Skip to main content

బ్యాంకింగ్, బీమా రంగాల్లో ఉపాధి మెండు

విస్తరిస్తున్న బ్యాంకింగ్ సేవలు... విస్తృతమవుతున్న బీమాపై అవగాహన.. అందరికీ ఆర్థిక సేవలు అందించేందుకు ప్రభుత్వ పథకాలు వెరసి బ్యాంకింగ్, బీమా రంగాల్లో ఉపాధి అవకాశాలు అధికమవుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగం ప్రగతి పథంలో పయనిస్తోంది. కెరీర్ పరంగా యువత భవితకు చక్కటి భరోసా కల్పిస్తోంది. దీంతో సాధారణ గ్రాడ్యుయేట్లు మొదలు, టెక్నికల్ డిగ్రీ హోల్డర్ల వరకు అందరూ ఈ రంగంలో అడుగు పెట్టేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. నిలకడైన వృద్ధిరేటుతో సుస్థిర అభివృద్ధి సాధిస్తూ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ముందంజలో నిలుస్తున్న బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో భవిష్యత్తు అవకాశాలు, వాటిని అందుకునే మార్గాలపై విశ్లేషణ...
వైట్ కాలర్ కొలువులుగా బ్యాంకు ఉద్యోగాలకు ఉన్న క్రేజీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. ఉద్యోగ భద్రత, మంచి ప్రోత్సాహకాలు ఉన్నందు వల్ల ఐటీ ఔత్సాహికులు కూడా ఈ రంగం వైపు దృష్టి సారిస్తున్నారు. భవిత భద్రత కోసం ఆర్థిక సేవల సంస్థలపై దృష్టిసారిస్తున్నారు. నాలుగైదేళ్ల కిందటి వరకు బ్యాంకుల్లో కొలువులు సొంతం చేసుకోవాలంటే నోటిఫికేషన్ల కోసం చాలా సమయం ఎదురు చూడాల్సిన వచ్చేది. ఒకవేళ నోటిఫికేషన్ విడుదలైనా పోస్టుల సంఖ్య చాలా పరిమితం. పోటీ మాత్రం లక్షలో! కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. మారుతున్న అవసరాలు, కార్యకలాపాల విస్తరణ, మరోవైపు అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా బీఎఫ్‌ఎస్‌ఐ రంగం భవిష్యత్తులో భారీ రిక్రూట్‌మెంట్లకు తెరలేపనుంది.

ఊరిస్తున్న ఉద్యోగాలు
వివిధ సర్వేల అంచనా ప్రకారం విస్తృతమైన ఉపాధి అవకాశాలకు ఊతమిస్తున్న బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగం 2022 నాటికి 16 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముందుకు వెళుతోంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ విభాగంలోనే 7.8 లక్షల ఉద్యోగాలు ఏర్పడనున్నాయి. వీటికి తోడుగా ప్రభుత్వ, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు 70 వేల ఉద్యోగాలు సృష్టించనున్నాయి. స్టాక్ బ్రోకింగ్ సంస్థలు మరో 20 వేలు, మ్యూచువల్ ఫండ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అంతే కాకుండా స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో ఉద్యోగాలు భర్తీకి అవకాశాలు ఉన్నాయి. నియామకాల పరంగా బ్యాంకింగ్ రంగంలో రానున్న కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులదే పైచేయి కానుంది. బ్యాంకింగ్ రంగంలోని మొత్తం నియామకాల్లో సుమారు 73 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే జరగనున్నాయి.

అన్ని స్థాయిల్లోనూ ఖాళీల భర్తీ
బ్యాంకింగ్ రంగంలో అన్ని స్థాయిల్లోను ఖాళీలున్నాయి. బ్యాంకుల కార్యకలాపాలు పెరిగిపోతుండడంతో వాటన్నింటిని భర్తీచేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎంట్రీ లెవల్‌లో క్లర్కులు, అసిస్టెంట్ మేనేజర్లు, ప్రొబేషనరీ ఆఫీసర్లు.. మిడిల్ లెవల్‌లో మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్.. టాప్ లెవల్‌లో డీజీఎం, జీఎం, ఈడీ, సీఈఓ, చైర్మన్ ఇలా అన్ని స్థాయిల్లోనూ నిపుణుల అవసరం ఉంది. ఇదే విధంగా ఇన్సూరెన్స్ విభాగంలోనూ ఎంట్రీ లెవల్‌లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఏజెంట్ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. అలాగే ఉన్నత స్థాయిలో కూడా వివిధ రకాలైన నిపుణుల కొరత వేధిస్తోంది. వీటన్నింటిని దశల వారీగా భర్తీ చేయడానికి ఆయా సంస్థలు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాయి.

