Skip to main content

ఐబీపీఎస్ ‘ఎస్‌వో’ కొలువులు...సిలబస్ తక్కువ ఉద్యోగం పక్కా!

బ్యాంకుల్లో ఉద్యోగాలంటే.. క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) పోస్టులే అనుకుంటాం. వాస్తవానికి టెక్నాలజీ ప్రవేశం, సేవల విస్తరణతో బ్యాంకుల్లో వృత్తినిపుణుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. బ్యాంకులు ఖాతాదారుల లావాదేవీలకే పరిమితం కాకుండా.. అనేకరకాల సేవలు అందిస్తున్నాయి. ఇందులో ఇన్సూరెన్స్, గోల్డ్ స్కీమ్స్, అగ్రికల్చర్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, హోంలోన్ వంటివి ముఖ్యమైనవి. కస్టమర్లకు రకరకాల సేవలు అందించేందుకు అవసరమైన విభిన్న వృత్తి నిపుణులను నియమించుకుంటున్నాయి. ఆ క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిపుణుల ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. నోటిఫికేషన్ సమాచారం, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ గెడైన్స్‌పై ప్రత్యేక కథనం...
స్పెషలిస్టులు వీరే..!
  • బ్యాంకుల పాలసీల్లో లోపాలను సవరించడానికి, ఆయా డాక్యుమెంట్ల న్యాయబద్ధతను నిర్ధారించడానికి, మోసాలు జరగకుండా అరికట్టడానికి, నిరర్ధక ఆస్తులను తిరిగి రాబట్టడానికి న్యాయ సలహాలు ఇవ్వడం, న్యాయస్థానాల్లో కేసులు తదితర సేవల కోసం న్యాయ నిపుణుల (లా ఆఫీసర్స్) అవసరం ఉంటుంది.
  • రైతులకు లోన్లు ఇచ్చేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయడం, వారికి ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసేందుకు అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ల సేవలు తప్పనిసరి.
  • బ్యాంకింగ్ సేవల్లో ఐటీ వినియోగం పెరుగుతోంది. మరోవైపు పెరుగుతున్న డేటా నిర్వహణ, బ్యాంకుల్లో కంప్యూటర్ సిస్టమ్స్ పనితీరు పర్యవేక్షణ, సాఫ్ట్‌వేర్, ఎంఐఎస్ నిర్వహణ, నెట్‌వర్క్ సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కరించడం, నెట్‌వర్క్ సెక్యూరిటీ తదితర విధులు నిర్వర్తించడానికి ఐటీ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంటోంది.
  • బ్యాంకుల్లోనూ హెచ్‌ఆర్ విభాగం సేవలు తప్పనిసరి. సంస్థ హెచ్‌ఆర్ విధానాలను ఎప్పటికప్పుడు సమీక్షించడం, ఎంపిక ప్రక్రియలు చేపట్టడం, ఉద్యోగులకు సంబంధించి పేరోల్స్ తదితర వ్యవహారాలను పర్యవేక్షించడం వంటి పనులు హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్ చేయాల్సి ఉంటుంది.
  • మన దేశంలో అధిక శాతం జనాభా హిందీలో మాట్లాడుతున్నారు. ఈ మేరకు బ్యాంకు డాక్యుమెంట్లు హిందీలో లభ్యమయ్యేలా రాజ్‌భాష అధికారులను నియమిం చుకోవాల్సిన అవసరం బ్యాంకులకు ఏర్పడింది.

మొత్తం ఖాళీలు: 1163
పోస్టుల వివరాలు: ఐటీ ఆఫీసర్ -76, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్-670, రాజ్‌భాష అధికారి-27, లా ఆఫీసర్-60, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్-20, మార్కెటింగ్ ఆఫీసర్-310.

అర్హతలు ఇవే..
ఐటీ ఆఫీసర్:
కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఐటీ/ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ(లేదా) పీజీ ఉత్తీర్ణత (లేదా) డీఓఈఏసీసీ-బీ లెవల్ డిగ్రీ ఉండాలి.
అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్: అగ్రికల్చర్/హార్టికల్చర్/యానిమల్ హస్బెండరీ/ వెటర్నరీ సైన్స్/డైరీ సైన్స్/ఫిషరీ సైన్స్/పిసి కల్చర్/అగ్రి మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్/కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్/ఆగ్రో ఫారెస్ట్రీ/ఫారెస్ట్రీ/అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ/ఫుడ్ సైన్స్/ఫుడ్ టెక్నాలజీ/అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ /ఫుడ్ టెక్నాలజీ/డెయిరీ టెక్నాలజీ/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/సెరికల్చర్‌లో నాలుగేళ్ల డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
రాజ్‌భాష అధికారి: హిందీలో పీజీ ఉత్తీర్ణతతోపాటు డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివిన వారు అర్హులు. లేదా సంస్కృతంలో పీజీ పూర్తిచేసి ఉండి.. డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టులు చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
లా ఆఫీసర్: లా డిగ్రీతోపాటు బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవాలి.
హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్ 1: డిగ్రీతోపాటు పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/హెచ్‌ఆర్/హెచ్‌ఆర్‌డీ/సోషల్ వర్క్/లేబర్ లా సబ్జెక్టులో రెండేళ్ల ఫుల్‌టైం పీజీ డిగ్రీ లేదా డిప్లొమా.
మార్కెటింగ్ ఆఫీసర్: డిగ్రీతోపాటు మార్కెటింగ్ స్పెషలైజేషన్‌తో ఫుల్‌టైైమ్ ఎంఎంఎస్/ఎంబీఏ/పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీపీఎం/ పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. రెండు కంటే ఎక్కువ స్పెషలైజేషన్లతో ఎంఎంఎస్ లేదా ఎంబీఏ, పీజీ డిప్లొమా చదివిన అభ్యర్థులు అనర్హులు.

