Skip to main content

కేంద్ర బడ్జెట్ 2018 - 19

పేద కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఆరోగ్య బీమా, రైతుల పెట్టుబడి వ్యయానికి 50% ఎక్కువగా కనీస మద్దతు ధర, 4 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు. ఇలా పలు ఆకర్షక పథకాలు, కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్.. వ్యవసాయం, వైద్యం, గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేసింది. అలాగే.. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇదే కావటంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లోని అంశాలు, గణాంకాలు మీ కోసం...
మొత్తం బడ్జెట్ రూ. 24,42,213 కోట్లు
రెవెన్యూ వసూళ్లు రూ. 17,25,738 కోట్లు
మూలధన వసూళ్లు రూ. 7,16,475 కోట్లు
మొత్తం వసూళ్లు రూ. 24,42,213 కోట్లు
రెవెన్యూ లోటు రూ. 4,16, 034 కోట్లు



Download
2018-19 Budget Documents

+ Budget at Glance
+ Annual Financial Statement
+ Receipt Budget
+ Expenditure Budget
+ Macro-Economic Framework statement
+ Fiscal Policy Strategy statement


ఇదీ బడ్జెట్ స్వరూపం
(అంకెలు రూ.కోట్లలో)

2016-2017

2017-2018

2017-2018

2018-2019

వాస్తవ కేటాయింపులు

బడ్జెట్ అంచనాలు

సవరించిన అంచనాలు

బడ్జెట్ అంచనాలు

1. రెవిన్యూ వసూళ్లు(2+3)

13,74,203

15,15,771

15,05,428

17,25,738

2. పన్ను ఆదాయం

11,01,372

12,27,014

12,69,454

14,80,649

3. పన్నేతర ఆదాయం

2,72,831

2,88,757

2,35,974

2,45,089

4. మూలధన వసూళ్లు(5+6+7)

6,00,991

6,30,964

7,12,322

7,16,475

5. రుణాల రికవరీ

17,630

11,933

17,473

12,199

6. ఇతర వసూళ్లు

47,743

72,500

1,00,000

80,000

7. అప్పులు, ఇతరత్రా వసూళ్లు

5,35,618

5,46,531

5,94,849

6,24,276

8. మొత్తం వసూళ్లు(1+4)

19,75,194

21,46,735

22,17,750

24,42,213

9. పథకాలుకాక ఇతర వ్యయం(10+13)

19,75,194

21,46,735

22,17,750

24,42,213

10. రెవిన్యూ ఖాతా

16,90,584

18,36,934

19,44,305

21,41,772

11. వడ్డీ చెల్లింపులు

4,80,714

5,23,078

5,30,843

5,75,795

12. మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు

1,65,733

1,95,350

1,89,245

1,95,345

13. మూలధన ఖాతా

2,84,610

3,09,801

2,73,445

3,00,441

14. రెవెన్యూ లోటు(10-1)

3,16,381

3,21,163

4,38,877

4,16,034

15. నికర రెవిన్యూ లోటు (14-12)

1,50,648

1,25,813

2,49,632

2,20,689

16. ద్రవ్య లోటు ్ర9-(1+5+6)

5,35,618

5,46,531

5,94,849

6,24,276

17. ప్రాథమిక లోటు (16-11)

