Skip to main content

కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2014-15

రూ. 17,63,214 కోట్లతో ప్రతిపాదన
ఫిబ్రవరి 17న లోక్‌సభలో ప్రవేశపెట్టిన చిదంబరం

2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ఫిబ్రవరి 17న (సోమవారం) పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వార్షిక వ్యయం రూ.17,63,214 కోట్ల అంచనాతో ప్రవేశపెట్టిన ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఇటు మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునేందుకు.. అటు తయారీ రంగానికీ కొంత ఊతమిచ్చేందుకు ప్రయత్నించారు విత్త మంత్రి. అంతా ఊహించినట్లే విధానపరంగా కీలకమైన నిర్ణయాలేమీ లేవు. అయితే.. పదేళ్ల యూపీఏ పాలనలో చివరి బడ్జెట్ కావటంతో.. యూపీఏ పాలన విజయాల చిట్టా చదివారు. ఈ తరుణంలో బడ్జెట్ సమగ్ర స్వరూపం మీకోసం..

2014-15 మధ్యంతర బడ్జెట్ హైలైట్స్
  • మొత్తం బడ్జెట్ వ్యయం రూ. 17,63,214 కోట్లు
  • ప్రణాళికా వ్యయం రూ. 5,55,322 కోట్లు
  • ప్రణాళికేతర వ్యయం రూ. 12,07,892కోట్లు. ఇందులో ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీ భారం రూ. 2,46,397కోట్లు.
  • రక్షణ బడ్జెట్ రూ. 2.24 లక్షల కోట్లు(10% పెంపు).
ప్రధాన పథకాలకు శాఖలవారీగా కేటాయింపులు:
Current Affirs
  1. గ్రామీణాభివృద్ధికి రూ. 82,200కోట్లు
  2. మానవ వనరుల అభివృద్ధికి రూ. 67,398కోట్లు
  3. ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ. 33,725కోట్లు
  4. మహిళా, శిశు సంక్షేమానికి రూ. 21,000కోట్లు
  5. తాగునీరు, పారిశుద్ధ్యానికి రూ. 15,260కోట్లు
  6. ఎస్సీ ఉప ప్రణాళికకు రూ. 48,638కోట్లు
  7. ఎస్టీ ఉప ప్రణాళికకు రూ. 30,726కోట్లు
  8. రైల్వేలకు రూ. 29 వేల కోట్లు
  9. కేంద్ర సాయుధ బలగాల ఆధునీకరణకు 11 వేల కోట్లు
  10. ప్రభుత్వ రంగ బ్యాంకులకు - రూ. 11,200కోట్లు
  11. ఎస్సీ వ్యాపార వేత్తలను ప్రోత్సహించేందుకు వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు
  12. ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పు లేదు. రూ. కోటి వార్షికాదాయమున్న సంపన్న వర్గాలపై 10 శాతం, రూ. 10 కోట్ల టర్నోవరున్న సంస్థలపై 5 శాతం సర్‌చార్జీ కొనసాగుతుంది.
  13. సాయుధ బలగాలకు ‘ఒక ర్యాంకు, ఒకే పెన్షన్’కింద2014-15లో రూ.500 కోట్లు
  14. నిర్మాణరంగానికి అన్ని ఎగుమతులపైనా పన్నుల రద్దు.
2014-15లో లక్ష్యాలు
  • రూ.8 లక్షల కోట్ల వ్యవసాయ రుణాల జారీ
  • ప్రభుత్వ నికర రుణాలు రూ.4.57 లక్షల కోట్లు
  • 50 వేల మెగావాట్ల సంప్రదాయ విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం
  • విదేశీ మారక నిల్వలను మరో 1,500 కోట్ల డాలర్ల మేరకు పెంచడం
  • వచ్చే దశాబ్ద కాలంలో 10 కోట్ల ఉద్యోగాల కల్పన
2013-14లో సాధించినవి...
Current Affirs
  • ద్రవ్య లోటు 2013-14లో 4.6 శాతం, 2014-15 అంచనా 4.1 శాతం
  • 2013-14లో ఎగుమతుల అంచనా 32,600 కోట్ల డాలర్లు.
  • ప్రస్తుత ఖాతా లోటు 4,500 కోట్ల డాలర్లు.
  • 2013-14 ఆర్థిక వృద్ధి అంచనా 4.9 శాతం.
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ది 11వ స్థానం.
  • బలహీన వర్గాలకు 2013-14లో రూ.66,500 కోట్ల రుణాలు.
  • రూ. 6.6 లక్షల కోట్ల విలువైన 296 ప్రాజెక్టులకు జనవరి చివరి నాటికి ఆమోదం.
  • 2013-14లో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కేంద్రానికి రూ. 88,188 కోట్ల డివిడెండ్. ఇది బడ్జెటరీ అంచనాల కంటే రూ.14,000 కోట్లు అదనం.
  • 2.1 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులకు రూ. 3,370 కోట్ల నగదు బదిలీ
  • 57 కోట్ల ఆధార్ కార్డుల జారీ.
  • ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు రూ. 1,200 కోట్లు అదనపు సాయం.
  • రూ.1,000 కోట్ల నిర్భయ నిధి, అదనంగా మరో రూ.1,000 కోట్లు.
వ్యవసాయ రంగం
2014-15 బడ్జెట్‌లో వ్యవసాయ రుణాల పరిమితిని రూ.8 లక్షల కోట్లకు పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతులు 2.80 లక్షల కోట్లకు చేరుకోనున్నాయి.
  • యూపీఏ ప్రవేశపెట్టిన ఆహార చట్టం ద్వారా దేశ జనాభాలో 67 శాతం మందికి ఆహార ధాన్యాలను చౌకగా పొందేలా చట్టపరమైన హక్కు కల్పించారు.
  • వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఈ ఏడాది 4.6%కి చేరుకునే అవకాశం.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల పరిమితిని రూ.7 లక్షల కోట్లుగా నిర్దేశించగా రూ.7.35 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా.
  • వ్యవసాయ రుణాలపై వడ్డీ తగ్గింపు పథకం వచ్చే ఏడాది కూడా కొనసాగింపు. 2006-07లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు రూ.23,924 కోట్లను రుణాలుగా మంజూరు చేశారు.
  • పదేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 213 మిలియన్ టన్నుల నుంచి 263 మిలియన్ టన్నులకు పెంపు. 2012-13లో 255 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది.
  • 2012-13లో రూ. 2.54 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి.
పారిశ్రామిక రంగం
  • చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు, స్కూటర్లు, వాణిజ్య వాహనాలపై ఎక్సైజ్ సుంకాలను 12 శాతం నుంచి 8 శాతానికి త గ్గించారు. అలాగే, ఎస్‌యూవీ (Sports Utility Vehicles) పైనా ఎక్సైజ్ సుంకాన్ని 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు.
  • యంత్రాలు, యంత్ర పరికరాల ఉత్పత్తికీ ఊతమిచ్చేలా.. ఎక్సైజ్ సుంకాన్ని 12 నుంచి 10 శాతానికి తగ్గించారు.
  • సబ్బులు, రసాయనాల్లో ఉపయోగించే నూనెలపై కస్టమ్స్ సుంకాన్ని 7.5 శాతానికి పరిమితం చేశారు.
  • పెద్ద వాహనాలపై సుంకం 27 శాతం నుంచి 24 శాతానికి, మధ్యతరహా కార్లపై పన్ను 24 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపు వచ్చే జూన్ 20 వరకు వర్తిస్తుంది.
తగ్గింపు ప్రయోజనం...
విభాగం ప్రస్తుత ఎక్సైజ్ సుంకం ప్రతిపాదిత సుంకం తగ్గింపు వాహన రేట్ల తగ్గుదల (అంచనా)
ద్విచక్రవాహనాలు 12% 8% 4% రూ.1,500-2,000
చిన్న కార్లు 12% 8% 4% రూ.1,500-2,000
మిడ్‌ సైజ్ కార్లు 24% 20% 4% రూ.32,000-48,000
పెద్ద కార్లు 27% 24% 3% రూ.40,000 పైనే...
ఎస్‌యూవీలు 30% 24% 6% రూ.48,000 పైనే...
వాణిజ్య వాహనాలు 12% 8% 4% రూ.48,000-80,000
  • సియామ్ గణాంకాల ప్రకారం 2013లో దేశీ కార్ల అమ్మకాలు 9.59% క్షీణించి 18,07,011కు పరిమితమయ్యాయి. 2012లో అమ్మకాల సంఖ్య 19,98,703.
  • గతేడాది జనవరితో పోలిస్తే 7.59% క్షీణించి 1,60,289కి తగ్గాయి.
కన్జూమర్ గూడ్స్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 10 శాతానికి తగ్గింపు
ఫ్రీజ్‌లు, టీవీలు, ఏసీలు ఇతరత్రా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించనున్నారు.
ధరలు తగ్గే వస్తువులు...
బియ్యం, సబ్బులు
మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు
చిన్నకార్లు, ఎస్‌యూవీలు
వాణిజ్య వాహనాలు
దేశంలో తయూరైన మొబైల్ ఫోన్లు
టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు
కంప్యూటర్లు, ప్రింటర్లు, కీబోర్డులు, మౌజ్‌లు, హార్డ్ డిస్క్‌లు, స్కానర్లు
వ్యాక్యూమ్ క్లీనర్లు, డిష్ వాషర్లు, హెరుుర్ డయ్యర్‌లు
వాటర్ కూలర్లు, టార్చ్‌లైట్లు, డిజిటల్ కెమెరాలు
ఎలక్ట్రిక్ ఐరన్స్, ఎంపీ 3..డీవీడీ ప్లేయర్లు
బ్లడ్ బ్యాంకుల చార్జీలు

