Creativity and Artistic Career: వినోద రంగం.. కొలువుల తరంగం!
నేటి ఉరుకులు,పరుగుల జీవితంలో.. ఒత్తిడిని తగ్గించుకొని.. ఉల్లాసం పొందడానికి ముఖ్యమైన మాధ్యమం.. సినిమా! వీకెండ్ వచ్చిందంటే.. సినిమా చూసేద్దాం.. ఎంజాయ్ చేద్దాం.. అనుకునే వారు ఎంతోమంది!! టెక్నాలజీ ప్రవేశంతో వినోద రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వెండితెర, టీవీతోపాటు షార్ట్‌ఫిలింస్, వెబ్‌సిరీస్, ఓటీటీ విస్తరణ వేగం పుంజుకుంది. ఇదే.. ఇప్పుడు యువతకు అవకాశాల వేదికగా మారుతోంది. పుణెలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, కోల్‌కతాలోని సత్యజిత్‌రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో వివిధ ఫిలిం, టీవీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జెట్(జాయింట్ ఎంట్రెన్స్ టెస్ట్)–2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. వినోద రంగంలో కీలక విభాగాలు, కెరీర్ అవకాశాలు, నైపుణ్యాలు, కోర్సులు అందించే ఇన్‌స్టిట్యూట్స్ గురించి తెలుసుకుందాం.. సృజనాత్మకత, కళాత్మక దృష్టి ఉంటే.. వినోద రంగం చక్కటి అవకాశాలు కల్పిస్తోంది. ముఖ్యంగా సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది హీరో హీరోయిన్‌లు, నటీ నటులు. వీరు తెరపై కనిపించే పాత్రలు. తెరవెనుక డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, టెక్నీషియన్స్.. ఇలా ఎంతో మంది కీలక పాత్ర పోషిస్తారు. ప్రతిభతో ఆయా విభాగాల్లో అనేక మంది ఉపాధి పొందుతున్నారు.
సినీ కెరీర్స్.. ముఖ్యాంశాలు
- వినోద రంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు.
- ప్రముఖ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో చక్కటి కోర్సులు.
- యాక్టింగ్ నుంచి స్క్రీన్ ప్లే వరకు పలు కోర్సులు.
- సినీ రంగంతోపాటు టీవీ, ఓటీటీ, యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఉపాధి.
ప్రధానంగా నాలుగు
సినిమా రంగంలో ఎన్నో కెరీర్ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. ప్రధానంగా నాలుగు విభాగాలు ముందంజలో నిలుస్తున్నాయి. అవి.. యాక్టింగ్, డైరెక్షన్, ఎడిటింగ్, మ్యూజిక్. ఈ నాలుగు విభాగాలు సినిమా విజయానికి ఎంతో కీలకం. వీటిల్లో నచ్చిన విభాగంలో చేరి రాణిస్తే.. పేరుతోపాటు ఆదాయం సొంతమవుతుంది.
JET Admissions 2021: జెట్–2021– ఫిలిం, టీవీ కోర్సుల్లో ప్రవేశాలు
యాక్టింగ్
- సినిమా రంగంలో కెరీర్ పరంగా ఎక్కువ మంది ఆసక్తి చూపే విభాగం.. యాక్టింగ్. ఎందుకంటే.. వెండితెరపై అలరిస్తూ ప్రేక్షకుల మదిలో చిర స్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉండటమే. యాక్టింగ్ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు ఇప్పుడు ఎన్నో ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రఖ్యాత ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు ప్రొడక్షన్ హౌస్‌లు సొంతంగా నెలకొల్పుతున్న శిక్షణ సంస్థలు సైతం కోర్సులు అందిస్తున్నాయి.
- కోర్సుల్లో చేరితే నటనకు సంబంధించిన మెళకువలు నేర్పుతారు. కానీ.. ఒక వ్యక్తి నటుడిగా రాణించాలంటే.. అతనికి స్వతహాగా టాలెంట్ ఉండాలి అంటున్నారు నిపుణులు. సన్నివేశానికి తగినట్లుగా హావభావాలు పలికించే సహజ ప్రతిభ ఉండాలి. నటన ద్వారా మంచి గుర్తింపు పొందితే.. సినీ రంగమే కాకుండా.. టెలివిజన్, ఓటీటీ, వెబ్ సిరీస్‌లలోనూ అవకాశాలు లభిస్తాయి. రూ.లక్షల్లో పారితోషికం సైతం అందుకోవచ్చు. టెలివిజన్ ఇండస్ట్రీలో ఎపిసోడ్‌ల ప్రాతిపదికన ఒక్కో ఎపిసోడ్‌కు రూ.పది వేల నుంచి రూ.30వేల వరకు రెమ్యునరేషన్ ఇస్తారు.
