Skip to main content

తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2017-18

సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధిస్తోందని.. మార్చి 15న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2017-18 స్పష్టం చేసింది.
‘బంగారు తెలంగాణ‘ సాధన కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింతగా మెరుగుపరిచేందుకు పలు రంగాల్లో అమలు చేస్తున్న కీలక సంస్కరణలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొంది. 2017-18 ఆర్థిక సంవత్సరం ధరలలో చూసుకుంటే వృద్ధి రేటు 14.1 శాతంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని సర్వే వివరించింది.



10.4% పెరిగిన జీడీపీ
రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీడీపీ) గత ఏడాది కన్నా 10.4 శాతం పెరిగింది. 2016-17లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.4,97,513 కోట్లు కాగా, 2017-18లో ఇది రూ.5,49,479 కోట్లుగా నమోదైంది. జాతీయ స్థూల ఉత్పత్తితో పోల్చినా తెలంగాణ స్థూల ఉత్పత్తి సగటు ఎక్కువగా నమోదవుతోందని గణాంకాలు చెపుతున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తి ఈ ఏడాది రూ.1,30,03,897 కోట్లు ఉంటుందని అంచనా కాగా, అది గత ఏడాది కన్నా 6.6 శాతమే ఎక్కువ. అదే రాష్ట్ర స్థూల ఉత్పత్తి మాత్రం 10.4 శాతం పెరిగింది. ఇక జాతీయ స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్రం గత ఏడాది 4.02 శాతం వాటా నమోదు చేయగా, ఈ ఏడాది అది 4.37 శాతానికి పెరిగింది.

నిలకడగా వృద్ధి రేటు
ఆర్థిక రంగ అభివృద్ధి విషయంలో రాష్ట్రంలో 9 శాతం వృద్ధి నమోదైనట్టు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు లాంటి కారణాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు మందగించినా, అందుకు భిన్నంగా రాష్ట్ర వృద్ధి రేటు నిలకడగా ఉంది. గత రెండేళ్లలోనూ రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు నమోదు చేసింది. రాష్ట్ర స్థూల విలువ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.6,61,052 కోట్లని సర్వే పేర్కొంది. అందులో రూ.97,885 కోట్లతో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 14.8 శాతం కాగా, రూ.4,32,520 కోట్లతో సేవా రంగం 65.4 శాతం వాటా సాధించింది. పరిశ్రమల రంగం రూ.1,30,647 కోట్లతో 19.8 వాటా నమోదు చేసుకుంది.
Download TS Socio Economic Outlook 2018 Document

తలసరి ఆదాయం రూ.1,75,534
రాష్ట్రాభివృద్ధికి కీలక ఆర్థిక ప్రాతిపదిక అయిన తలసరి ఆదాయం రాష్ట్రంలో పెరుగుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,75,534గా నమోదైంది. 2016-17తో పోలిస్తే ఇది 13.4 శాతం ఎక్కువ. గత ఏడాది తలసరి ఆదాయం రూ.1,54,734 మాత్రమే. జాతీయ తలసరి ఆదాయంకన్నా రాష్ట్ర తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉంది. జాతీయ తలసరి ఆదాయం రూ.1,12,764 మాత్రమే. రాష్ట్ర తలసరి ఆదాయం.. జాతీయ తలసరి ఆదాయం కన్నా రూ.62,770 ఎక్కువగా నమోదైంది.
  • తలసరి ఆదాయం విషయంలో హైదరాబాద్ జిల్లా కన్నా రంగారెడ్డి జిల్లా ప్రజలు ఆధిక్యత కనబరుస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.3,68,747 కాగా, హైదరాబాద్ తలసరి ఆదాయం రూ.3,15,745గా నమోదైంది. ఇక, రాష్ట్రంలోని 31 జిల్లాల్లో నాగర్‌కర్నూలు జిల్లా రూ.82,694 తలసరి ఆదాయంతో వెనుకబడి ఉంది. లక్షలోపు తలసరి ఆదాయం కలిగిన జిల్లాల్లో వనపర్తి, మహబూబ్‌నగర్, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, వరంగల్ అర్బన్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ ఉన్నాయి. వరంగల్ అర్బన్ కన్నా ఎక్కువగా వరంగల్ రూరల్ జిల్లాలో రూ.1,03,914 తలసరి ఆదాయం నమోదైంది.
కొత్త జిల్లాలవారీగా తలసరి ఆదాయం(రూ.ల్లో)
ఆదిలాబాద్ 93,588
ఆసిఫాబాద్ 1,03,822
మంచిర్యాల 1,04,891
నిర్మల్ 98,129
నిజామాబాద్ 1,04,868
జగిత్యాల 91,885
పెద్దపల్లి 1,29,723
భూపాలపల్లి 1,15,774
కొత్తగూడెం 1,26,084
మహబూబాబాద్ 1,07,684
వరంగల్ రూరల్ 1,03,914
వరంగల్ అర్బన్ 91,333
కరీంనగర్ 1,20,173
సిరిసిల్ల 99,687
కామారెడ్డి 86,608
సంగారెడ్డి 1,64,698
మెదక్ 1,10,345
సిద్దిపేట 1,28,701
జనగామ 1,00,216
యాదాద్రి 1,31,749
మేడ్చల్ 1,81,104
హైదరాబాద్ 3,15,745
రంగారెడ్డి 3,68,747
వికారాబాద్ 87,891
మహబూబ్‌నగర్ 86,237
జోగుళాంబ 1,01,977
నాగర్‌కర్నూలు 82,694
నల్లగొండ 1,04,660
సూర్యాపేట 1,13,348
ఖమ్మం 1,08,133
వనపర్తి 94,774

