Skip to main content

విదేశీ భాషల నిలయం.. ‘ఇఫ్లూ’

ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ.. సంక్షిప్తంగా ఇఫ్లూ. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్‌గా 1958లో ఇంగ్లిష్ కోర్సుల బోధనతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కాలక్రమంలో ఇంగ్లిష్‌తోపాలు పలు విదేశీ భాషలూ బోధిస్తూ.. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్‌గా పేరు మార్చుకొని పరిధిని మరింత విస్తృతం చేసింది. 2007లో సెంట్రల్ యూనివర్సిటీ హోదాను సొంతం చేసుకుని విభిన్న కోర్సులను అందిస్తూ.. నానాటికీ విస్తరిస్తున్న ఇఫ్లూపై ఇన్‌స్టిట్యూట్ వాచ్...

ఇంగ్లిష్, ఇతర విదేశీ భాషల్లో పదుల సంఖ్యలో కోర్సులను అందిస్తోంది ఇఫ్లూ. ఆయా భాషల్లో నెపుణ్యం పొందేలా మెరుగైన బోధన అందిస్తూ.. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విశేష గుర్తింపు పొందింది. ప్రతిఏటా ఇక్కడ ప్రవేశం పొందుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా జాతీయ స్థాయిలోనూ ఇఫ్లూ తన క్యాంపస్‌లను విస్తరిస్తోంది. హైదరాబాద్ ప్రధాన క్యాంపస్‌గా ఉన్న ఈ యూనివర్సిటీ.. ఇప్పుడు షిల్లాంగ్, లక్నో, మలప్పురం(కేరళ) సెంటర్స్‌ను కూడా ఏర్పాటు చేసి పలు కోర్సులను అందిస్తోంది. తద్వారా అన్ని ప్రాంతాల విద్యార్థులకు అందుబాటులో ఉండేలా నిరంతర ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఇంగ్లిష్ టు రష్యన్.. పలు భాషలు, విస్తృత కోర్సులు
ఇఫ్లూలో ఇంగ్లిష్‌తోపాటు అరబిక్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, జపనీస్ కోర్సులను ప్రస్తుతం ఆఫర్ చేస్తున్నారు. ఇంగ్లిష్ భాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా అనేక కోర్సులను రూపొందించింది. ఇంగ్లిష్ లిటరరీ స్టడీస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్‌లు ఈ కోవకే చెందుతాయి.

పలు స్థాయిల్లో అకడమిక్ కోర్సులు
ఇఫ్లూలో సర్టిఫికెట్ స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా వరకు పలు స్థాయిల్లో, భాషల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అరబిక్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషల్లో బ్యాచిలర్స్ డిగ్రీ (ఆనర్స్), పీజీ కోర్సులు ఇందుకు ఉదాహరణలు. వీటిలో బ్యాచిలర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధిత భాషలో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణతలు అర్హతలు. ఇంగ్లిష్‌కు సంబంధించి ఇఫ్లూకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

అందిస్తున్న కోర్సులు..
ఇంగ్లిష్‌లో బీఏ (ఆనర్స్). అర్హత:
ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
ఇంగ్లిష్‌లో బీఈడీ. అర్హత: బీఏ(ఇంగ్లిష్) లేదా ఎంఏ (ఇంగ్లిష్)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ఎంఏ (ఇంగ్లిష్). అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

భాష నైపుణ్యాలతో మరెన్నో..
ఆయా భాషలకు సంబంధించి నైపుణ్యాలు అందించే విధంగా కోర్సులను ప్రవేశపెట్టిన ఇఫ్లూ.. మరెన్నో ఇతర కోర్సులను కూడా అందిస్తోంది. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మాస్టర్స్ ఇన్ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఇంగ్లిష్ వంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలు. హిందీలోనూ కోర్సులు ప్రవేశపెట్టడం ఇన్‌స్టిట్యూట్ అనుసరిస్తున్న వైవిధ్య విధానాలకు నిదర్శనం. అంతేకాకుండా ఇన్‌స్టిట్యూట్ అందిస్తున్న ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులన్నింటిలోనూ పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది.

ఔత్సాహికులకు స్పోకెన్ ఇంగ్లిష్, పార్ట్‌టైం కోర్సులు
ఇంగ్లిష్ భాష ఔత్సాహికులు, నైపుణ్యాలు పెంచుకోవాలనుకునే వారికి ప్రత్యేకంగా కొన్ని పార్ట్‌టైం కోర్సులు కూడా ఇఫ్లూలో అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లిష్‌లో బేసిక్, అడ్వాన్స్‌డ్ ప్రొఫిషియన్సీ కోర్సులు ఇందులో ప్రధానమైనవి. వీటితోపాటు ఇతర ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల్లో ఇంగ్లిష్ భాష నైపుణ్యాలు పెంచే విధంగా స్వల్ప కాలిక వ్యవధిలో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులను కూడా ఇఫ్లూ నిర్వహిస్తోంది.