వయోపరిమితి :
అన్ని పోస్టులకు 2019 నవంబర్ 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (1989 నవంబర్ 2-1999 నవంబర్ 1 మధ్య జన్మించి ఉండాలి). రిజర్వేషన్ నిబంధనల మేరకు- ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం :
ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష), కామన్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్‌కు హాజరయ్యే అవకాశం లభిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో.. ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు :
ఆంధ్రప్రదేశ్:
చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

మెయిన్ పరీక్ష కేంద్రాలు :
ఆంధ్రప్రదేశ్:
విజయవాడ, విశాఖపట్నం
తెలంగాణ: హైదరాబాద్.

ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది:
2019 నవంబర్ 26
అప్లికేషన్ ఫీజు: రూ. 600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100.
ప్రిలిమినరీ ఆన్‌లైన్ టెస్ట్: 2019, డిసెంబర్ 28, 29 తేదీల్లో
మెయిన్ ఆన్‌లైన్ టెస్ట్: 2020 జనవరి 25న
ఇంటర్వ్యూలు: 2020 ఫిబ్రవరిలో
ప్రొవిజినల్ అలాట్‌మెంట్: 2020 ఏప్రిల్‌లో
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ibps.in

పరీక్ష విధానం:
ప్రిలిమినరీ :
  • లా ఆఫీసర్లు, రాజ్‌భాష అధికారి పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంశాలపై 50 ప్రశ్నల చొప్పున మొత్తం 150 ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో ఒక్కో ప్రశ్నకు అర మార్కు, మిగతా వాటికి ఒక్కో మార్కు. ప్రతి సెక్షన్‌కు వేర్వేరుగా 40 నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తారు.
  • ఐటీ ఆఫీసర్లు, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్లు, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్లు, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్‌లో ఒక్కో ప్రశ్నకు అర మార్కు, మిగతా సెక్షన్లలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతి సెక్షన్‌కు వేర్వేరుగా 40 నిమిషాల చొప్పున సమయం అందుబాటులో ఉంటుంది.
  • అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ అర్హత సాధించాలి. మొత్తంగా నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించడం తప్పనిసరి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హులైన వారినే మెయిన్‌కు ఎంపిక చేస్తారు.

మెయిన్ పరీక్ష :
  • మెయిన్ పరీక్ష కేవలం 60 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఆయా పోస్టును బట్టి సంబంధిత ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీదే ప్రశ్నలు ఉంటాయి. రాజ్‌భాష అధికారి పోస్టుకు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ తరహాలో 60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
  • ప్రిలిమ్స్, మెయిన్‌లో.. ఆబ్జెక్టివ్ విధానంలోని ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఆయా ప్రశ్నలకు కేటాయించిన మార్కుల్లో నాలుగోవంతు కోత విధిస్తారు. మెయిన్ పరీక్షలో నిర్ణీత కటాఫ్ స్కోరు సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో కనీస అర్హత మార్కులు పొందటం తప్పనిసరి. జనరల్ కేటగిరీ వారు 40 శాతం మార్కులు, ఇతరులు కనీసం 35 శాతం మార్కులు సాధిస్తే అర్హులుగా ప్రకటిస్తారు. మొత్తంగా తుది ఎంపికలో మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు 80:20 నిష్పత్తిలో వెయిటేజీ ఇచ్చి.. మెరిట్ జాబితా రూపొందిస్తారు.

ప్రిపరేషన్ కొద్దీ స్కోర్..
స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాలకు వేర్వేరు విద్యా నేపథ్యంతో అభ్యర్థులు పోటీ పడతారు. అన్ని పరీక్షల్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఉమ్మడిగా కనిపిస్తాయి. వీటితోపాటు రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్ ఉద్యోగాలకు పోటీపడే వారికి బ్యాంకింగ్ రంగం, జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటే.. మిగతా అన్ని పోస్టుల అభ్యర్థులకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమినరీ దశ దాటడం ముఖ్యం. ఈ దశ దాటితే మెయిన్‌కు హాజరయ్యే అవకాశం లభిస్తుంది.