54,904

23,453

64,006

48,481


Budget 18-19

2018-19 బడ్జెట్ హైలైట్స్
  • 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు అంచనా 3.3 శాతం.
  • 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీల సంక్షేమానికి రూ.56,619 కోట్లు.. ఎస్టీల సంక్షేమానికి రూ.39,135 కోట్లు కేటాయింపు.
  • 2018 ఆర్థిక సంవత్సరం చివరి 6 నెలల్లో 7.2-7.5% వృద్ధి రేటు నమోదు కావొచ్చు.
  • ప్రస్తుతం ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద ఆర్థికశక్తిగా భారత్. భారత ఆర్థిక వ్యవస్థ విలువ రూ.160 లక్షల కోట్లు. త్వరలోనే ఐదో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించనుంది.
  • 2018-19 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి ప్రభుత్వ రుణాల సేకరణ అంచనా రూ.4.07 లక్షల కోట్లు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.4.79 లక్షల కోట్లుగా ఉంది.
  • వ్యవసాయ మార్కెట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,000 కోట్లతో నిధి. దీని ద్వారా దేశవ్యాప్తంగా 22 వేల గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు, 585 ఏపీఎంసీల అభివృద్ధి.
  • రూ. 2.5 లక్షలు, అంతకు మించిన లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి.
  • ఫుడ్ ప్రాసెసింగ్‌కు గత ఏడాది రూ.715 కోట్లు కేటాయిస్తే.. ఈసారి అది రూ.1,400 కోట్లకు పెరిగింది.
  • ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం నియంత్రణకు చర్యలు.
  • స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా మరో 2 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం.
  • జాతీయ జీవనోపాధి మిషన్‌కు రూ.5,750 కోట్లు.
  • జౌళి రంగానికి రూ.7,148కోట్లు
  • ఎయిర్‌పోర్ట్‌ల సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచాలి. ఏడాదిలో బిలియన్ ట్రిప్పులను నిర్వహించే సామర్థ్యాన్ని సాధించాలి.
  • రూ.17 వేల కోట్ల అంచనా వ్యయంతో ముంబైలో 160 కి.మీ. సబర్బన్ రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధి.
  • 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆహార సబ్సిడీ రూ.1.69 లక్షల కోట్లకు పెంపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1.4 లక్షల కోట్లే.
  • 2018-19లో ఎస్సీల సంక్షేమానికి రూ.56,619 కోట్లు.. ఎస్టీల సంక్షేమానికి రూ.39,135 కోట్లు కేటాయింపు.
  • ముద్రా పథకం కింద రుణ లక్ష్యం రూ. 3 లక్షల కోట్లు.
  • డిజిటల్ ఇండియా పథకానికి రూ. 3,073 కోట్లు కేటాయింపు.
  • టెలికం రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 10 వేల కోట్ల కేటాయింపు.
  • మౌలిక వసతుల రంగానికి ప్రాధాన్యత. రూ. 5.97 లక్షల కోట్లు కేటాయింపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4.94 లక్షల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.
  • 2018-19 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.80 వేల కోట్లు.
  • గోల్డ్ పాలసీని రూపొందిస్తున్నట్టు ప్రకటన.
  • రూ.5 లక్షల కోట్ల అదనపు రుణాలు అందించేలా బ్యాంకు లకు మూలధన సాయం.
  • జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల కోసం రూ.150 కోట్లు కేటాయింపు.
  • 2018 జనవరి 15 వరకూ ప్రత్యక్ష పన్నుల వసూలు 18.7 శాతం వృద్ధి.
  • 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలపై కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గింపు.
  • వయోధిక పౌరుల బ్యాంకు, పోస్టాఫీస్ డిపాజిట్ల వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి రూ.10 వేల నుంచి రూ.50 వేలకు పెంపు.
  • సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులు, వైద్య బీమా ప్రీమియంపై రూ.50 వేల వరకూ అదనపు రాయితీ.
  • ఈక్విటీ మార్కెట్‌లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.లక్ష దాటిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్పై 10 శాతం పన్ను
  • విద్యా, వైద్య సెస్సు 3 నుంచి 4 శాతానికి పెంపు.
  • ప్రతి మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు.
  • విదేశీయులను ఆకర్షించేందుకు 10 ప్రధాన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి.
పెరిగేవి..
కార్లు, మోటార్ సైకిళ్లు, బస్సులు, ట్రక్కుల రేడియల్ టైర్లు, మొబైల్ ఫోన్లు, వాటి యాక్సెసరీలు, ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ, ఓఎల్‌ఈడీ టీవీ ప్యానెళ్లు, ఇతర టీవీ
విడిభాగాలు, ధరించగలిగిన ఎలక్ట్రానిక్ వస్తువులు, పెర్ఫ్యూమ్‌లు, డియోడ్రంట్లు, టాయిలెట్ వాటర్, టాయిలెట్ స్ప్రేలు, సౌందర్య ఉత్పత్తులు, పాదరక్షలు, పట్టు వస్త్రాలు, రంగు రాళ్లు, కొన్ని రకాల వజ్రాలు, పండ్లు, కూరగాయల జ్యూస్‌లు, వంటనూనెలు, బంగారం, వెండి, సన్‌గ్లాసెస్, సన్‌స్క్రీన్, సన్‌ట్యాన్ లోషన్లు, మ్యానిక్యూర్, పెడిక్యూర్‌లలో వాడే పదార్థాలు.
తగ్గేవి
ముడి జీడిపప్పు, కాక్లియర్ ఇంప్లాంట్‌ల తయారీలో వాడే పరికరాలు, సౌర
ఫలకాల తయారీలో వాడే సోలార్ టెంపర్డ్ గ్లాస్‌లు, కొన్ని రకాల మేకులు.
దిగుమతి సుంకాల పెంపు!
మిగిలిన పన్నులన్నీ జీఎస్‌టీ పరిధిలోకి వచ్చి ఎప్పటికప్పుడు సవరణలు జరుగుతుండటంతో ఈ సారి వాటిలోకి ప్రవేశించే అవకాశం జైట్లీకి రాలేదు. దీంతో దిగుమతి సుంకాలను పెంచేశారు. సెల్‌ఫోన్లు, అత్తర్లు, ముస్తాబు సామగ్రి (టాయ్‌లెట్రీ), వాచ్‌లు, ఆటోమొబైల్ భాగాలు, సన్‌గ్లాసులు, ట్రక్-బస్సు టైర్లు వంటి వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచేశారు.
ద్రవ్య నియంత్రణ కష్టమేనా
విద్య, ఆరోగ్యాలకు రూ.1.38 లక్షల కోట్లను ప్రకటించిన జైట్లీ... ఈ ఏడాది ద్రవ్యలోటు ముందుగా అంచనా వేసినట్టుగా జీడీపీలో 3.2 శాతంగా కాకుండా 3.5 శాతంగా ఉండవచ్చని స్పష్టంచేశారు. 2018-19లో ఇది 3.3 శాతానికి చేరుకోవచ్చన్నారు.
కార్పొరేట్ ట్యాక్స్ ఊరట కొందరికే
కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలన్న డిమాండ్‌పై జైట్లీ కొందరికే ఊరటనిచ్చారు. ప్రస్తుతం రూ.50 కోట్ల వరకూ వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలకు ఈ వెసులుబాటు ఉండగా.. ఇకపై రూ.250 కోట్ల టర్నోవర్ చేసే సంస్థలకు కూడా వర్తింపజేశారు.
లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్
షేర్లను కొని, ఏడాదికన్నా ఎక్కువకాలం వాటిని అట్టేపెట్టుకుంటే వాటిపై వచ్చే లాభాలపై లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను ఉండదు. ఏడాదిలోపు విక్రయిస్తే మాత్రం షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద పన్నుంటుంది. నిజానికి పద్నాలుగేళ్ల కిందట లాం గ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును తొలగించారు. దాన్ని జైట్లీ మళ్లీ తెచ్చారు. రూ.లక్షకు మించి వచ్చిన లాభాలపై 10 శాతం పన్ను విధిస్తామని చెప్పారు. నిజానికి 2004 జూలైలో లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్నును తొలగించి... దాని స్థానంలో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను తెచ్చారు. ఇప్పుడు రెండూ అమల్లో ఉండటం గమనార్హం.

శాఖలు, పథకాల వారీగా కేటాయింపులు
Budget 18-19 ఒక్కో

కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వైద్య బీమా
తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న ఆరోగ్యశ్రీ తరహాలోనే బడ్జెట్‌లో కొత్త పథకాన్ని కేంద్రం ప్రకటించింది. దేశంలో 10 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రవేశపెడతామనిఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. దీనికింద ఒక్కో కుటుంబానికి గరిష్టంగా ఏటా రూ.5 లక్షల వైద్య బీమా సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వరంగంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య పథకమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 50 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్ బీఐ) కింద పేదలకు ఏటా రూ. 30 వేల వైద్య బీమా మాత్రమే ఉంది. ఈ పథకానికి తాజా బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించారు.

ఆరోగ్య బడ్జెట్ రూ.54,667 కోట్లు
ఆరోగ్య రంగానికి గతేడాది రూ.53,198 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.54,667 కోట్లు కేటాయించారు. అలాగే ఆరోగ్య పరిశోధన విభాగానికి కిందటేడాది రూ.1,500 కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ.1,800 కోట్లు ప్రతిపాదించారు.

‘ఆయుష్’కు రూ. 1,626 కోట్లు
ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1626.37 కోట్లు కేటాయించారు.
ఇది గతేడాది కన్నా 13 శాతం ఎక్కువ. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న వివిధ ప్రాజెక్టులు, పథకాలకయ్యే మొత్తం వ్యయాన్ని రూ.71.36 కోట్లుగా అంచనా వేశారు. గతేడాది బడ్జెట్‌లో ఇందుకోసం తొలుత రూ.68.86 కోట్లు కేటాయించి తరువాత రూ.87.64 కోట్లకు పెంచారు.

