కెరీర్ ఇన్ బ్యాంకింగ్
బ్యాంకుల ఆధునికీకరణ.. బ్రాంచ్‌ల విస్తరణ, గ్రామీణ ప్రాంతాలకు సేవలందించాలనే ఉద్దేశంతో.. ఇటీవలి కాలంలో ఈ రంగంలో రిక్రూట్‌మెంట్స్ ఉపందుకున్నాయి, సుస్థిర భవిష్యత్తుకు బాటలు వేస్తున్న బ్యాంకింగ్ రంగం ఇంటర్మీడియెట్ మొదలు పోస్ట్‌గ్రాడ్యుయేషన్, ఆపై చదువులు చదివిన ప్రతి ఒక్కరికి కచ్చితమైన ఉపాధి వేదికగా నిలుస్తోంది. బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించిన వారి కెరీర్ గ్రాఫ్ ఏవిధంగా ఉంటుంది? ఇటీవల కొత్తగా ప్రారంభించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) కామన్ రిటెన్ ఎగ్జామ్‌లో విజయానికి ప్రిపరేషన్ వ్యూహాలు.. త దితర అంశాలపై ఫోకస్..
ప్రతిభకు పెద్దపీట వేసే రంగాల్లో బ్యాంకింగ్ రంగం ఒకటి. ఇందులో ప్రవేశించిన వారు తమ సామర్థ్యం, అనుభవం ఆధారంగా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చు. దీనికి చక్కని ఉదాహరణ.. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అత్యున్నత స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్నవారందరూ.. సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ)గా కెరీర్ ప్రారంభించిన వారే కావడం గమనార్హం. వారంతా ప్రతిభ, అనుభవంతో ప్రస్తుత స్థానాలకు చేరుకున్నారు. బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌గ్రాఫ్ పరిశీలిస్తే..
ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ):
ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ)గా కెరీర్ ప్రారంభించిన వారు బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత స్థాయిలో స్థిరపడొచ్చు. కానీ కెరీర్‌గ్రాఫ్‌లోపైకి వెళ్తున్న కొద్ది.. ఆ స్థానాలు తగ్గుతుంటాయి. అందువల్ల అతికొద్ది మందికి మాత్రమే అత్యున్నత అవకాశాలు లభిస్తాయి. సాధారణంగా పీఓగా కెరీర్ ప్రారంభించిన వారు పదవీ విరమణలోపు సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయికి చేరుకోవచ్చు. ఆకర్షణీయ వేతనంతోపాటు పలు రకాల సౌకర్యాలు పీఓల సొంతం.
కెరీర్.. సౌకర్యాలు:
పీఓగా బ్యాంకింగ్ రంగంలో ప్రవేశానికి అర్హత: గ్రాడ్యుయేషన్. బేసిక్ పే నెలకు రూ.14,500. విధులు నిర్వహించే ప్రదేశం ఆధారంగా ప్రారంభంలో కనీసం రూ.21,000 వరకు వేతనం లభిస్తుంది. ప్రమోషన్ల ఆధారంగా నెలకు రూ.52,000 వరకు సంపాదించవచ్చు. ఫర్నిచర్‌తో కూడిన గృహవసతి కూడా కల్పిస్తారు (ఈ సౌకర్యం బ్యాంకులను బట్టి మారుతుంది). అన్ని బ్యాంకుల్లో పేస్కేల్ ఒకే విధంగా ఉంటుంది కానీ సౌకర్యాలు మాత్రం బ్యాంకులను బట్టి మారుతుంటాయి. ప్రతి సంవత్సరంలో ఒక సారి.. ఒక నెల జీతానికి సమానమైన మొత్తాన్ని వడ్డీలేని రుణంగా మంజూరు చేస్తారు. దీన్ని పది సమాన వాయిదాల్లో చెల్లించే సౌలభ్యం ఉంటుంది. దీనికితోడు వాహన రుణాలు, గృహ రుణాలను తక్కువ వడ్డీకి ఇస్తారు. ఉద్యోగి స్థాయిని బట్టి ప్రతి నెల పెట్రోల్ ఖర్చులు కూడా చెల్లిస్తారు. ఎస్‌బీఐ దాని అనుబంధ బ్యాంకులు, కొన్ని ఇతర బ్యాంకుల్లో పనిమనిషి కోసం అలవెన్సులు చెల్లించే సౌకర్యం కూడా ఉంది. గృహోపకరణాలు, వాటి నిర్వహణ కోసం పరిమితులకు లోబడి అలవెన్సులు ఇస్తున్నారు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సెల్‌ఫోన్లు, నెల నెలా వాటి బిల్లులు కూడా చెల్లిస్తారు. ఇతర సదుపాయాలు మాత్రం బ్యాంకును బట్టి మారుతుంటాయి.
