Skip to main content

బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ రంగాల్లో విసృత అవకాశాలు,..

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్.. మొత్తంగా బీఎఫ్‌ఎస్‌ఐ పేరుతో ప్రగతి పథాన పయనిస్తున్న రంగం. ప్రభుత్వ బ్యాంకులతో పోటీగా.. ప్రైవేటు బ్యాంకులు కూడా పల్లె బాట పట్టి, బ్రాంచ్‌లను విస్తరిస్తున్నాయి. మరోవైపు కొత్త ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు లెసైన్సులు ఇచ్చేందుకు ఆర్‌బీఐ సిద్ధమైన తరుణంలో నవతరం ముందు నయా కొలువులతో బీఎఫ్‌ఎస్‌ఐ ప్రత్యక్షమవుతోంది. సుస్థిర కెరీర్‌లో కాలు మోపేందుకు ఊతమిస్తోంది.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల్లోని సంస్థలు తమ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు నిపుణులైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. ఔత్సాహికులు దీన్ని అందిపుచ్చుకుంటే అద్భుత భవిష్యత్తు ఖాయం.
  • నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ) గణాంకాల ప్రకారం ప్రస్తుతం బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో 45 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంఖ్య 2020 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ విద్యా సంస్థలు బీఎఫ్‌ఎస్‌ఐ స్పెషలైజేషన్ కోర్సులను అందిస్తున్నాయి.
పరీక్షలు, కోర్సులు:
బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో ప్రవేశించాలంటే రెండు రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) సంస్థ క్లరికల్, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కోసం వేర్వేరుగా ఉమ్మడి రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది జాబితా రూపొందించి అభ్యర్థులు పొందిన ర్యాంకు ప్రకారం నియామకాలు జరుపుతోంది.

ఇన్సూరెన్స్ రంగం:
ఇన్సూరెన్స్ రంగంలో అయిదో పెద్ద దేశంగా భారత్ నిలుస్తోంది. ఇటీవల కాలంలో ప్రైవేటు రంగంలోనూ ఇన్సూరెన్స్ సంస్థల ప్రవేశంతో ఈ రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఈ రంగం 2020 నాటికి రూ.17 లక్షల కోట్ల విలువైన మార్కెట్‌ను సొంతం చేసుకుంటుందని అంచనా. ఉన్నవాటికి తోడు, కొత్త కంపెనీలు ప్రవేశిస్తుండటంతో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) అంచనాల ప్రకారం 2020 నాటికి వివిధ స్థాయిల్లో దాదాపు 7 నుంచి 8 లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది.
  • ఇన్సూరెన్స్ విభాగంలోకి ప్రవేశించాలంటే ఆయా ఇన్సూరెన్స్ సంస్థలు నిర్వహించే నియామక పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణులు కావాలి. సాధారణంగా ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ సంస్థలు.. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏడీవో) ఉద్యోగంతో కెరీర్‌ను ప్రారంభించేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి.
స్టాక్ మార్కెట్లు.. సదవకాశాలు:
ఆర్థిక సేవల విభాగంలోని స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల్లో అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టే వారికి సలహాలనిచ్చి, వారికి లాభాలు తెచ్చిపెట్టేలా శిక్షణ ఇచ్చే అకడమిక్ కోర్సులు ఉన్నాయి.
  • బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ వంటి సంస్థలు పలు సర్టిఫికేషన్, డిప్లొమా కోర్సులను రెగ్యులర్, దూర విద్యా విధానంలో అందిస్తున్నాయి.
  • బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రత్యేకంగా బీఎస్‌ఈ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ పేరిట శిక్షణ సంస్థను నెలకొల్పి.. అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్ ఇన్ డెరివేటివ్స్; అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్ ఆన్ స్టాక్ మార్కెట్స్; అకౌంటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అండ్ డెరివేటివ్స్ తదితర స్వల్పకాలిక, దీర్ఘకాలిక సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను అందిస్తోంది.
  • నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా ఎన్‌ఎస్‌ఈ సర్టిఫైడ్ క్యాపిటల్ మార్కెట్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. అంతేకాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఫైనాన్షియల్ మార్కెట్స్ కోర్సును ఫుల్‌టైం, పార్ట్‌టైం విధానంలో బోధిస్తోంది.
  • ఈ విభాగంలో కోర్సులు పూర్తిచేసిన వారు స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో రీసెర్చ్ అనలిస్ట్‌లుగా, రిలేషన్‌షిప్ మేనేజర్లుగా, ఆపరేషన్స్ మేనేజర్లుగా కెరీర్ ప్రారంభించే అవకాశం ఉంది.
ఆకర్షణీయ వేతనాలు:
Bavitha
బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో వేతనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. నిర్ణీత సర్టిఫికెట్లతో ఈ రంగంలో అడుగుపెడితే ప్రారంభంలో కనీసం నెలకు రూ.15 వేల వేతనం ఖాయం. రెండేళ్ల అనుభవంతో పదోన్నతితోపాటు రెట్టింపు జీతం అందుకునే అవకాశం లభిస్తుంది.