వ్యవసాయశాఖకు రూ. 58,080 కోట్లు
బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. వరి తదితర ఖరీఫ్ పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా 50 శాతం అధికంగా మద్దతు ధర కల్పించేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11 లక్షల కోట్లు పంట రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడమే లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ బడ్జెట్ కేటాయింపులను గతేడాది (రూ.51,576 కోట్లు) కన్నా 13 శాతం అధికంగా రూ. 58,080 కోట్లకు పెంచారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు ఈసారి రూ.13,000 కోట్లు కేటాయించారు. దీనికి గతేడాది కేటాయింపులు రూ.10,698 కోట్లే.
Budget 18-19

ఖరీఫ్ పంటలకు మద్దతు

వరి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పుధాన్యాల వంటి ఖరీఫ్ పంటలకు కచ్చితమైన కనీస మద్దతు ధర అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జైట్లీ వెల్లడించారు. ఆయా పంటల ఉత్పాదక వ్యయానికి 50 శాతం అదనంగా జోడించి మద్దతు ధర అందిస్తామని ప్రకటించారు. పంట ఉత్పత్తుల ధరలు పడిపోయినా రైతులకు కనీస మద్దతు ధర కచ్చితంగా అందేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

భారీగా వ్యవసాయ ఎగుమతుల లక్ష్యం
వివిధ వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. దేశం నుంచి ప్రస్తుతం 30 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 2 లక్షల కోట్లు) విలువైన వ్యవసాయోత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని.. ఇవి 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.4 లక్షల కోట్లు)కు చేరే అవకాశముందని పేర్కొన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహం
ఫుడ్ ప్రాసెసింగ్‌కు గతేడాదికన్నా వంద శాతం అధికంగా రూ.1,400 కోట్లు కేటాయించారు. స్థానిక ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను రక్షించుకునేందుకు విదేశాల నుంచి దిగుమతయ్యే పలు ప్రాసెస్డ్ ఫుడ్‌పై కస్టమ్స్ సుంకాలను సవరిస్తున్నట్లు తెలిపారు. ఆరెంజ్ జ్యూస్‌పై 30 నుంచి 35 శాతానికి, ఇతర పళ్ల రసాలు, కూరగాయల జ్యూస్‌లపై 30 శాతం నుంచి 50 శాతానికి సుంకాన్ని పెంచారు. సోయా ప్రొటీన్ మినహా ఇతర వ్యవసాయ ప్రాసెస్డ్ ఉత్పత్తులపైనా సుంకాన్ని 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ముడి జీడిపప్పు దిగుమతి సుంకాన్ని 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.

కూరగాయల ధరల నియంత్రణకు ‘ఆపరేషన్ గ్రీన్స్’
ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండే ఉల్లి, టమాటా వంటి వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయల ధరల నియంత్రణ, పర్యవేక్షణ కోసం ‘ఆపరేషన్ గ్రీన్స్’ను చేపడతామని ప్రకటించారు. దేశంలో పాల ఉత్పత్తి పెంపునకు దోహదపడిన ‘ఆపరేషన్ ఫ్లడ్’తరహాలో దీనిని చేపడతామని చెప్పారు. ‘ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీవో)’లను ప్రోత్సహించేందుకు.. ఆయా ఉత్పత్తుల నిల్వ, రవాణా, ప్రాసెసింగ్, నిర్వహణ కోసం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. రూ.100 కోట్లలోపు టర్నోవర్ ఉన్న ఎఫ్‌పీవోలకు పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

వ్యవసాయంలో లక్ష్యాలివీ..
  • రైతులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 11 లక్షల కోట్ల మేర పంట రుణాల మంజూరు లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది రూ.లక్ష కోట్లు అదనం.
  • ఒక్కో జిల్లా పరిధిలో ఒక్కో తరహా పంట పండించేలా ‘క్లస్టర్’ఆధారిత వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు చర్యలు. ఇందుకోసం ప్రస్తుత పథకాల్లో మార్పులు చేర్పులు.
  • మత్స్య పరిశ్రమ, పశువుల పెంపకానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.10,000 కోట్లతో ఇన్‌ఫ్రా ఫండ్ ఏర్పాటు.
  • జాతీయ వెదురు మిషన్‌కు రూ.1,290 కోట్లు.. ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కల పెంపకానికి రూ.200 కోట్లు.
  • ఈ-నామ్ (జాతీయ వ్యవసాయ మార్కెట్) కింద ఈ ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్ల అనుసంధానం.
  • దేశవ్యాప్తంగా మెగా ఫుడ్‌పార్కుల ఏర్పాటు. ప్రస్తుతమున్న 42 మెగా ఫుడ్‌పార్కుల్లో అత్యాధునిక సదుపాయాల కల్పనకు చర్యలు. శీతల గిడ్డంగుల నిర్మాణం. ‘ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన’కింద రూ.1,313 కోట్లు కేటాయింపు.
  • వ్యవసాయ మార్కెట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇన్‌ఫ్రా ఫండ్ కింద రూ.2,000 కోట్లు కేటాయింపు. దేశవ్యాప్తంగా 22 వేల సంతలను గ్రామీణ వ్యవసాయ మార్కెట్లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు.
  • వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు నిధులు అందించేందుకు ప్రత్యేకంగా ‘ఆగ్రో-ప్రాసెసింగ్ ఫైనాన్షియల్’సంస్థల ఏర్పాటు.
  • మత్స్య పరిశ్రమ, పశువుల పెంపకం చేపట్టే రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు.

విద్యారంగానికి రూ.85,010 కోట్లు

కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగం అభివృద్ధికి రూ.85,010 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.35,010 కోట్లు ఉన్నత విద్యారంగానికి, రూ.50,000 కోట్లు పాఠశాల విద్యకు కేటాయించారు. వచ్చే నాలుగేళ్లలో ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.లక్ష కోట్లతో ‘రివైటలైజింగ్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్ ఇన్ ఎడ్యుకేషన్(రైజ్) పేరిట ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

Budget 18-19

బ్లాక్ బోర్డుల నుంచి డిజిటల్ బోర్డులకు..

వడోదరలో స్పెషలైజ్డ్ రైల్వే యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే పూర్తిస్థాయిలో రెండు కొత్త ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన 18 ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్కూళ్లను నెలకొల్పనున్నట్లు తెలిపారు. 13 లక్షల మందికిపైగా టీచర్లకు శిక్షణ ఇస్తామన్నారు. ఇటీవల ప్రారంభించిన ‘దీక్షా’పోర్టల్ ద్వారా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. 50 శాతానికి పైగా గిరిజన జనాభా గల ప్రాంతాలు లేదా 20 వేల గిరిజన జనాభా ఉన్న ప్రతిచోట నవోదయ విద్యాలయాల తరహాలో 2022 నాటికి ‘ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు’ ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ వెల్లడించారు.

