Skip to main content

బీఎఫ్‌ఎస్‌ఐ రంగం...మారుతున్న కొలువుల తీరు

ప్రస్తుతం కొలువుల కామధేనువుగా నిలుస్తున్న రంగం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ). క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) ఉద్యోగాలకు లక్షలాది అభ్యర్థులు పోటీపడుతున్న పరిస్థితి. అయితే సుస్థిర కెరీర్‌కు వేదికగా నిలుస్తున్న బీఎఫ్‌ఎస్‌ఐ నేడు ఆధునికతను సంతరించు కుంటోంది. సరికొత్త హోదాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో కొలువుల పరంగా ఆధునిక పోకడలపై విశ్లేషణ..
సాధారణంగా బ్యాంకు ఉద్యోగాలంటే ఎవరికైనా క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలే గుర్తొస్తాయి. అయితే కొంచెం అన్వేషిస్తే.. వీటితోపాటు మరెన్నో కొలువులు బ్యాంకుల్లో కనిపిస్తున్నాయి. దీనికితోడు ఇటీవల కాలంలో బ్యాంకుల్లో వివిధ హోదాల్లో మార్పులు కనిపిస్తున్నాయి.

క్లర్క్ కాదు.. సీఆర్‌ఈ
  • బ్యాంకుల్లో క్లరికల్ కేడర్ కీలకమైంది. ప్రస్తుతం ఈ క్లర్క్ హోదా కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ (సీఆర్‌ఈ)గా మారింది. ఈ హోదాలో విధులు కూడా విస్తృతమవుతున్నాయి. ఇప్పటి వరకు క్లర్క్‌లు తమకు కేటాయించిన కౌంటర్‌లో పనిచేయడానికి పరిమితమయ్యేవారు. ఇకపై వీరు అదనంగా ఖాతాదారులకు అన్ని రకాలుగా సహకరించాల్సి ఉంటుంది. ప్రధానంగా ప్రైవేటు బ్యాంకుల్లో ఈ ధోరణి పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నించడం. అదే విధంగా బ్యాంకులో అడుగుపెట్టిన వినియోగదారులకు సింగిల్ విండో విధానంతో అన్ని రకాల సేవలు ఒకేచోట లభించేలా చేయాలన్నది కూడా కారణం.
  • అటెండర్, ఆఫీస్ బాయ్‌గా పేర్కొనే దిగువ స్థాయి ఉద్యోగాల హోదాల్లోనూ మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వీరిని మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్), సబ్ స్టాఫ్‌గా పిలుస్తున్నారు. అయితే వీరు నిర్వర్తించాల్సిన విధులు మారలేదు. వృత్తిపై నిబద్ధతతో పనిచేయాలనే లక్ష్యంతో హోదాల్లో మార్పులు జరుగుతున్నట్లు బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.

కొత్త హోదాలు..
ప్రస్తుతం పోటీ బాగా పెరగడంతో బ్యాంకులు, గృహ రుణ సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో కొత్త హోదాలు పుట్టుకొస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి.. మేకర్/వెరిఫైయర్, బ్రాంచ్ సర్వీస్ పార్ట్‌నర్, బిజినెస్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, బిజినెస్ బ్యాంకింగ్ మేనేజర్, ఫైనాన్స్ బిజినెస్ మేనేజర్, ఫైనాన్షియల్ ప్లానర్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఆఫీసర్, రెవెన్యూ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్/ఆఫీసర్. అయితే వీరందరి లక్ష్యం.. తాము పనిచేస్తున్న సంస్థను అభివృద్ధి పథంలో నడిపించడం.
  • కిందిస్థాయిలో వినియోగదారులను ఆకర్షించేలా బ్రాంచ్ సర్వీస్ పార్ట్‌నర్, సీఆర్‌ఈ, కస్టమర్ రిలేషన్ మేనేజర్ (సీఆర్‌ఎం) వంటి హోదాల్లో ఉన్నవారు విధులు నిర్వహిస్తుండగా.. సంస్థను మార్కెట్లోని ఇతర సంస్థలకు దీటుగా రాణించేలా ప్రణాళికలు రచించడంలో అనలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, కంప్లయన్స్ ఆఫీసర్ వంటి కీలక స్థానాల్లోని వ్యక్తులు పనిచేస్తున్నారు.

