Skip to main content

వైద్యంలో ఉజ్వల కెరీర్...

నిలువెల్లా నిస్సత్తువ ఆవరించిన రోగికి ఆపన్న హస్తైమై, స్వస్థత చేకూర్చే దేవుని రూపమై నిలిచే పవిత్ర వృత్తి వైద్యం. విలవిలలాడుతున్న ప్రాణాలకు ఊపిరిపోశామన్న సంతృప్తితో పాటు ఉజ్వల కెరీర్‌కు మెడిసిన్ చిరునామాగా ఉంటోంది. ఇంటర్ పూర్తయిన విద్యార్థుల ముందున్న అలాంటి మెడిసిన్, సంబంధిత కోర్సులపై ఫోకస్...

మెడిసిన్
కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 6-6.5 లక్షల మంది డాక్టర్లున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన డాక్టర్- జనాభా నిష్పత్తి (1:1000)ని చేరుకోవాలంటే 2020 నాటికి మరో నాలుగు లక్షల మంది వైద్యుల అవసరం ఉంది. ఇంత భారీగా డిమాండ్ ఉన్న తరుణంలో దేశంలో వైద్య వృత్తి ఉన్నత కెరీర్ ఆప్షన్‌గా వెలుగొందుతోంది.
ప్రవేశ పరీక్షలు: వైద్య వృత్తిలోకి ప్రవేశించాలనుకునే వారికి ఎంబీబీఎస్ తొలి మెట్టు. రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా ఎంబీబీఎస్ కోర్సులోకి ప్రవేశాలు కల్పిస్తున్నారు. గతేడాది ప్రవేశాలకు సంబంధించి 15 ప్రభుత్వ, 28 ప్రైవేటు వైద్య కళాశాలలో 6,200 సీట్లున్నాయి. కొత్త కళాశాలల రాక, ఉన్న కళాశాలల్లోనే సీట్ల పెంపు వల్ల ఈ ఏడాది అదనపు సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ)/ బయో టెక్నాలజీ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. అర్హత పరీక్షకు సంబంధించిన గ్రూప్ సబ్జెక్టులన్నీ కలుపుకొని కనీసం 50 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కనీసం 40 శాతం మార్కులు ఉండాలి.
పరీక్ష వివరాలు: ఎంసెట్-మెడికల్ ప్రశ్నపత్రంలో 160 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 40 బోటనీ ప్రశ్నలు, 40 జువాలజీ ప్రశ్నలు, 40 ఫిజిక్స్ ప్రశ్నలు, 40 కెమిస్ట్రీ ప్రశ్నలుంటాయి. మూడు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. నెగిటివ్ మార్కులు లేవు. ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ గ్రూప్ సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. వీటి ఆధారంగానే ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రత్యామ్నాయ ఎంట్రన్స్‌లు: ఎంసెట్‌కు ప్రత్యామ్నాయంగా దేశంలోని పలు ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు చాలా ఎంట్రన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి.. జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్- పుదుచ్చేరి), ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్), ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ (పుణె), బెనారస్ హిందూ యూనివర్సిటీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్- వార్ధా, ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, మణిపాల్ యూనివర్సిటీ, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (వెల్లూరు), ఎస్‌ఆర్‌ఎం, అమృత విశ్వవిద్యా పీఠం, డీవై పాటిల్ ఎడ్యుకేషనల్ సొసైటీ.
 • విదేశాల్లోనూ ఎంబీబీఎస్ చేసేందుకు మక్కువ చూపుతున్న వారూ అధికంగానే ఉన్నారు. చైనా, ఉక్రెయిన్, రష్యా, ఫిలిప్పీన్స్, సెంట్రల్ అమెరికా, జార్జియా, రుమేనియా వంటి దేశాలు వైద్య విద్యకు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి.
  కోర్సు కాల వ్యవధి: ఎంబీబీఎస్ కోర్సు కాల వ్యవధి ఐదున్నరేళ్లు (ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి). మొత్తం తొమ్మిది సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్ కాల పరిమితి ఆర్నెల్లు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) మార్గదర్శకాల మేరకు కరిక్యులం ఉంటుంది. ఇందులో కమ్యూనిటీ మెడిసిన్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ తదితర అంశాలుంటాయి.
  కెరీర్: ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారు యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్‌గా సేవలందించొచ్చు. ఇతర కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య విభాగాల్లో చేరొచ్చు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
 • ఎంబీబీఎస్ పూర్తయ్యాక మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చేయడం ద్వారా ఉన్నత కెరీర్ సొంతమవుతుంది. పీజీ డిగ్రీ ఇన్ జనరల్ సర్జరీ (ఎంఎస్), పీజీ డిగ్రీ ఇన్ జనరల్ మెడిసిన్ (ఎండీ) లేదా డిప్లొమా కోర్సులు చేయొచ్చు.
  వేతనాలు: పీజీ పూర్తిచేసిన వారికి ప్రారంభంలో రూ.70 వేల వరకు వేతనాలు వచ్చే అవకాశముంది. స్పెషలైజేషన్, ఆసుపత్రి లేదా వైద్య కళాశాల స్థితి, అవి ఉన్న ప్రాంతం తదితరాల ఆధారంగా వేతనాలు మారుతుంటాయి. టాప్ కార్డియాలజిస్టులు, న్యూరో సర్జన్లకు భారీ స్థాయిలో వేతనాలు ఉంటున్నాయి.
అంకితభావం, కష్టపడే తత్వం ప్రధానం
వైద్య విద్యలోకి అడుగుపెట్టాలనుకునే విద్యార్థులకు సేవా దృక్పథం అవసరం. సహనం, అంకితభావంతో సేవలందించే వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. ఎంబీబీఎస్ కోర్సు పూర్తిచేసేందుకు అపార జ్ఞాపకశక్తి, కష్టపడే తత్వం ప్రధానం. సెమిస్టర్ వారీగా సబ్జెక్టులను చదివి, మార్కులు తెచ్చుకుని ఆ తర్వాత వదిలేద్దాం అంటే కుదరదు. సముపార్జించిన జ్ఞానాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలి. థియరీ, క్లినికల్ ప్రాక్టీస్ రెండింటిలోనూ ప్రతిభ కనబరిచేందుకు కృషిచేయాలి. ఈ రోజుల్లో వైద్య విద్యలో సుస్థిర కెరీర్‌ను సంపాదించాలంటే ఎంబీబీఎస్ సరిపోదు. తప్పనిసరిగా పీజీ చేయాల్సిందే. అందువల్ల ఎంబీబీఎస్‌లో చేరిన మొదటి రోజు నుంచి విజయవంతమైన వైద్యుడిగా గుర్తింపు తెచ్చే దిశగా కృషిచేయాలి.
- డాక్టర్ ఎ.కృష్ణమూర్తి, ప్రిన్సిపాల్,
సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ.

