Skip to main content

లింగ్విస్టిక్స్ - కెరీర్‌లో విజయానికి సరికొత్త మార్గం

బ్రిటీషు ఉద్యోగిగా ఇండియా వచ్చిన బ్రౌన్ తెలుగు భాషను నేర్చుకునే క్రమంలో తనకుకష్టంఅనిపించిన పదాలను ఒకచోట చేర్చి మొట్టమొదటి తెలుగు నిఘంటువును (డిక్షనరీ) తయారు చేశాడు. అది తర్వాత కాలంలో తెలుగు నేర్చుకోవాలనుకున్న ఇంగ్లీషు వారికి చాలా బాగా ఉపయోగపడింది. నిజానికి తెలుగు భాషతో ఏ మాత్రం పరిచయం లేని బ్రౌన్ తన తెలుగు నైపుణ్యాన్ని పెంచుకోవడానికి రకరకాల పద్ధతులు ఉపయోగించాడు. ఆయన చివరికి ప్రజలు తనకు సమర్పించిన దరఖాస్తులను చదివి కూడా తన భాషా నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. ఇంగ్లీషు తన మాతృభాష అయినా తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని గమనించిన బ్రౌన్ ప్రాచీన తెలుగు తాళపత్ర గ్రంథాలెన్నింటిలో ముద్రణ చేయించాడు. ఆయనకు ఈ ప్రక్రియలో బాగా ఉపయోగపడింది ఆయనకున్న భాషాశాస్త్ర పరిచయమే.

భాష- భాషాశాస్త్రం
భాష అంటే ఏమిటో మనందరికీ తెలిసిందే. ప్రతి సమాజానికి ఒక భాష ఉంటుంది. ఆ భాష తరువాత తరాలకు వారసత్వంగా అందుతుంది. ఒక భాషను మాట్లాడే వ్యక్తి ఇతర భాషలు మాట్లాడే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ భాషలో ధ్వనులను మాత్రమే వినగలుగుతాడు కాని ఆ భాష అర్థం కాదు. ఆ వ్యక్తికి చిన్నప్పటి నుంచి తన మాతృ భాషతో మాత్రమే సంబంధం ఉండడం, ఇతర భాషల గురించి తెలియక పోవడమే దీనికి కారణం. ఒక్కొక్క భాషకు కొన్ని ప్రత్యేకమైన ధ్వనులు, భాషానియమాలు ఉంటాయి. ఆ భాషా నియమాలు, సూత్రాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే భాషాశాస్త్రం లేదా లింగ్విస్టిక్స్.

భాషా శాస్త్ర అధ్యయనం వల్ల భాషా కుటుంబాల ప్రజలలో ప్రాచీన కాలంలో జరిగిన సాంస్కృతిక, సామాజిక మార్పులను తెలుసుకోవడానికి తోడ్పడుతుంది. చారిత్రక, సామాజిక, మార్పులు, భాషలో జరిగే మార్పులను భాషాశాస్త్రం విశదీకరిస్తుంది. భాషలు, భాషా కుటుంబాలు గురించి అధ్యయనం చేస్తుంది. భాషల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి భాషాశాస్త్రం పనిచేస్తుంది. భాషా శాస్త్రానికి, వ్యాకరణానికి చాలా దగ్గర సంబంధం ఉంది. భాషాశాస్త్రం ద్వారా వాక్యనిర్మాణం, పదనిర్మాణం, పదబంధాల నిర్మాణం, ఇతర భాషల నుంచి వచ్చి చేరిన పదాల వివరాలు తెలుస్తాయి. అంతే కాకుండా భాషా శాస్త్రం ప్రజలు భాషను ఉపయోగించే పద్ధతి, భాషా చరిత్ర గురించి వివరిస్తుంది.

భాషాశాస్త్ర అధ్యయనం
ప్రపంచీకరణ నేపథ్యంలో పపంచమంతా కుగ్రామంగా మారుతుండటం వల్ల భాషాశాస్త్రం అధ్యయనం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. పెరుగుతున్నఅవసరాల దృష్ట్యా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ వంటి రంగాలలో లింగ్విస్టిక్స్‌కి ప్రాధాన్యత ఉంది. భాషాశాస్త్రం అనేక శాఖలుగా విస్తరించింది. ప్రస్తుతం లింగ్విస్టిక్స్‌లో హిస్టారికల్ లింగ్విస్టిక్స్, సోషియో లింగ్విస్టిక్స్, డెవలప్‌మెంట్ లింగ్విస్టిక్స్, న్యూరో లింగ్విస్టిక్స్, క్లినికల్ లింగ్విస్టిక్స్, బయో లింగ్విస్టిక్స్, క్లినికల్ లింగ్విస్టిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ వంటి అనేక శాఖలున్నాయి.

