Skip to main content

కేంద్ర బడ్జెట్ 2019-20(ఓట్ ఆన్ అకౌంట్)

సార్వత్రిక ఎన్నికలకు ముందు రైతులు, వేతన జీవులుసహా దాదాపు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయుష్ గోయల్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 27,84,200 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఐదు లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి పూర్తిగా పన్ను రిబేట్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతోపాటు ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6వేలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
అసంఘటిత రంగంలోని కార్మికులకు పదవీ విరమణ తర్వాత ఏటా రూ.3వేల పింఛను ఇచ్చే ప్రతిపాదనలను కూడా బడ్జెట్‌లో పేర్కొన్నారు.

మొత్తం బడ్జెట్

రూ. 27,84,200 కోట్లు

రెవెన్యూ వసూళ్లు

రూ. 19,77,693 కోట్లు

మూలధన వసూళ్లు

రూ. 8,06,507 కోట్లు

మొత్తం వసూళ్లు

రూ. 27,84,200 కోట్లు


ఇదీ బడ్జెట్ స్వరూపం.. (రూ.కోట్లలో)

అంశాలు

2017-18 వాస్తవ కేటాయింపులు

2018-19 బడ్జెట్ అంచనాలు

2018-19 సవరించిన అంచనాలు

2019-20 బడ్జెట్ అంచనాలు

1. రెవెన్యూ వసూళ్లు

14,35,233

17,25,738

17,29,682

19,77,693

2. పన్ను ఆదాయం

12,42,488

14,80,649

14,84,406

17,05,046

3. పన్నేతర ఆదాయం

1,92,745

24,50,89

2,45,276

2,72,647

4. మూలధన వసూళ్లు

7,06,742

7,16,475

7,27,553

8,06,507

5. రుణాల రికవరీ

15,633

12,199

13,155

12,508

6. ఇతర వసూళ్లు

1,00,045

80,000

80,000

90,000

7. అప్పులు,ఇతరత్రావసూళ్లు

5,91,064

6,24,276

6,34,398

7,03,999

8.మొత్తం వసూళ్లు (1+4)

21,41,975

24,42,213

24,57,235

27,84,200

9. మొత్తం వ్యయం (10+13)

21,41,975

24,42,213

24,57,235

27,84,200

10. రెవెన్యూ ఖాతా

18,78,835

21,41,772

21,40,612

24,47,907

11. వడ్డీ చెల్లింపులు

5,28,952

5,75,795

5,87,570

6,65,061

12. మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు

1,91,034

1,95,345

2,00,300

2,00,740

13. మూలధన ఖాతా

2,63,140

3,00,441

3,16,623

3,36,293

14. రెవెన్యూ లోటు (10-1)

4,43,602

4,16,034

4,10,930

4,70,214

15. నికర రెవెన్యూలోటు (14-12)

2,52,568

2,20,689

2,10,630

2,69,474

16. ద్రవ్యలోటు 9-(1+5+6)

5,91,064

6,24,276

6,34,398

7,03,999

17. ప్రాథమిక లోటు (16-11)

62,112

48,481

46,828

38,938


రూపాయి రాక (పైసల్లో)

1 రుణాలు సంబంధిత ఇతర మార్గాలు

19

2 కార్పొరేట్ పన్ను

21

3 ఆదాయపు పన్ను

17

4 కస్టమ్స్

4

5 కేంద్ర ఎక్సైజ్ సుంకాలు

7

6 వస్తు, సేవల పన్ను

21

7 పన్ను యేతర ఆదాయం

8

8 డివిడెండ్ తరహా మూలధన ఆదాయాలు

3


రూపాయి పోక(పైసల్లో)
1 కేంద్ర ప్రాయోజిత పథకాలు 9
2 కేంద్ర పథకాలు 12
3 వడ్డీ చెల్లింపులు 18
4 రక్షణ వ్యయాలు 8
5 సబ్సిడీలు 9
6 ఫైనాన్స్ కమిషన్, ఇతర బదలాయింపులు 8
7 పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా 23
8 పెన్షన్లు 5
9 ఇతర వ్యయాలు 8

బడ్జెట్ ముఖ్యాంశాలు
  • ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం
  • 12 కోట్ల మంది రైతులకు లబ్ది కలిగించేలా సరికొత్త సంక్షేమ పథకం.
  • 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులకు ప్రతి నెలా రూ. 3000 పింఛన్
  • ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు.
  • స్టాండర్డ్ డిడక్షన్ రూ. 40 వేల నుంచి 50 వేలకు పెంపు
  • గోకుల్ మిషన్ కు ఈ సంవత్సరం రూ. 750 కోట్ల కేటాయింపులు
  • పెన్షన్ లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు
  • కొత్త పెన్షన్ విధానంలో నెలకు రూ. 3 వేలు
  • రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్ల కేటాయింపు- జాతీయ విద్యా మిషన్ కు రూ. 38,572 కోట్లు.
  • సీబీఐకి రూ.777 కోట్లు
  • చైల్డ్ డెవలప్ మెంట్ స్కీమ్ కు రూ. 27,584 కోట్లు.
  • ఎస్సీ, ఎస్టీల అభ్యన్నతికి రూ. 76 వేల కోట్లు.
  • పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితి రూ. 10 వేల నుంచి రూ. 40 వేలకు పెంపు.
  • కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ. 3.27 లక్షల కోట్లు.
  • ప్రణాళికా వ్యయం రూ. 3.36 లక్షల కోట్లు.
  • గత సంవత్సరంతో పోలిస్తే 13.3 శాతం పెరిగిన ప్రభుత్వ ఖర్చు.
  • గో ఉత్పాదకతను పెంచడం కోసం రాష్టీయ్ర కామ్ ధేన్ ఆయోగ్ పథకం.
  • పెన్షన్ లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు.
  • స్టాక్స్, బాండ్స్ వంటి ఆర్థిక సాధనాల లావాదేవీలపై స్టాంప్ డ్యూటీ రేటు వర్తింపు
  • ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పేరిట మరో సరికొత్త స్కీమ్.
  • గ్రాట్యుటీ లిమిట్ రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంపు.
  • బ్యాంకుల రుణాలు రూ. 35,984 కోట్లకు పెరుగుదల.
  • డీవోపీటీకి 241 కోట్ల నిధులు.
  • కిసాన్ క్రెడిట్ కార్డులపై 2 శాతం వడ్డీ రాయితీ.
  • ఉజ్వల యోజన కింద 8 కోట్ల ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు.
  • ముద్ర యోజనలో రూ. 7.23 లక్షల కోట్ల రుణాలు.
  • రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్ల కేటాయింపు.
  • కేంద్ర స్థాయిలో ప్రత్యేక మత్స్య శాఖ ఏర్పాటు.
  • పశు సంవర్థక, మత్స్య పరిశ్రమలకు 2 శాతం వడ్డీ రాయితీ.
  • ప్రధానమంత్రి కౌశల్ యూజన ద్వారా కోటి మంది యువతకు లబ్ది.
  • రైల్వేలకు బడ్జెటరీ సపోర్ట్ కింద రూ. 64,587 కోట్లు.
  • మిజోరం, మేఘాలయా రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం.
  • సినిమా పరిశ్రమ 12 శాతం జీఎస్టీ పరిధిలోకి.
  • సినిమా షూటింగ్ అనుమతులకు సింగిల్ విండో.
  • శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాలకు మరిన్ని కేటాయింపులు.
  • అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, ఆర్థిక లావాదేవీలను డిజిటల్ మాధ్యమంగానే సాగేలా చర్యలు.
  • 2025 నాటికి ప్రతి దేశ పౌరుడికీ ఆరోగ్య బీమా ఉండేలా చర్యలు
  • ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపులో అతి త్వరలోనే నిర్ణయం.
  • అన్ని కేటగిరీల అంగన్‌వాడీలు, ఆశా యోజన కార్మికుల గౌరవ వేతనాలను 50 శాతం పెంపు.
  • అవినీతి నిరోధక అంబుడ్స్మెన్ లోక్‌పాల్‌కు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు రూ.35.5 కోట్ల కేటాయింపు.
  • అమ్ముడు పోకుండా ఉన్న గృహాలపై (ఇన్వెంటరీ) పన్ను మినహాయింపును రెండేళ్ల వరకు పొడిగింపు.
  • జీఎస్‌టీ తగ్గింపు కోసం మంత్రుల బృందం ఏర్పాటు.
  • ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్‌‌సకు రూ.3,900 కోట్లు.
  • 2019-20లో ఎగుమతి ప్రోత్సాహక స్కీములకు రూ.4,115 కోట్లు.
లాభం ఎవరికి.. నష్టం ఎవరికి?
రైతులకు ఆర్థిక సాయం, ఉద్యోగులకు ఆదాయపు పన్ను పరిమితి పెంపు, అసంఘటిత రంగ కార్మిమకులకు పింఛన్ వంటివి ఇందులో బడ్జెట్‌లో ముఖ్యమైనవి. బడ్జెట్‌ ప్రతిపాదనల వల్ల కొన్ని వర్గాలు లబ్ధి పొందుతాయని, మరికొన్ని నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