ఇన్సూరెన్స్ రంగంలో కూడా..
బ్యాంకింగ్ రంగంలో మాదిరిగానే ఇన్సూరెన్స్ సెక్టార్‌లో కూడా ప్రత్యేక విభాగాల్లో నిపుణుల అవసరం ఎంతో ఉంది. జీవిత బీమా, సాధారణ బీమా, కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో రిస్క్ మేనేజ్‌మెంట్, రిస్క్ అనాలిసిస్, యాక్చూరియల్ సైన్స్, అండర్ రైటర్స్, ఇన్వెస్టిగేటర్స్, క్లెయిమ్ మేనేజర్స్ వంటి ఉద్యోగుల అవసరం పెరుగుతోంది. వీటన్నింటికి ఆయా విభాగాల్లో నైపుణ్యం తప్పనిసరి. ఇవేకాకుండా ఎంట్రీ లెవల్‌లో కూడా కస్టమర్ రిలేషన్‌షిప్ ఆఫీసర్ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి.

రిక్రూట్‌మెంట్ విధానం
బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
  • ఎస్‌బీఐ గ్రూప్ బ్యాంకులు మినహా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ స్థాయి ఉద్యోగాల కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నిర్వహించే కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ ఫర్ క్లరికల్ పరీక్షకు హాజరు కావాలి. డిగ్రీ అర్హతగా నిర్వహించే ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ, మెయిన్స్ దశల్లో ఉంటుంది.
  • ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఉద్యోగాల భర్తీ కోసం కూడా ఐబీపీఎస్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ ఫర్ పీఓస్ పేరుతో పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. అర్హత బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
  • స్పెషలిస్ట్ కేటగిరీ ఉద్యోగాలు, జనరల్ రూరల్ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ ఫర్ ఆర్‌ఆర్‌బీస్, కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ ఫర్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పేరుతో ఐబీపీఎస్ పరీక్షలు నిర్వహిస్తోంది.
    వివరాలకు వెబ్‌సైట్: www.ibps.in
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ బ్యాంకుల్లో నియామకాలకు ప్రత్యేక నోటిఫికేషన్లు వెలువడతాయి. క్లర్క్స్, పీఓ కేడర్ పోస్టుల కోసం వేర్వేరు పరీక్షలను ఎస్‌బీఐ నిర్వహిస్తోంది. ఐబీపీఎస్ నిర్వహించే కామన్ రిటెన్ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా 20 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలోని ఇన్సూరెన్స్ సంస్థలు తమ అవసరాల మేరకు ఖాళీలను భర్తీ చేస్తుంటాయి. వీటన్నింటికి దాదాపు ఓకే విధమైన పరీక్ష విధానం ఉంటుంది.
  • ప్రైవేటు బ్యాంకులు కూడా ఆయా కేడర్లలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకులు మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకుని ప్రత్యేకంగా ఏడాది వ్యవధి గల బ్యాంకింగ్ స్పెషలైజ్డ్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. కోర్సు పూర్తయిన అనంతరం ఆయా బ్యాంకులు ప్రొబేషనరీ ఆఫీసర్ హోదాలో వారిని నియమిస్తాయి.

వేధిస్తున్న నిపుణుల కొరత
బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో ఫ్రంట్ ఆఫీస్/డెరైక్ట్ కస్టమర్ రిలేషన్ ఉద్యోగాల కంటే ఇటీవల కాలంలో స్పెషలిస్ట్ ఆఫీసర్ల అవసరం పెరుగుతోంది. కస్టమర్లకు చేరువకావడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందిస్తుండటం వల్ల నైపుణ్యం గల ఉద్యోగుల అవసరం ఏర్పడుతోంది. మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం బ్యాంకింగ్, ఈ-పే లాంటి విధానాల వల్ల కస్టమర్లు బ్యాంకుకు వెళ్లే అవసరం లేకుండానే ఎనభై శాతం వరకు తమ ఆర్థిక కార్యకలాపాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ ఆధునిక టెక్నాలజీ ఆధారిత సేవల్లో లోపాలు తలెత్తకుండా చూసేందుకు నైపుణ్యం తప్పనిసరి. దీనికి అనుగుణంగా అటువంటి అభ్యర్థుల కోసం సంస్థలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెట్ వర్కింగ్ సొల్యూషన్స్, డేటా మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో నిపుణులకు బాగా డిమాండ్ ఉంది.