డెంటల్ సైన్స్
ముఖంపై చిరునవ్వు చిరు ముత్యమై మెరవాలన్నా, ఇతరులతో మనస్ఫూర్తిగా నోరువిప్పి మాట కలపాలన్నా సొగసైన దంత సిరి ఉండాలి. దంత క్షయం, పళ్ల మధ్య ఖాళీలు, చిగుళ్ల సమస్యలు, దంతాలు పచ్చగా మారడం వంటివి దంత సిరికి ఎసరు పెడతాయి. ఇలా కాకుండా దంత ఆరోగ్యాన్ని సంరక్షించే పరిజ్ఞానమే డెంటల్ సైన్స్. ఇప్పుడు ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా చాలా మంది విద్యార్థులు డెంటల్ సైన్స్ కోర్సులను ఎంపిక చేసుకొని, కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నారు.
కోర్సులు: డెంటల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని బీడీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ)గా పేర్కొంటారు. 2013-14 ప్రవేశాలకు సంబంధించి మన రాష్ట్రంలో 24 కళాశాలల్లో 2,130 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా బీడీఎస్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ)/ బయో టెక్నాలజీ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. అర్హత పరీక్షకు సంబంధించిన గ్రూప్ సబ్జెక్టులన్నీ కలుపుకొని కనీసం 50 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కనీసం 40 శాతం మార్కులు ఉండాలి.
ప్రవేశ పరీక్ష: ఎంసెట్‌లో మొత్తం 160 ప్రశ్నలకు 160 మార్కులు ఉంటాయి. ఇందులో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి 40 ప్రశ్నల చొప్పున వస్తాయి. ఇంటర్మీడియెట్ గ్రూప్ సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వె యిటేజీ ఉంటుంది. ఎంసెట్ ర్యాంక్, ఇంటర్మీడియెట్ మార్కులు ఆధారంగా తుది ర్యాంక్ కేటాయిస్తారు. వీటితో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తారు.
బీడీఎస్ కోర్సు కాల వ్యవధి: నాలుగేళ్లు. ఫైనల్ బీడీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తర్వాత తప్పనిసరిగా ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌నకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థులను హౌస్ సర్జన్‌గా వ్యవహరిస్తారు. ఈ దశలో కాలేజీకి అనుబంధంగా ఉన్న లేదా నిర్దేశించిన హాస్పిటల్‌లో సీనియర్ డాక్టర్ పర్యవేక్షణలో విద్యార్థులు ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించు కుంటారు. బీడీఎస్ కరిక్యులంను డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తుంది. కరిక్యులంలో డెంటల్ అనాటమీ, ఎంబ్రియాలజీ, ఓరల్ హిస్టాలజీ, జనరల్ పాథాలజీ అండ్ మైక్రో బయాలజీ, జనరల్ అండ్ డెంటల్ ఫార్మకాలజీ, డెంటల్ మెటీరియల్స్, ఓరల్ పాథాలజీ అండ్ మైక్రో బయాలజీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ వంటి అంశాలుంటాయి.

