రోత్సాహకాలు, భవిష్యత్తు అవకాశాలపై ప్రత్యేక కథనం...

  • ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా– 2021 ఫెలోషిప్‌కు దరఖాస్తులు
  • మొత్తం 12 విభాగాల్లో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో ఫెలోషిప్‌
  • అభ్యర్థులు తమకు నచ్చిన విభాగంలో పని చేసే అవకాశం
  • ఎంపికైన వారికి 13 నెలలపాటు నెలకు రూ.15వేల ఫెలోషిప్‌
  • సేవ, సామాజిక అభివృద్ధి, భవిష్యత్తు అవకాశాలకు చక్కటి మార్గం
  • ఫెలోషిప్‌నకు ఎంపికైతే స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసే వీలు
  • సోషల్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో ఉజ్వల కెరీర్‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఫౌండేషన్‌.. ఇది గ్రామీణ ప్రజల ప్రగతికి చేయూతనందించేలా..ప్రముఖ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పల్లెల అభివృద్ధికి కృషి చేస్తోంది. ఇందులో యువతను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్స్‌ను అందిస్తోంది. 2011లో ప్రారంభమైన ఈ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌లకు యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా 2021 సంవత్సరానికి ఈ ఫెలోషిప్‌లకు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.

అర్హతలు..
ఎస్‌బీఐ యూత్‌ ఫెలోషిప్‌నకు దరఖాస్తు చేసుకు నేందుకు బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 21ఏళ్ల నుంచి 32ఏళ్ల మధ్య ఉండాలి. డొమైన్‌తో సంబంధం లేకుండా ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. కావల్సిందల్లా.. సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలనే దృక్పథమే.

ఎంపిక ప్రక్రియ..

  • ఎంపిక ప్రక్రియను మొత్తం మూడు దశలుగా ఎస్‌బీఐ ఫౌండేషన్‌ చేపడుతోంది.
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ వ్యక్తిగత సమాచారం, అకడమిక్‌ సంబంధిత వివరాలు అందించాలి. ఈ దరఖాస్తులను పరిశీలించిన నిపుణుల కమిటీ, వాటిని షార్ట్‌లిస్ట్‌ చేసి..సదరు జాబితాలో నిలిచిన అభ్యర్థులకు సమాచారం ఇస్తుంది. జాబితాలో నిలిచిన అభ్యర్థులు స్టేజ్‌–2గా పిలిచే ఆన్‌లైన్‌ అసెస్‌ మెంట్‌ ప్రక్రియకు హాజరు కావాలి.
  • స్టేజ్‌–2 ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ ప్రక్రియలోనూ విజయం సాధించిన వారికి స్టేజ్‌–3లో పర్స నాలిటీ అసెస్‌మెంట్‌ లేదా ఇంటర్వూ నిర్వహిస్తారు. ఇందులోనూ ప్రతిభ చూపి తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులను ఎస్‌బీఐ యూత్‌ ఫెలోషిప్‌నకు ఎంపిక చేస్తారు.

స్టేజ్‌–2 ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌..
స్టేజ్‌–2 ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌లో భాగంగా అభ్యర్థులు మూడు ఎస్సే ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సామాజిక అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆసక్తి, తమకున్న నైపుణ్యాలు, తమ ఆసక్తికి అను గుణంగా ఎస్‌బీఐ యూత్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ ఎలా చేయూతనిస్తుందని భావిస్తున్నారు? అనే అంశాలపై 500పదాలకు మించకుండా ఎస్సే రాయమని అడుగుతారు. ఈ ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌లో భాగంగానే అభ్యర్థులు తమ ప్రొఫెసర్లు/విభాగాధిపతులను రిఫరెన్స్‌లుగా పేర్కొనాల్సి ఉంటుంది.

స్టేజ్‌–3 పర్సనాలిటీ..అసెస్‌మెంట్‌/ ఇంటర్వూ..
స్టేజ్‌–2లో విజయం సాధించిన అభ్యర్థులకు స్టేజ్‌–3లో పర్సనల్‌ ఇంటర్వూ్య నిర్వహిస్తారు. అభ్యర్థులకు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలపై నిజంగా ఆసక్తి ఉందా? లేదా? అనే విషయాన్ని పరిశీలించే విధంగా నిపుణుల కమిటీ ఈ ఇంటర్వూ్య చేస్తుంది. అభ్యర్థులు ఇచ్చిన సమాధానాలు మెప్పించేలా ఉంటే.. తుది జాబితాలో నిలిచి ఫెలోషిప్‌నకు ఎంపికైనట్లే!

పదమూడు నెలలు..
ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు మొత్తం 13 నెలల పాటు ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. ఈ సమయంలో అభ్యర్థులు ఎస్‌బీఐ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న విభాగం గురించి తెలపాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా ఆ విభాగానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.

సమస్యలు.. పరిష్కారాలు..
ఎస్‌బీఐ ఫెలోషిప్‌లో భాగంగా విధులు నిర్వహిస్తున్న యువత.. తాము పని చేస్తున్న విభాగంలో సమస్య లను గుర్తించి.. వాటికి పరిష్కార మార్గాలు సూచించాల్సి ఉంటుంది. నిర్దిష్టంగా ఏదైనా ఒక ప్రాజెక్ట్‌ను ఎంచుకుంటే.. దానికి సంబంధించిన అంశాలపై తాము పని చేస్తున్న ఎన్‌జీఓల నుంచి కూడా సహకారం లభించేలా చర్యలు అమలవుతున్నాయి.

ఫెలోషిప్‌ విధులు ఇలా..
మొత్తం 13 నెలల ఫెలోషిప్‌ మూడు దశలుగా ఉంటుంది. అవి..