ఇన్సూరెన్స్ రంగంలో ఇలా
ఎల్‌ఐసీ, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వంటి సంస్థలు ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లర్క్స్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నాయి. ప్రైవేటు రంగ ఇన్సూరెన్స్ సంస్థలు డెరైక్ట్ రిక్రూట్‌మెంట్లు చేపడుతున్నాయి. అంతేకాకుండా ఇన్సూరెన్స్ స్పెషలైజ్డ్ కోర్సులు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందాలు చేసుకుని క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా ఖాళీల భర్తీ నిర్వహిస్తున్నాయి.

ఇన్సూరెన్స్ కోర్సులు అందించే ఇన్‌స్టిట్యూకోర్సులు అందించే ఇన్‌స్టిట్యూట్‌లు
  • నేషనల్ ఇన్సూరెన్స్ అకాడెమీ-పుణె
    కోర్సు:
    ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌తో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
    అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
    ప్రవేశం: క్యాట్, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్ స్కోర్లు, గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
    వివరాలకు వెబ్‌సైట్: www.nia-pune.com
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్- హైదరాబాద్
    వెబ్‌సైట్:
    www.iirmworld.org.in
  • అమిటీ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ యాక్చూరియల్ సైన్స్ - నోయిడా
    కోర్సులు:
    బీఏ(ఆనర్స్) - ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్
    అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత
  • ఎంబీఏ (ఇన్సూరెన్స్)
    అర్హత:
    50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
    ప్రవేశం: క్యాట్, సీమ్యాట్, మ్యాట్ స్కోర్లు లేదా అమిటీ యూనివర్సిటీ ఎంట్రెన్స్ స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
    వెబ్‌సైట్: www.amity.edu
  • బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ - న్యూఢిల్లీ
    కోర్సు:
    పీజీ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్
    అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
    ప్రవేశం: క్యాట్/ ఎక్స్‌ఏటీ/ మ్యాట్/ జీమ్యాట్/ సీమ్యాట్ స్కోర్లు ఆధారంగా నిర్వహించే పర్సనల్ ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్‌లో ప్రతిభ ఆధారంగా.
    వివరాలకు వెబ్‌సైట్: www.bimtech.ac.in
  • ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ స్థాయిల్లో ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో లెసైన్సియేట్, అసోసియేట్, ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.
    వివరాలకు వెబ్‌సైట్: www.insuranceinstituteofindia.com
  • తిలక్ మహారాష్ట్ర విద్యా పీఠ్- పుణె, ముంబై
    కోర్సులు:
    ఇన్సూరెన్స్‌లో డిప్లొమా, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, అండర్ రైటింగ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ విభాగాల్లో పీజీ డిప్లొమా.
    అర్హత: డిప్లొమా కోర్సుకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత, పీజీ డిప్లొమా కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
    వెబ్‌సైట్: www.insuranceacademy.org

బ్యాంకింగ్ స్పెషలైజ్డ్ ఇన్‌స్టిట్యూట్స్
ఇన్సూరెన్స్ రంగం మాదిరిగానే బ్యాంకింగ్ రంగంలోనూ సంబంధిత కోర్సులు అందించేందుకు ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. అవి..
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్-ముంబై
    కోర్సు:
    పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ అండ్‌ఫైనాన్షియల్ ఇంజనీరింగ్
    వెబ్‌సైట్: www.nibmindia.org
  • ఆసియా పసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- న్యూఢిల్లీ
    కోర్సు:
    పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
    వెబ్‌సైట్: www.asiapacific.edu
  • ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్
    కోర్సు:
    పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్
    వెబ్‌సైట్: www.isbf.edu.in
ప్రత్యేక నైపుణ్యాలున్న వారికే పట్టం
బ్యాంకింగ్ రంగంలో రానున్న నాలుగైదేళ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుంది. డిగ్రీ అర్హతతో సంబంధిత నియామక పరీక్షలకు హాజరుకావచ్చు. భవిష్యత్తులో సమర్థంగా విధులు నిర్వహించాలంటే మాత్రం ప్రత్యేక నైపుణ్యాలు తప్పనిసరి. కనుక అభ్యర్థులు అకడమిక్ స్థాయి నుంచే వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. అంతే కాకుండా మారుతున్న మార్కెట్‌కు అనుగుణంగా కొత్త విషయాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్, ఐటీ వంటి ప్రత్యేక విభాగాల్లో రాణించాలంటే సంబంధిత అకడమిక్ అర్హతలతోపాటు సూక్ష్మ పరిశీలన, కంప్యుటేషన్/కాలిక్యులేషన్ స్కిల్స్ ఎంతో అవసరం. ఐటీ విభాగంలో అయితే నెట్‌వర్క్ నైపుణ్యాలదే పెద్దపీట.
- ప్రొఫెసర్ ఎం.వి.ఎన్.కె.ప్రసాద్, ఐడీఆర్‌బీటీ
Published date : 09 Oct 2015 10:58AM

Photo Stories