స్పెషలిస్ట్ ఆఫీసర్లు :
బ్యాంకులు ప్రత్యేక విభాగాలతో పాటు బ్రాంచ్ లెవల్, క్లస్టర్ లెవల్, బ్యాక్ ఎండ్‌లో వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ల నియామకాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో లీగల్, హెచ్‌ఆర్, ఫైనాన్స్, ఐటీ, ట్యాక్సేషన్, అగ్రికల్చర్ బ్యాంకింగ్ తదితర విభాగాల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) స్థాయి నుంచి ఏజీఎం, డీజీఎం వరకు పోస్టులను భర్తీచేస్తున్నాయి.

ఎన్‌బీఎఫ్‌సీల్లో..
ఇటీవల కాలంలో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు.. బ్యాంకులతో పోటీపడుతూ ఆర్థిక సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో రిలేషన్‌షిప్ మేనేజర్, క్రెడిట్ అప్రైజర్, లీగల్ అప్రైజర్, రిటైల్ లెండింగ్ మేనేజర్, రిటైల్ అసెట్ మేనేజర్ నియామకాలు చేపడుతున్నాయి. ఎన్‌పీఏ సొల్యూషన్స్ విభాగాల్లో ఆఫీసర్, మేనేజర్ స్థాయిలో నియామకాలు జరుపుతున్నాయి. అంతేకాకుండా వినియోగదారులకు డోర్‌స్టెప్ సర్వీసులు అందించేలా బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, మొబైల్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ తదితర పేర్లతో కింది స్థాయిలో సిబ్బందిని నియమించుకుంటున్నాయి.

హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల్లో..
ఇటీవల కాలంలో బ్యాంకులతోపాటు హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు కూడా వినియోగదారులకు సేవలు అందించడంలో ప్రత్యేకత చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. వ్యాపారాన్ని విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త పేర్లతో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. వాల్యూ అప్రైజర్, లీగల్ అప్రైజర్, క్రెడిట్ రిస్క్ అనలిస్ట్, అసెట్ అప్రైజర్ తదితర హోదాల్లో నియామకాలు చేపడుతున్నాయి.

ఇన్సూరెన్స్ సంస్థలు :
ప్రస్తుతం ఇన్సూరెన్స్ రంగంలోనూ ఉద్యోగాలు-హోదాల విషయంలో ఆధునికత కనిపిస్తోంది. బీమా సంస్థల్లో కింది స్థాయిలో ఇన్సూరెన్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది ‘ఏజెంట్’ అనే పదమే. ఇప్పుడు ఈ ‘ఏజెంట్’ను బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ లేదా బ్రాంచ్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పిలుస్తున్నారు. మిడిల్ లెవల్‌లో బ్యాంకింగ్ రంగంలో మాదిరిగానే అప్రైజర్స్, అనలిస్ట్‌ల పేరుతో పిలుస్తున్నారు.

బ్యాంకింగ్ కొలువులు.. మారుతున్న పేర్లు
ఇటీవల ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతమున్న హోదాల మార్పు వివరాలు..

ప్రస్తుత హోదా

భవిష్యత్తు హోదా

సేల్స్ అసోసియేట్

సేల్స్ స్పెషలిస్ట్

కస్టమర్ అసోసియేట్

ఇష్యూ రిడ్రెసల్ స్పెషలిస్ట్

లోన్ అసోసియేట్

ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజర్

చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్

చీఫ్ డిజిటల్ ఆఫీసర్


కొత్త కొలువులు..
  • క్రెడిట్ అనలిస్ట్
  • ప్రాసెస్ మోడలింగ్ స్పెషలిస్ట్
  • సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్
  • రోబో ప్రోగ్రామర్
  • బ్లాక్‌చైన్ ఆర్కిటెక్ట్

రెండు లక్షలకు పైగా నియామకాలు
  • ఆధునిక యుగం.. ఆటోమేషన్ ప్రభావంతో బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. వీటిలో ప్రధానంగా డేటా అనలిస్ట్, బిగ్ డేటా మేనేజర్, రోబోటిక్ స్పెషలిస్ట్, క్లౌడ్ మేనేజర్ వంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారిత ఉద్యోగాలు ఉన్నాయి.
  • బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో వివిధ హోదాల్లో నియామకాలకు సంబంధించి భవిష్యత్తు అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే.. కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ నుంచి సీఈవో స్థాయి వరకు 2022 నాటికి దాదాపు రెండు లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ జరగనుందని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తదితర సంస్థలు వెల్లడించాయి. వీటిలో అధిక శాతం టెక్ ఆధారిత ఉద్యోగాలు (డేటా అనలిస్ట్, బిగ్ డేటా మేనేజర్ తదితర) ఉంటాయని పేర్కొన్నాయి. వీటితోపాటు టాప్ లెవల్‌లో క్రెడిట్ అనలిస్ట్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్స్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్, స్ట్రాటజీ అనలిస్ట్స్ వంటి ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది.