తగ్గిన ఆహార ధాన్యాల ఉత్పత్తి
వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఈ ఏడాది 9.8 శాతం వృద్ధి నమోదైనప్పటికీ ఆహార ధాన్యాల ఉత్పత్తి, పంటల సాగులో మాత్రం గత ఏడాది కన్నా రాష్ట్రం వెనకబడింది. 2017-18 సంవత్సరానికి గానూ రెండో ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 31.87 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అయితే, గత ఏడాది 34.39 లక్షల హెక్టార్లలో సాగు కావడం గమనార్హం. అంటే గత ఏడాదితో పోలిస్తే పంటల సాగు 7.33 శాతం తగ్గిందన్నమాట. ఇక, ఆహార ధాన్యాల దిగుబడి విషయంలోనూ తగ్గుదల కనిపిస్తోంది. గత సంవత్సరం మొత్తం 101.29 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయితే, ఈ ఏడాది 95.01 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుందని సామాజిక ఆర్థిక సర్వే అంచనా వేసింది.

Budget 18-19

పంటల సాగులో నల్లగొండ ఫస్ట్
సాగుకు యోగ్యమైన భూముల్లో పంటల సాగు విషయంలో నల్లగొండ జిల్లా ముందుందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ జిల్లాలో ఉన్న 4.2 లక్షల హెక్టార్ల సాగు యోగ్య భూమిలో 3.6 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. పంటల సాగులో వరంగల్ అర్బన్ 0.6 లక్షల హెక్టార్లతో చివరి స్థానంలో ఉంది. అయితే, సాగుకు యోగ్యమైన భూముల్లో పంటలు సాగయ్యే విస్తీర్ణ రాష్ట్ర సగటు 1.2 లక్షల హెకార్లు కాగా, రాష్ట్రంలోని 15 జిల్లాలు ఈ సగటు కన్నా వెనుకబడి ఉన్నాయి.
  • ఇక, మాంసకృత్తులుండే ఆహార ఉత్పత్తుల విషయంలోనూ రాష్ట్ర పరిస్థితి బాగానే ఉంది. 2016-17 సంవత్సరంలో మొత్తం 4,681 టన్నుల పాల ఉత్పత్తి అయితే 2017-18లో అక్టోబర్ నాటికే 2,894 టన్నుల పాల ఉత్పత్తి జరిగిందని సామాజిక ఆర్థిక సర్వే చెబుతోంది. గుడ్ల విషయానికి వస్తే గత ఆర్థిక సంవత్సరంలో 1,181.86 కోట్ల గుడ్లు ఉత్పత్తి కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 2017 అక్టోబర్ నాటికి 718.31 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యాయి. 2016-17లో 591 టన్నుల మాంసం ఉత్పత్తి అయితే, 2017 అక్టోబర్ నాటికి 379 టన్నులు వచ్చింది.
పంట రుణాలు68%
రుణాల విషయానికి వస్తే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం ప్రకారం 2017-18 సంవత్సరంలో రూ.98,542.7 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.38,298 కోట్లు(39శాతం) ఇవ్వాలని నిర్ణయించింది. అందులో 2017 సెప్టెంబర్ 30 నాటికి 68 శాతం పంట రుణాలిచ్చినట్టు సామాజిక ఆర్థిక సర్వే వివరించింది.
కాగా.. వ్యవసాయ రుణాల విషయంలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రూ.3,610 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌లో రూ.3,126 కోట్లు, నల్లగొండలో రూ.3,071 కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇక, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో అత్యల్పంగా రూ.453 కోట్లు మాత్రమే వ్యవసాయ రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో పత్తి పంట