24 కొత్త మెడికల్ కాలేజీలు
దేశంలో వైద్యుల-రోగుల నిష్పత్తిలో అంతరాన్ని పూరించేందుకు 24 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రుల స్థాయిని పెంచుతూ ఈ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు కనీసం ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

విద్య, వైద్యం సెస్సు 4 శాతానికి పెంపు
వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నులపై 3 శాతంగా ఉన్న విద్య సెస్సును ‘విద్య, వైద్యం సెస్సు’కింద 4 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పేద, గ్రామీణ కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు ద్వారా రూ.11 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

జిల్లాకో నైపుణ్య కేంద్రం ఏర్పాటు
ప్రధాన మంత్రి కౌశల్ కేంద్ర పథకం కింద ప్రతి జిల్లాలో ఓ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని జైట్లీ ప్రకటించారు. ఇందుకోసం 2018-19 బడ్జెట్‌లో రూ.3,400 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.2,356.22 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడానికి దేశవ్యాప్తంగా ఇప్పటికే 306 ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

మహిళా ఉద్యోగులకు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌లో వెసులుబాటు
  • బడ్జెట్‌లో మహిళలపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. పేద మహిళలకు ఇవ్వాల్సిన ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారుల సంఖ్యను 8 కోట్లకు పెంచినట్లు జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వెల్లడించారు.
  • నూతనంగా ఉద్యోగంలో చేరిన మహిళలు అధిక మొత్తంలో టేక్ హోమ్ శాలరీ (నికర జీతం) తీసుకునే విధంగా వెసులుబాటును ఇచ్చింది. ఉద్యోగ భవిష్యనిధిలో వీరి వాటా చెల్లింపును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వారి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను ప్రస్తుతం ఉన్న 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ మేరకు ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్-1952’లో మార్పులు చేస్తున్నట్లు జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. ఇందులో భాగంగా మహిళా ఉద్యోగులు తొలి మూడేళ్ల వరకు 8 శాతం ఈపీఎఫ్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా సామాజిక భద్రత పథకాల్లో భాగంగా మూడేళ్లపాటు కొత్తగా ఉద్యోగాల్లో చేరే అందరు ఉద్యోగులకు ఎంప్లాయర్ (యాజమాన్యం) వాటా ఈపీఎఫ్ 12 శాతాన్నీ ప్రభుత్వమే భరించే ప్రతిపాదన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రధాన్ మంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన కింద వస్త్ర, తోలు, ఫుట్‌వేర్ పరిశ్రమలకు చెందిన ఉద్యోగులు పొందుతున్న ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రయోజనాన్ని మిగిలిన రంగాలకు కూడా వర్తింపచేస్తున్నట్లు వెల్లడించారు.

స్వయం సహాయక బృందాలకు..

జాతీయ గ్రామీణ జీవన కార్యక్రమంలోని క్లస్టర్లలో స్వయం సహాయక బృందాలు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2019 మార్చి వరకు ఈ కార్యక్రమం కోసం ఇచ్చే రుణాలను రూ.75 వేల కోట్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాలను గతేడాదితో పోలిస్తే 37 శాతం పెంచి.. రూ.42,500 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘బేటీ బచావో, బేటీ పఢావో’, సుకన్య సమృద్ధి అకౌంట్ పథకాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయని జైట్లీ పేర్కొన్నారు. ‘నవంబర్ 2017 వరకు బాలికల పేర్లతో 1.26 కోట్ల అకౌంట్లు దేశవ్యాప్తంగా తెరిచారని.. ఇందులో రూ.19,183 కోట్లు దాచుకున్నారు’అని బడ్జెట్‌లో పేర్కొన్నారు.

హోంశాఖకు రూ.92,679 కోట్లు
పారామిలిటరీ బలగాల బలోపేతమే లక్ష్యంగా ఈ సంవత్సరం (2018-19) కేంద్ర బడ్జెట్‌లో హోంశాఖకు నిధుల కేటాయింపు జరిగింది. ఈ సారి రూ.92,679.86 కోట్లను కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 10.5 శాతం అదనం. గత సంవత్సరం (2017-18)లో రూ.83.823.30 కోట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం కేటాయింపుల్లో సగానికిపైగా పారామిలిటరీ దళాలకే వెచ్చించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ పోలీసుల కోసం రూ.6,946.28 కోట్లు, సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 1,750 కోట్లు కేటాయించారు.

రక్షణకు రూ.2.95 లక్షల కోట్లు
Budget 18-19
2018-19 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ. 2,95,511 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపులు రూ. 2.74 లక్షల కోట్ల కంటే 7.81 శాతం ఈ ఏడాది ఎక్కువ. మొత్తం బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయింపులు 12.10 శాతం.. జీడీపీలో 1.58 శాతంగా రక్షణ రంగ కేటాయింపులు ఉన్నాయి. ఇక రక్షణ రంగం కేటాయింపుల మొత్తంలో ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధ నౌకలు, ఇతర రక్షణ సామగ్రి కొనుగోలుకు రూ. 99,947 కోట్లు కేటాయించారు. రక్షణ బడ్జెట్‌లో సిబ్బంది జీతాలు, నిర్వహణ, ఇతరత్రా ఖర్చులకు సంబంధించి రెవెన్యూ వ్యయం రూ. 1,95,947 కోట్లుగా ఉంది. కాగా, రక్షణ రంగ సిబ్బంది పెన్షన్ కోసం ప్రత్యేకంగా రూ. 1,08,853 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కేటాయింపు రూ. 85,740 కోట్లు కంటే 26.60 శాతం అధికం. రక్షణ రంగానికి సంబంధించి దేశీయ పరిశ్రమల ప్రోత్సాహకానికి రెండు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ, ప్రైవేట్, ఎంఎస్‌ఎంఈ విభాగాల్లో దేశీయంగా ఆయుధ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి డిఫెన్స్ ప్రొడక్షన్ పాలసీ-2018ని తీసుకువస్తామని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ పేర్కొన్నారు.

అరుణాచల్ ‘సేలా’ కనుమల్లో సొరంగం
చైనా సరిహద్దుకు సమీపంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని సేలా కనుమల్లో సొరంగం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. 13,700 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో సొరంగం పూర్తయితే... దేశ రక్షణ పరంగా వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్‌కు వేగంగా బలగాల్ని తరలించేందుకు వీలవుతుందని ఆయన చెప్పారు.

సాంస్కృతిక శాఖకు రూ.2,843 కోట్లు
సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు బడ్జెట్‌లో రూ.2,843 కోట్లను కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 3.82 శాతం ఎక్కువ. గత బడ్జెట్‌లో ఆ శాఖకు రూ.2,738.47 కోట్లను కేటాయించారు. మరోవైపు భారత పురావస్తు శాఖకు రూ.974.56 కోట్లను కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 5.42 శాతం అధికం. గ్రంథాలయాలకు రూ.109.18 కోట్లు, మ్యూజియాల కోసం రూ.80.60 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ‘కళా సంస్కృతి వికాస్ యోజన’పథకానికి రూ.310 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా మహాత్మా గాంధీ హెరిటేజ్ సైట్స్ మిషన్ అండ్ దండి సంబంధిత ప్రాజెక్టులు, కళలు, సంస్కృతి, స్కాలర్‌షిప్, ఫెలోషిప్‌లను అందిస్తోంది.

