Skip to main content

ఇలా చేస్తే...క్లర్క్ కొలువు ఖాయమే !

జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగాలను భర్తీచేసే సంస్థ.. ఐబీపీఎస్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్). దేశంలోని వివిధ జాతీయ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, క్లర్క్, స్పెషల్ ఆఫీసర్ వంటి పోస్టుల భర్తీని ఐబీపీఎస్ చేపడుతుంది. అందుకోసం ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఐబీపీఎస్ 12,075 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 7, 8, 14, 21 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు; 2020, జనవరి 19న మెయిన్ పరీక్ష నిర్వహించేందుకు ఐబీపీఎస్ సన్నద్ధమవుతోంది. పరీక్షకు ఇంకా 100 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగాల ఔత్సాహిక అభ్యర్థులు పరీక్షలో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు...
ఏదైనా డిగ్రీ అర్హతతో ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లర్క్ ప్రిలిమ్స్‌కు మూడు నెలలకుపైగా సమయం, మెయిన్స్ కు దాదాపు నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంది. అభ్యర్థులు పక్కా ప్రణాళికతో పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ సాగిస్తే.. విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. కాబట్టి అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షలు రెండు దశల్లో(ప్రిలిమినరీ, మెయిన్) ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. రెండూ పరీక్షలు బహుళైచ్చిక విధానంలో ఉంటాయి.

ప్రిలిమ్స్ :
మొదట ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు జరుగుతుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్(30), న్యూమరికల్ ఎబి లిటీ (35), రీజనింగ్ ఎబిలిటీ (35) విభాగాలు ఉంటాయి. ప్రిలిమ్స్ పరీక్ష వ్యవధి గంట. ఈ పరీక్షలో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు మెయిన్ రాసేందుకు అర్హులు.

మెయిన్ :
మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలో 190 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయిస్తారు. మెయిన్ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు; క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు). ప్రతి విభాగానికి వేర్వేరుగా సమయం కేటాయించారు. ప్రతి విభాగంలోనూ నిర్దేశిత మార్కులు పొందాలి. అలాగే మొత్తంగా ఐబీపీఎస్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు సాధించాలి.

నెగిటివ్ మార్కింగ్ :
ప్రిలిమినరీ పరీక్షలో కనీస అర్హత మార్కులను పేర్కొన్నప్పటికీ.. వాటిని తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. అలానే ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షల్లో రుణాత్మక మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఆయా ప్రశ్నలకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు మార్కుల కోత విధిస్తారు.

ఉమ్మడి ప్రిపరేషన్ :
ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షల్లో ఉమ్మడి సిలబస్ కనిపిస్తుంది. ప్రిలిమ్స్‌లోని ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ విభాగాలు మెయిన్‌లోనూ ఉంటాయి. మెయిన్‌లో ఈ విభాగాలకు అదనంగా జనరల్ అవేర్‌నెస్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్‌‌జ ఉంటాయి. మొత్తంగా చూస్తే సిలబస్ పరంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్; రీజనింగ్; క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/న్యూమరికల్ ఎబిలిటీ సబ్జెక్టులు ప్రిలిమ్స్, మెయిన్ రెండింటిలోనూ ఉమ్మడి అంశాలు. ఈ సబ్జెక్టుల్లో పట్టు సాధిస్తే ఉద్యోగం సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల కాఠిన్యత స్థాయిలో వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి వేర్వేరుగా సన్నద్ధమయ్యే బదులు ఒకే వ్యూహంతో ముందుకు సాగాలి. మెయిన్ లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తే.. ప్రిలిమినరీ దశలో సులువుగా నెగ్గుకురావచ్చు.