కెరీర్ వేదికలు:
బీడీఎస్ పూర్తయిన తర్వాత కెరీర్‌ను ప్రారంభించేందుకు ఉన్న వేదికలు..
 • ప్రభుత్వ/ప్రైవేటు హాస్పిటల్స్/క్లినిక్స్.
 • మెడికల్ కాలేజీలు/ శిక్షణ సంస్థలు.
 • ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లోని మెడికల్ సర్వీసెస్.
 • పరిశోధనా సంస్థలు.
 • డాక్టర్‌గా సొంతంగా ప్రాక్టీస్ చేయవచ్చు.
ఉన్నత విద్య: బీడీఎస్ తర్వాత ఎండీఎస్ (మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ) కోర్సు చేస్తే ఉన్నత కెరీర్ అవకాశాలు చేజిక్కుతాయి. ఎంట్రన్స్ ద్వారా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సుల్లో ఓరల్ పాథాలజీ అండ్ ఓరల్ మైక్రో బయాలజీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి.

క్లినికల్ ప్రాక్టీస్ ప్రధానం
Bavitha ఎంచుకున్న కెరీర్ ఏదైనా ఆసక్తి, విశ్వాసంతో పాటు కష్టపడే తత్వం పనిచేయడం అవసరం. ముఖ్యంగా బీడీఎస్‌లో చేరాలనుకునే వారి కెరీర్ రాణింపు అనేది నైపుణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల కోర్సులో భాగంగా థియరీతో పాటు క్లినికల్ ప్రాక్టీస్‌పైనా ఎక్కువ దృష్టిపెట్టాలి. ఆధునిక జీవనశైలిలో భాగంగా మారిన ఆహారపు అలవాట్లు వల్ల వయసుతో సంబంధం లేకుండా దంత వ్యాధుల కు గురవుతున్నారు. చిన్న పట్టణాల్లో సైతం డెంటల్ సర్జన్‌ల అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అందుబాటులో కి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే ఈ రంగంలో తిరుగుండదు. వృత్తి లో భాగంగా రోగులతో బాగా మాట్లాడటం, వారిలో నమ్మకం కలిగించడం ప్రధానం కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలి.