హిస్టారికల్ లింగ్విస్టిక్స్ భాషా పరిణామ చరిత్రను వివరిస్తుంది. సామాజిక సంఘటనల ద్వారా భాష ఎలా మారిందో సోషియో లింగ్విస్టిక్స్ తెలియచేస్తుంది. వ్యక్తులకు భాషను ఎలా నేర్పాలో డెవలప్‌మెంట్ లింగ్విస్టిక్స్ వివరిస్తుంది. దీని వల్ల పిల్లలు భాషను ఎలా నేర్చుకుంటారో అర్థం చేసుకోవచ్చు. భాషలు నేర్చుకునే క్రమంలో మెదడులో జరిగే మార్పులనున్యూరోలింగ్విస్టిక్స్ పరిశీలిస్తుంది. మనిషి మాటల ద్వారా జంతువులను మచ్చిక చేసుకునే విధానం బయోలింగ్విస్టిక్స్ అధ్యయనం చేస్తుంది. కొన్ని అక్షరాలు స్పష్టంగా పలకలేనివారిని, సరిగా మాట్లాడలేని వారిని స్పష్టంగా మాట్లాడించే పనిని క్లినికల్ లింగ్విస్టిక్స్ చేస్తుంది.

లింగ్విస్టిక్స్‌కోర్సులు - ప్రధాన యూనివ ర్శిటీలు
డిగ్రీలో లింగ్విస్టిక్స్‌ను ఒక సబ్జెక్టుగా కొన్ని యూనివర్శిటీలు అందిస్తోండగా, మరికొన్ని యూనివర్శిటీలు సర్టిపికేట్, డిప్లమో కోర్సులను అందిస్తున్నాయి. అయితే లింగ్విస్టిక్స్‌ను ప్రత్యేక అంశంగా ప్రధానంగా ఎం.ఎ. స్థాయిలోనే బోధించడం జరుగుతోంది. ఎం.ఎ. స్థాయిలో లింగ్విస్టిక్స్ చేయాలనుకునే వారు ఈ క్రింది విశ్వవిద్యాలయాలు, సంస్థలకు తమ మొదటి ప్రాధాన్యతని ఇవ్వవచ్చు -
  1. సెంటర్ ఫర్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్‌లేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, హైదరాబాద్.
  2. సెంటర్ ఫర్ లింగ్విస్టిక్స్, జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ, న్యూఢిల్లీ.
  3. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ, హైదరాబాద్.
  4. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మైసూర్.
  5. డిపార్ట్‌మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్, అన్నామలై యూనివర్శిటీ, అన్నామలై నగర్.
  6. డిపార్ట్‌మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం.
  7. డిపార్ట్ట్‌మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్, భారతీయార్ యూనివర్శిటీ, కోయంబత్తూర్.
  8. డిపార్ట్ట్‌మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్, కలకత్తా యూనివర్శిటీ, కలకత్తా .
  9. అలిఘర్ ముస్లిం యూనివర్శిటీ, అలిఘర్, ఉత్తర ప్రదేశ్.
  10. సెంటర్ ఫర్ బిహేవియర్ అండ్ కాగ్నినిటివ్ సైన్స్, అలహాబాద్.
వీటితోపాటుగా అనేక సెంట్రల్ యూనివర్శిటీలు, రాష్ట్ర స్థాయి యూనివర్శిటీలు కూడా ఎం.ఎ. లింగ్విస్టిక్స్ కోర్సును అందిస్తున్నాయి. వీటిలో అనేక యూనివర్శిటీలకు మంచి పేరు కూడా ఉంది. ఉదాహరణకి ఉస్మానియా యూనివర్శిటీ లింగ్విస్టిక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఇప్పటికీ చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కోర్సులు, డిపార్ట్‌మెంట్‌ల వివరాలకోసం ఆ యూనివర్శిటీల సంప్రదించవచ్చు.