విద్యా రంగం
ఉన్నత విద్య-
రూ. 16,200 కోట్లు
పాఠశాల విద్య-రూ. 51,198 కోట్లు
  • విద్యారంగానికి 2014-15 బడ్జెట్‌లో రూ. 67,398 కోట్లు కేటాయించారు. ఇవి కిందటేడాదితో పోలిస్తే దాదాపు 9 శాతం అదనం.
  • అలాగే, 2009 మార్చి 31కి ముందు తీసుకున్న విద్యా రుణాల మీద వడ్డీపై మారటోరియం విధించారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 9 లక్షల మంది విద్యార్థులకు సుమారు రూ. 2,600 కోట్ల మేర లబ్ధి చేకూర్చనుంది. ఈ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కెనరా బ్యాంకుకు బదిలీ చేయనున్నారు.
మౌలిక రంగంపై ప్రత్యేక దృష్టి
వివిధ కారణాలతో పలు ప్రాజెక్ట్‌లు నిలిచిపోయిన పరిస్థితుల్లో పెట్టుబడులపై క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా 296 ప్రాజెక్ట్‌లకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ల అంచనా విలువ రూ. 6,60,000 కోట్లుగా పేర్కొన్నారు.
  • 2004లో 51,511 కిలోమీటర్లుగా ఉన్న గ్రామీణ రోడ్ నెట్‌వర్క్ ప్రస్తుతానికి 3,89,578 కి.మీ.కు పెరిగిందని వివరించారు.
సబ్సిడీలకు 2.46 లక్షల కోట్లు!
  • 2014-15కుగాను సబ్సిడీకు ఏకంగా రూ.2.46 లక్షల కోట్లు కేటాయించారు. దీనిలో జాతీయ ఆహార భద్రత చట్టం అమలుకు రూ. 1.15 లక్షల కోట్లు కేటాయించారు.
ముఖ్యాంశాలివీ..
  • ఇంధన సబ్సిడీకి రూ.65 వేల కోట్లు కేటాయించారు.
  • ఆహార సబ్సిడీకి 2013-14 సవరించిన అంచనాల్లో రూ. 92 వేల కోట్లు కేటాయించారు. అయితే ఆ నిధులకు మరో రూ.23 వేల కోట్లు అదనంగా ఇస్తూ 2014-14కు మొత్తం రూ.1.15 లక్షల కోట్లు కేటాయించారు.
  • ఎరువుల సబ్సిడీకి రూ. 67,970 కోట్లు కేటాయించారు. ఇందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియాకు రూ.12,300 కోట్లు, దేశీయ యూరియా సబ్సిడీకి రూ.31 వేల కోట్లు, ఫాస్పేట్, పొటాషియం వంటి (డీ-కంట్రోల్డ్ ఫెర్టిలైజర్స్) ఎరువులకు రూ.24,670 కోట్లు కేటాయించారు.
  • బియ్యం లోడింగ్ దశ నుంచి గిడ్డంగుల్లో నిల్వ చేసే దశ వరకూ వసూలు చేస్తున్న సేవా పన్నును మినహాయించనున్నారు.
‘రక్షణ’ శాఖకు రూ. 2.24 లక్షల కోట్లు
  • 2014-15 మధ్యంతర బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయింపులు 10 శాతం పెరిగాయి. గతేడాది రూ.2.03 లక్షల కోట్లున్న కేటాయింపులను తాజాగా రూ. 2.24 లక్షల కోట్లకు పెంచారు.
  • మాజీ సైనికోద్యోగులకు ఊరట కలిగించే విధంగా ఒక హోదాలో ఉన్నవారందరికీ ఒకే మొత్తం పింఛను వర్తింపచేసే అంశాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇందుకోసం రూ. 500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా దాదాపుగా 30 లక్షల మంది మాజీ సైనికులకు లబ్ధి చేకూరనుంది.
హోంశాఖకు 59,387 కోట్లు
గతంతో పోలిస్తే ఈ సారి బడ్జెట్‌లో కేంద్ర హోంశాఖకు 16 శాతం అదనంగా రూ. 59,387 కోట్లు కేటాయించారు. భద్రతాపరమైన వ్యయానికి రూ. 789.08 కోట్లు, పోలీసు దళాల ఆధునీకరణకు రూ. 600 కోట్లు, ఢిల్లీలో మహిళల భద్రతకు రూ. 2 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