బీఏఎంఎస్
ఆయుష్షును కాపాడి వృద్ధిచేసే వేదం ఆయుర్వేదం! ఇది భారత దేశంలో అతి పురాతన కాలం నుంచి మనుగడలో ఉన్న వైద్య శాస్త్రం. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు.. ఆధునిక వైద్యానికి లొంగని ఎన్నో మొండి వ్యాధులను సైతం నయం చేస్తాయని చెబుతారు. నిండా ప్రకృతి సిద్ధ రోగ నివారణ సద్గుణాలను ఒంటబట్టించుకున్న ఆయుర్వేదం యువత కెరీర్ ఆప్షన్ల జాబితాలో చోటుసంపాదిస్తోంది. 2003లో ఏర్పాటు చేసిన ఆయుర్వేద, యోగా అండ్ నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్) విభాగం.. దేశంలో భారతీయ వైద్య విధానాల విద్య, పరిశోధనల అభివృద్ధికి కృషిచేస్తోంది.
కోర్సులు: ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా అధికమంది విద్యార్థులను ఆకర్షిస్తున్న విభాగాల్లో ఆయుర్వేదం ఒకటి. ఆయుర్వేదంలో బ్యాచిలర్ కోర్సు బీఏఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ). ఇంటర్మీడియెట్ బైపీసీ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు బీఏఎంఎస్ కోర్సులో చేరేందుకు అర్హులు. ఈ కోర్సును రాష్ట్రంలో ఏడు కళాశాలలు (4 ప్రభుత్వ, 3 ప్రైవేటు) ఆఫర్ చేస్తున్నాయి. ఎంసెట్ ర్యాంకు, ఇంటర్మీడియెట్ గ్రూప్ సబ్జెక్టుల్లో మార్కుల ఆధారంగా తుది ర్యాంక్ కేటాయిస్తారు. దీని ఆధారంగా ఎన్టీఆర్‌హెల్త్ యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కౌన్సిలింగ్ ద్వారా సీటు కేటాయిస్తారు.
కెరీర్: ఉద్యోగాలపరంగా బీఏఎంఎస్ అభ్యర్థులకు అవకాశాలు బాగానే ఉన్నారుు. ప్రభుత్వ విభాగంలో మెడికల్ ఆఫీసర్ హోదాలో ఉద్యోగ జీవితంలో అడుగు పెట్టవచ్చు. ఆయుర్వేద ఔషధ తయూరీ సంస్థలు (డాబర్, హిమాలయ తదితర) భారీగా బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి. విదేశాల్లో హెర్బల్ మెడిసిన్‌కు డిమాండ్ బాగుండటంతో అక్కడ కూడా ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. లేదంటే సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
కెరీర్ వేదికలు: ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు; కళాశాలలు; పరిశోధన సంస్థలు; ఆయుర్వేద ఆరోగ్య కేంద్రాలు; స్పాలు; రిసార్టులు; ఫార్మాస్యూటికల్ సంస్థలు.
వేతనాలు: ప్రారంభంలో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనాలు అందుకోవచ్చు. తర్వాత అనుభవం, ఉన్నత అర్హతలతో అధిక వేతనాలను సంపాదించవచ్చు.
ఉన్నత విద్య: బీఏఎంఎస్ తర్వాత పీజీ స్థారుులో ఎండీ (ఆయుర్వేద), ఎంఎస్ (ఆయుర్వేద) కోర్సులు చేయడం ద్వారా ఉన్నత కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

ప్రముఖ సంస్థలు:
 • ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ- ఆంధ్రప్రదేశ్.
 • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద- జైపూర్.
 • బెనారస్ హిందూ యూనివర్సిటీ- వారణాసి.
 • గుజరాత్ ఆయుర్వేద యూనివర్సిటీ- గుజరాత్.
 • ఆయుర్వే అండ్ టిబియా కాలేజ్- ఢిల్లీ.
 • గవర్నమెంట్ ఆయుర్వేద కళాశాల- త్రివేండ్రం.
ఆయుర్వేదం.. అవకాశాల తరంగం
బీఏఎంఎస్ కోర్సు పూర్తిచేసిన వారికి ఆధునిక కాలంలో అవకాశాలు బాగా పెరిగాయని చెప్పొచ్చు. కోర్సు పూర్తిచేశాక సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఔషధ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే ఫార్మసీ సంస్థల్లో ఫార్మసీ సూపర్‌వైజర్‌గా, టెక్నీషియన్‌గా, అడ్వయిజర్ తదితర హోదాలతో కెరీర్‌ను ప్రారంభించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య సంస్థల్లోనూ అవకాశాలుంటాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఆయుష్ విభాగాలకు చెందిన నిపుణులను నియమించాలన్న (మూడో వైద్యునిగా) ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇది అమల్లోకి వస్తే మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఉన్నత విద్య పరంగా చూస్తే నచ్చిన స్పెషలైజేషన్‌తో ఎండీ (ఆయుర్వేద) చేయవచ్చు. ఆ తర్వాత బోధన రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ అవకాశాలు బాగుంటాయి.
డాక్టర్ ఎ.అనిల్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్,
డాక్టర్ బీఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్.