 

లాభపడేది..
 బడ్జెట్‌లో ప్రకటించిన రైతు సాయం, పింఛను పథకాలను ప్రధానమంత్రి పేరుతో రూపొందించారు. దీనివల్ల ప్రధాని నరేంద్ర మోదీ పరపతి ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంది.
 
రైతులు
ప్రధానమంత్రి సమ్మాన్ యోజన పేరుతో రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున నేరుగా వారి ఖాతాల్లోకే బదిలీ చేస్తారు. మూడు విడతలుగా ఈ సాయం అందిస్తారు. ఈ పథకంతో దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం కలుగనుంది. ఎన్నికలకు ముందే వీరి ఖాతాల్లో మొదటి విడత రూ.2,000 సాయం జమ కానుంది.
 
పన్ను చెల్లింపుదారులు
ఆదాయపు పన్ను(ఐటీ) పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు పన్ను చెల్లించనవసరం లేదు. రూ.6.5 లక్షల వార్షికాదాయం ఉన్నవారు కూడా ప్రావిడెంట్‌ ఫండ్, ఈక్విటీలలో పెట్టుబడులు పెడితే పన్ను పోటు నుంచి తప్పించుకోవచ్చు. దీనివల్ల 3 కోట్ల మంది ప్రయోజనం పొందుతారని అంచనా.
 
గ్రామీణ భారతం
పశు సంరక్షణ, మత్స్య రంగాలకు కేటాయింపులు పెంచడం, చిన్న, సన్నకారు వ్యాపారులకు వడ్డీ రాయితీ ఇవ్వడం వల్ల సంబంధిత కంపెనీలు గ్రామాలకు మళ్లే అవకాశం ఉంది. తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.
 
కార్మికులు
అసంఘటిత కార్మికులకు పింఛను పథకం వల్ల వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల మంది లాభం పొందుతారని కేంద్రం అంచనా వేస్తోంది. రూ.15,000 లోపు నెలవారీ ఆదాయం గల కార్మిమకులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.3 వేల చొప్పున పింఛను ఇవ్వనున్నట్టు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది.
 
రియల్‌ ఎస్టేట్‌
గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చే చర్యలను బడ్జెట్‌లో పొందుపరచడంతో బాంబే స్టాక్‌ ఎక్ఛ్సేంజ్‌ సూచిక పైకెగిరింది. దేశంలో ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు సమకూరుస్తామని పీయూష్‌ గోయల్‌ హామీ ఇచ్చారు. ఇంటి అద్దెపై వడ్డీ పరిమితిని కూడా పెంచారు. ఆటోమొబైల్‌ రంగం కూడా లబ్ధి పొందనుంది. గోయల్‌ ప్రసంగం చేస్తుండగానే ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ ఇండెక్స్‌ 5.3 శాతం పెరిగింది.
 
నష్టపోయేది...
బాండ్‌ హోల్డర్లు
 ఈసారి ద్రవ్యలోటు 3.4 శాతం వరకు ఉంటుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. దీనివల్ల మన క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గే అవకాశం ఉంది. పైగా బడ్జెట్‌లో ఆదాయం పెంపునకు కొత్త పథకాలేమీ లేవని ప్రధాని మోదీ చెప్పారు. దీనివల్ల వివిధ రకాల బాండ్లు కొనేవారికి పెద్దగా లాభం ఉండదు.
 
వ్యవసాయ కూలీలు/కౌలు రైతులు
 మోదీ ప్రకటించిన రైతు సాయం భూయజమానులకే తప్ప కౌలు రైతులకు అందదు. దేశంలోని పంటలు సాగుచేస్తున్న వారిలో చాలామందికి సొంత భూమి లేదు. కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు.
 
రక్షణ రంగం
 గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే పెంచారు. ఫలితంగా రక్షణ శాఖ ఆధునికీకరణ కష్టమవుతుంది.

ఆదాయపు పన్ను పరిమితి పెంపు
ఏటా ఐదులక్షల్లోపు ఆదాయం ఉన్న మూడుకోట్ల మంది వేతనజీవులు, పింఛనర్లు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, చిరు వ్యాపారులను టాక్స్ చెల్లించే అవసరం లేకుండా ఆదాయపన్ను పరిమితిని పెంచారు. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ రూ.13వేల వరకు లబ్ధిచేకూరనుంది. ఈ రిబేటు పరిమితిని పెంచడం వల్ల 3 కోట్ల మంది ఉద్యోగులకు రూ.18,500 కోట్ల మేర పన్ను భారం తగ్గుతుందని గోయల్ ప్రకటించారు. అంతేకాదు సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.5 లక్షల మినహాయింపు, ఇంటి రుణానికి చెల్లించే వడ్డీ, ఆరోగ్య బీమా ప్రీమియం వంటి ఇతర మినహాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే రూ.9 లక్షల వార్షికాదాయం ఉన్న వారూ పన్ను కట్టక్కర్లేదు. స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా రూ.40 వేల నుంచి రూ.50వేలకు పెంచడం ద్వారా రూ.2,080 నుంచి రూ.3,588 వరకు మేలు (ఆదాయ స్థాయిల ఆధారంగా) జరగనుంది.