ముద్రా యోజనకు రూ.3 లక్షల కోట్లు
2018-19 ఆర్థిక సంవత్సరానికి ముద్రా పథకం కింద రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. 2015 ఏప్రిల్‌లో ప్రారంభించిన ముద్రా యోజన పథకం ద్వారా రూ.4.6 లక్షల కోట్ల రుణాలను ఇచ్చారు. ఈ పథకం కింద 10.38 కోట్ల మంది లబ్ధిపొందారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన(పీఎమ్‌ఎమ్‌వై)లో శిశు, కిషోర్, తరుణ్ అనే పథకాల కింద రుణాలను ఇస్తారు.

ఘనవ్యర్థాల నిర్వహణకు ‘గోబర్ ధన్’
వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్ మిషన్’కింద 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అలాగే ఘనవ్యర్థాల నిర్వహణ కోసం గోబర్-ధన్ అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రతిపాదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని మరుగుదొడ్లు నిర్మిస్తామని ప్రకటించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇప్పటికే 6 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించినట్లు జైట్లీ పేర్కొన్నారు. భారత్‌ను బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మార్చే లక్ష్యంలో భాగంగా గోబర్-ధన్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-ఆగ్రో రిసోర్సెస్ ధన్) కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పశువుల పేడ, ఘన వ్యర్థాలను కంపోస్ట్, ఎరువులు, బయోగ్యాస్‌లా మార్చడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు.

తయారీకి చేయూత
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘భారత్‌లో తయారీ’లో భాగంగా దేశీ తయారీని ప్రోత్సహించే చర్యలను ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. పది రంగాలకు సంబంధించి దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలను భారీగా పెంచారు. సిల్క్ ఫ్యాబ్రిక్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రెట్టింపు చేశారు. ప్రస్తుతం ఇది 10 శాతం ఉండగా దీన్ని 20 శాతంగా బడ్జెట్లో పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లపై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం చేశారు. మొబైల్ యాక్సెసరీలపై 7.5 శాతం నుంచి 15 శాతానికి, టీవీలపైనా 15 శాతానికి కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. కొత్తగా చార్జింగ్ అడాప్టర్లపై 10 శాతం సుంకం ప్రవేశపెట్టారు. ముఖ్యంగా పళ్లరసాలపై భారీగా పెంచారు. కాన్‌బెర్రీ జ్యూస్‌పై ఐదు రెట్లు పెంచి 50 శాతం చేశారు. అన్ని రకాల పళ్ల, కూరగాయల జ్యూస్‌పైనా 30 నుంచి 50 శాతం చేశారు. సిల్క్ ఫ్యాబ్రిక్స్ మాదిరే పాదరక్షలపైనా దిగుమతి సుంకాన్ని 20 శాతానికి పెంచారు.

డీవోపీటీకి రూ. 192 కోట్లు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దేశ విదేశాల్లో శిక్షణ ఇచ్చేందుకు, అందుకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 2018-19 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.192 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో రూ.75.35 కోట్లతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ అండ్ మేనేజ్‌మెంట్(ఐఎస్‌టీఎం), లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ) సంస్థల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు.

రాష్ట్రపతి వేతనం రూ.5 లక్షలు
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వేతనాలు భారీగా పెరిగాయి. రాష్ట్రపతి వేతనం నెలకు రూ.5 లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనం నెలకు రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే గవర్నర్ల వేతనం రూ.3.5 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రపతికి నెలకు రూ.1.50 లక్షలు, ఉపరాష్ట్రపతికి 1.25 లక్షలు, గవర్నర్లకు రూ.1.10 లక్షల చొప్పున జీతాలు చెల్లిస్తున్నారు. ఈ వేతనాల పెంపును బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ..వారి జీతభత్యాలు చివరిసారి 2006 జనవరి 1న పెరిగిన సంగతిని గుర్తుచేశారు. రెండేళ్ల క్రితం ఏడో వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి కేబినెట్ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు రాష్ట్రపతి కన్నా ఎక్కువ వేతనాలు పొందుతున్న సంగతి తెలిసిందే.
అలాగే... ఎంపీల మూల వేతనాలు రెట్టింపు కానున్నాయి. 2018 ఏప్రిల్ 1 నుంచి వారి మూలవేతనాన్ని ప్రస్తుతమున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ తాజా బడ్జెట్‌లో జైట్లీ ప్రతిపాదించారు. వారికిచ్చే ఇతర భత్యాలను కూడా పెంచనున్నారు. ద్రవ్యోల్బణం ఆధారంగా ఐదేళ్లకోసారి ఎంపీల వేతనాలు, భత్యాలను ఆటోమేటిక్‌గా సవరించేందుకు కూడా జైట్లీ కొత్త చట్టాన్ని ప్రతిపాదించారు.

ఇక కంపెనీలకూ ‘ఆధార్’
దేశంలోని ప్రతి వ్యక్తికి ఆధార్ సంఖ్య ఉన్నట్లే ఇకపై ప్రతి కంపెనీకి కూడా ఓ గుర్తింపు సంఖ్య ఉండేలా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న కంపెనీ కానీ, పెద్ద కంపెనీ కానీ ప్రతి ఒక్క కంపెనీకి ఓ గుర్తింపు కార్డు ఉండాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రత్యేకమైన పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 119 కోట్ల మంది భారతీయులకు ఆధార్ కార్డును కేంద్రం అందజేసింది.

రైల్వేలకు కేటాయింపులు రూ.1,48,528 లక్షల కోట్లు
Budget 18-19
  • రైల్వేలకు ఈసారి బడ్జెట్‌లో 1,48,528 లక్షల కోట్లను కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 13 శాతం అదనం. గత ఏడాది బడ్జెట్‌లో రైల్వేలకు రూ.1.31 లక్షల కోట్లు కేటాయించారు. రైల్వేలను పరిపుష్టం చేసి రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచనున్నట్లు అరుణ్‌జైట్లీ చెప్పారు. ‘రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్’ కింద నిధులు కేటాయించి ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. దేశవ్యాప్తంగా 18 వేల కి.మీ. డబ్లింగ్, 5 వేల కి.మీ. మేర 3, 4 లైన్ల ట్రాక్‌లుగా మార్చటం వల్ల రైల్వే నెట్‌వర్క్ దాదాపుగా బ్రాడ్‌గేజ్‌లోకి మారుతుందని జైట్లీ చెప్పారు. రైల్వే ట్రాక్‌ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, 3,600 కి.మీ మేర రైల్వే లైన్లను పునరుద్ధరించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు.
  • దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో దశలవారీగా వైఫై సదుపాయం కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 బడ్జెట్‌లో ప్రకటించారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణతోపాటు ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయనున్నారు. బడ్జెట్‌లో కొత్త రైళ్లేవి ప్రకటించలేదు.
  • ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభూతి కోసం ప్రపంచశ్రేణి రైళ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా చెన్నైలోని కోచ్‌ల తయారీ కేంద్రంలో ‘ట్రైన్ 18’, ‘ట్రైన్ 20’ తయారు కానున్నాయి. జర్మనీకి చెందిన లింక్ హాఫ్‌మాన్ బాష్ టెక్నాల జీతో తయ్యారయ్యే ఈ ప్రయాణికుల రైళ్లు 2018లో ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో ‘ట్రైన్ 18’ అని వ్యవహరిస్తున్నారు. గంటకు 160 కి.మీ వేగంతో దూసుకెళ్లటం వీటి ప్రత్యేకత. ఇక ‘ట్రైన్ 20’ మరింత ఆధునికంగా స్లీపర్ కోచ్‌లతో ఉంటుంది. 2020లో ఇది అందుబాటులోకి రానుంది.