వెటర్నరీ సైన్స్
ప్రపంచంలోనే అత్యధిక పశు సంపద కలిగిన దేశంగా భారత్ గుర్తింపు సాధించింది. ప్రపంచ పశు జనాభాలో భారత్ వాటా 15 శాతం. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పశు పరిశ్రమ వాటా ఎనిమిది శాతం. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో వెటర్నరీ సైన్స్ కోర్సులను అభ్యసించిన వారికి డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయం. అంతేకాకుండా స్వయం ఉపాధి అవకాశాలు అనేకం. దీంతో యువత వెటర్నరీ కోర్సుల వైపు మొగ్గుచూపుతోంది.
కోర్సులు:వెటర్నరీ సైన్స్‌కు సంబంధించి బ్యాచిలర్ స్థాయిలో కోర్సును బీవీఎస్సీ అండ్ ఏహెచ్ (బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ )గా పేర్కొంటారు. ఇందులో చేరేందుకు అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ). కోర్సు కాల వ్యవధి: ఐదున్నరేళ్ల వరకు ఉంటుంది. రాష్ట్రంలో తిరుపతి, రాజేంద్రనగర్ (హైదరాబాద్), గన్నవరం (కృష్ణా జిల్లా), ప్రొద్దుటూరు (వైఎస్‌ఆర్ జిల్లా), కోరుట్ల (కరీంనగర్ జిల్లా)లో వెటర్నరీ కళాశాలలున్నాయి. వీటిలో తిరుపతి, రాజేంద్రనగర్, గన్నవరం వెటర్నరీ కళాశాలల్లో ఒక్కోదాంట్లో 60 చొప్పున మొత్తం 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రొద్దుటూరు, కోరుట్లలోని కళాశాలల్లో సుమారు 30 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్ ర్యాంకు, ఇంటర్మీడియెట్ మార్కులాధారంగా తుది ర్యాంకు కేటాయించి, కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
 • వెటర్నరీ విద్యా ప్రమాణాలను నిర్దేశించే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) ఏటా జాతీయ స్థాయిలో ఆలిండియా ప్రీ-వెటర్నరీ టెస్ట్(ఏఐపీవీటీ)ను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 30కి పైగా రాష్ట్రస్థాయి వెటర్నరీ(జమ్మూ-కాశ్మీర్ మినహా) కళాశాలల్లోని బీవీఎస్సీ - ఏహెచ్ కోర్సులో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు.
  కరిక్యులం: బీవీఎస్సీ కోర్సు కరిక్యులంలో వెటర్నరీ గ్రాస్ అనాటమీ, జనరల్ వెటర్నరీ బయో కెమిస్ట్రీ, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, జనరల్ వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ మైక్రో బయాలజీ, వెటర్నరీ ఇమ్యునాలజీ తదితర అంశాలుంటాయి.
  కెరీర్: బీవీఎస్సీ పూర్తిచేసి ఉద్యోగం లభించక ఖాళీగా ఉండే పరిస్థితి ఎంతమాత్రం లేదని చెప్పొచ్చు. బీవీఎస్సీ పూర్తిచేసిన వారికి పశుసంవర్థ్ధక శాఖలో, వెటర్నరీ హాస్పిటల్స్, జులాజికల్ పార్క్స్, ఇన్సూరెన్స్ సంస్థల్లో, ఫీడ్ మెషీన్ ప్లాంట్లు, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తాయి. సొంతంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. పరిశోధన సంస్థల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
 • బీవీఎస్సీ అండ్ ఏహెచ్ తర్వాత పీజీ స్థాయిలో ఎంవీఎస్సీ (మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్) కోర్సులు చేసి, ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు. ఇందులో పలు స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంవీఎస్సీని తిరుపతి, రాజేంద్రనగర్, గన్నవరంలోని వెటర్నరీ కళాశాలలు అందిస్తున్నాయి. ఈ మూడు కళాశాలల్లో కలిపి 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఆయా కాలేజీల్లో అడ్మిషన్ కల్పిస్తారు.
బీఎన్‌వైఎస్
బ్యాచిలర్ స్థాయిలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కోర్సు బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సెన్సైస్ (బీఎన్‌వైఎస్). ఇంటర్మీడియెట్ (బైపీసీ) పూర్తిచేసిన వారు దీనికి అర్హులు. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. గాంధీ నేచురోపతి మెడికల్ కాలేజ్-హైదరాబాద్ (ప్రభుత్వ), నారాయణ యోగా అండ్ నేచురోపతి మెడికల్ కాలేజ్-నెల్లూరు (ప్రైవేటు) ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
కెరీర్: కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య సంస్థల్లో అవకాశాలు పొందొచ్చు. కార్పొరేట్ ఆసుపత్రులు, వెల్‌నెస్ కేంద్రాల్లో కన్సల్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు. ఐటీ, సంబంధిత కంపెనీల్లో స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా సేవలు అందించవచ్చు. ఆతిథ్య రంగంలో స్పా మేనేజర్లు, స్పా థెరపిస్టులుగా పనిచేయొచ్చు.సొంతంగా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఫార్మసీ
భారత దేశం ఫార్మా హబ్‌గా ఎదుగుతుండటంతో పాటు నానాటికీ విస్తృతమవుతున్న
వ్యాధులు, వాటి నివారణకు సంబంధించి పరిశోధన, కొత్త మందుల తయారీ మొదలైన అంశాల్లో నిష్ణాతుల అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఫార్మసీ కోర్సులు పూర్తిచేసిన వారికి అవకాశాలు పెరుగుతున్నాయి.
ప్రపంచంలో వందకు పైగా దేశాలకు భారత్ నుంచి ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలకు ఔషధాలను విక్రయించే క్రమంలో మన దేశానికి చెందిన ఫార్మా కంపెనీలు విదేశీ కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం,ఉమ్మడిగా డ్రగ్ డిజైన్, అభివృద్ధి వంటివాటిలో పాలుపంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నిష్ణాతులైన మానవ వనరుల కోసం సంబంధిత ఫార్మా కంపెనీలు ఎదురుచూస్తున్నాయి.
కోర్సులు:బీఫార్మసీ: ఇది నాలుగేళ్ల కోర్సు. ఈ కోర్సులో చేరడానికి అర్హత: ఇంటర్మీడియెట్ (సెన్సైస్-ఎంపీసీ/బైపీసీ) లేదా డి.ఫార్మసీ. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా బీ.ఫార్మసీలో ప్రవేశం కల్పిస్తారు. 50 శాతం సీట్లను ఎంపీసీ అభ్యర్థులతో, 50 శాతం సీట్లను బైపీసీ అభ్యరులతో భర్తీ చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 278 ఫార్మసీ కళాశాలల్లో దాదాపు 32,070 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ఫార్మసీ కళాశాలలు 11. వీటిలో మొత్తం సీట్లు 510.