డైరెక్షన్
- డైరెక్షన్.. సినిమా విజయానికి కీలకమైన విభాగం ఇది. ఓడకు కెప్టెన్ ఎంత ముఖ్యమో.. సినిమాకు డైరెక్టర్ కూడా అంతే! ఇంతటి కీలకమైన డైరెక్షన్ విభాగంలో పలు కెరీర్ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, కో–డైరెక్టర్ వంటివి. ఈ విభాగంలో నైపుణ్యం సాధించాలంటే.. వాస్తవిక దృక్పథం, శ్రమ, సహనం అవసరం. కథ, నటీనటుల ఎంపిక, మ్యూజిక్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఆర్ట్, పబ్లిసిటీ.. ఇలా అన్నీ విభాగాలను డైరెక్టర్ సమర్థవంతంగా సమన్వయం చేయాల్సి ఉంటుంది.
- డైరెక్టర్‌గా క్లిక్ అయితే.. కెరీర్‌లో సుస్థిరతతోపాటు పేరు, డబ్బు.. ఇలా అన్నీ ఒకదాని వెంట ఒకటి సొంతమవుతాయి. అందుకే..ఇప్పుడు యువత డైరెక్షన్ విభాగం వైపు దృష్టిసారిస్తోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో షార్ట్ ఫిల్మ్స్, ఓటీటీ సంస్కృతి పెరిగింది. దాంతో ముందుగా ఈ విభాగాల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
- డైరెక్షన్ విభాగంలో సినిమా డైరెక్షన్‌తోపాటు పలు ఉపాధి వేదికలు అందుబాటులో ఉన్నాయి. అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలు, టీవీ సీరియళ్లు, డాక్యుమెంటరీ ఫిల్మ్స్.. వంటివి ముందు వరుసలో నిలుస్తున్నాయి.
- నైపుణ్యాలు అందించే కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్; మాస్టర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్; పీజీ డిప్లొమా ఇన్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ రైటింగ్. వీటిని పలు ప్రముఖ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి.
ఎడిటింగ్
- సినిమా రంగంలో ప్రధానమైన మరో విభాగం.. ఎడిటింగ్. వాస్తవ రన్ టైమ్ నాలుగైదు గంటల నిడివి ఉండే సినిమాని రెండున్నర,మూడు గంటలకు కుదించడం.. ఆయా సన్నివేశాల మధ్య అనుసంధానం కోల్పోకుండా.. సీక్వెన్స్ దెబ్బతినకుండా.. ప్రేక్షకులు మెచ్చే విధంగా కూర్పుచేయడం సవాలుతో కూడుకున్న పని. ఈ పనిని విజయవంతంగా చేయగలిగే వారే ఎడిటర్స్.
- ఎడిటింగ్ విభాగంలో రాణించాలంటే.. సృజనాత్మకతతోపాటు ఓర్పు, సహనం ఉండాలి. ఎందుకంటే.. డైరెక్టర్, నిర్మాత ఆలోచన సరళిని తెలుసుకుంటూ.. అందుకు అనుగుణంగా సన్నివేశాల కూర్పు చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎడిటర్‌కు టెక్నికల్ నైపుణ్యాలు కూడా ఉండాలి. ప్రస్తుతం ఎడిటింగ్‌లో డిప్లొమా నుంచి బ్యాచిలర్ స్థాయి వరకూ.. పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
- ఎడిటింగ్ కోర్సులు: డిప్లొమా ఇన్ ఫిల్మ్ ఎడిటింగ్; డిప్లొమా ఇన్ వీడియో ఎడిటింగ్; డిప్లొమా ఇన్ వీడియో ఎడిటింగ్ అండ్ సౌండ్ రికార్డింగ్; పీజీ డిప్లొమా ఇన్ ఎడిటింగ్.
- ఉపాధి వేదికలు: ఎడిటింగ్ కోర్సులు పూర్తి చేసిన వారు సినిమా, టీవీ, వార్తా ఛానళ్లు, ప్రకటన సంస్థలు, మల్టీ మీడియా సంస్థలు, వెబ్ డిజైనింగ్ కంపెనీలు, నెట్ పోర్టల్స్ వంటి చోట్ల ఉద్యోగాలు పొందొచ్చు. అదే విధంగా ఫ్రీలాన్స్ ఎడిటర్‌గా స్వయం ఉపాధి అవకాశాలు కూడా సొంతం చేసుకోవచ్చు. డిజిటల్ వీడియోలు, యూట్యూబ్ చానెళ్లకు సైతం పని చేయొచ్చు.