సాగు విస్తీర్ణం ఈ ఏడాది భారీగా పెరిగింది. 2016-17లో 14.09 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగు కాగా, 2017-18లో 19.03 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేపట్టారు. అంటే గత ఏడాది కన్నా 35.06 శాతం ఎక్కువగా పత్తి వైపు రైతులు మొగ్గు చూపారు. అయితే గత ఏడాది 34.44 లక్షల బేళ్ల పత్తి దిగుబడి రాగా, ఈ ఏడాది 43.32 లక్షల బేళ్లు దిగుబడి వస్తుందని అంచనా.
  • రాష్ట్ర స్థూల ఉత్పత్తి 10.4 శాతం కాగా, అందులో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 6.9 శాతం, పరిశ్రమల రంగంలో 5.6 శాతం, సేవల రంగం 11.1 శాతంగా నమోదైంది.
ఆయుః ప్రమాణం జాతీయ సగటు కన్నా ఎక్కువ
రాష్ట్రంలోని ప్రజల ఆయుఃప్రమాణం జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉంది. హెల్త్ ఆఫ్ ది నేషన్‌‌స స్టేట్స్-2017 ప్రకారం తెలంగాణలోని పురుషుల సగటు ఆయుష్షు 69.4 ఏళ్లు కాగా, జాతీయ స్థాయి సగటు 66.9 ఏళ్లు మాత్రమే. ఇక, మహిళల విషయానికి వస్తే జాతీయ స్థాయి సగటు 70.3 ఏళ్లు కాగా, తెలంగాణలో 73.2 ఏళ్లుగా నమోదైంది. ఆయుఃప్రమాణంలో దేశంలోని 21 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణకు 3వ ర్యాంకు దక్కింది.
  • కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసూతీల సంఖ్య పెరిగింది. జనవరి 2017లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో కలిపి 17,543 ప్రసూతులు నమోదయ్యాయి. ఆ నెలలో రాష్ట్రంలో జరిగిన అన్ని డెలివరీల్లో ఇది 33 శాతం. అదే డిసెంబర్ 2017లో ఆ సంఖ్య 26,089కి పెరిగింది. మొత్తం డెలివరీల్లో ఇది 49 శాతం.
ఆర్థిక సర్వేలోని ఇతర ముఖ్య వివరాలు
  • రాష్ట్ర జనాభాలో 11% మందికి(38.87లక్షలు) ఆసరా పెన్షన్ల ద్వారా లబ్ధి కలుగుతోంది.
  • 2017- 18 ఆర్థిక సర్వే ప్రకారం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగింది. 2015-16లో రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,51,549 మంది చేరగా, 2016-17లో 1,63,870 మంది, 2017-18లో 1,67,752 మంది చేరారు.
  • రాష్ట్రానికి ఏటేటా ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతోందని సామాజిక ఆర్థిక సర్వే-2018 వెల్లడించింది. 2015-16లో రాష్ట్రం నుంచి రూ.35,444 కోట్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతులు జరగ్గా, 2016-17లో అది రూ.40,332 కోట్లకు పెరిగింది. ఐటీ ఆధారిత సేవా సంస్థల స్థాపన చురుకుగా సాగడంతో సాఫ్ట్‌వేర్, ఐటీ సేవల ఎగుమతుల విలువ రూ.85,740 కోట్లకు చేరింది.
  • రాష్ట్రంలో టీఎస్‌ఐపాస్ విధానం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 6,117 పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు వచ్చాయని సామాజిక ఆర్థిక సర్వే చెబుతోంది. ఈ పరిశ్రమల ద్వారా రూ.1.18 లక్షల కోట్ల పెట్టుబడులు సమకూరడంతో పాటు 4.43 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