సీబీఐకి రూ.520 కోట్లు
మధ్యంతర బడ్జెట్‌లో సీబీఐకి ప్రభుత్వం రూ. 520.56 కోట్లు కేటాయించింది. 2013-14 బడ్జెట్‌లో ఇది రూ.443 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 17 శాతం అధికం.

రాష్ట్రాలకు 3.38 లక్షల కోట్లు
కేంద్రం సహాయమందించే పథకాలు (సీఎస్‌ఎస్)లకు రాష్ట్ర ప్రణాళిక కింద బడ్జెట్‌లో రూ. 3,38,562 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది సవరించిన అంచనాల కంటే రూ. 1,19,039 కోట్లు అధికంగా ఉంది. గత బడ్జెట్‌లో ఈ పథకాలకు రూ. 1,36,254 కోట్లు కేటాయించారు.
ప్రస్తుతం 17 ప్రధాన పథకాల కింద అమలవుతున్న 122 స్కీములను 66కు కుదించాలని పేర్కొన్నారు. దీని ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ. 34,000 కోట్లు, సర్వశిక్ష అభియాన్‌కు రూ. 27,635 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి రూ. 13,152 కోట్లు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కు రూ.4,965 కోట్లు కేటాయించారు. అలాగే ఐసీడీఎస్‌కు కేంద్ర సహాయం కింద రూ. 18,631కోట్లు, గ్రామీణ గృహనిర్మాణానికి రూ. 16,000 కోట్లు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకు రూ. 13,000కోట్లు అందించనున్నారు.

ఎయిర్ ఇండియాకు రూ. 5,500 కోట్లు
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడి కింద రూ. 5,500 కోట్లను ఎయిర్ ఇండియా పొందనుంది.
  • దీంతో పౌర విమానయాన శాఖ ప్రణాళిక కేటాయింపులు రూ. 5,720 కోట్లకు చేరాయి. ప్రణాళికేతర వ్యయం రూ. 657.98 కోట్లుగా అంచనా.
  • ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ)కు బడ్జెటరీ మద్దతు కింద రూ. 74.7 కోట్లు కేటాయించారు.
  • డెరైక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు రూ. 50 కోట్లు కేటాయించారు.
  • బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కోసం రూ. 40 కోట్లు, సోనియాగాంధీ నియోజకవర్గమైన రాయబరేలిలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ కోసం రూ. 5.10 కోట్లు కేటాయించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 11,200 కోట్లు
తాజా మూలధనం సమకూర్చడంలో భాగంగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 11,200 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇవ్వాలని తాజా బడ్జెట్ ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) ప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 14,000 కోట్ల సమకూర్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు 2013 మార్చిలో రూ. 1.83 లక్షల కోట్లు ఉండగా, సెప్టెంబర్ నాటికి ఈ పరిమాణం రూ.2.36 లక్షల కోట్లకు పెరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.

Current Affirs రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటాలో 2000 కోట్లు కోత
మనకు కేంద్ర పన్నుల వాటాలో 2000 కోట్లు కోత విధించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 22,131.68 కోట్లుగా ఉండనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా 26,970 కోట్లు.

4 అల్ట్రా మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టులు
‘జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సౌర పథకం’ కింద ఒక్కోటీ 500 మెగావాట్లకుపైగా సామర్థ్యం కలిగిన నాలుగు భారీ స్థాయి సౌర విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించనున్నట్లు తాజా బడ్జెట్‌లో పేర్కొన్నారు. పదేళ్ల కిందట 1,12,700 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 2.34 లక్షల మెగావాట్లుగా ఉంది. ఈ బడ్జెట్‌లో విద్యుత్ ప్రాజెక్టులకు రూ.1,520.39 కోట్లు సహా విద్యుత్ శాఖకు రూ. 9,768.50 కోట్లు కేటాయించారు.

