Skip to main content

ఎస్‌బీఐ ‘పీవో’..ఫైనల్‌లో విజయానికి మార్గాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) విడుదల చేసిన 2000 ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) పోస్టుల ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. జూలై 20న నిర్వహించిన మెయిన్ పరీక్ష ఫలితాలు కొద్దిరోజుల క్రితమే వెలువడ్డాయి. మొత్తం పోస్టుల సంఖ్యకు మూడింతల మంది (1ః3) తో మెరిట్జాబితాను ఎస్‌బీఐ విడుదల చేసింది. వీరికి ఫైనల్ దశలో.. గ్రూప్ ఎక్సర్‌సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. తుది జాబితా రూపకల్పనలో గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూలో పొందే మార్కులకు ప్రాధాన్యం ఉంటుంది. సెప్టెంబర్ రెండో వారంలో ప్రారంభమవనున్న ఎస్‌బీఐ పీవో ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌ల తీరుతెన్నులపై కథనం...
తేలిగ్గా తీసుకోవద్దు :
పీవో పరీక్ష తుది దశలో.. గ్రూప్ ఎక్సర్‌సైజ్ 20 మార్కులకు, ఇంటర్వ్యూ 30 మార్కులకు కలిపి మొత్తం 50 మార్కులకు జరుగుతుంది. 250 మార్కులకు(ఎస్సే రైటింగ్‌తో కలిపి) నిర్వహించిన మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులను 75 మార్కులకు.. 50 మార్కులకు జరిపిన గ్రూప్ ఎక్సర్‌సైజ్,ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను 25 మార్కులకు.. మొత్తంగా వంద మార్కులకు క్రోడీక రించి.. అందులో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. అంటే.. జీఈ, ఇంటర్వ్యూలకు నాలుగో వంతు మార్కులు కేటాయించారన్నమాట!

గ్రూప్ డిస్కషన్ :
  • గ్రూప్ ఎక్సర్‌సెజైస్‌లో భాగంగా గ్రూప్ డిస్కషన్స్(జీడీ) నిర్వహిస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత జీడీ ఉంటుంది. ఇందులో పది నుంచి పన్నెండు మంది అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటు చేస్తారు. వీరిని సమకాలీన అంశాలు, ముఖ్యమైన ఆర్థిక, బ్యాంకింగ్ రంగ సమస్యలపై చర్చించమని కోరే అవకాశముంది. జీడీ టాపిక్ ఇచ్చి కొంత సమయం కేటాయిస్తారు. ఈ సమయంలో అభ్యర్థులు ముఖ్యమైన పాయింట్లు రాసుకోవచ్చు. జీడీ 15 నుంచి 25 నిమిషాల వరకు జరుగుతుంది. జీడీకి సిద్ధమయ్యే అభ్యర్థులు సమకాలీన అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. ప్రస్తుతం దేశంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యంపై చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఆర్థిక మాంద్యం ప్రభావం వివిధ రంగాలపై ఎలా ఉంటుందో విశ్లేషించగలగాలి. ఉదాహరణకు ఆటోమొబైల్ పరిశ్రమ కొంతకాలంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. దీన్ని సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఆర్థిక వృద్ధికి ప్రకటిస్తున్న ఉద్దీపనలను గురించి తెలుసుకోవాలి.
  • కేంద్ర బడ్జెట్-కీలక అంశాలు, భారత దేశం ఆర్థికంగా సూపర్ పవర్ కాగలదా?, సైబర్ సెక్యూరిటీ సమస్యలకు పరిష్కారాలు, బ్యాంకు లకు సవాళ్లుగా మారిన నిర్ధరక ఆస్తులు, ఇటీవల కాలంలో ఏవియేషన్ రంగంలో చేటుచేసుకున్న జెట్‌ఎయిర్‌వేస్ మూసివేత-కారణాలు, చైనా- అమెరికా వాణిజ్య సంబంధాలు- ఇండియాపై ప్రభావం, ఆర్‌బీఐ నిధులు కేంద్రానికి బదిలీ చేయడం-కారణాలు మొదలైన సమకాలీన టాపిక్స్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయడం ద్వారా జీడీలో రాణించవచ్చు.
  • సబ్జెక్టు మీద పరిజ్ఞానంతోపాటు చెప్పే విధానం లోనూ ఓర్పు ప్రదర్శించాలి. ఇతరులతో విభేదించేటప్పుడు సహనంతో ఉండాలి. జీడీ నిర్వాహకులను మెప్పించేలా ప్రవర్తించాలి. బాడీ లాంగ్వేజ్, హావభావాలు హుందాగా ఉండేట్లు చూసుకోవాలి. బృందంలోని ఇతర సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. తామే ఎక్కువ సేపు మాట్లాడే విధంగా వ్యవహరించకూ డదు. దూకుడు ప్రదర్శించకుండా ఇతరులకు సమయం ఇస్తూ, చెప్పాలనుకున్న అంశాలను ఆత్మవిశ్వాసంతో పరిమిత సమయంలో సూటీగా చెప్పాలి. జీడీలో అభ్యర్థుల దృక్పథాన్ని, ఆలోచన ల్లో స్పష్టతను, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను, ఓర్పును, ఇతరులతో విభేదించే తీరును నిపుణులు నిశితంగా పరిశీలిస్తారు.
  • గ్రూప్ డిస్కషన్ సందర్భంగా కొన్నిసార్లు ఏమా త్రం అవగాహన లేని టాపిక్ ఇచ్చి చర్చించమని కోరవచ్చు. సదరు టాపిక్‌పై ముందుగా ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు మాట్లాడే వరకు వేచి చూడాలి. బృందంలోని సహచరులు పేర్కొన్న అంశాలను పాయింట్ల వారీగా గుర్తుంచుకోవాలి. వారి అభిప్రాయాలతోపాటు, గణాంకాలు కూడా నోట్ చేసుకోవాలి. ఫలితంగా టాపిక్‌పై విషయ పరిజ్ఞానం సొంతమవుతుంది. మనకంటూ స్పష్టత వచ్చి చర్చలో పాల్గొనే సంసిద్ధత లభిస్తుంది.