- ఫోటోగ్రఫీ
- సినిమాటోగ్రఫీ విభాగంలోనూ అవకాశాలు విస్తరిస్తున్నాయి. ఒక సన్నివేశాన్ని హృద్యంగా చిత్రీకరించే బాధ్యత ఫోటోగ్రాఫర్‌దే. వినోద రంగం విస్తరిస్తుండటం, వందల కొద్దీ సినిమాలు తెరకెక్కుతుండటంతో.. నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఫోటోగ్రఫీకి సంబంధించి టెక్నికల్ నైపుణ్యాలు కూడా సొంతం చేసుకుంటే.. అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్, అసోసియేట్ సినిమాటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్‌గా రాణించొచ్చు.
చదవండి: Blockchain Jobs: బ్లాక్‌చైన్ టెక్నాలజీ నిపుణులకు డిమాండ్.. అవసరమైన నైపుణ్యాలు ఇవే...
మ్యూజిక్
- సినిమా హిట్, ఫ్లాప్‌లో కీలక ప్రాత పోషించే విభాగం.. మ్యూజిక్. సినిమా విడుదల కంటే ముందే రిలీజయ్యే సంగీతం, పాటలే సినిమా పట్ల ఆసక్తిని పెంచుతాయి. అందుకే డైరెక్టర్లు సైతం సంగీతం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విభాగంలో రాణించాలంటే.. సంగీతంపై సహజమైన ఆసక్తి ఉండాలి. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్స్ గ్రూప్‌లో సభ్యులుగా అడుగుపెట్టి.. తమ ప్రతిభను నిరూపించుకుంటే.. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. నైపుణ్యం, అనుభవం ఆధారంగా మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి చేరుకోవచ్చు.
- కోర్సులు: మ్యూజిక్ విభాగంలో నైపుణ్యాలు పొందేందుకు బ్యాచిలర్ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీఏ మ్యూజిక్, బీఎఫ్‌ఏ తబలా, మ్యూజిక్; బీఏ తబలా; ఎంఏ మ్యూజిక్; ఎంఫిల్ ఇన్ మ్యూజిక్; పీహెచ్‌డీ ఇన్ మ్యూజిక్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. వీటితోపాటు ఆం్ర«ధా యూనివర్సిటీ, నాగార్జున, కాకతీయ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలు బీఏ మ్యూజిక్ కోర్సును అందిస్తున్నాయి. పలు ప్రైవేట్ సంస్థలు కూడా శిక్షణ ఇస్తున్నాయి.
స్క్రీన్ ప్లే
- సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ కొట్టకుండా.. ఆయా సన్నివేశాల పట్టు సడలకుండా.. ప్రతి సీన్‌ను ఉత్కంఠ కలిగించేలా.. కథలో బిగి తగ్గకుండా.. అందంగా, ఆహ్లాదంగా, ఆకర్షణీయంగా ఉండేలా చేసేది.. స్క్రీన్‌ప్లే. దాన్ని రాసే రచయిత విల్లు విడిచిన బాణంలా ఉండాలంటారు. అలాంటి స్క్రీన్ ప్లే రచయితలకు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉంది. దీనికి సంబంధించి నైపుణ్యాలు పొందేందుకు స్క్రీన్ ప్లే రైటింగ్, రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే స్పెషలైజేషన్లతో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు అభ్యసించే వీలుంది.
ఫిల్మ్ కోర్సులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు
- ఫిల్మ్ అండ్ టీవీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా–పుణె: (www.ftiindia.com)
- సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్–కోల్‌కత: (www.srfti.ac.in)
- సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆర్ట్ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్–న్యూఢిల్లీ:(www.log2craft.org)
- ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్–నోయిడా: (www.aaft.com)
సంప్రదాయ యూనివర్సిటీలు
సినిమా రంగానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు రాష్ట్రాల స్థాయిలో సంప్రదాయ యూనివర్సిటీలు కూడా ఫిల్మ్ అండ్ మీడియాకు సంబంధించి పలు కోర్సులను అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తదితర విశ్వవిద్యాలయాలు థియేటర్ ఆర్ట్స్ విభాగంలో యాక్టింగ్, మ్యూజిక్ కోర్సులను అందిస్తున్నాయి.
చదవండి: Cyber Security: ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే... జాబ్ గ్యారెంటీ!