రీజనింగ్ :
బ్యాంకు పరీక్షల్లో మంచి స్కోరింగ్ విభాగం.. రీజనింగ్. ఇందులో రాణించేందుకు కాన్సెప్టులను క్షుణ్నంగా అర్థం చేసుకోవాలి. అలాగే లాజిక్‌ను గుర్తించడం ముఖ్యం. అంతేకాకుండా ప్రశ్నలను వేగంగా సాధించే నైపుణ్యాలు అలవర్చుకోవాలి. స్వల్ప సమయంలోనే సమాధానాన్ని గుర్తించాలి. సీటింగ్ అరెంజ్‌మెంట్, పజిల్స్, ఇన్‌ఈక్వాలిటీస్, సిలాయిజమ్స్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఇన్‌పుట్- అవుట్‌పుట్స్, సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, డెరైక్షన్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్ తదితర అంశాలుంటాయి. ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే.. షార్ట్‌కట్ మెథడ్‌‌స గుర్తించుకోవాలి. ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

ఇంగ్లిష్ :
ఎస్‌వో పరీక్షకు వృత్తి విద్య కోర్సులు చేసిన గ్రాడ్యుయేట్లు పోటీపడుతుండటం వల్ల ఇంగ్లిష్‌కు తక్కువ వెయిటేజీ ఇచ్చినట్లు భావించొచ్చు. ప్రశ్నల సంఖ్య 50 ఉన్నా.. వీటికి కేటాయించిన మార్కులు 25 మాత్రమే. అలా అని ఇంగ్లిష్‌పై శ్రద్ధ చూపకపోతే అభ్యర్థులు అవకాశాలు కోల్పోయే ఆస్కారముంది. అంతేకాకుండా సెక్షన్‌వైజ్ కటాఫ్ మార్కులు ఉన్నాయనే విషయాన్ని మరవకూడదు. ఇంగ్లిష్‌లో మంచి స్కోరు సాధించడానికి గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్.. బాగా ప్రాక్టీస్ చేయాలి. దిన పత్రికలు, ప్రామాణిక పుస్తకాల సహాయంతో పదజాలం పెంచుకోవాలి. యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. పార్‌‌ట్స ఆఫ్ స్పీచ్; యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్; డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ వంటి వాటికి సంబంధించి గ్రామర్ నిబంధనలు తెలుసుకోవాలి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ :
లా ఆఫీసర్, రాజ్‌భాష తప్ప.. మిగతా అన్ని పోస్టుల ప్రిలిమ్స్ పరీక్షలో ఉన్న సెక్షన్ ఇది. అభ్యర్థుల్లోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో చాలా వరకు ప్రశ్నలు సింప్లిఫికేషన్, సూత్రాల ఆధారంగా రాబట్టేలా ఉంటాయి. ప్రాథమిక భావనలపై పట్టు సాధించడం తప్పనిసరి. వర్గమూలాలు, ఘన మూలాలు, శాతాలు, కాలం-పని; కాలం-దూరం, లాభం-నష్టం, నిష్పత్తులకు సంబంధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. బేసిక్ గణాంకాలు వేగంగా చేసేలా సన్నద్ధమవ్వాలి.

జనరల్ అవేర్‌నెస్ :
  • లా ఆఫీసర్, రాజ్‌భాష పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలో ఈ విభాగం ఉంది. బ్యాంకింగ్ రంగంలో తాజాగా చోటు చేసుకుంటున్న మార్పులు, చేర్పులపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి.ఆర్‌బీఐ-విధాన నిర్ణయాలు, బ్యాంకింగ్ రంగంలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, వివిధ బ్యాంకులు/ఆర్థిక సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, బ్యాంకింగ్/ఆర్థిక రంగంలో ఉపయోగించే పదజాలం, కేంద్ర ఆర్థిక శాఖ తీసుకునే నిర్ణయాలు(ఉదాహరణకు పెట్టుబడుల ఉపసంహరణ),బీమా రంగంలో సెబీ కీలక నిర్ణయాలు, బ్యాంకుల మెర్జింగ్, డిజిటల్ లావాదేవీల (యూపీఐ మొదలైనవి)పై అవగాహన పెంచుకోవాలి.
  • పెట్టుబడులు, ఆర్‌బీఐ తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, నూతన నియామకాలు, బ్యాంకులు పెద్దఎత్తున ఇస్తున్న రుణ వితరణలు, ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్రముఖ ఆర్థిక సంస్థలు.. వాటి అధిపతులు, అవి ఉన్న ప్రాంతాలు, అంతర్జాతీయంగా ఇటీవల జరిగిన ప్రముఖ వాణిజ్య సదస్సులు, పాల్గొన్న ప్రముఖులు వంటి అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఇందులో మెరుగైన స్కోర్ కోసం ప్రతిరోజూ ఫైనాన్షియల్ డైలీ/మ్యాగజైన్స్ చదవాలి. స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ అంశాలపై దృష్టి సారించాలి!!
Published date : 25 Nov 2019 02:12PM

Photo Stories