నాలుగేళ్ల కోర్సు: నాలుగేళ్ల బీఫార్మసీ కోర్సు మొత్తం 7 సెమిస్టర్లుగా ఉంటుంది. ప్రథమ సంవత్సరం అంతా ఒక సెమిస్టర్, మిగిలిన మూడేళ్లు ఆరు సెమిస్టర్లు ఉంటాయి. ఇండస్ట్రీ ప్రాధాన్యంగా, హాస్పిటల్స్ అవసరాలు తీర్చే విధంగా కోర్సు ఉంటుంది. బేసిక్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, అనలిటికల్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయలాజికల్ ఫార్మసీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ సంబంధిత అంశాలను బోధిస్తారు. మైక్రోస్కోప్, డ్రగ్స్ రూపకల్పన, వాటి పనితీరు తదితర అంశాలపై అధ్యయనం చేస్తారు. వీటితోపాటు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఔషధాల తయూరీ నుంచి వినియోగం వరకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. మానవ శరీర నిర్మాణంపై అవగాహన పొందేలా వ్యాధుల తీవ్రత గుర్తింపు, నివారణ మార్గాలను కనుక్కోవడంలోనూ నైపుణ్యం సాధించేలా శిక్షణ ఉంటుంది. ప్రాక్టికల్స్‌తోపాటు కోర్స్ పూర్తయ్యూక లేదా మూడో సంవత్సరం పూర్తయ్యూక రెండు నెలలు ఇంటర్న్‌షిప్ చేయూల్సి ఉంటుంది.