రైల్వేలకు ఇచ్చినవి..
  • రైల్వేస్టేషన్ల పరిసరాలలోవాణిజ్య సముదాయాల అభివృద్ధి
  • రైల్వే సిబ్బందికి శిక్షణ కోసం వడోదరలో ఇన్‌స్టిట్యూట్.
  • 25,000 మించి ప్రయాణికులు రాకపోకలు సాగించే అన్ని రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు.
  • వచ్చే రెండేళ్లలోగాబ్రాడ్ గేజ్ పరిధిలో కాపలా లేని 4,267 రైల్వే గేట్ల తొలగింపు.
  • సిగ్నలింగ్, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ ఆధునీకరణ కోసం రూ. 2,025 కోట్లు
  • రైల్వే ట్రాక్‌ల నవీకరణ కోసం రూ.11,450 కోట్లు
  • రాష్ట్రీయ రైల్ సంరక్షణ కోష్ తదితరాల కింద ప్రయాణికులభద్రత కోసం రూ.73,065 కోట్లు

విమానయాన రంగానికి 6 వేల కోట్లు

పౌర విమానయాన శాఖకు తాజా బడ్జెట్‌లో రూ.6,602.86 కోట్ల నిధులు దక్కా యి. గతేడాదితో పోలిస్తే కేటాయింపులు మూడు రెట్లు పెరిగాయి. అయితే ఇందులో రూ.4,469.5 కోట్లను కేవలం రెండు విమానాలు కొనడానికే ప్రత్యేకంగా కేటాయించారు. రెండు బోయింగ్ 777-300 ఈఆర్ విమానాలను కొనుగోలు చేసి కేవలం వీవీఐపీల పర్యటనల కోసం మాత్రమే వాడనున ా్నరు. ఉడాన్ పథకం కోసం రూ.1,014.09 కోట్లను కేటాయించారు.

సీ ప్లేన్ పరిశ్రమకు ప్రోత్సాహం..
దేశంలో సీ ప్లేన్ (నీటి మీదనే ల్యాండ్, టేకాఫ్ అయ్యే చిన్న విమానాలు)ల కార్యకలాపాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. గతేడాది డిసెంబరులో విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ముంబై దగ్గర్లో వీటిని ప్రయోగా త్మకంగా నడిపింది. 400 మిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో 100 సీ ప్లేన్‌లను కొనేందుకు కూడా ఈ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.

మౌలిక వసతుల కల్పనకు రూ.5.97 లక్షల కోట్లు
2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ మౌలిక వసతుల కల్పనకు రూ.5.97 లక్షల కోట్లను కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ కేటాయింపులు రూ. లక్ష కోట్ల మేరకు పెరిగాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి కేటాయించింది రూ. 4.94 లక్షల కోట్లే. వృద్ధికి ఊతమివ్వడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ రంగానికి కేటాయింపులు పెంచారు. రోడ్డు రవాణా, హైవేలకు మొత్తం రూ.71 వేల కోట్లు కేటాయించారు. 2018-19లో 9,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను విస్తరించనున్నట్టు ప్రకటించారు. భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా దేశ సరిహద్దులు, వెనకబడిన ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీని విస్తరిస్తామన్నారు. భారత్‌మాల ఫేజ్ 1లో 35,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను, రూ.5.35 లక్షల కోట్లతో నిర్మిస్తామన్నారు.

సగానికిపైగా బడ్జెట్ గ్రామాలకే
తాజా బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. బడ్జెట్‌లో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాలకే కేటాయించారు. వ్యవసాయంతో పాటు గ్రామీణాభివృద్ధి రంగాలకు పెద్దపీట వేశారు. 2018-19కిగాను మొత్తం బడ్జెట్‌లో సగానికిపైగా.. ఏకంగా 14.34 లక్షల కోట్లను గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర పథకాల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

'ఉపాధి'కి దన్ను..
  • గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు కీలకంగా మారిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకానికి మోదీ ప్రభుత్వం ఈసారీ నిధులను భారీగా విదిల్చింది.
  • 2017-18లో బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే సవరించిన అంచనాలు రూ.55,000 కోట్లకు పెంచడం ఈ పథకం అమలు జోరుకు నిదర్శనం.
'స్వచ్ఛ భారత్' జోరు..
  • 2019 అక్టోబర్ 2 నాటికి(గాంధీ జయంతి) దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పారిశుధ్యాన్ని(సెప్టిక్ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం.
  • ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ 6 కోట్ల వ్యక్తిగత టాయిలెట్ల నిర్మాణం పూర్తయిందని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 1.88 కోట్లను నిర్మించే లక్ష్యంతో బడ్జెట్‌ను పెంచినట్లు జైట్లీ పేర్కొన్నారు.
  • ఈ ఏడాది జనవరి 1 నాటికి 284 జిల్లాల్లో మొత్తం 1,32,038 గ్రామ పంచాయతీలు, 3,02,445 గ్రామాలను బహిరంగ మరుగుదొడ్ల రహితం(ఓడీఎఫ్)గా ప్రకటించారు. ఇక 9 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను(సిక్కిం, హిమాచల్, అరుణాచల్, డామన్ అండ్ డయ్యూ, కేరళ, ఉత్తరాఖండ్, హరియాణా, గుజరాత్) ఓడీఎఫ్‌గా ప్రకటించారు. మొత్తం ఓడీఎఫ్ ప్రాంతాల సంఖ్య 8,02,054కు చేరింది.
  • కాగా, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ పథకం కోసం తాజా బడ్జెట్‌లో రూ.2,500 కోట్లు కేటాయించారు.

ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ..

దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని గ్రామీణ ప్రాంతాలకూ తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. నాలుగేళ్లలో 28,000 ఆర్సినిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనేది కూడా మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది అరకొర నీటి సదుపాయం ఉన్న 60,000 ప్రాంతాలను, తాగునీరు అందని 9,000 ప్రాంతాలను ఈ పథకం కిందికి తీసుకురావాలని నిర్ణయించారు.
Budget 18-19

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన..
  • విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు.. దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ లక్ష్యం(సమగ్ర విద్యుదీకరణ స్కీమ్స్-ఐపీడీఎస్). 2018 మే 1 కల్లా దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు.
  • ఐపీడీఎస్‌లో భాగంగా సౌభాగ్య ఘర్ యోజన(ఉచిత విద్యుత్ కనెక్షన్లు) కోసం రూ.3,700 కోట్లను, ఫీడర్లను వేరు చేసేందుకు గాను(33/11 కేవీ సబ్‌స్టేషన్ల ఏర్పాటు, హై-లో టెన్షన్ విద్యుల్ లైన్ల నిర్మాణం వంటివి) రూ.4,935 కోట్లను కేటాయించారు.
  • గ్రామాల్లో కొత్తగా 175 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం.
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)..
  • మారుమూల గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పథకం ఇది. 2011-14 మధ్య రోజుకు సగటు రోడ్డు నిర్మాణం 73 కిలోమీటర్లు కాగా, 2016-17లో ఇది 133 కిలోమీటర్లకు పెరిగిందని జైట్లీ పేర్కొన్నారు.
  • గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించడానికి మరో 57,000 కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. తద్వారా అర్హతగల గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం అనుసంధానం లక్ష్యం. ప్రస్తుతం 82 శాతం అనుసంధానం పూర్తయింది. 2019 మార్చికల్లా 100 శాతం లక్ష్యాన్ని సాధించనున్నట్లు జైట్లీ చెప్పారు.
  • 2021 నాటికి మిగిలిన 65,000 అర్హత గల గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించేందుకు దాదాపు 2.3 లక్షల కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలనేది లక్ష్యం కాగా, దీన్ని 2019 నాటికే పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2018 జనవరి 15 నాటికి) 25 వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించారు. 6,400 ప్రాంతాలను అనుసంధానించగలిగారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)..
2022 కల్లా దేశంలో అందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామనేది మోదీ సర్కారు నినాదం. 2019 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లులేనివాళ్లు, పూరిళ్లలో ఉంటున్న వారికి ఒక కోటి పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ఈ లక్ష్యంలో ఈ ఏడాది మార్చి కల్లా 51 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కానుందని ప్రభుత్వం పేర్కొంది. 2019 మార్చి నాటికి మరో 49 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు వెల్లడించింది. కాగా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో చూస్తే.. 2017 డిసెంబర్ నాటికి 15.57 లక్షల గ్రామీణ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలు, ఎస్‌సీ/ఎస్‌టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్ధిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి.
1.5 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం
ఇక దేశంలో జనాభా కంటే ఎక్కువ మొబైల్స్ అందుబాటులో ఉన్నా.. ఇంటర్నెట్ విషయంలో గ్రామీణ భారతం ఎంతో వెనుకంజలో ఉంది. ఈ లోటు భర్తీకి నేషనల్ నాలెడ్‌‌జ సెట్‌వర్క్ పేరుతో గ్రామ పంచాయతీల్ని అనుసంధానించే ప్రాజెక్టును గత ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే లక్ష గ్రామ పంచాయతీల్ని అనుసంధానించినట్లు ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 1.5 లక్షల గ్రామాల్ని శరవేగంగా భారత్ నెట్‌లోకి చేర్చే చర్యలు ముమ్మరం చేస్తామని ఈ బడ్జెట్‌లోత పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ కనెక్టివిటీ పెంచేందుకు ఐదు లక్షల వైఫై హాట్‌స్పాట్ల ఏర్పాటు ప్రకటన, డిజిటల్ ఇండియా పథకానికి కేటాయింపులు రెట్టింపు చేయడం, 5జీ మొబైల్ టెక్నాలజీ పరీక్షలకు చెన్నై ఐఐటీలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన ఇతర ముఖ్యాంశాలు.
పర్యాటకంపై ప్రత్యేక దృష్టి
దేశంలోని 10 ప్రముఖమైన చరిత్రాత్మక, సాంప్రదాయిక పర్యాటక కేంద్రాలను 'ఐకానిక్ టూరిజం డెస్టినేషన్స్'గా మార్చేందుకు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నామని జైట్లీ పేర్కొన్నారు. దీంతోపాటుగా భారత పురావస్తు శాఖ ప్రతిపాదించిన 100 ఆదర్శ కట్టడాల వద్ద పర్యాటకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ అగ్‌మెంటేషన్ యోజన (హృదయ్)లో భాగంగా ప్రాచీన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రోప్‌వేలు నిర్మించటం.. ఆయా ప్రాంతాలకు రైల్వే సదుపాయం కల్పించటం, సమీప రైల్వే స్టేషన్ల అభివృద్ధి వంటివి చేపట్టామన్నారు.
పౌష్టికాహార మిషన్‌కు రూ.3 వేల కోట్లు
  • జాతీయ పౌష్టికాహార మిషన్(ఎన్‌ఎన్‌ఎం)కు ఈ బడ్జెట్‌లో కేటాయింపుల్ని మూడు రెట్లు పెంచారు. గతేడాది రూ.950 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.3,000 కోట్లకు పెంచారు.
  • రాబోయే మూడేళ్లలో(2017-20) ఎన్‌ఎన్‌ఎంకు రూ.9,046 కేటాయించాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు బడ్జెట్‌లో తాజా కేటాయింపులు చేశారు. చిన్నారుల్లో పోషకాహారలోపం తదితర సమస్యల్ని నివారించడానికి ఎన్‌ఎన్‌ఎం కృషి చేస్తోంది.
  • ఈ ఏడాది కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్‌లో రూ.24,700 కేటాయించగా.. దీంట్లో రూ.16,334 కోట్లను అంగన్‌వాడీ సేవలకు వినియోగిస్తారు.
  • గర్భిణులు, పాలిచ్చే తల్లులకు రూ.6 వేలు అందించే ప్రధాన్‌మంత్రి మాతృ వందన యోజనకు గతేడాది రూ.2,594 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తం రూ.2,400 కోట్లకు పరిమితమైంది. బేటీ బచావో-బేటీ పడావో పథకానికి ఈ సారి రూ.280 కోట్లు కేటాయించారు. గతేడాది ఈ మొత్తం రూ.200 కోట్లు. మహిళల రక్షణకు 2013లో రూ.3,500 కోట్లతో ఏర్పాటు చేసిన నిర్భయ ఫండ్‌ను ఈసారి రూ.500 కోట్లకు పెంచారు. చిన్నారుల్ని రక్షించే సేవలకు ఈసారి రూ.725 కోట్లు ఇవ్వనున్నారు.
15 శాతం పెరిగిన సబ్సిడీలు
ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీలు ఈసారి 15 శాతం పెరిగాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీల కోసం కేంద్రం రూ.2.64 లక్షల కోట్లు కేటాయించింది. బడ్జెట్ సవరణల తర్వాత 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ సబ్సిడీల కోసం రూ.2,29,715.65 కోట్లు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆహార సబ్సిడీ కోసం రూ.1,69,323 కోట్లు కేటాయించగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,40,281 కోట్లు కేటాయించారు. ఎరువుల కోసం సబ్సిడీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను రూ.70,079.85 కోట్లు కేటాయించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.64,973.5 కోట్లు కేటాయించారు. యూరియా కోసమే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.44,989.5 కోట్లు కేటాయించారు. ఫాస్ఫేట్, పొటాషియం ఎరువుల కోసం రూ.25,090.35 కోట్లు కేటాయించగా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.22,251.8 కోట్లు కేటాయించారు. కాగా, పెట్రోలియం సబ్సిడీ కోసం రూ.24,932.8 కోట్లు, ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.24,933 కోట్లు కేటాయించారు.
'మెట్రో'లకు 20% కోత
కేంద్ర బడ్జెట్‌లో మెట్రో రైలు ప్రాజెక్టులకు 20 శాతం కోత పడింది. మెట్రో ైప్రాజెక్టులకు రూ.14.264.60 కోట్లను కేటాయించారు. ఈ మొత్తం 2017-18లో రూ.17,810 కోట్లుగా ఉంది. అయితే ఈ మొత్తంలో ఏ ప్రాజెక్టుకు ఎంతెంత కేటాయించారన్న దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు జాతీయ రాజధాని ప్రాంతంలో ఢిల్లీ మెట్రోరైలు(డీఎంఆర్‌సీ) విస్తరణకు ఈ బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం గత సంవత్సరం రూ.150 కోట్లుగా ఉండేది.
మారని పెట్రోలు, డీజిల్ ధరలు
బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ఆశలు పెట్టుకున్న సామాన్యుడికి ఆర్థిక మంత్రి జైట్లీ మొండిచేయి చూపారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించినట్టే తగ్గించి.. మరో రూపంలో వాతపెట్టారు. దీంతో పెట్రో ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. 2018-19 బడ్జెట్ ప్రతిపాదనల్లో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 2 చొప్పున ఎకై ్సజ్ పన్నును తగ్గించారు. అలాగే ఆ రెండింటిపై రూ.6 చొప్పున అదనపు ఎకై ్సజ్ పన్నును తగ్గించడంతో అందరూ సంతోషించారు. మొత్తంగా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 8 తగ్గించినా.. అంతే మొత్తంలో 'లెవీ ఆఫ్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ సెస్' పేరిట భారీగా వాత పెట్టారు. దీంతో ధరలు మళ్లీ యథాస్థితికి చేరుకున్నాయి.
ఢిల్లీకి రూ.790 కోట్లు
2018-19 వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి రూ.790 కోట్లు కేటాయించింది. కేంద్ర పన్నుల వాటా పెంచాలని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం డిమాండ్ చేసినప్పటికీ ఎలాంటి మార్పూలేదు. ఈ బడ్జెట్‌లో కేంద్ర సాయం రూ.449.99 కోట్లు. ఇది గత బడ్జెట్‌లో 412.98 కోట్లు. 1984 అల్లర్ల బాధిత కుటుంబాల కోసం గత బడ్జెట్‌లో రూ.15 కోట్లివ్వగా ఈసారి రూ.10 కోట్లే కేటాయించింది. కేంద్ర పన్నుల వాటా కింద ఢిల్లీకి రూ.325 కోట్లు కేటాయించింది. 2001-02 నుంచి కేంద్రంలో ప్రభుత్వాలు మారినా ఈ మొత్తం మాత్రం స్థిరంగా ఉంది.
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు చర్యలు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు దేశ రాజధాని ప్రాంతంలో వాయుకాలుష్యం నియంత్రణకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు బడ్జెట్‌లో తెలిపారు. ఢిల్లీ సమీప రాష్ట్రాలతో కలసి కేంద్రం ప్రభుత్వం ఈ పథకం అమలును పర్యవేక్షించనుంది. ఈ పథకం ద్వారా పంట అవశేషాలను తొలగించేందుకు రైతులకు అవసరమైన ప్రత్యేక యంత్రాలను రాయితీపై అందజేయనున్నట్లు తెలిపారు. హరియాణా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో వాయుకాలుష్యానికి కారణమవుతున్న పంట అవశేషాలు తొలగించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.
Budget 18-19

తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు

తెలంగాణ
  • తెలంగాణ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 2018-19 బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించారు.
  • హైదరాబాద్ ఐఐటీలో నాణ్యత ప్రమాణాల పెంపునకు రూ.75 కోట్లు కేటాయించారు.
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని జాకారంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ములుగుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రానుంది. దేశంలో తొలి గిరిజన విశ్వవిద్యాలయం మధ్యప్రదేశ్‌లోని అమరకంఠక్‌లో ఉండగా, ములుగులో ఏర్పాటయ్యే వర్సిటీ రెండోదిగా రికార్డులకెక్కనుంది.
పన్నుల వాటా...
14వ ఆర్థిక సంఘం సూచించిన మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా పంపిణీ అవుతుంది. మొత్తం రూ.7.88 లక్షల కోట్ల పన్నుల వాటాను రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాల వారీగా అందులో 2.437 శాతం నిధులు రాష్ట్రానికి విడుదలవుతాయి. ఈ నిధులను కేంద్రం ఏ నెలకానెలా విడుదల చేస్తుంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణకి పన్నుల వాటాలో రూ.16,401.13 కోట్లు వచ్చాయి. దీంతో వచ్చే ఏడాది రూ.2,806.30 కోట్లు రాష్ట్రానికి అదనంగా రానున్నాయి.
తెలంగాణకు కేంద్ర పన్నుల ఆదాయం (రూ.కోట్లలో)..

సెంట్రల్ జీఎస్టీ

6,181.16

కార్పొరేట్ ట్యాక్స్

5,392.78

ఆదాయ పన్ను

4,772.31

కస్టమ్స్ ట్యాక్స్

946.26

ఎకై్సజ్ డ్యూటీ

922.11

ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ

511.77

మొత్తం

19,207.43


కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా
2018-19కి కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.33,929.84 కోట్లుగా ఉంది. ఇది మొత్తం పంపిణీ చేసే పన్నుల్లో (42%రాష్ట్రాలకు) 4.305%గా ఉంది. ఇందులో కార్పొరేషన్ పన్ను రూ.9526.44 కోట్లు, ఆదాయ పన్ను రూ.8,430.37 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.10,919.11 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.904 కోట్లు, కస్టమ్స్ ట్యాక్స్ రూ.1671.58 కోట్లు, కేంద్ర ఎకై ్సజ్ డ్యూటీ రూ.1628.92 కోట్లు తదితరాలు ఉన్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది కేంద్ర పన్నుల్లో వాటా రూ. 4,791 కోట్లు అదనంగా రానుంది.

ఏడాది

ఏపీకి కేంద్ర పన్నుల్లో వాటా...

2014-15

రూ. 14,106.93 కోట్లు

2015-16

రూ. 21,893.79 కోట్లు

2016-17

రూ. 26,263.88 కోట్లు

2017-18

రూ. 29,138.82 కోట్లు

2018-19

రూ. 33,929.84 కోట్లు

Published date : 03 Feb 2018 04:03PM

Photo Stories