Budget 19-20సన్నకారు రైతులపై దృష్టి
దేశవ్యాప్తంగా 5 ఎకరాలకంటే తక్కువ భూములున్న 12కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఈ రైతుల బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా ఏటా రూ.6వేలను (నాలుగు నెలలకోసారి 3 దఫాలుగా రూ.2వేల చొప్పున) జమచేయనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా రూ.75వేల కోట్ల భారం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈ ఏడాది కోసం రూ.20వేల కోట్లను విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల ద్వారా నష్టపోయే రైతులకు 2% వడ్డీ ప్రభుత్వ సాయంగా అందిచేందుకు కూడా కేంద్రం ముందుకొచ్చింది. అలాగే రుణాలను సకాలంలో చెల్లించేవారికి 3 శాతం అధికంగా అందించనుంది.

ప్రధానమంత్రి శ్రమ-యోగి మాన్‌ధన్ పథకం
అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. నెలకు రూ.15,000 దాకా వేతనం పొందుతున్న వారికి ప్రత్యేక పింఛన్ పథకాన్ని ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రధానమంత్రి శ్రమ-యోగి మాన్‌ధన్(పీఎంఎస్‌వైఎం) పేరిట అమలు చేసే ఈ పథకంలో కార్మికులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.3,000 చొప్పున పింఛన్ అందజేస్తారు. ఇందుకోసం కార్మికులు, ప్రభుత్వం తమ వంతు వాటాగా నెలకు రూ.100 చొప్పున పింఛన్ ఖాతాలో జమ చేయాల్సి ఉం టుంది. ‘‘భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 50 శాతం అసంఘటిత రంగంలోని కార్మికుల శ్రమ నుంచే వస్తోంది.

రెండో ఇంటికీ ‘క్యాపిటల్’ గెయిన్స్
ఏదైనా ఇంటిని విక్రయించినపుడు వచ్చిన దీర్ఘకాలిక మూలధన పన్ను లాభాలను రెండు ఇళ్లకు వర్తింప చేస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం ఏదైనా ఒక ఇంటిని విక్రయించినపుడు దానిపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను చెల్లించాలి.

పెన్షన్‌దారులకు ఊరట
పోస్టాఫీసులు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వాటిపై వచ్చే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ (మూలం వద్ద ఆదాయ పన్ను) పరిమితిని 3 రెట్లు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పస్తుతం ఏడాదిలో వడ్డీ రూపంలో వచ్చే మొత్తం రూ.10,000 దాటితే టీడీఎస్ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.40,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఇంటి అద్దెల రూపంలో వసూలు చేసే మొత్తంపై కూడా టీడీఎస్ పరిమితిని పెంచారు. ఇప్పటి వరకు ఇంటద్దెల రూపంలో వచ్చే ఆదాయం ఏడాదికి రూ.1.80 లక్షలు దాటితే (నెలకు రూ.15వేలు) టీడీఎస్ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.2.40 లక్షలకు (నెలకు రూ.20 వేలకు) పెంచారు.

ట్యాక్స్ పరిధిలోకి తెచ్చిన నల్లధనం 1.30 లక్షల కోట్లు
‘‘నల్లధన నియంత్రణ చట్టం, పరారీలో ఉన్న నేరస్తుల చట్టం, డీమోనిటైజేషన్ వంటి నిర్ణయాలు రూ.1,30,000 కోట్లను పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. రూ.50,000 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం. ఈ కాలంలోనే రూ.6,900 కోట్ల మేర బినామీ ఆస్తులు, రూ.1,600 కోట్ల మేర విదేశీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం. 3,38,000 షెల్ కంపెనీలను గుర్తించి రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతోపాటు ఆ కంపెనీల డెరైక్టర్లను డిస్‌క్వాలిఫై చేశాం’’ అని మధ్యంతర బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి చెప్పారు.

Budget 19-20విద్యారంగానికి రూ. 93,847 కోట్లు
విద్యారంగానికి 2019-20 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.93,847.64 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్ కంటే 10 శాతం అధికం. ఈ బడ్జెట్‌లో ఉన్నత విద్యకు రూ.37,461.01 కోట్లు, పాఠశాల విద్యకు రూ. 56,386.63 కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ.85,010 కోట్లు విద్యారంగానికి కేటాయించారు. వైద్య సంస్థలతోపాటు ప్రధాన విద్యాసంస్థల్లో పరిశోధనల రంగంలో పెట్టుబడులు, సంబంధిత మౌలిక వసతుల కోసం ‘రివైటలైజింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్స్ ఇన్ ఎడ్యుకేషన్ (రైజ్)’అనే కొత్త పథకాన్ని తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇందులో 2022నాటికల్లా రూ. లక్ష కోట్లు పెట్టుబడిగా పెడతారు.

కొత్తగా ఎస్పీఏలు..
‘స్కూల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ)’పేరుతో రెండు పూర్తిస్థాయి సంస్థలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. దీనికి అదనంగా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో 18 ఎస్పీఏలను స్వయంప్రతిపత్తి గల సంస్థలుగా ఏర్పాటుచేస్తారు. దీనికోసం ఐఐటీ/ఎన్‌ఐటీల డెరైక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ప్రతిపాదనలను సమర్పించాలని గోయల్ కోరారు.
ఈసారి ప్రభుత్వం పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.608.87 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్‌లో రూ.350.23 కోట్లుగా ఉంది.
విద్యలో నాణ్యత పెరగాలంటే సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకెళ్లాలని, ‘బ్లాక్‌బోర్డు’నుంచి ‘డిజిటల్ బోర్డుకు’మారాలని చెప్పారు. టీచర్లు అధునాతన సాంకేతికత ఆధారంగా పరిష్కారాలు సాధించేందుకు, వారికి డిజిటల్ సౌకర్యాలు కల్పించేందుకు ‘దిక్షా’ను అభివృద్ధి చేశామన్నారు.

షూటింగ్ కష్టాలకు తెర
సినిమా షూటింగ్‌లకు అనుమతుల జారీని సరళతరం చేసేందుకు సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ప్రకటించారు. పైరసీని అరికట్టేందుకు యాంటి క్యామ్‌కార్డింగ్ నిబంధనలు తెస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో చిత్రీకరణ జరిపే విదేశీ సినిమాలకు మాత్రమే సింగిల్ విండో అనుమతుల జారీ విధానం ఉండగా ఇప్పుడు భారతీయ సినిమాలకు కూడా వర్తింపచేస్తున్నట్లు గోయల్ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.

విదేశాంగశాఖకు రూ.16 వేల కోట్లు
మధ్యంతర బడ్జెట్‌లో విదేశాంగ శాఖకు రూ.16వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.వెయి్య కోట్లు ఎక్కువ. గత బడ్జెట్‌లో విదేశాలకు అందించిన సాయం రూ.5,545 కోట్లు కాగా ఈసారి రూ.6,447 కోట్లకు ప్రభుత్వం పెంచింది. మాల్దీవులకు సాయం రూ.125 కోట్ల నుంచి రూ.575 కోట్లకు పెరిగింది. భూటాన్‌కు సాయం గత ఏడాది రూ.2,650 కోట్లు కాగా ఈసారి రూ.2,615 కోట్లకు తగ్గించింది. అఫ్గానిస్తాన్‌కు రూ.325 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.175 కోట్లు, శ్రీలంకకు రూ.150 కోట్లు, మంగోలియాకు రూ.5 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. నేపాల్‌కు రూ.700 కోట్లు కేటాయించారు.