  • సరుకుల ఎగుమతుల విషయంలో ఈసారి కొన్ని రంగాలు వెనకబడ్డాయి. 2015-16తో పోలిస్తే 2016-17లో ఆర్గానిక్ కెమికల్స్, ఎలక్ట్రానిక్ మెషినరీ, ఎయిర్‌క్రాఫ్ట్, టూల్స్ తయారీ పరిశ్రమలు వెనుకంజలో ఉన్నాయి. అయితే ముత్యాలు, లోహాల తయారీ పరిశ్రమ మాత్రం 185 శాతం వృద్ధి సాధించింది.
  • గనులు, ఖనిజాల శాఖ ఆదాయంలో వృద్ధి నమోదైంది. గత ఏడాది కన్నా 17 శాతం వృద్ధితో ఈ ఏడాది (డిసెంబర్ 2017 వరకు)లో రూ.1,158 కోట్లు ఆర్జించింది.
  • నాలుగు దశల్లో జరిగిన మిషన్ కాకతీయ పనుల్లో ఇప్పటివరకు 37,224 చెరువులను పునరుద్ధరించే ప్రతిపాదనలు రాగా, 26,302 చెరువుల పునరుద్ధరణ పూర్తయింది. ఈ చెరువుల ద్వారా 20.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరింది. మిషన్ కాకతీయ పనులపై నాబ్కాన్ సంస్థ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో సర్వే చేయగా రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న 90 శాతం కుటుంబాలకు లబ్ధి కలిగిందని తేలింది. రైతుల వ్యవసాయ ఆదాయంలో ప్రస్తుత ధరల ప్రకారం 78.5 శాతం వృద్ధి కనిపించిందని, 9.02 మిల్లీమీటర్ల మేర భూగర్భజలాలు పెరిగినట్టు తేలింది.
  • రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మంజూరు చేయబడిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు 2, 72,763. ఇందులో 2,40,153 ఇళ్లకు పరిపాలనా అనుమతులు లభించాయి. వాటిలో 1,38,795 ఇళ్లను గ్రౌండింగ్ చేయగా, ఇప్పటివరకు 5,824 ఇళ్లు పూర్తయ్యాయి.
  • రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా బాగానే ఉంది. 2014లో స్వదేశీ, విదేశీ పర్యాటకులు కలిపి 7,24,74,284 మంది రాష్ట్రానికి రాగా, 2015లో 9,46,42,994 మంది వచ్చారు. ఇక, 2016లో 9,53,27,400 మంది పర్యాటకులు రాగా, 2017 అక్టోబర్ నాటికి 5,34,51,396 మంది వచ్చారు.
  • తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి హైదరాబాద్‌లో 66 జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించారు. 2015లో 19, 2016లో 28, 2017లో 19 కార్యక్రమాలు జరిగాయి.
  • నైరుతీ రుతుపవనాల వల్ల రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 715.8 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా.. 2017లో 645.6 మిల్లీమీటర్లు నమోదైంది. ఈశాన్య రుతుపవనాల విషయానికి వస్తే సాధారణ వర్షపాతం 127 మిల్లీమీటర్లు కాగా.. కొంచెం ఎక్కువగా 129.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
  • రాష్ట్రంలో మొత్తం ఉన్న ఎల్‌పీజీ కనెక్షన్లు 89,41,311. ఇందులో హైదరాబాద్‌లోనే 13,59,542 ఉండగా, అత్యల్పంగా మహబూబాబాద్‌లో 64,621 కనెక్షన్లు ఉన్నాయి.
Published date : 16 Mar 2018 05:27PM

Photo Stories