శాస్త్ర పరిశోధనలకు ప్రత్యేక ఆర్థిక సంస్థ..
దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక ఆర్థిక సంస్థను ఏర్పాటు చేయనున్నారు. పోటీ పద్ధతిన పరిశోధన ప్రాజెక్టులను ఎంపిక చేసి.. వాటికి ఈ సంస్థ ద్వారా నిధులు అందజేస్తామని తెలిపారు. ఈ ఆర్థిక సంస్థకు ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ ఖజానాకు 88 వేల కోట్ల ‘డివిడెండ్’
ప్రభుత్వ ఖజానాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు, ఇతర ప్రభుత్వరంగ సంస్థల నుంచి డివిడెండ్ రూపంలో రూ. 88,188 వేల కోట్లు సమకూరనున్నాయి. ఇది గత ఏడాది అంచనా కంటే రూ.14,320 కోట్లు ఎక్కువ.

‘నిర్భయ నిధి’కి 1,000 కోట్లు
మహిళల రక్షణ, సాధికారతకు ఉద్దేశించిన ‘నిర్భయ నిధి’కి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. వెయ్యి కోట్లు అదనంగా కేటాయించారు. అలాగే ఈ నిధికి గత ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన రూ. 1,000 కోట్ల నిధులను మురిగిపోనివి (నాన్-లాప్సబుల్)గా ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన యువతి (నిర్భయ) జ్ఞాపకార్థం గత ఏడాది బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లతో ఈ ‘నిర్భయ నిధి’ని ప్రకటించిన సంగతి విదితమే.

అందరికీ ఆధార్
ఇప్పటివరకూ 57 కోట్ల మందికి విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేశారు. మిగతా ప్రజలకు కూడా ఆధార్ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోనున్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌తో అనుసంధానం చేసుకున్న 2.1 కోట్ల గ్యాస్ వినియోగదారుల ఖాతాలకు సుమారు రూ. 3,370 కోట్లను సబ్సిడీ రూపంలో బదలాయించారు.

లోక్‌పాల్‌కు రూ. 2 కోట్లు
దేశంలో అవినీతి నిరోధానికి ఉద్దేశించిన లోక్‌పాల్‌కు కేవలం రూ. 2 కోట్లనే కేటాయించింది. (లోక్‌పాల్ బిల్లుకు 2014 జనవరి 1న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.) సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు ప్రణాళికేతర పద్దుల కింద రూ.20.35 కోట్లను కేటాయించారు.

స్పెక్ట్రం వేలంతో వచ్చే ఏడాది రూ. 39వేల కోట్ల లక్ష్యం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెలికం స్పెక్ట్రం వేలంతో పాటు సంబంధిత ఫీజులు మొదలైన వాటి రూపంలో రూ. 38,954 కోట్లు సమీకరించాలని ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కేంద్రం నిర్దేశించుకుంది. ఇటీవలే ముగిసిన 2జీ స్పెక్ట్రం వేలం ద్వారా రూ. 61,162 కోట్ల మేర బిడ్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 18,296 కోట్లు రాగలవని అంచనా.

ఎస్‌టీటీ(Securities Transaction Tax) లక్ష్యం పెంపు
ఎస్‌టీటీ ను 2004లో ప్రవేశపెట్టారు. క్యాపిటల్ మార్కెట్లో ఈక్విటీల కొనుగోలు లేదా అమ్మకపు లావాదేవీపై విధించే పన్ను ఇది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎస్‌టీటీ వసూలు లక్ష్యం రూ. 6,000 కోట్లు. ఈ ఏడాది (2013-14) లక్ష్యం రూ. 6,720 కోట్లుకాగా, తాజాగా రూ. 5,497 కోట్లకు తగ్గించారు. దీంతో పోలిస్తే వచ్చే ఏడాది లక్ష్యం 9% అధికం. గడిచిన ఏడాది (2012-13)లో ఈ వసూళ్లు రూ. 4,997 కోట్లు.

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగేందుకు చిదంబరం ప్రణాళిక
మరో మూడు దశాబ్దాల్లో... అంటే 2043 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించేందుకు దోహదపడే 10 సూత్రాల ప్రణాళికను ప్రకటించారు. ‘స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పరిమాణపరంగా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంది. అమెరికా, చైనాల తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌దే అవుతుంది.
Published date : 20 Feb 2014 05:40PM

Photo Stories