బ్యాంకుల్లో.. జూనియర్, మిడిల్, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు ఉంటాయి. తర్వాతి స్థాయి టాప్ ఎగ్జిక్యూటివ్. జూనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగులకు అసిస్టెంట్ మేనేజర్ హోదా ఇస్తారు. మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయిలో డిప్యూటీ మేనేజర్, మేనేజర్ అనే రెండు హోదాలు ఉంటాయి. సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఉండే హోదాలు.. చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్. డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ డిజిగ్నేషన్లకు టాప్ ఎగ్జిక్యూటివ్ హోదా ఇస్తారు. ఈ విధంగా మొత్తం ఏడు స్కేళ్లు, ఆ తర్వాత రెండు స్కేళ్లు ఉంటాయి. వాటిలో ఒకటి చీఫ్ జనరల్ మేనేజర్ కాగా రెండోది అత్యున్నతమైన మేనేజింగ్ డెరైక్టర్ స్థాయి.
ప్రోత్సాహకాలు:
బ్యాంకింగ్ రంగంలో ఒకప్పుడు కేవలం డిపాజిట్ల సేకరణ, రుణాలు ఇవ్వడం మాత్రమే ప్రధాన పనిగా ఉండేది. వాటిల్లో పోటీ పెరగడంతో లాభదాయకత తగ్గింది. దీంతో ఇతర ఆదాయ మార్గాల వైపు దృష్టి సారించాయి. అందులో భాగంగా ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ల అమ్మకాలు వంటి వ్యవహారాలను చేపట్టాయి. కొన్ని బ్యాంకులు బంగారం అమ్మడం ప్రారంభించాయి.
ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ల అమ్మకంతో జీతం కంటే ఎక్కువ కమీషన్ సంపాదిస్తున్న ఉద్యోగులున్నారు. అదనపు ప్రోత్సాహంగా విదేశీ యాత్ర సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. కొంతమంది మార్కెటింగ్ అధికారులైతే ఫిక్స్‌డ్ వేతనంతోపాటు చేసిన బిజినెస్‌కు అనుగుణంగా కమీషన్ సొంతం చేసుకుంటున్నారు.
క్లరికల్ కేడర్:
బ్యాంకింగ్ రంగలో కేవలం ఇంటర్మీడియెట్‌తో అర్హతతో కెరీర్ ప్రారంభించే అవకాశం క్లరికల్ కేడర్ కల్పిస్తోంది. ఇటీవల ఐబీపీఎస్ క్లరికల్ స్థాయి ఉద్యోగాలకు కూడా పీఓగా మాదిరిగానే కామన్ రిటెన్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తోంది. క్లరికల్ కేడర్ ద్వారా బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించిన వారికి క్లర్క్, క్యాషియర్, టైపిస్ట్ అనే మూడు రకాల పనులను ఒకటిగా చేసిన హోదా ఇస్తారు. వీరిని సీసీటీ అని వ్యవహరిస్తారు. ఇక్కడ గమనించాల్సిన అంశం.. బ్యాంకులు సాధారణ ంగా టైప్ రైటింగ్ క్వాలిఫికేషన్ అని ప్రత్యేకంగా ప్రస్తావించరు. టైప్ చేయడం వస్తే చాలు అని పేర్కొంటారు. ఈ రోజుల్లో యువతకు కంప్యూటర్‌తో పని చేయడం అలవాటు. కాబట్టి ఏదో ఒక వేగంతో టైప్ చేయగలిగి ఉంటారు. కాబట్టి తరువాత అవసరాలకు అనుగుణంగా టైప్ వేగం పెంచుకోవచ్చనే భావనే ఇందుకు ప్రధాన కారణం.