అవసరమైన నైపుణ్యాలు
లింగ్విస్టిక్స్‌ను కెరీర్‌గా తీసుకోవాలకునే వారికి మాతృభాషతో పాటు ఆంగ్లభాషా పరిజ్ఞానం, భాషా నియామాల అధ్యయనం పట్ల ఉత్సుకత, సూక్షస్థాయి పరిశీలన, పరిశోధనా దృష్టి, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ ప్రోగామింగ్‌లపై ఆసక్తి వంటి నైపుణ్యాలు కలిగి ఉండడం ఎంతో ఉపయోగకరం.

ఉద్యోగావకాశాలు
ఇటీవల కాలంలో వేగంగా పరిశ్రమ ఆదరణ పొందుతోన్న సబ్జెక్టులలో లింగ్విస్టిక్స్ ముందు వరుసలో ఉంటుదని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. లింగ్విస్టిక్స్ చదివిన వారికి ప్రధానంగా యూనిర్శిటీలు, ప్రభుత్వ సంస్థలు, ఐటి, ప్రభుత్వేతర సంస్థలలో ఉద్యోగ అవకాశాలున్నాయి.

లింగ్విస్టిక్స్‌లో ఎం.ఎ, ఎం.ఫిల్., పిహెచ్.డి చేసిన వారికి విశ్వవిద్యాలయాలలో బోధన, పరిశోధన రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. భాషాశాస్త్రం పట్టు సాధించిన భారతీయులు ఈ రోజు అనేక విదేశీ విశ్వవిద్వాలయాలు, పరిశోధనా సంస్థలలో ఉన్నత స్థానాలలో ఉన్నారు. ఉదాహరణకి మన రాష్ట్రానికి చెందిన తెలుగు భాషా శాస్త్రజ్ఞులు మ్యాడిసన్ యూనివర్శిటీకీ, చికాగో యూనివర్శిటీకీ వంటి అమెరికన్ యూనివర్శిటీలలో తమ సేవలను అందిస్తున్నారు. హెదరాబాదు విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్‌లేషన్, మైసూరులోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ వంటి సంస్థలు మెషీన్ ట్రాన్స్‌లేషన్, మల్టీలింగ్వల్ డిక్షనరీలు తయారు చేస్తున్నారు.

విశ్వ విద్యాలయాలే కాక అనేక ప్రభుత్వ, ప్రయివేటు పరిశోధనా సంస్థలు చేసే పరిశోధనల్లో భాషాశాస్త్రం ముఖ్య భూమిక పోషిస్తోంది. ఉదాహరణకు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి.డాక్) వంటి సంస్థలు భారతీయ భాషలకు సాప్ట్‌వేర్‌లను తయారు చేస్తున్నాయి. ఇవన్నీ భాషాశాస్త్రం అధ్యయనం ద్వారా జరిగేవే. భారత ప్రభుత్వం ఏదైనా భాషకు సంబంధించిన సాప్ట్‌వేర్ తయారు చేయాలనుకున్నప్పుడు భాషాశాస్రజ్ఞుల సహాయం తీసుకుంటుంది. అదే విధంగా యూనివర్శిటీలు, ఇతర భాషా సంస్థలలో నిఘంటువులు నిర్మాణ శాస్త్రం (లెక్సికోగ్రఫీ)లో కూడా భాషా శాస్త్రవేత్తలకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

భాషా శాస్త్రవేత్తలకుఇటీవల ఐటి రంగం అపారమైన అవకాశాలు కల్పిస్తోంది. ముఖ్యంగా కంప్యూటేషన్ లింగ్విస్టిక్స్, అప్లైడ్ లింగ్విస్టిక్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ వంటి అంశాలపై పట్టు ఉన్న లింగ్విస్ట్‌లకు ఐటి కంపెనీలు భారీ వేతనాలతో ఆహ్వానం పలుకుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ వంటి రంగాలలో భాషాశాస్త్ర ప్రాధాన్యత రోజు, రోజుకూ పెరుగుతోంది.

లింగ్విస్టిక్స్ని సీరియస్‌గా తీసుకున్న విద్యార్థులందరూ భారీ వేతనాలతో మంచి స్థానాలకు వెళుతున్నారు.

Published date : 12 Nov 2013 12:29PM

Photo Stories