  • ఫెమిలియరైజేషన్‌(అవగాహన)
  • ఇంప్లిమెంటేషన్‌(ఆచరణ)
  • సస్టెయినెన్స్‌ (సుస్థిరత). ఈ మూడు దశలను పూర్తి చేసే క్రమంలో ముందుగా ఒక వారం పాటు ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తారు. ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్‌ పూర్తయ్యాక.. అభ్యర్థులు తమకు కేటాయించిన ఎన్‌జీఓ కేంద్రంలో ఉండి, ఆయా ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలి. దీనిద్వారా అభ్యర్థులు తమకు ఏ ప్రాంతంలో, ఏ విభాగంలో పనిచేసేందుకు ఆసక్తి ఉందో తెలియ చేయాలి. దానికి అనుగుణంగా అభ్యర్థులు ఎంచు కున్న ప్రాంతం, విభాగంలో సదరు ఎన్‌జీఓలతో కలిసి పని చేసే అవకాశం కల్పిస్తారు.

ప్రాజెక్ట్‌ వర్క్..
ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న అంశంపై ప్రాజెక్ట్‌ వర్క్‌ పూర్తి చేయాలి. ఇందుకోసం కనీసం తొమ్మిది నెలల సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులు ఏదైనా ఒక సామాజిక సమస్యకు పరిష్కారం చూపే విధంగా కార్యాచరణకు ఉపక్రమించాలి. దానికి సంబంధించి నివేదికను రూపొందించి అందించాల్సి ఉంటుంది.

ఆర్థిక ప్రోత్సాహకం..
షెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్‌బీఐ ఫౌండేషన్‌ ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. 13 నెలల పాటు ప్రతి నెల రూ.15వేల ఫెలోషిప్‌ను, ప్రయాణ ఖర్చుల కోసం ప్రతి నెల మరో వేయి రూపాయలను అందిస్తారు. ఇతర అలవెన్స్‌ల పేరుతో రూ.50వేల ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. వీటితోపాటు ఫెలోషిప్‌ వ్యవధిలో శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తారు.

12 విభాగాలు..
ఫెలోషిప్‌లో భాగంగా గ్రామీణాభివృద్ధికి సంబం ధించి ప్రస్తుతం ఎస్‌బీఐ ఫౌండేషన్‌ మొత్తం పన్నెండు అంశాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఎడ్యుకే షన్, ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్, హెల్త్, ఫుడ్‌ సెక్యూ రిటీ, రూరల్‌ లైవ్‌లీహుడ్స్, ఆల్టర్నేట్‌ ఎనర్జీ, ట్రెడిషనల్‌ క్రాఫ్ట్స్, సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సెల్ఫ్‌ గవ ర్నెన్స్, ఉమెన్స్‌ ఎంపవర్‌మెంట్, టెక్నాలజీ, వాటర్‌ విభాగాల్లో అభివృద్ధి కార్యక్రమాల దిశగా అడుగులు వేస్తోంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమ కు ఆసక్తి ఉన్న విభాగాన్ని పేర్కొనాల్సి ఉంటుంది. ఈ 12 విభాగాల్లో అభివృద్ధికి సంబంధించి అగాఖాన్‌ రూరల్‌ సపోర్ట్‌ ప్రోగ్రామ్‌(ఇండియా), బీఏఐఎఫ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ తదితర 12 ప్రముఖ స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం కుదు ర్చుకుని.. ఈ కార్యక్రమాలను ఎస్‌బీఐ ఫౌండేషన్‌ నిర్వహిస్తోంది. ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు ఈ సంస్థలతో కలిసి పని చేసే అవకాశం లభిస్తుంది.

గ్రామీణ సమస్యలు, పరిష్కారాలు..
ఈ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అభ్యర్థులకు గ్రామీణ ప్రాంతాల్లో ఆయా విభాగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆయా సమస్యలకు ఎన్‌జీఓలు సూచిస్తున్న పరిష్కార మార్గాలపై అవగాహన లభిస్తుంది. అభ్యర్థులు స్వయంగా కూడా నిర్దిష్టంగా ఒక సమస్యను గుర్తించి.. దాన్ని పరిష్కరించే విధంగా అడుగులు వేసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ ఫెలోషిప్‌ ద్వారా యువతకు గ్రామీణ భారత సమకాలీన పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది.

భవిష్యత్తు అవకాశాలు..
ఈ ఫెలోషిప్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు భవిష్యత్తులో చక్కటి అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. ఫెలోషిప్‌ వ్యవధిలో చూపిన చొరవ, పనితీరు ఆధారంగా ఎన్‌జీఓలోనే కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫెలోషిప్‌ సర్టిఫికెట్‌తో కా ర్పొరేట్‌ సంస్థల్లోని కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలి టీ విభాగాల్లోనూ కొలువులు దక్కించుకునే వీలుంది.

సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా..
ఫెలోషిప్‌ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తాము పనిచేసిన విభాగంలోనే సోషల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌గా స్టార్ట్‌ అప్స్‌ నెలకొల్పే అవకాశముంది. ఎస్‌బీఐ యూత్‌ ఫెలోస్‌ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే...ఈ ఫెలోషిప్‌ పూర్తి చేసుకున్న వారిలో దాదాపు 70శాతం మంది సోషల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌గా కెరీర్‌ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సీడ్‌ ఫండింగ్‌ సంస్థలు.. సోషల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇది కూడా కలిసొచ్చే అంశమే.

ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌ – 2021 సమాచారం..

    • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
    • మొత్తం ఫెలోషిప్‌ల సంఖ్య: దాదాపు 100.
    • విద్యార్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
    • వయో పరిమితి: 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి.
    • దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2021
    • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://youthforindia.org/home/web_ngo, https://youthforindia.org
Published date : 26 Apr 2021 04:25PM

Photo Stories