ఒప్పందాలు.. కోర్సులు:
Bavitha
దేశంలోని పలు ప్రముఖ ప్రైవేటు బ్యాంకులు తమ బ్యాంకు అవసరాలకు తగిన రీతిలో ముందుగానే అభ్యర్థులను తీర్చిదిద్దుకునే విధంగా కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. బీఎఫ్‌ఎస్‌ఐకు సంబంధించిన ప్రత్యేక కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకు.. ఎంబీఏ (ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్) కోర్సును అందిస్తోంది. బ్యాంకింగ్ ఆపరేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తోంది. యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్‌లు మణిపాల్ యూనివర్సిటీతో ఒప్పందం ద్వారా తమ అవసరాలకు సరితూగే పీజీ కోర్సులకు రూపకల్పన చేసి.. కోర్సు పూర్తయ్యే నాటికి పరిపూర్ణ బ్యాంకర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి.

క్యాంపస్ కొలువులు:
బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలోని సంస్థలు, తమ అవసరాలకు అనుగుణంగా సాధారణ డిగ్రీ కళాశాలల నుంచి బీటెక్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కళాశాలల వరకు అన్నింటిలో క్యాంపస్ నియామకాలు చేపడుతున్నాయి. ప్రతిభగల వారికి ప్రారంభంలోనే ఆఫీసర్ హోదాను కట్టబెడుతున్నాయి.

అకడమిక్ సంస్థలు
బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో మానవవనరుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వివిధ సంస్థలు ప్రత్యేక కోర్సులను అందిస్తున్నాయి.
  • నర్సీ మొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్; కోర్సు: ఎంబీఏ- యాక్చూరియల్ సైన్స్.
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్-ముంబై; కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్.
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్- చెన్నై; కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ ఇన్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్.
  • బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ- గ్రేటర్ నోయిడా; కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్.
  • ఆసియా పసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- న్యూఢిల్లీ; కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్.
  • సెంటర్ ఫర్ ఇన్సూరెన్స్ స్టడీస్ అండ్ రీసెర్చ్, నేషనల్ లా యూనివర్సిటీ-జోథ్‌పూర్; కోర్సు: ఎంబీఏ- ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్.
  • ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్- కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్.
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్- హైదరాబాద్; కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్; పీజీ డిప్లొమా ఇన్ యాక్చూరియల్ సైన్స్; సర్టిఫికెట్ కోర్సులు.
  • ఇంటర్, గ్రాడ్యుయేషన్ అర్హతలతో వివిధ కోర్సులను పూర్తిచేయొచ్చు.
కాలం నీడన..
Bavitha
  • సాధారణంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనివేళలుంటాయి. అయితే కొన్ని రోజుల్లో (ఉదాహరణకు ఆర్థిక సంవత్సరం చివర్లో) పని వేళలతో సంబంధం లేకుండా అధిక సమయం పనిచేయాల్సి ఉంటుంది.
  • ఏ ప్రాంతంలోనైనా పనిచేసేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి.
  • కొన్ని సార్లు బ్రాంచ్‌ల మధ్య రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.
నైపుణ్యాలు
Bavitha
  • అకౌంటింగ్, ఫైనాన్షియల్ స్కిల్స్.
  • కమ్యూనికేషన్, పీపుల్ స్కిల్స్.
  • లీడర్‌షిప్ స్కిల్స్.
  • సమస్య పరిష్కార నైపుణ్యాలు.
  • కంప్యూటర్ స్కిల్స్.
  • సృజనాత్మకంగా ఆలోచించగల నైపుణ్యం.
Bavithaప్రస్తుత మార్కెట్ ధోరణిని పరిశీలిస్తే బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో అభివృద్ధి రేటు బాగా పెరుగుతోంది. యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కామర్స్, అకౌంట్స్ నేపథ్యం ఉన్నవారికే బీఎఫ్‌ఎస్‌ఐ సరైనదనే అపోహను విడనాడాలి. తగిన నైపుణ్యాలు, సానుకూల దృక్పథం ఉంటే ఎవరైనా ఈ రంగంలోకి ప్రవేశించొచ్చు.


Bavithaప్రైవేటు బ్యాంకులలో ఉద్యోగమంటే ఎప్పుడూ బయట తిరుగుతూ సేల్స్, మార్కెటింగ్ చేయడమనే అపోహ ఉంది. కానీ, తగిన అర్హతలుంటే అందిపుచ్చుకునేందుకు వేలాది వైట్ కాలర్ ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో అడుగుపెట్టిన వారు సరైన పనితీరు కనబరిస్తే 10 నుంచి 15 ఏళ్లలో అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చు.


Bavithaమెట్రో నగరాలు మొదలు, మారుమూల పల్లెల వరకు బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. అందువల్ల మానవ వనరులకు డిమాండ్ ఏర్పడుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నియామకానికి నిర్వహించే పరీక్షలో నెగ్గాలంటే విద్యార్థులు జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై పట్టు సాధించాలి.
Published date : 09 Jan 2014 04:36PM

Photo Stories