మార్పు కోసం పది లక్ష్యాలు
బడ్జెట్‌ని ప్రవేశ పెడుతూ ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ రాబోయే పది ఏళ్లలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థకి తాత్కాలిక బడ్జెట్‌తో పునాదివేశారు. ఇది తాత్కాలికం కాదని ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పుకిది నాంది అని ప్రకటించారు. పది లక్ష్యాలతో దారిద్య్రం, పోషకాహార లోపం, నిరక్షరాస్యత, అపరిశుభ్రత లాంటి రుగ్మతలను రూపుమాపి సరికొత్త భారతాన్ని నిర్మించడం, ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రగతిపథంలో మున్ముందుకు సాగడమే ఈ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తెలిపారు.

1 మౌలిక సదుపాయాల మదుపు
ప్రజా జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రోడ్లు, రైల్వే, సీపోర్టు, విమానాశ్రయాల అభివృద్ధికి బాటలు వేయడం. దీనికోసం అధికంగా నిధులు కేటాయించింది. గ్రామసడక్ యోజనకింద రూ. 19 వేల కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించింది.

2 డిజిటల్ ఇండియా
సరికొత్త ఆవిష్కరణలతో, నూతన కంపెనీల స్థాపన ద్వారా యువతకు ఉపాధికల్పన. దేశంలో లక్ష గ్రామాలను డిజిటల్ విలేజెస్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికల రూపకల్పన.

3 హరిత భారతం
ఇంధన అవసరాలకు విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ విద్యుత్‌తో నడిచే వాహనాలపై దృష్టి పెట్టి పర్యావరణానికి మేలు చేయడంతో హరిత భారత నిర్మాణానికి బాటలు వేసుకోవడం.

4 గ్రామీణ భారతానికి దన్ను
గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వడం. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించి గ్రామీణ భారతాన్ని పారిశ్రామికాభివృద్ధి దిశగా పరుగులు పెట్టించడం.

5 నదుల ప్రక్షాళన
మానవాళికి ప్రధానాధారమైన జలవనరులను కాపాడుకోవడానికీ, భారత ప్రజలందరికీ పరిశుభ్రమైన, రక్షిత మంచినీటిని అందుబాటులోకి తేవడానికి నదులను ప్రక్షాళన చేయడం.

6 సముద్రాలను జయిద్దాం
రాబోయే పదేళ్లలో సముద్రతీర ప్రాంతాలను అభివృద్ధి పరచడం. సముద్ర ఆధారిత ప్రాజెక్టుల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడం. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవడం.

7 అంతరిక్షంలోకి దూసుకెళ్లడం
అంతరిక్ష రంగానికి అత్యధిక ప్రాధాన్యతినివ్వడం. అందులో భాగంగానే బడ్జెట్ కేటాయింపుల్లో ఈ రంగానికి భారీగా నిధుల కేటాయింపు. 2020 కల్లా భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం.

8 పౌష్టికాహారం
వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఆహారభద్రత అనే దీర్ఘకాలిక లక్ష్యానికి మార్గనిర్దేశనం చేయడం. ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఆహారాన్ని పండించుకోవడం ద్వారా స్వయం సమృద్ధిని సాధించడం.

9 ఆరోగ్యానికి అందలం
ప్రజల ఆరోగ్యానికి అత్యున్నత స్థానాన్ని కల్పించడం. అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో మారుమూల గ్రామ ప్రజలతో సహా సర్వజనానికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవడం.

10 సుపరిపాలన
ప్రజాజీవితంలో ప్రభుత్వ యంత్రాంగం జోక్యం సాధ్యమైనంత వరకూ తగ్గించి, ప్రజలందరికీ సుపరిపాలనా ప్రయోజనాలందించడం, సత్వర స్పందన, బాధ్యతాయుత, స్నేహపూరిత అధికార యంత్రాంగం, ఇ-గవర్నెన్స్కు సోపానం వేయడం.

గోకుల్ మిషన్‌కు నిధుల పెంపు..
రైతుల కష్టాలు తొలగించడానికి మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి వివరిస్తూ.. మట్టి నాణ్యతా కార్డులు, నాణ్యమైన విత్తనాలు, నీటి పారుదల పథకాలు, ఎరువుల కొరత లేకుండా చూడడం వంటివాటి గురించి వివరించారు. పశుసంవర్థక శాఖ, మత్స్యకార రంగాలకు కూడా గణనీయమైన మద్దతు అవసరమని మంత్రి గోయల్ పేర్కొన్నారు. ఆ రంగాల ప్రాధాన్యతను గుర్తించినందునే ఈ ఆర్థిక సంవత్సరంలో ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’కు నిధులను రూ.750 కోట్లకు పెంచినట్లు గోయల్ తెలిపారు.

కొత్తగా ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’
కొత్తగా ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆవుల ఉత్పాదకతను పెంచడం, గో వనరుల వృద్ధికి అవసరమైన జన్యుపరమైన ప్రయోగాలను విస్తరించడం వంటి పనులను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. గో సంరక్షణ కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయించడం కూడా ఈ వ్యవస్థ విధుల్లో భాగమే. మత్స్యకారుల అభివృద్ధిపై ప్రత్యేకంగా కేంద్రీకరించడం కోసం ఫిషరీస్‌కి ప్రత్యేకంగా ఒక డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు గోయల్ వెల్లడించారు. అత్యధికంగా మత్స్య సంపదను ఉత్పత్తి చేసే దేశాలలో రెండో అతి పెద్ద దేశం భారతదేశమేనని, ప్రపంచ ఉత్పత్తిలో భారత్ వాటా 6.3శాతమని మంత్రి వివరించారు.