గ్రూప్ ఎక్సర్‌సెజైస్ :
గ్రూప్ ఎక్సర్‌సైజ్ విషయానికొస్తే.. ఆరేడు మంది అభ్యర్థులను ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేసి.. వారికి ఒక సమస్య ఇస్తారు. సమస్య పరిష్కార క్రమంలో అభ్యర్థులు అంచెల వారీ పద్ధతిని అలవర్చుకోవాలి. కొన్ని సమస్యలకు నేరుగా సమాధానం చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కానీ.. గ్రూప్ ఎక్సర్‌సైజ్ ప్రధాన ఉద్దేశం అభ్యర్థుల్లోని విశ్లేషణాత్మక శక్తిని, నిర్ణయాత్మక శక్తిని గుర్తించడం. కాబట్టి ఎంత సులువైన సమస్యను ఇచ్చినా కూడా క్రమ పద్ధతిలో పరిష్కారాన్ని సూచించడం లాభిస్తుంది. అలానే, కొన్ని పరామితులు ఇచ్చి మీ ప్రాధాన్యత క్రమాన్ని సూచించమని కోరతారు. ఉదాహరణకు మీరు ఇల్లు కొనేందుకు ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇస్తారో చెప్పాలంటూ.. కొన్ని పరామితులు ఇస్తారు. మార్కెట్ ప్రాంతం, రెండు పడక గదుల ఇల్ల్లు, మూడు పడకల గదుల ఇల్లు, సొసైటీలో ఇల్లు, ఇండివిడువల్ ఇల్లు, ఆసుపత్రి-స్కూల్స్ ఉన్న ప్రాంతం, కనీస మౌలిక వసతులు.. ఇలా పలు పరామితులు ఇచ్చి మొదటి ప్రాధాన్యం, తర్వాత వేటికి ప్రాధాన్యం ఇస్తారు అని అడుగుతారు. ఆ క్రమంలో మీరిచ్చే ప్రాధాన్య అంశాలకు వివరణలు కూడా ఉండాలి.