ఫార్మ్-డి: ఫార్మసీ విద్యకు సంబంధించి ప్రస్తుతం ఉన్న కోర్సులు పరిశ్రమ అవసరాలను తీర్చే విధంగా లేవనే భావనతో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. 2008లో ప్రవేశపెట్టిన వినూత్న కోర్సే.. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మ్.డి). ఫార్మ్.డి. కోర్సు దాదాపు ఎం.ఫార్మ్‌తో సమానమైందని చెప్పొచ్చు. ఈ కోర్సులో చేరడానికి అర్హత: ఇంటర్మీడియెట్ (సెన్సైస్-ఎంపీసీ/బైపీసీ) లేదా డి.ఫార్మసీ. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా బీ.ఫార్మసీలో ప్రవేశం కల్పిస్తారు. 50 శాతం సీట్లను ఎంపీసీ అభ్యర్థులతో, 50 శాతం సీట్లను బైపీసీ అభ్యరులతో భర్తీ చేస్తారు. ఫార్మ్-డి కోర్సు కాల వ్యవధి ఆరేళ్లు. ఇందులో థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు కూడా ప్రాధాన్యమిస్తారు. మెడికల్ కళాశాల, హాస్పిటల్‌తో అనుసంధానమై కోర్సును నిర్వహిస్తారు. డ్రగ్ ఎంతస్థాయిలో ఇవ్వాలి? డ్రగ్ పనితీరును తెలుసుకోవడంతోపాటు పరిమితికి మించి ఔషధం వినియోగించకుండా వీరు నిరంతరం పర్యవేక్షిస్తారు. వైద్యులకు, రోగికి మధ్య వారధిగా ఉంటారు. రోగికి కౌన్సెలింగ్ చేయడం, ఔషధ వినియోగ విధానం, డ్రగ్ ప్రొఫైల్ అధ్యయనం చేయడం వీరి విధులు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు క్లినికల్ థెరపీ, ఫార్మకోథెరపీ, క్లినికల్ రీసెర్చ్, కమ్యూనిటీ ఫార్మసీ వంటి కార్యకలాపాల్లో సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఫార్మ్-డిలో మన రాష్ట్రంలో దాదాపు 31 కళాశాలల్లో 930 సీట్లు మాత్రమే ఉన్నాయి.

ఉన్నత విద్య:జాతీయస్థాయిలో నైపర్ ఎంఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు ఏటా జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది. హైదరాబాద్‌లో నైపర్ ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జీప్యాట్‌ను, మన రాష్ర్టంలో ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈసెట్ ను ఏటా నిర్వహిస్తారు.

కెరీర్:కోర్సులు పూర్తిచేసినవారికి రెడ్డీస్ ల్యాబ్స్, నాట్కో, అరబిందో, గ్లాండ్ ఫార్మా వంటి కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో బోధన, పరిశోధన రంగాల్లో అవకాశాలున్నాయి. డ్రగ్ ఇన్‌స్పెక్టర్, అనలిస్ట్, కెమికల్ ఎగ్జామినర్ వంటి హోదాల్లో ఉపాధి లభిస్తుంది. దేశ, విదేశాల్లో కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటు, ఉత్పత్తులను విక్రయించడానికి ఆయా దేశాల లెసైన్సుల కోసం కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంతో నిపుణుల అవసరం భవిష్యత్తులో భారీగా పెరగబోతోంది. సొంతంగా మందుల దుకాణం కూడా ఏర్పాటు చేయొచ్చు.