పేస్కేలు.. ప్రమోషన్:
క్లరికల్ స్థాయి వేతన స్కేలు రూ. 6200-440 నుంచి రూ. 7400 -500-8900-600-11300-700-16200-1300-17500-800-19100గా ఉంటుంది. ఈ స్కేలును ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరిస్తుంటారు. ప్రస్తుతం ప్రారంభంలో నెలకు రూ.10 వేల వేతనం లభిస్తుంది. తర్వాత హోదాను బట్టి నెలకు రూ. 40వేల వరకుసంపాదించవచ్చు. వీరికి కూడా పని చేసే ప్రదేశం బట్టి వేతనాల్లో వ్యత్యాసం ఉంటుంది. పదోన్నతులను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా ప్రయత్నించిన వారు.. ఐదు సంవత్సరాల్లో ఆఫీసర్‌గా జూనియర్ మేనేజ్‌మెంట్ స్థాయికి ప్రమోషన్ పొందొచ్చు. ఆ స్థాయి నుంచి క్రమంగా ప్రమోషన్ల ఆధారంగా జనరల్ మేనేజర్ హోదా వరకు చేరుకోవచ్చు. కనీసం చీఫ్ మేనే జర్ స్థాయి వరకు తప్పకుండా చేరుకునే అవకాశం ఉంటుంది.
ఒకసారి ఆఫీసర్ ప్రమోషన్ పొందాక వారి కెరీర్ గ్రాఫ్ ఇతర ఆఫీసర్లతో సమానంగా ఉంటుంది. ఆఫీసర్లందరికీ ప్రతి మూడు సంవత్సరాలకు ట్రాన్స్‌ఫర్ తప్పనిసరి. అది కూడా భారతదేశంలో ఎక్కడికైనా కావచ్చు. ప్రమోషన్ తర్వాత తప్పనిసరిగా ఇతర రాష్ట్రాల్లో పని చేయాలి. వ్యక్తిగత ప్రాధాన్యతల వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లలేని వారు, స్థాన చలనం పట్ల ఆసక్తి చూపని వారు, క్లరికల్ స్థాయిలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నా వారికి కూడా పదోన్నతులు ఉంటాయి. వీరికి హెడ్‌క్యాషియర్‌గా, స్పెషల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఉంటాయి. ఈ అదనపు బాధ్యతలు నిర్వహించినందుకుగాను అదనపు అలవెన్సులు కూడా ఇస్తారు.
ఐఐబీఎఫ్:
బ్యాంకింగ్ రంగంలోకి విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారు ఉంటారు. వీరందరికీవస్తున్న మార్పులకనుగుణంగా అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నేతృత్వంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(ఐఐబీఎఫ్) అనే సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ జేఏఐఐబీ, సీఏఐఐబీ అనే కోర్సులను ఆఫర్ చేస్తుంది. బ్యాంక్ ఉద్యోగులందరూ ఈ కోర్సులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఒక్కో పరీక్ష పూర్తి చేస్తేప్రోత్సాహకరంగా ఒక్కొక్క ఇంక్రిమెంట్ అధికంగా ఇస్తున్నారు. జేఏఐఐబీ కోర్సు పూర్తి చేస్తే ఒక ఇంక్రిమెంట్, సీఏఐఐబీ కోర్సు పూర్తి చేస్తే రెండు ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తున్నారు. మిగిలిన డిప్లొమాలకు, సర్టిఫికెట్లకు ఆఫీసర్లతో సమానంగా నగదు ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు.
ప్రోత్సాహకాలు:
క్లరికల్ స్థాయిలో కూడా ఇన్సూరెన్స్ వ్యాపారం ద్వారా కమీషన్, విదేశీ యాత్ర వంటి ప్రోత్సాహాకాలు కల్పిస్తున్నారు. పెట్రోల్, పేపర్ వంటి ఖర్చులకు డబ్బులిచ్చే సంప్రదాయం కొన్ని బ్యాంకుల్లో ఉంది. తక్కువ వడ్డీకి వాహన రుణాలు, గృహ రుణాలను అందజేస్తున్నారు. ఇంటర్మీడియెట్ స్థాయిలో బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించి గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రెండు అదనపు ఇంక్రి మెంట్లు మంజూరు చేస్తారు. కొన్ని బ్యాంకుల్లో సీఏ, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేస్తే ఎలాంటి పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండా ఆఫీసర్ స్థాయి పదోన్నతి కల్పిస్తారు. బ్యాంకింగ్ విధులకు సంబంధించి క్లరికల్ స్థాయి ఉద్యోగులకు మాత్రమే వర్తించే నిబంధన.. రోజుకు నిర్దేశించిన సమయమే పని చేయాలి. ఆఫీసర్లకు మాత్రం ఇన్ని గంటలు అనే పరిమితి లేదు. వారు ఇరవై నాలుగు గంటలూ డ్యూటీలో ఉన్నట్లే.