Budget 19-20ఆరోగ్యం.. ఆయుష్మాన్!
ఆరోగ్య రంగానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.61,398 కోట్లను కేటాయించారు. అందులో రూ.6,400 కోట్లను ఆయుష్మాన్ ప్రధానమంత్రి జనారోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్)కు ప్రత్యేకించారు. గత ఏడాది కన్నా ఈసారి ఆరోగ్య రంగానికి 16 శాతం అధికంగా కేటాయింపులు జరపడం గమనార్హం.
ఆరోగ్య రంగం... ఇతర విశేషాలు..
  • జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం)లో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్‌సెంటర్ల ఏర్పాటుకు రూ.250 కోట్ల కేటాయింపు.
  • జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాల ఏర్పాటు నిమిత్తం రూ.1,350.01 కోట్ల కేటాయింపు.
  • ఈ పథకం కింద 2022 నాటికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఉప ఆరోగ్య కేంద్రాల్ని హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతారు. రక్తపోటు, డయాబెటిస్, కేన్సర్, వృద్ధాప్య సంబంధ వ్యాధులకు ఈ కేంద్రాల్లో చికిత్స అందిస్తారు.
  • జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) పథకానికి రూ.31,745 కోట్లు కేటాయించారు.
  • ఎన్‌హెచ్‌ఎంలో అంతర్భాగమైన రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన కు రూ. 156 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం గతేడాది కన్నా రూ.1,844 కోట్లు తక్కువ కావడం గమనార్హం.
  • ఎయిడ్స్, అసురక్షిత లైంగిక వ్యాధుల నివారణ కార్యక్రమానికి రూ.2,500 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం రూ.400 కోట్లు అధికం.
  • ఎయిమ్స్‌కు రూ.3,599.65 కోట్లు కేటాయించారు.
  • జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమానికి కేటాయింపులను రూ.50 కోట్ల నుంచి రూ.40 కోట్లకు తగ్గించారు.
  • కేన్సర్, డయాబెటిస్, హృద్రోగ సంబంధ వ్యాధుల నివారణ, నియంత్రణ కార్యక్రమానికి కేటాయింపులను రూ.295 కోట్ల నుంచి రూ.175 కోట్లకు తగ్గించారు.
  • టెర్షరీ కేర్(ప్రత్యేక సంరక్షణ, చికిత్సలు) కార్యక్రమాలకు కేటాయింపులను రూ.750 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గించారు.
  • నర్సింగ్ సేవల ఆధునీకరణకు రూ.64 కోట్లు, ఫార్మసీ స్కూల్స్, కళాశాలల బలోపేతానికి రూ.5 కోట్లు, జిల్లా ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలల(పీజీ సీట్లు) ఆధునీకరణకు రూ.800 కోట్లు కేటాయించారు.
  • ప్రభుత్వ మెడికల్ కళాశాలలు(డిగ్రీ సీట్లు), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి రూ.1,361 కోట్ల కేటాయింపు. కొత్త వైద్య కళాశాలల స్థాపనకు రూ.2 వేల కోట్లు, రాష్ట్రాల్లో ప్రభుత్వ పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు రూ.20 కోట్లు కేటాయించారు.
స్త్రీ, శిశు.. సంక్షేమానికి 20 శాతం అధిక నిధులు
స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. తాజా బడ్జెట్లో ఈ శాఖకు రూ. 2,9164.90 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ. 24758.62 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం అధికం. రాబోయే ఐదేళ్లకు చేపట్టాల్సిన పనుల గురించి రోడ్ మ్యాప్ తయారు చేస్తామని స్త్రీశిశు సంక్షేమమంత్రి మనేకా గాంధీ చెప్పారు. దేశవ్యాప్తంగా స్త్రీలు, పిల్లల కోసం ఏకీకృత కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రధాన కేటాయింపులు
  • ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకానికి కేటాయింపులు రూ. 1,200 కోట్ల నుంచి రూ. 2,500 కోట్లకు పెంపు.
  • ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలు, బాలింతలకు రూ. 6,000 సాయం.
  • జాతీయ పౌష్టికాహార మిషన్(ఎన్‌ఎన్‌ఎం) ద్వారా పదికోట్ల మందికి ప్రయోజనం. ఈ పథకానికి రూ. 3,400 కోట్ల కేటాయింపు.
  • శిశు అభివృద్ధి సేవలకు కేటాయింపులు రూ. 925 కోట్ల నుంచి రూ. 1500కు పెంపుదల.
  • బేటీ బచావ్, బేటీ పడావో పథకానికి రూ. 200 కోట్ల నుంచి రూ. 280 కోట్ల కేటాయింపుల పెంపుదల.
  • అంగన్‌వాడీ సేవలకు రూ. 19,834.37 కోట్ల కేటాయింపులు.
  • నేషనల్ క్రెచ్ స్కీమ్‌కు రూ. 30 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు కేటాయింపులు పెంచారు.
  • వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పథకానికి కేటాయింపులు రూ. 52 కోట్ల నుంచి రూ. 165 కోట్లకు పెంపు.
  • మహిళా శక్తి కేంద్రాల పథకానికి కేటాయింపులు రూ. 115 నుంచి రూ. 150 కోట్లకు పెంచారు.
  • ఉజ్వల(అక్రమ రవాణా నుంచి కాపాడిన మహిళలను ఆదుకునే పథకం)కు కేటాయింపులు రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు, విడో గృహాలకు రూ. 8 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు పెంచారు.
  • మహిళా సాధికారత, సశక్తిత మిషన్‌కు బడ్జెట్‌ను రూ. 1,156 కోట్ల నుంచి రూ. 1,330 కోట్లకు పెంపుదల.
  • మహిళల రక్షణ, సాధికారతకోసం రూ.1,330 కోట్లు
 
పర్యావరణానికి రూ.3,111 కోట్లు
మధ్యంతర బడ్జెట్‌లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం రూ.3,111.20 కోట్లు కేటాయించింది. గత కేటాయింపులతో పోలిస్తే ఇది 20.27 శాతం ఎక్కువ. ఇందులో ‘ప్రాజెక్టు టైగర్’కు రూ.350 కోట్లు, ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’కు రూ.30 కోట్లు, నేషనల్ టైగర్ కాన్జర్వేషన్ అథారిటీ(ఎన్‌టీసీఏ)కు పది కోట్లు కేటాయించారు. అదేవిధంగా, జంతు సంక్షేమ బోర్డు(ఏడబ్య్లూబీ)కు గత ఏడాది కంటే రూ.2 కోట్లు ఎక్కువగా అంటే రూ.12 కోట్లు ప్రత్యేకించింది. నేషనల్ కమిషన్ ఫర్ గ్రీన్ ఇండియాకు గత ఏడాది కంటే రూ.30 కోట్లు ఎక్కువగా రూ.240 కోట్లు కేటాయించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ)కి గత ఏడాది మాదిరిగానే రూ.100 కోట్లు ప్రత్యేకించిన ప్రభుత్వం, కాలుష్య నివారణ కార్యక్రమాలకు గత ఏడాది కంటే సగానికి తగ్గించి రూ.10 కోట్లు ఇచ్చింది.

సామాజిక న్యాయ, సాధికారతకు రూ.7,800 కోట్లు
సామాజిక, న్యాయ సాధికారత శాఖకు ఈసారి బడ్జెట్ కేటాయింపులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. 2018-19లో రూ.7,750 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.7,800 కోట్లకు పెంచారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.1,144.90 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే(రూ.1,070 కోట్లు) ఇది ఏడు శాతం అధికం. ‘షెడ్యూల్ క్యాస్ట్‌కు సంబంధించి 2018-19 బడ్జెట్ అంచనాలు రూ.56,619 కోట్లు కాగా.. 2019-20కి వచ్చేసరికి రూ.76,801 కోట్లకు పెరిగింది. మొత్తంగా ఇది 35.6 శాతం అధికం’ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, సఫాయీ కర్మచారీస్ తదితర ఐదు జాతీయ కమిషన్ల కోసం గత బడ్జెట్‌లో రూ.33.72 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.39.87 కోట్లకు పెంచారు. జాతీయ స్కాలర్‌షిప్ పథకాలకు కేటాయింపులు తగ్గించారు. గతేడాది రూ.500 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.390.50 కోట్లకు పరిమితం చేశారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర ఆర్థిక, అభివృద్ధి బోర్డులకు రూ.215 కోట్లు కేటాయించారు.