బీహెచ్‌ఎంఎస్
‘‘ఐదేళ్లుగా సైనస్ సమస్యతో బాధపడుతున్నాను. సర్జరీ కూడా చేయించుకున్నాను.. అయినా పూర్తిస్థాయిలో ఉపశమనం కనిపించలేదు!’’ ఆరోగ్యానికి సంబంధించి తరచూ ఇలాంటి నిట్టూర్పులు వినిపిస్తుంటాయి.. వీటికి సమాధానంగా చాలామంది ఇచ్చే సమాధానం.. ‘‘హోమియోపతి మందులను ఉపయోగించి చూడు.. ఫలితం ఉంటుంది!’’.
వ్యాధి లక్షణాలతో సరిపోలిన నివారణోపాయాలతో (సారూప్యతా సిద్ధాంతం) రోగాన్ని నయం చేసే వైద్య విధానమే హోమియోపతి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం ప్రపంచంలో రెండో అతిపెద్ద వైద్య విధానంగా హోమియోపతి గుర్తింపు పొందింది. 2017 నాటికి హోమియోపతి మార్కెట్ విలువ రూ.52 వేల కోట్లకు చేరుకోనుంది. ఇంతగా జోరుమీదున్న హోమియోపతిని కెరీర్‌గా ఎంపిక చేసుకుంటున్న యువత పెరుగుతోంది.

కోర్సులు:హోమియోపతిలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సును బీహెచ్‌ఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ)గా పేర్కొంటారు. ఇంటర్మీడియెట్ (బైపీసీ) లేదా తత్సమాన అర్హత ఉన్నవారు కోర్సులో చేరేందుకు అర్హులు. కోర్సు కాల వ్యవధి ఐదున్నరేళ్లు (ఏడాది ఇంటర్న్‌షిప్‌తో కలిపి). రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ, రెండు ప్రైవేటు కళాశాలలు బీహెచ్‌ఎంఎస్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఎంసెట్ మెడికల్ పరీక్ష ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంసెట్ ర్యాంకు, ఇంటర్ గ్రూపు సబ్జెక్టుల మార్కులు ఆధారంగా తుది ర్యాంకు కేటాయిస్తారు. దీని ఆధారంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా సీటు కేటాయిస్తారు.

కెరీర్:బీహెచ్‌ఎంఎస్ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు; మెడికల్ కళాశాలలు; స్వచ్ఛంద సంస్థల వైద్య విభాగాలు; పరిశోధన సంస్థలు, ఔషధ సంస్థలలో హోమియోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ మెడికల్ కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్ వంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేయవచ్చు.
 • బీహెచ్‌ఎంఎస్ తర్వాత పీజీ స్థాయిలో ఎండీ (హోమియోపతి) కోర్సులు చేసి, ఉన్నత కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.
వేతనాలు: బీహెచ్‌ఎంఎస్ చేసిన వారికి ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయి. తర్వాత అనుభవం, అర్హతల ద్వారా రూ.50 వేల వరకు వేతనాలు అందుకోవచ్చు.

దేశ, విదేశాల్లో ఉజ్వల అవకాశాలు
Bavitha
బీహెచ్‌ఎంఎస్ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రస్తుతం దేశ, విదేశాల్లో ఉజ్వల భవిష్యత్తును అందించే అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అల్లోపతి వైద్య విధానంతో పోలిస్తే తక్కువ ఖర్చుతో మందులు లభిస్తుండటం, సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం వల్ల హోమియోపతికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. కోర్సు పూర్తిచేసిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వైద్య విభాగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ‘ఆయుష్’ నియామకాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులు సైతం హోమియోపతి విభాగాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది.
Published date : 24 Apr 2014 04:44PM

Photo Stories