పర్సనల్ ఇంటర్వ్యూ :
అభ్యర్థులు ఎస్‌బీఐ పీవోగా కొలువు దీరేందుకు చివరి దశ ప్రక్రియ.. ఇంటర్వ్యూ. ఇందులో అధిక శాతం ప్రశ్నలు అభ్యర్థి విద్యా నేపథ్యం, వ్యక్తిగత విషయాలు, పని అనుభవం, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక పరిణామాలు, భవిష్యత్తు లక్ష్యాలకు సంబంధిం చినవే ఉంటాయి. ముఖ్యంగా దేశంలో చోటుచేసు కుంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు-ప్రభావం, కశ్మీర్ అంశం, ఉపయోగం లోని లేని చట్టాల రద్దు, భారత ప్రభుత్వం విదేశాలతో అవలంబిస్తున్న దౌత్య వ్యవహారాలు, భారత్-చైనా-పాక్ వాణిజ్య సంబంధాలు, రాజకీయంగా ఆర్థికంగా సున్నితమైన అంశాలు, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, బ్యాంకింగ్ సంబంధిత కమిటీలు, నివేదికలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన పథకాలు (ఉదాహరణకు బేటీ బచావో-బేటీ పడావో, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ముద్ర), ఇంజనీరింగ్ విద్యార్థులు అయితే బ్యాంకింగ్ రంగం ఎందుకు ఎంచుకున్నారు?, స్థానికంగా బ్యాంకుల పనితీరు, మీకు ఎదురైన అనుభవాలు, కరెన్సీలు, బంగారం ధరలు-పెరగడానికి కారణాలు, ఆర్థిక మాంద్యానికి కారణాలు - ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు - మీ అభిప్రా యాలు, వినియోగదారులను సంతృప్తిపరచడం, మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టవలసిన సంస్కరణలు, బ్యాంకింగ్ రంగంలో ఐటీ వినియోగం, సైబర్‌దాడుల నియంత్రణకు చర్యలు వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టిపెట్టాలి. ఇంటర్వ్యూ 15 నుంచి 20 నిమిషాలపాటు జరిగే అవకాశముంది. అభ్యర్థులు బోర్డ్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు తడబాటులేకుండా సమాధానం చెప్పేలా సన్నద్ధం కావాలి. సమాధానం తెలియకుంటే.. నిజాయితీగా తెలియదని అంగీకరించడం మేలు. అలాకాకుండా తప్పు సమాధానం చెప్పడం... దానిపై మరింత చర్చ జరగడం వల్ల అభ్యర్థి ఒత్తిడికి గురయ్యే ఆస్కారముంది.

ప్రతిభ చూపాలంటే.. :
  • అయిదుగురు లేదా ఆరుగురు సభ్యుల బోర్డ్ నిర్వహించే ఇంటర్వ్యూలో అధిక శాతం ప్రశ్నలు అకడమిక్ ప్రొఫైల్, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌం డ్, పర్సనల్ ప్రొఫైల్, ఫ్యూచర్ గోల్స్ గురించే ఉంటాయి.
  • టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు బ్యాంకింగ్ కెరీర్ వైపు ఎందుకు రావాలను కుంటున్నారు?, భవిష్యత్తు లక్ష్యాలేంటి, ఒకవేళ ఎంపిక కాకపోతే ఏం చేస్తారు.. వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. వీటికి సంబంధించి స్పష్టంగా సమాధానం ఇచ్చేలా సంసిద్ధత పొందాలి. జాబ్ సెక్యూ రిటీ, ఆకర్షణీ యమైన వేతనాలు వంటి కారణాలతో ఈ రంగాన్ని ఎంపిక చేసుకున్నామని సమాధా నం చెప్పడం సరికాదు. తమ అకడమిక్ నైపుణ్యాలను విధుల్లో అన్వయించేందుకు ఉన్న మార్గాలను వివరించాలి. తద్వారా వినియోగదారులకు సేవలందించడంతో పాటు సంస్థ అభ్యున్న తికి తోడ్పడగలనని సమాధానాలు ఇవ్వాలి.
  • ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు ప్రతిరోజు దినపత్రికలు చదవడం ఎంతో మేలు చేస్తుంది. ఇలా చదువుతున్నప్పుడు ముఖ్య మైన అంశాలకు సంబంధించి నిపుణుల వ్యాసాలు- అందులోని ముఖ్యమైన పాయిం ట్లతో నోట్స్ సిద్ధంచేసుకోవాలి. పత్రికల్లో వచ్చే వ్యాసాలు ప్రిపరేషన్‌కు ఎంతో ఉప యోగపడతాయి. ఒక వ్యాసం చదవడం పూర్తయిన తర్వాత దాని సారాంశం ఆధారం గా.. సొంతంగా, క్లుప్తంగా నోట్స్ రాసుకో వాలి. దీంతోపాటు న్యూస్ ఛానెళ్లలో సమకా లీన పరిణామాలపై నిర్వహించే డిబేట్స్ కూడా ఉపయోగపడతాయి. వీటిని అనుస రించడం ద్వారా ఒక అంశాన్ని పలు కోణాల్లో సృశించే నైపుణ్యాలు అలవడుతాయి!!
Published date : 04 Sep 2019 05:10PM

Photo Stories