నియామక ప్రక్రియ :
బ్యాంకుల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలున్న తరుణంలో వాటి నియామక విధానాలు, అర్హతలు ఏంటనే సందేహం తలెత్తడం సహజం. ప్రభుత్వ రంగ బ్యాంకులు.. క్లరికల్, పీవో, స్పెషలిస్టు ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)- కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ ద్వారా భర్తీచేస్తున్నాయి. ఈ విషయంలో ప్రైవేటు బ్యాంకులు వినూత్నంగా వ్యవహరిస్తున్నాయి. అకడమిక్ కొలాబరేషన్ పేరుతో అకడమిక్ ఇన్‌స్టిట్యూట్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. నిర్దిష్ట వ్యవధిలో కోర్సును నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారిని పీవో స్థాయిలో నియమించుకుంటున్నాయి. తమ వెబ్‌సైట్లు, జాబ్ సెర్చ్ సైట్స్‌లోని అభ్యర్థుల ప్రొఫైల్స్ ఆధారంగా క్లరికల్ కేడర్ ఖాళీలను భర్తీచేస్తున్నాయి.

క్యాంపస్ రిక్రూట్‌మెంట్ :
క్లర్క్, పీవో, స్పెషలిస్టు ఆఫీసర్ మినహా ప్రత్యేక అర్హతలు, నైపుణ్యాలు అవసరమైన విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రైవేటు బ్యాంకులు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ చేపడుతున్నాయి. దీనికి ఐఐటీ, ఐఐఎం, నేషనల్ లా యూనివర్సిటీస్, ఐసీఏఐ, ఇతర ప్రముఖ బి-స్కూల్స్‌ను వేదికగా చేసుకుంటున్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత వేతన ప్యాకేజీలతో ఆఫర్లు అందిస్తున్నాయి. గత నాలుగైదేళ్లలో ఐఐటీలు, ఐఐఎంల క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో సగటున 30 శాతం ఆఫర్లు బ్యాంకింగ్ రంగానికి సంబంధించినవే.

అనుభవం ఉంటేనే..
ఉన్నతస్థాయి ఉద్యోగాలుగా పేర్కొనే స్ట్రాటజీ అనలిస్ట్, సీఎఫ్‌వో, లీగల్ అప్రైజర్, రిస్క్ అనలిస్ట్, ఫైనాన్సియల్ అనలిస్ట్ తదితర ఉద్యోగాలు పొందాలంటే తగిన పని అనుభవం తప్పనిసరి.
  • బ్యాంకింగ్ రంగంలో వినూత్న కొలువులను సొంతం చేసుకునేందుకు స్వీయ అన్వేషణ మార్గాలు కొంచెం తక్కువే. అయితే అప్పటికే సంబంధిత బ్యాంకింగ్ విభాగాల్లో పనిచేస్తున్న వారు నేరుగా సంస్థలకు తమ ప్రొఫైల్స్ పంపడం ద్వారా కొంత వరకు విజయం సాధించొచ్చు.

ఉన్నతస్థానాల్లో అనుభవానికి ప్రాధాన్యం..
ఉన్నతస్థాయిలో కీలక, ప్రత్యేక విభాగాల్లో నియామకాలు ఎక్కువగా అట్రిషన్స్ ద్వారా జరుగుతున్నాయి. ఆయా విభాగాల్లో అనుభవం ఉన్న వారికి కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. ఇటీవల కాలంలో బ్యాంకుల్లో సంప్రదాయ కొలువులతో పాటు టెక్నికల్ ఉద్యోగాలు కూడా పెరుగుతు న్నాయి. వీటి భర్తీకి సంస్థలు.. స్పెషలైజ్డ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ చేపడు తున్నాయి. విధుల విస్తృతికి అనుగుణం గా కొత్త హోదాలు రావడంతో ఉద్యోగుల్లో ఉత్సాహం పెరుగుతోంది.
- ప్రొఫెసర్ జి.నాగరాజు, ఎన్‌ఐబీఎం-పుణె.
Published date : 23 Oct 2018 02:27PM

Photo Stories