Skip to main content

వాయుసేనలో కొలువులు.. ఎంపికైతే శిక్ష‌ణ‌లోనే రూ.56 వేల స్టైఫండ్‌!

దేశ త్రివిధ దళాల్లో ముఖ్యమైనది వాయుసేన. శత్రుమూకలు మన దేశ గగనతలంలోకి ప్రవేశించకుండా అరికట్టడంలో వైమానిక దళం నిరంతరం పహారకాస్తుంది.


ఇలాంటి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉజ్వల కెరీర్‌కు చక్కటి మార్గం.. ఏఎఫ్‌క్యాట్‌ (ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌). ఇందులో అర్హత సాధించిన వారు పైలెట్‌ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. దాంతో పాటు గ్రౌండ్‌ డ్యూటీ.. టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లో ఉన్నతస్థాయి కొలువులను దక్కించుకోవచ్చు. తాజాగా ఏఎఫ్‌క్యాట్‌ 2021 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఏఎఫ్‌క్యాట్‌ ప్రత్యేకతలు, అర్హతలు, దరఖాస్తు, పరీక్షా విధానంపై ప్రత్యేక కథనం..

పైలెట్‌ కావాలని ఎంతోమంది కలలు కంటారు. కాని పైలెట్‌ శిక్షణ ఎంతో వ్యయంతో కూడుకున్నది. అందరికీ అందుబాటులో ఉండదు. ఏఎఫ్‌క్యాట్‌తో ఎలాంటి ఖర్చు లేకుండా.. ఉచిత పైలెట్‌ శిక్షణతోపాటు ఉద్యోగం పొందొచ్చు. పైలెట్‌ మాత్రమే కాకుండా.. గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్, నాన్‌టెక్నికల్‌ విభాగాల్లోనూ కొలువులు సొంతం చేసుకోవచ్చు. భారత వైమానిక దళం.. ఏటా రెండుసార్లు ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(ఏఎఫ్‌ క్యాట్‌) పేరుతో నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 334 (ఫ్లయింగ్‌–96, గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌)–137, నాన్‌ టెక్నికల్‌–73, మెటియోరాలజీ ఎంట్రీ: 28).

విద్యార్హతలు..
ఫ్లయింగ్‌ బ్రాంచ్‌: ఈ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్‌/10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివి ఉండి.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60శాతం మార్కులతో డిగ్రీ (ఏదేని గ్రూప్‌) ఉత్తీర్ణత సాధించాలి. లేదా కనీసం 60శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. వయసు: జూలై 01, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎత్తు: కనీసం 162.5సెంటీమీటర్లు ఉండాలి. ఎలాంటి కంటి సమస్యలు ఉండరాదు.

గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌): ఈ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌(ఎలక్ట్రానిక్స్‌/మెకానికల్‌) వి భాగాల్లో లేదా అనుబంధ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 10+2 స్థాయిలో ఫిజిక్, మ్యాథమెటిక్స్‌లో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌): నాన్‌ టెక్నికల్‌కు సంబంధించి అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్‌ విభాగాలున్నాయి. అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్‌ విభాగాలకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసుండాలి. అకౌంట్స్‌ విభాగానికి సంబంధించి 60 శాతం మార్కులతో బీకాం ఉత్తీర్ణులవ్వాలి. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. వయసు: 26–26ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఎంపిక విధానం..
ఆయా పోస్టులను అనుసరించి ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంజనీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్, పైలెట్‌ అప్టిట్యూడ్‌ బ్యాటరీ టెస్ట్, ఇంటర్వూ్య, మెడికల్, ఫిజికల్‌ టెస్ట్‌లను నిర్వహించి.. తుది ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు, ఉన్నతస్థాయి హోదాతో కూడిన ఉద్యోగం సొంతమవుతుంది.

పరీక్ష ఇలా..
బ్రాంచ్‌ ఏదైనా ఏఎఫ్‌క్యాట్‌ పరీక్షను ఉమ్మడిగానే నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. 300 మార్కులకుగాను 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.

టెక్నికల్‌ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ఇంజనీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌(ఈకేటీ) నిర్వహిస్తారు. ఇది మొత్తం 50 ప్రశ్నలకుగాను 150 మార్కులకు 45 నిమిషాలపాటు జరుగుతుంది.

ఏఎఫ్‌ఎస్‌బీ ఇంటర్వూ..
రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఎయిర్‌ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఏఎఫ్‌ఎస్‌బీ) ఇంటర్వూ్యలకు పిలుస్తుంది. ఇది రెండు స్టేజ్‌ల్లో(స్టేజ్‌–1, 2) ఉంటుంది. స్టేజ్‌–1లో అర్హత సాధించిన వారు స్టేజ్‌–2కి వెళ్తారు. ఆ తర్వాత పర్సనల్‌ ఇంటర్వూ్య జరుగుతుంది. ఈ దశలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి మెడికల్‌ టెస్టులు నిర్వహిస్తారు. అనంతరం మెరిట్‌ప్రాతిపదికన శిక్షణకు ఎంపిక చేస్తారు.

ఉచిత ట్రైనింగ్‌..
ఎంపికైన ఫ్లయింగ్, టెక్నికల్‌ బ్రాంచ్‌లకు చెందిన అభ్యర్థులకు 74 వారాల పాటు; గ్రౌండ్‌ డ్యూటీకి ఎంపికైన వారికి 52 వారాలపాటు ఉచిత ఎయిర్‌ఫోర్స్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. శిక్షణలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఫైటర్‌ పైలెట్, ట్రాన్స్‌పోర్ట్‌ పైలెట్, హెలికాప్టర్‌ పైలెట్‌గా.. ఆయా విభాగాల్లో ఇంటర్నల్‌ శిక్షణ ఇస్తారు.

స్టైఫండ్‌..
శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 సై్టఫండ్‌గా చెల్లిస్తారు. విజయవంతంగా ట్రైనింగ్‌ పూర్తిచేసుకొని ఉద్యోగంలో చేరిన వారికి రూ.56,100 ప్రారంభ వేతనం లభిస్తుంది. దీంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఎ సహా వివిధ రకాల అలవెన్సులు, సౌకర్యాలు లభిస్తాయి.

ముఖ్యమైన సమాచారం..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30.06.2021
పరీక్ష ఫీజు: రూ.250 (అన్ని కేటగిరీల అభ్యర్థులకు )
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/AFCAT

ఇంకా చ‌దవండి : part 2: వాయుసేన‌లో కొలువులు సాధించేలా.. ప్రిపరేషన్ టిప్స్ పాటించండిలా..

Published date : 08 Jun 2021 03:49PM

Photo Stories