ఐబీపీఎస్ కామన్ రిటెన్ ఎగ్జామ్
రిక్రూట్‌మెంట్ కింగ్‌గా మారిన బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి కాలం వరకు ఉద్యోగాల నియామకానికి.. ఆయా బ్యాంకులు వేర్వేరుగా లేదా రెండు, మూడు బ్యాంకులు ఉమ్మడిగా పరీక్షను నిర్వహించేవి. ఇలాంటి సందర్భాల్లో రెండు బ్యాంకుల పరీక్షలు ఒకే సారి రావడం.. ప్రిపరేషన్ పరంగా, ఆర్థికంగా కూడా నిరుద్యోగులకు భారంగా ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఐబీపీఎస్ జాతీయ స్థాయిలో కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ నిర్వహణకు శ్రీకారం చుట్టింది. సంవత్సరానికి రెండుసార్లు పీఓ, క్లరికల్ కేడర్‌కు పరీక్షలను నిర్వహిస్తున్నారు. రెండు వేర్వేరుగా ఉంటాయి. ఈ స్కోర్‌కు ఏడాది వ్యాలిడిటీ ఉంటుంది. దీని ఆధారంగా ఆ సమయంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసే బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కోర్ పెంచుకోవాలనుకుంటే మాత్రం ఆరు నెలల తర్వాత మరోసారి ఈ పరీక్షకు హాజరుకావచ్చు.
ఐబీపీఎస్ నిర్వహించే ప్రవేశ పరీక్షలో విజయం సాధించడానికి ఇంగ్లిష్, మ్యాథ్స్, రీజనింగ్‌లలో నైపుణ్యం కీలకం. క్లరికల్, ఆఫీసర్ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలో దాదాపుగా సబ్జెక్టులు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ప్రశ్నపత్రం క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. పీఓ ఉద్యోగాలకు జనరల్ ఎవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ కలిపి ఉంటే, క్లరికల్ ఉద్యోగాలకు బ్యాంకింగ్ రంగ నేపథ్యంలో జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్‌నాలెడ్జ్ వేర్వేరుగా ఉంటాయి.
ప్రిపరేషన్ ప్లాన్:
- ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. ఈ జ్ఞానాన్ని బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ మోడల్ పేపర్‌లోని ప్రశ్నలకు అన్వయిస్తూ వీలైనంత ప్రాక్టీస్ చేయాలి.
- పీఓ పరీక్ష నేపథ్యంగా పెట్టుకున్న వారు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. గత రెండేళ్ల ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే.. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో సింహభాగం డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై ఆధారపడిన ప్రశ్నలే ఇస్తున్నారు.
- క్లరికల్ కేడర్‌కు ప్రిపేరయ్యే వారు మాత్రం 8,9,10 తరగతుల్లోని అర్థమెటిక్ విభాగాన్ని ఔపోసన పట్టాలి. అందులో ప్రతి ప్రశ్నకూ రఫ్ వర్క్ చేయకుండా మనసులో గణించడం ద్వారా సమాధానాలు కనుక్కొనే విధంగా సాధన చేయాలి.
- రీజనింగ్ విభాగంలో మొదట నమూనాలను అర్థం చేసుకోవాలి. విద్యార్థి దశలో ఏ స్థాయిలోనూ ఈ విభాగంతో పరిచయం ఉండదు. కాబట్టి ప్రాథమిక స్థాయి నుంచి ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఒక మాదిరి అవగాహన వచ్చాక సమయాన్ని నిర్దేశించుకుని సమస్యను సాధించే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్‌లో ప్రాథమిక అంశాలపై అవగాహన వచ్చాక మోడల్ ప్రశ్నలపై దృష్టి సారించడం మంచిది. ఈ విభాగంలో మోడల్ ప్రశ్నలను బట్టీ పట్టడం సముచితం కాదు. కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదువుకున్న వారు ప్రాథమిక విషయాలను పునశ్చరణ చేసుకుంటే సరిపోతుంది.
- జనరల్ అవేర్‌నెస్‌కు మాత్రం ప్రతిరోజు దిన పత్రికలు చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. బ్యాంకింగ్ రంగ నేపథ్యానికి సంబంధించిన నాలెడ్జ్ కోసం ఒక ఫైనాన్షియల్ డైలీని కూడా చదవాలి. సమయం ఉన్న వారు ఐబీపీఎస్ అందించే డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పూర్తిచేస్తే మంచిది. ఆ మెటీరియల్ చదవడం వల్ల బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ప్రాథమిక విషయాలపై అవగాహన ఏర్పడుతుంది.