రోడ్ల నిర్మాణంలో అత్యంత వేగవంతమైన పురోగతి
రోజుకు సగటున 27 కి.మీ మేర రహదారులు నిర్మిస్తూ ఈ రంగంలో భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిందని గోయల్ చెప్పారు. వచ్చే 8 ఏళ్లలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భారత్ ఉవ్విళ్లూరు తోందని చెప్పారు. మౌలిక వసతులకు కేటాయింపులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, పూర్తయిన ప్రాజెక్టులపై తాజా బడ్జెట్‌లో గోయల్ ప్రస్తావించిన విషయాలు..
  • రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, పట్టణ రవాణా, గ్యాస్-విద్యుత్ సరఫరా, జలరవాణా మార్గాల లాంటి రంగాల్లో తరువాతి తరం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
  • ఢిల్లీ, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఏళ్లుగా నిలిచి పోయిన వంతెన ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
  • రోడ్ల నిర్మాణానికి రూ.83 వేల కోట్లు కేటాయించారు.
  • బ్రహ్మపుత్ర నదిలో నౌకాయానాన్ని అభివృద్ధిచేస్తే.. ఈశాన్య ప్రాంతానికి కూడా జలమార్గం గుండా సరుకు రవాణా చేసేందుకు సాధ్యమవుతుంది.
  • కోల్‌కతా నుంచి వారణాసికి తొలిసారిగా దేశీయంగా జలరవాణా ద్వారా సరుకు రవాణా ప్రారంభమైంది.
  • రైల్వే చరిత్రలోనే ఈ ఏడాది అత్యంత సురక్షితమైనదిగా గడిచింది.
  • సిక్కింలోని పాక్యాంగ్ విమానం అందుబాటులోకి వచ్చాక దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 100కు చేరింది.
  • స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’తో ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సేవలు, వేగం, భద్రత అందుబాటులోకి వస్తాయి. ఈ సాంకేతికతతో మన ఇంజినీర్లు మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఊతమిస్తున్నారు.
  • అరుణాచల్‌ప్రదేశ్‌లో విమానయాన సేవలు, మేఘాలయ, త్రిపుర, మిజోరంలలో రైల్వే మార్గాల అనుసంధానత ఇటీవలే ప్రారంభమయ్యాయి.
  • ఈ మేరకు ఈశాన్య భారత్‌లో కేటాయింపులు 21 శాతం పెరిగి రూ.58, 166 కోట్లకు చేరుకున్నాయి.
  • వచ్చే ఐదేళ్లలో లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యం.
  • 15.80 లక్షల ఇళ్లను పక్కా రోడ్లతో అనుసంధానించారు. మిగిలిపోయిన సుమారు 2 లక్షల ఇళ్లకు కూడా ఈ సౌకర్యం కల్పించేందుకు పనులు జరుగుతున్నాయి.
  • ఈసారి పీఎంజీఎస్‌వైకి కేటాయించిన మొత్తం రూ.19,000 కోట్లు.
  • 2014-18 మధ్యకాలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 1.53 కోట్ల ఇళ్లను నిర్మించారు.

 

Budget 19-20రక్షణకు రూ. 3.18 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి 2019-20 బడ్జెట్‌లో రూ. 3,18,931 కోట్లు కేటాయించింది.. గత ఏడాది రక్షణ శాఖ బడ్జెట్‌తో కేటాయింపు రూ. 2,95,511 కోట్లతో పోలిస్తే ఇది 6.87 శాతం ఎక్కువ.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, ఇతర పరికరాలు కొనడానికి బడ్జెట్ కేటాయింపులో రూ. 1,08,248 కోట్లను మూలధనంగా పేర్కొన్నారు. మూలధనం ఆర్మీకి రూ. 29,447 కోట్లు, నేవీకి రూ. 23,156 కోట్లు, ఎయిర్‌ఫోర్స్‌కు రూ. 39,302 కోట్లు కేటాయించారు.
కేంద్ర ప్రభుత్వ వ్యయం మొత్తంలో 15.48 శాతం రక్షణ రంగం కేటాయింపులేనని చెప్పారు. రక్షణ రంగానికి ఇచ్చిన దానికి అదనంగా పెన్షన్ల కోసం రూ. 1,12,079 కోట్లను కేటాయించారు. సరిహద్దులను కాపాడటానికి అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధమని పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కఠినమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న సైనికులు గర్వకారణమని, అందుకే ఈ ఏడాది వారికోసం ఇప్పటివరకూ ఎవరూ కేటాయించని స్థాయిలో నిధులు కేటాయించామని తెలిపారు.

హోం మంత్రిత్వ శాఖకు 1,03,927
కేంద్ర హో మంత్రిత్వ శాఖకు కేటాయింపులు తొలిసారి లక్ష కోట్ల రూపాయలు దాటాయి. 2019-20 కేంద్ర బడ్జెట్‌లో హోం మంత్రిత్వ శాఖకు రూ. 1,03,927 కోట్లు కేటాయించారు. 2018-19 బడ్జెట్‌లో ఆ శాఖకు రూ. 99.03వేల కోట్లతో పోలిస్తే ఈ సారి 4.9 శాతం ఎక్కువ. దేశ రాజధానిలో శాంతిభద్రత కాపాడే ఢిల్లీ పోలీసులకు ఈ బడ్జెట్‌లో రూ. 7,496.91 కోట్లు, సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 2 వేల కోట్లు కేటాయించారు. సీఆర్‌పీఎఫ్ బలగాల కోసం రూ. 23,742.04 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సీఆర్‌పీఎఫ్‌కు దాదాపు రూ. 1,095 కోట్లు అదనంగా కేటాయింపులు జరిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం బీఎస్‌ఎఫ్ కోసం 19,647.59 కోట్లు ఇచ్చారు. ఇది గతేడాదితో పోలిస్తే రూ. 1,061 కోట్లు అదనం. సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, సశస్త్ర సీమా బల్, అస్సాం రైఫిల్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌తో పాటు సాయిధ బలగాల కోసం మొత్తం రూ. 71,618.70 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఈ కేటాయింపులు రూ. 67,779.75గా ఉన్నాయి.