ఏఐఈఎల్‌టీఏ.. ఇఫ్లూ మరో ప్రత్యేకం
ఆల్ ఇండియా ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ అథారిటీ (ఏఐఈఎల్‌టీఏ) పేరుతో ఇఫ్లూ జాతీయ స్థాయిలో.. నిర్వహించే పరీక్ష ఇది. దీనికి ఔత్సాహికులు ఎవరైనా హాజరు కావచ్చు. ఇందులో మార్కుల ఆధారంగా అభ్యర్థులు తమకు ఇంగ్లిష్ భాష నైపుణ్యాలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవచ్చు.

ప్లేస్‌మెంట్స్ సదుపాయం కూడా..
ఇఫ్లూలో ప్రతి ఏటా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. సగటున 92 శాతం మంది విద్యార్థులు వీటిలో విజేతలుగా నిలుస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం పాఠశాలల నుంచి మన దేశంలోని వివిధ దేశాల ఎంబసీలు, టూరిజం సంస్థలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, బీపీఓ, కేపీఓ రంగంలోని కంపెనీలు ఈ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో పాల్గొంటున్నాయి. పీజీ విద్యార్థులకు సగటున రూ.3 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది.

వేల సంఖ్యలో రిఫరెన్‌‌స బుక్స్, జర్నల్స్
లాంగ్వేజెస్ కోర్సులో నైపుణ్యాలు పొందాలంటే.. పలు రిఫరెన్స్ పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఇఫ్లూలో చక్కటి లైబ్రరీ సదుపాయం కూడా ఉంది. వేల సంఖ్యలో రిఫరెన్స్ పుస్తకాలతోపాటు దాదాపు 15 వందలకుపైగా పీహెచ్‌డీ థీసిస్‌లు, జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా విద్యార్థులు ఆయా అంశాలకు సంబంధించి పూర్తి అవగాహన పొందొచ్చు. అంతేకాకుండా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసిన విద్యార్థులు అందజేసిన థీసిస్‌లను డిజిటలైజేషన్ పద్ధతిలో అమర్చి విద్యార్థులందరూ ఇంటర్నెట్‌లో చూసే అవకాశం కూడా కల్పించింది.

డిస్టెన్స్ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ
ఇఫ్లూ రెగ్యులర్ కోర్సులతోపాటు దూర విద్యా విధానంలోనూ పీజీ కోర్సులను అందిస్తోంది. 2014-15కు ఎంఏ ఇంగ్లిష్ (వ్యవధి రెండేళ్లు); పీజీడీటీఈ (వ్యవధి: ఏడాది) ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తోంది. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 31. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.
వెబ్‌సైట్: www.efluniversity.ac.in/

ఇఫ్లూ ప్రత్యేకం.. పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్
ఇఫ్లూకు ప్రత్యేకంగా ట్రేడ్ మార్క్‌గా నిలుస్తున్న మరో అంశం.. ఇక్కడ ఉన్న పీహెచ్‌డీ కోర్సులు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్; లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్; కంపేరిటివ్ లిటరేచర్ అండ్ ఇండియన్ స్టడీస్; ఇంగ్లిష్ లిటరేచర్; ఇండియన్ అండ్ వరల్డ్ లిటరేచర్; ట్రాన్స్‌లేషన్ స్టడీస్; కల్చరల్ స్టడీస్; ఫిల్మ్ స్టడీస్; సోషల్ ఎక్స్‌క్లూజన్ స్టడీస్ వంటి విభాగాల్లో పీహెచ్‌డీ కోర్సులున్నాయి. వీటిలో ఇండియన్ అండ్ వరల్డ్ లిటరేచర్; కంపేరిటివ్ లిటరేచర్ అండ్ ఇండియన్ స్టడీస్‌లో పీహెచ్‌డీలపై విదేశీ విద్యార్థులు అమితమైన ఆసక్తి చూపుతున్నారు.

త్వరలో మరికొన్ని కోర్సులు..
‘‘లాంగ్వేజ్ స్టడీస్‌లో పలు కోర్సులను అందిస్తున్న ఇఫ్లూకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. త్వరలో ఇంటర్ డిసిప్లినరీ కోర్సులను ప్రవేశ పెట్టే ఆలోచన కూడా ఉంది. జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతాల విద్యార్థులకూ అందుబాటులో ఉండేలా క్యాంపస్‌లను విస్తరిస్తున్నాం. ఇఫ్లూ కోర్సులకు విద్యార్థుల ఆదరణ పెరుగుతోంది. నేటి పోటీ ప్రపంచంలో మాతృభాషతోపాటు ఇంగ్లిష్ లాంగ్వేజ్ (రీడింగ్, స్పోకెన్) స్కిల్స్ ప్రాధాన్యం పెరుగుతుండటమే ఇందుకు కారణం. ఈ దిశగా సమాజ అవసరాలకు అనుగుణంగా కరిక్యులంలోనూ మార్పులు చేస్తున్నాం. త్వరలో మరికొన్ని కోర్సులను అందించేందుకు కృషి చేస్తున్నాం’’
ప్రొఫెసర్ సునయన సింగ్, వైస్ ఛాన్స్‌లర్, ఇఫ్లూ
Published date : 06 Sep 2014 03:35PM

Photo Stories