ప్రిపరేషన్.. పక్కాగా :
న్యూమరికల్ ఎబిలిటీ/క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ :
  • పరీక్షల్లో పోటీ దృష్ట్యా ప్రశ్నల కాఠిన్యత పెరుగుతూ వస్తోం ది. న్యూమరికల్ ఎబిలిటీలో.. అర్థమెటిక్ అంశాలు.. పర్సం టేజెస్, యావరేజేస్, రేషియో-ప్రపోర్షన్, ప్రాఫిట్- లాస్, సింపుల్ ఇంట్రెస్ట్-కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్-వర్క్, టైమ్- డిస్టెయి, పర్ముటేషయి-కాంబినేషయి, ప్రాబబిలిటీ, మిక్షర్ అండ్ అలిగేషన్స్ అంశాలు కీలకం. ఈ చాప్టర్ల నుంచి ప్రశ్నలు తప్పనిసరిగా వస్తున్నాయి. ప్రశ్నలను లోతుగా అడగటం జరుగుతోంది. ముందుగా అభ్యర్థులు బేసిక్స్‌ను క్షుణ్నంగా తెలుసుకోవాలి.
  • బోడ్‌మస్ క్రమంలో క్యాలికులేషన్స్ వేగంగా, కచ్చిత త్వంతో చేయగలగాలి. అలాగే వర్గాలు, ఘనాలు, వర్గమూలాలు గుర్తుంచుకోవాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలసిస్ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. మెయిన్‌లో డేటా విశ్లేషణ అంశం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
  • ముఖ్యమైన చాప్టర్లు: సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్షిమేషన్స్, బేసిక్ ఆల్జీబ్రా(క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్), డేటా ఇంటర్‌ప్రి టేషన్, మిస్సింగ్ నంబర్స్(రాంగ్ నంబర్ సిరీస్). గత మెయిన్ పరీక్షలో అప్రాక్షిమేషన్స్, నంబర్ సిరీస్, డీఐ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ టాపిక్స్.

ఇంగ్లీష్ :
  • విజయావకాశాలను నిర్ణయించడంలో ఇంగ్లిష్ ఎంతో కీలకం. కొంత దృష్టిసారిస్తే ఎక్కువ మార్కులు సాధించడా నికి వీలున్న సబ్జెక్ట్ ఇంగ్లిష్. కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టే అభ్యర్థులు మొదట ఇంగ్లిష్ పట్ల భయం వదిలి బేసిక్ రూల్స్ నేర్చుకోవాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్, పారా జంబుల్స్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, స్పాటింగ్ ఎర్రర్స్ టాపిక్స్ ముఖ్యమైనవి.
  • ఇంగ్లిష్‌పై పట్టు సాధించేందుకు గ్రామర్ రూల్స్, వొకాబ్యులరీ పెంచుకోవడం ప్రధానం. అందుకు ఏదైనా ప్రామాణిక ఇంగ్లిష్ దిన పత్రిక ఎడిటోరియల్స్ చదవడం, కొత్త పదాలతో వాక్యాలు రాయడం ప్రాక్టీస్ చేయాలి. నిత్యం ఏదైనా ఒక ప్రామాణిక ఇంగ్లిష్ పత్రిక చదవడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా ఇంగ్లిష్‌పై పట్టుతోపాటు మెయిన్‌లో ఉండే జనరల్ అవేర్‌నెస్‌కు కూడా ఉపయోగపడుతుంది. ఇంగ్లిష్‌కు రెన్ అండ్ మార్టిన్ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది.

రీజనింగ్ :
  • రీజనింగ్...అత్యధికంగా స్కోరు చేసేందుకు అవకాశమున్న విభాగం. కొంతమందికి ఇది అస్సలు కొరుకుడు పడదు. రీజనింగ్‌లో స్కోరింగ్‌కు ఏకైక మార్గం ప్రాక్టీస్. సాధ్యమైన న్ని ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్ని మాక్ టెస్టులు రాయాలి. ప్రతి టాపిక్‌లో సందేహాలు నివృత్తి చేసుకోవాలి. సందేహాలను వదిలేస్తే గందరగోళానికి దారితీస్తుంది. అనలిటికల్ ఎబిలిటీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  • ముఖ్యమైన టాపిక్స్: సీటింగ్ అరేంజ్‌మెంట్స్, కోడింగ్- డీకోడింగ్, బ్లడ్ రిలేషయి, సిలాయిజమ్స్, ఇన్‌ఈక్వాలిటీస్, పజిల్స్, డేటా సఫిషియెన్సీ, డెరైక్షన్స్ అండ్ డిస్టెన్స్, ఇన్‌పుట్-ఔట్‌పుట్, అనలిటికల్ రీజనింగ్.

జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ :
  • మెయిన్‌లో మాత్రమే ఉండే విభాగమిది. ఈ సెక్షన్‌కు ప్రిలిమ్స్ పరీక్ష రాశాక సన్నద్ధం అవ్వొచ్చని భావించడం సరికాదు. ముఖ్యంగా గతంలో ప్రిలిమినరీ దశలో అర్హులైన అభ్యర్థులు ముందు నుంచే జనరల్ అవేర్‌నెస్‌పై దృష్టిసారించాలి. 2019 జూన్ నుంచి కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి.
  • ఇంగ్లిష్‌కు ప్రిపరేషన్ కోసం చదివే ఇంగ్లిష్ పత్రికతోనే జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్‌కు సన్నద్ధత లభిస్తుంది. వీటికి సొంతంగా నోట్స్ సిద్ధం చేసుకోవాలి.
  • ఇటీవల కాలంలో ఆర్థిక రంగంలో ఎన్నో కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిని సునిశితంగా పరిశీలిస్తూ ప్రధాన పేపర్లో వచ్చే కథనాల నుంచి నోట్స్ సిద్ధం చేసుకోవడం లాభిస్తుంది. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, బ్యాంకుల విధులు, కొత్త విధానాలు, రిజర్వ్ బ్యాంక్ వంటి వాటిపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలి.
  • జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్‌‌జ కోణంలోనూ ఆర్థిక వ్యవహారాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విభాగంలో 50 ప్రశ్నలు ఉన్నాయి. వీటిలో బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 12; ప్రభుత్వ విధానాల నుంచి 3; కరెంట్ అఫైర్స్ నుంచి 20; బేసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ నుంచి 5; స్టాండర్డ్ జీకే నుంచి 6; బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ నుంచి 4 ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
  • కంప్యూటర్ నాలెడ్‌‌జ (రీజనింగ్‌తో కలిపి ఉంది)కు సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్స్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షార్ట్‌కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల గురించి తెలుసుకోవాలి.

ముఖ్య వివరాలు...
ఐబీపీఎస్ - కామన్ రిక్రుట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ) క్లర్క్స్-9
మొత్తం ఖాళీలు:
12,075 (ఆంధ్రప్రదేశ్-777, తెలంగాణ-612)
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్‌‌జ ఉండాలి.
వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ప్రిల్రిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తులకు ప్రారంభ తేది: 17.09.2019
దరఖాస్తులకు చివరి తేది: 09.10.2019
ప్రిలిమినరీ పరీక్షతేది: 2019 డిసెంబరు 7, 8, 14, 21.
మెయిన్ పరీక్షతేది: 19.01.2020.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ibps.in/

బ్యాంకు పరీక్షలన్నింటికి ఉమ్మడిగా..
ఐబీపీఎస్ బ్యాంకు పరీక్షలకు ఏటా ఆగస్టు నుంచి నోటిఫికేషన్లు విడుదలు చేస్తూ ఉంటుంది. ప్రాంతీయ బ్యాంకుల్లో అసిస్టెంట్లు, ఆఫీసర్ పోస్టులు, ఐబీపీఎస్ పీవో, క్లర్క్.. ఇలా వరుసగా ఉద్యోగ ప్రకటనలు వస్తుంటాయి. ఈ పరీక్షల్లో కనిపించే సిలబస్ అంతా దాదాపు ఉమ్మడిగానే ఉంటుంది. ఒక పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు మిగతా బ్యాంక్ పరీక్షల్లోనూ విజయం సాధించేందుకు అవకాశం ఉంది. నాలుగు సెక్షన్లు.. న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల్లో పట్టు సాధించడం ద్వారా బ్యాంకు కొలువు ఖాయం చేసుకోవచ్చు. పీవో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాబోయే క్లర్క్ ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా సన్నద్ధమవ్వాలి. కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించే వారు కష్టపడి చదివితే క్లర్క్ ఉద్యోగాన్ని దక్కించుకోవచ్చు. మాక్ టెస్టులు సాధ్యమైనన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది.
- రాజశేఖర్ రెడ్డి, ఫౌండర్-ఐరైజ్ అకాడమీ.

మెయిన్స్‌ను దృష్టిలో పెట్టుకొని..
ప్రిలిమ్స్ తర్వాత మెయిన్‌కు గరిష్టంగా 20 రోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షకు ప్రిపేరయ్యే అభ్యర్థులు మెయిన్ పరీక్షను కూడా దృష్టిలో పెట్టుకొని జనరల్ అవేర్‌నెస్‌ను ముందు నుంచే సన్నద్ధమవ్వాలి. రోజూ ది హిందూ ఎడిటోరియల్స్ చదవడం వల్ల కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సన్నద్ధత లభిస్తుంది. కనీసం వారానికి ఒకటి, రెండు మాక్‌టెస్టులు రాయాలి.
- అల్లూరి వర్షిత్ రెడ్డి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐబీపీఎస్ క్లర్క్ గత విజేత.
Published date : 12 Sep 2019 04:43PM

Photo Stories