ఇతర కేటాయింపులు..
  • ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఈ బడ్జెట్‌లో రూ. 2,198.35 కోట్లు కేటాయించారు.
  • -ప్రధాని, మాజీ ప్రధాని భద్రతకోసం వినియోగించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌నకు రూ. 530.75 కోట్లు ఇచ్చారు.
  • పోలీస్ మౌలిక వసతుల అభివృద్ధి, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వాహనాల కొనుగోళ్లు, బారక్‌లు, ఇళ్ల నిర్మాణం కోసం రూ. 5,117 కోట్లు ఇచ్చారు.
  • పోలీసు బలగాల ఆధునికీకరణ కోసం రూ. 3,378 కోట్లు, సరిహద్దులో మౌలిక వసతులు, నిర్వహణకు రూ. 2 వేల కోట్లు, మహిళల రక్షణ, సాధికారత మిషన్‌కు రూ. 1,330 కోట్లు, సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమానికి రూ. 825 కోట్లు, జమ్మూకశ్మీర్‌లో వలసదారులు, స్వదేశానికి తిరిగివచ్చిన వారి పునరావాసం కోసం రూ. 809 కోట్లు, స్వాతంత్య్ర పోరాటయోధుల పింఛన్ల కోసం రూ. 953 కోట్లు, నిర్భయ ఫండ్‌కు రూ. 50 కోట్లు కేటాయించారు.
  • ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు రిలీఫ్ ఫండ్‌కు రూ. 10,000 కోట్లు కేటాయించారు.
  • రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా 2021 జనాభా లెక్కలకు రూ. 541.33 కోట్లు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు రూ. 50 కోట్లు, జమ్మూ కశ్మీర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు రూ. 78.09 కోట్లు, హిందీ భాష ప్రచారానికి రూ. 4,895.81 కోట్లు కేటాయించారు.
  • కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ అండ్ నికోబార్ దీవులకు రూ. 4,817.48 కోట్లు, చండీగఢ్‌కు రూ. 4,291.70 కోట్లు, దాద్రా నగర్ హవేలీకి రూ. 1,117.99 కోట్లు, డామన్ అండ్ డయ్యు రూ. 821.4 కోట్లు, లక్షద్వీప్‌కు రూ. 1,276.74 కోట్లు ఢిల్లీకి రూ.1,112 కోట్లు, పుదుచ్చేరికి రూ. 1,545 కోట్లు కేటాయించారు.
అదే విధంగా ఎల్పీజీ సబ్సిడీ రూ.2.66 లక్షల కోట్ల నుంచి రూ.2.97 లక్షల కోట్లకు పెంచడం వంటివి కూడా బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.90వేల కోట్ల సేకరణ, ఆర్బీఐతోపాటు వివిధ బ్యాంకుల డివిడెండ్ల ద్వారా రూ.82,900కోట్ల ఆదాయం సమకూరిందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

పభుత్వ రంగంలోకి కృత్రిమ మేథ
గ్రామీణ భారతాన్ని డిజిటల్ పుంతలు తొక్కించేందుకు ఎన్డీయే సర్కారు తన తుదిబడ్జెట్‌లో గట్టి ప్రయత్నమే మొదలు పెట్టింది. భారత్ నెట్ పథకం కింద అనుసంధా నించే 2.5లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ఆర్థికశాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతేకాదు..వేర్వేరు ప్రభుత్వ శాఖల్లోని సమాచారాన్ని విశ్లేషించి వనరులను మరింత సమర్థంగా వినియోగించు కునే లక్ష్యంతో ప్రభుత్వ శాఖల్లోనూ కృత్రిమ మేథను వాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

గామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
ఉపాధిహామీకి మరింత ధీమా, మారుమూల పల్లెల్లో కూడా అందరికీ విద్యుత్ సౌకర్యం, గ్రామీణ రోడ్లకు మెరుగులు దిద్దేందుకు నిధులను కుమ్మరించారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. గ్రామపంచాయతీలకు డిజిటల్ సొబగులు, ప్రతిఒక్కరికి గృహవసతి కల్పన లాంటి తాయిలాలు ప్రకటించారు.
ఉపాధి హామీకి మరింత ఊతం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ దఫా బడ్జెట్లో రూ. 60వేల కోట్లు కేటాయింపు. గతేడాది కన్నా ఈ మొత్తం రూ. 5వేల కోట్లు లేదా 11 శాతం అధికం. అవసరమైతే ఈ కేటాయింపులు మరింత పెంచుతారు.
  • 2019-20 కేటాయింపులు 60వేల కోట్లు
  • 2018-19 కేటాయింపులు 55వేల కోట్లు
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్‌జ్యోతి యోజన
  • 2019-20 కేటాయింపులు 4,066కోట్లు
  • 2018-19 కేటాయింపులు 3,800 కోట్లు
గ్రామీణ రోడ్ల నిర్మాణం
  • 2019-20 కేటాయింపులు 19,000కోట్లు
  • 2018-19 సవరించిన కేటాయింపులు 15,500 కోట్లు
స్వచ్ఛ భారత్ సాకారం...
2014-15 నుంచి ఇప్పటివరకు దాదాపు 9 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి. బహిరంగ మలవిసర్జన అలవాటు దాదాపు కనుమరుగైంది. ఓడీఎఫ్(బహిరంగ మలవిసర్జన రహిత) గ్రామాల సంఖ్య 5.45 లక్షలకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 98 శాతం శానిటేషన్ కవరేజ్ కల్పన.
  • 2019-20 కేటాయింపులు 12,750కోట్లు
  • 2018-19 కేటాయింపులు 16,978 కోట్లు
గ్రామీణ టెలిఫోనీ
భారత్ నెట్ ఫేజ్1 కింద 1, 21, 652 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ కనెక్టివిటీ పూర్తి అయింది. 1.16లక్షల పంచాయతీల్లో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో 2.5 లక్షల గ్రామాల్లోని దాదాపు 20 కోట్ల మంది గ్రామీణవాసులకు బ్రాడ్‌బ్యాంక్ యాక్సెస్ లభించింది. 39, 359 పంచాయతీల్లో వైఫై హాట్‌స్పాట్స్ ఇన్‌స్టలేషన్ పూర్తి. ఐదు కోట్లమంది గ్రామీణులకు లబ్ది చేకూరేలా 5 లక్షల వైఫై స్పాట్స్ ఏర్పాటు లక్ష్యం.
  • 2019-20 కేటాయింపులు 8,350కోట్లు
  • 2018-19 సవరించిన కేటాయింపులు 5,000 కోట్లు
జాతీయ గ్రామీణ తాగునీటి పథకం
ఈ ‘భారత్ నిర్మాణ్’ పథకానికి నిధులు జోరుగానే అందుతున్నాయి. దేశంలో తాగునీటి సౌకర్యం లేని(అన్‌కవర్డ్) అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం. దీన్ని ఇప్పుడు విజన్ 2030లో భాగంగా చేర్చారు. నాలుగేళ్లలో 28,000 ఆర్సినిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనేది కూడా ఈ పథకంలో భాగంగా మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.
  • 2019-20 కేటాయింపులు 8,201కోట్లు
  • 2018-19 సవరించిన కేటాయింపులు 5,500 కోట్లు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటి వరకు 1.53 కోట్ల ఇళ్ల నిర్మాణం(గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు కలిపి).
  • నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో రూ. 10వేల కోట్ల కార్పస్‌తో కొత్తగా హౌసింగ్ ఫండ్(ఏహెచ్‌ఎఫ్) ఏర్పాటు.
  • ఇళ్ల నిర్మాణాలు ఇందిరా ఆవాస్ యోజన కన్నా ఈ పథకం కింద ఐదు రెట్లు అధికం. 2022 నాటికి అందరికీ గృహవసతి లక్ష్యం.
  • 2019-20 కేటాయింపులు 25,853కోట్లు
  • 2018-19 సవరించినది 26,405 కోట్లు

 

Budget 19-20రైల్వేకు కేటాయింపులు 64 వేల కోట్లు
గతంలో ఎన్నడూ లేనంత మూలధన వ్యయాన్ని ఈ బడ్జెట్‌లో రైల్వేకు కేటాయించారు. గతేడాది అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉండగా రూ. 1.48 లక్షల కోట్లను రైల్వేకు కేటాయించగా, ప్రస్తుతం దాన్ని మరో పది వేల కోట్లు పెంచి రూ. 1,58,658 కోట్లకు పియూష్ గోయల్ చేర్చారు. అలాగే బడ్జెట్ నుంచి మూలధన సాయంగా రూ.64,587 కోట్లను రైల్వేలకు కేటాయించారు. ఇప్పటివరకు రైల్వే చరిత్రలో 2018-19 సంవత్సరమే అత్యంత సురక్షితమైనదనీ, బ్రాడ్‌గేజ్ పట్టాలపై వెంట ఉన్ని కాపలా లేని రైల్వే గేట్లను సంపూర్ణంగా తొలగించామని రైల్వే, ఆర్థిక శాఖల మంత్రి పియూష్ చెప్పారు. రైల్వేకు వచ్చే ఆర్థిక ఏడాదిలో రూ. 2.73 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. గతేడాది ఈ అంచనా రూ. 2.5 లక్షల కోట్లుగా ఉంది. కొత్త మార్గాల నిర్మాణాలకు రూ. 7,255 కోట్లు, గేజ్ మార్పిడికి రూ. 2,200 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు తదితరాలకు రూ. 6,114.82 కోట్లు, సిగ్నల్ వ్యవస్థ, టెలికాంలకు కలిపి రూ. 1,750 కోట్లు, ప్రయాణికులకు సౌర్యాలను మెరుగుపరిచేందుకు రూ. 3,422 కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించారు.

ఇంజిన్లు, బోగీలు తదితరాల కోసం గతేడాది కన్నా ఈ ఏడాది బడ్జెట్‌లో 64 శాతం అధిక కేటాయింపులకు చేశారు. 2018-19 బడ్జెట్‌లో ఈ కేటగిరీ కోసం రూ. 3,724.93 కోట్లు కేటాయించగా, తాజా ఆ బడ్జెట్‌లో ఆ మొత్తం రూ. 6,114.82 కోట్లుగా ఉంది.
  • తాజా బడ్జెట్‌లో రైల్వేలకు సమకూర్చిన మూలధనం 64,587 కోట్లు
  • రైల్వేల మొత్తం మూలధన వ్యయం విలువ 1,58,658 కోట్లు
 
తెలంగాణ ఊసే లేదు
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధు పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రైతుబంధు తరహాలో ఐదెకరాలలోపు రైతుకు ఏటా రూ.6 వేల చొప్పున సాయాన్ని ప్రకటించింది. ఈ ఒక్క విషయంలోనే తెలంగాణ చర్చకు వచ్చింది తప్ప బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించి ప్రత్యేక ప్రస్తావనే లేదు. ఏపీ, తెలంగాణలో కలిపి గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.8 కోట్లు కేటాయించారు. ఈ అంశంలో తప్ప మరెక్కడా తెలంగాణ ప్రస్తావన రాలేదు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన రాయితీల్లో భాగంగా ఏపీకి, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద 2018-19 బడ్జెట్ అంచనాలను రూ.100 కోట్లుగా చూపారు. సవరించిన అంచనాల్లో సున్నాగా చూపారు.

కేంద్ర పన్నుల్లో వాటా ఇలా..
తెలంగాణకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచే మొత్తం (42 శాతం వాటా) నిధుల్లో 2.437 శాతం దక్కింది. ఇది రూ.20,583.05 కోట్లకు సమానం. గత ఏడాదికంటే దాదాపు రూ.2,022 కోట్లు అధికం. ఇందులో కార్పొరేషన్ టాక్స్ రూ.6,665.84 కోట్లు, ఆదాయ పన్ను రూ.5,600.58 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.6,229.45 కోట్లు, కస్టమ్స్ టాక్స్ రూ.1,293 కోట్లు, కేంద్ర ఎకై ్సజ్ డ్యూటీ రూ.794 కోట్లు ఉన్నాయి. 2014-15తో పోల్చితే ఇప్పుడు కేంద్ర పన్నుల్లో వచ్చే వాటా రెట్టింపు కావడం విశేషం.

ఏడాది

వాటా (రూ. కోట్లల్లో)

2014-15

10,091.94

2015-16

12,350.72

2016-17

14,876.61

2017-18

16,505.02

2018-19

18,560.88

2019-20

20,583.05


ఏపీకి మళ్లీ మొండిచేయి
కేంద్ర ప్రభుత్వ తాజా మధ్యంతర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు యథావిధిగా మొండిచేయి చూపింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చివరి బడ్జెట్లో కూడా ఏపీకి నిరాశే మిగిల్చింది. కనీసం జాతీయ విద్యా సంస్థలకూ కేటాయింపుల్లేకుండా చేసింది. కేవలం ఏపీ సెంట్రల్ వర్సిటీకి, గిరిజన విశ్వవిద్యాలయానికే నిధులు కేటాయించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద 2018-19 బడ్జెట్ అంచనాలను రూ.100 కోట్లుగా చూపారు. కానీ సవరించిన అంచనాల్లో సున్నాగా చూపారు.

ఏపీ వాటా రూ.36.3 వేల కోట్లు
కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా అయిన 4.305 శాతం కింద రూ.36,360.26 కోట్లు రానున్నాయి. ఇందులో కార్పొరేషన్ టాక్స్ రూ.11,775.31 కోట్లు, ఆదాయ పన్ను రూ.9,893.51 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.11,004.42 కోట్లు, కస్టమ్స్ టాక్స్ రూ.2284.72 కోట్లు, కేంద్ర ఎకై ్సజ్ డ్యూటీ రూ.1402.62 కోట్లుగా ఉన్నాయి. సంపద పన్నును0.32 కోట్లుగా చూపారు. గతేడాది కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.32,738.03 కోట్లు ఉండగా ఈ ఏడాది దాదాపు రూ.3,582 కోట్లు అదనంగా రానున్నాయి.

2014 నుంచి కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా ఇదీ..

2014-15 14,106.93
2015-16 21,893.79
2016-17 26,263.88
2017-18 29,138.82
2018-19 32,738.03
2019-20 36,360.26


నాలుగు నెలలకు రూ.34.17 లక్షల కోట్లు
2019, ఏప్రిల్ నుంచి నూతన ఆర్థిక సంవత్సరం (2019-20)లో మొదటి నాలుగు నెలల కాలానికి గాను (ఏప్రిల్ నుంచి జూలై వరకు) రూ.34.17 లక్షల కోట్ల వ్యయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ద్వారా పార్లమెంట్ అనుమతి కోరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థూల వ్యయాలు రూ.97.43 లక్షల కోట్లుగా మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అంచనాలను పేర్కొన్నారు. మొదటి నాలుగు నెలల కాలానికి అయ్యే వ్యయాలకు గాను పార్లమెంటు ఆమోదం కోరారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్-మే నెలల్లో పూర్తవుతాయి. తదుపరి ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను వచ్చే జూలైలో కొత్త ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించనుంది.

Download Union Budget 2019-20 Documents
Published date : 02 Feb 2019 07:15PM

Photo Stories