కేంద్ర బడ్జెట్ 2017-18
బడ్జెట్ ముఖ్యాంశాలు
- మొత్తం బడ్జెట్ రూ.21,46,735 కోట్లు
- పథకాల వ్యయం రూ.9,45,078 కోట్లు
- పథకాలేతర వ్యయం రూ. 12,01,657 కోట్లు
- 2017-18లో ద్రవ్యలోటు లక్ష్యం 3.2 శాతం.(2016-17లో ఇది 3.5 శాతం)
- 2017-18లో రెవెన్యూ లోటు 1.9 శాతం (2016-17లో ఇది 2.1 శాతం)
- రూ.5 లక్షల లోపు ఆదాయంపై పన్ను 5 శాతానికి తగ్గింపు.
- రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న సంస్థలపై కార్పొరేట్ పన్ను 30 నుంచి 25 శాతానికి తగ్గింపు.
- రూ.3 లక్షలకు పైబడిన అన్ని నగదు లావాదేవీల నిషేధం.
- 2017-18లో వ్యవసాయ వృద్ధి లక్ష్యం 4.1 శాతం. రుణాల మంజూరు లక్ష్యం రూ.10 లక్షల కోట్లు.
- రాజకీయ పార్టీలకు రూ.2 వేలకు పైబడిన నగదు విరాళాలపై నిషేధం.
- రైల్వేలకు రూ. 1.31 లక్షల కోట్లు కేటాయింపు.
- IRCTC ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై సర్వీసు చార్జీల ఎత్తివేత.
- దేశం విడిచి వెళ్లిన ఎగవేతదారుల ఆస్తులను స్వాధీనం చేసుకునేలా చట్ట సవరణలు.
- వయోవృద్ధులకు ఆధార్ ఆధారిత ఆరోగ్య కార్డులు. కనీసం 8 శాతం రాబడినిచ్చే వర్షిత పింఛన్ పథకం ఏర్పాటు
- 2017-18 లో 2.50 లక్షల డిజిటల్ లావాదేవీల లక్ష్యం.
- దేశంలో ఇంటర్నెట్ విస్తృతి కోసం భారత్ నెట్‌కు రూ. 10 వేల కోట్లు నిధులు.
- గ్రామీణుల కోసం కొత్తగా ‘డిజి గావ్’ ప్రారంభం
- POS పరికరాలపై సుంకం రద్దు. మార్చికల్లా 10 లక్షల పీఓఎస్‌ల కొనుగోలు.
- డిజిటల్ పేమెంట్ల పర్యవేక్షణకు ‘పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు’ ఏర్పాటు
- 2018 మే నాటికి దేశంలోని 100 శాతం గ్రామాలకు విద్యుత్.
- పేదలకు 2019 నాటికి కోటి గృహాల నిర్మాణం
- 2017-18 ఆర్థిక సంవత్సరానికి రాయితీల అంచనా రూ. 2,40,338 కోట్లు.
- ప్రభుత్వ బ్యాంకులకు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు
- 2017-18లో రూ.72 వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ
2017-18 Budget Documents
Key Features of Budget 2017
Budget Speech
Budget at a Glance
Receipt Budget
Expenditure Budget
The Macro Economic Framework Statement
The Medium Term Fiscal Policy Statement
The Fiscal Policy Strategy Statement
Implementation of Budget Announcements 2016-2017
భారత్‌ను Transform, Energise and Clean దేశంగా మార్చడమే తాజా బడ్జెట్ ఎజెండా అని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. దేశాన్ని ‘టెక్’ ఇండియాగా అభివృద్ధి చేసేందుకు 10 రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అవి
రైతులు: ఐదేళ్లలో దేశంలోని రైతుల ఆదాయం రెండింతలు చేయడం
గ్రామీణ భారతం: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, కనీస మౌలిక సౌకర్యాల పెంపు
యువత: యువతకు సరైన విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన
పేద, వెనుకబడిన వర్గాలు: సామాజిక భద్రత, ఆరోగ్య రంగాలను బలోపేతం చేయడం, చవకగా గృహాలను అందించడం ద్వారా పేద, వెనుకబడిన వర్గాలకు తోడ్పాటు
మౌలిక సదుపాయాలు: మరింత సమర్థవంతంగా, ఉత్పాదకత పెంచేలా, నాణ్యమైన జీవితం గడిపేలా మౌలిక సదుపాయాల కల్పన
ఆర్థిక రంగం: సమర్థవంతమైన సంస్థల ద్వారా ఆర్థిక అభివృద్ధి, సుస్థిరత సాధన
డిజిటల్ ఎకానమీ: వేగవంతమైన, పారదర్శక, జవాబుదారీతనాన్ని పెంపొందించే వ్యవస్థ కోసం డిజిటల్ ఎకానమీకి ప్రోత్సాహం
పబ్లిక్ సర్వీస్: ప్రజల భాగస్వామ్యం ద్వారా ఉత్తమపాలన, కేంద్రీయ రక్షణ రవాణా విధా నం, ఆర్థిక నేరాగాళ్ల విషయంలో కఠిన చట్టం
సమర్థవంతంగా ఆర్థిక నిర్వహణ: సరైన రీతిలో వనరుల విస్తరణ, ఆర్థిక స్థిరత్వాన్ని సంరక్షించుకోవడం కోసం తెలివైన (Prudent) ఆర్థిక నిర్వహణ
పన్నుల నిర్వహణ: నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గౌరవించడం.
ముఖ్య శాఖలు/రంగాలు- కేటాయింపులు
- మౌలిక వసతుల కల్పనకు రూ.3.96 లక్షల కోట్లు.
- రక్షణ రంగానికి రూ.2,74,114 కోట్లు.
- హోంశాఖకు రూ. రూ.83 వేల కోట్లు.
- మహిళా శిశు సంక్షేమానికి రూ.1.84 లక్షల కోట్లు.
- వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.87 లక్షల కోట్లు
- ఎస్సీ సంక్షేమానికి రూ. 52,393 కోట్లు.
- ఎస్టీలకు రూ.31,920 కోట్లు, మైనారిటీ వ్యవహారాలకు రూ.4,195 కోట్లు.
- వైద్యం, ఆరోగ్యానికి రూ.47,352 కోట్లు
- గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1,07,758 కోట్లు.
- ఉపాధి హామీకి రూ.48 వేల కోట్లు.
- స్వచ్ఛ భారత్‌కు రూ.13,948 కోట్లు.
- శాస్త్ర, సాంకేతిక రంగానికి రూ.37,435 కోట్లు.
- పర్యాటక రంగానికి రూ. 1,840 కోట్లు.
- జాతీయ రహదారులకు రూ. 64 వేల కోట్లు.
- రవాణాశాఖకు రూ.1,24,373 కోట్లు.
- పాఠశాల విద్య, అక్షరాస్యతకు రూ.46,356 కోట్లు.
- ఉన్నత విద్యకు రూ.33,329 కోట్లు.
బడ్జెట్ స్వరూపం..(రూ. కోట్లలో)
2015-16 వాస్తవ కేటాయింపులు అంచనాలు | 2016-17 బడ్జెట్ అంచనాలు | 2016-17 సవరించిన అంచనాలు | 2017-18 బడ్జెట్ అంచనాలు | |
1.రెవెన్యూ వసూళ్లు (2+3) | 11,95,025 | 13,77,022 | 14,23,562 | 15,15,771 |
2) పన్ను ఆదాయం | 9,43,765 | 10,54,101 | 10,88,792 | 12,27,014 |
3) పన్నేతర ఆదాయం | 2,51,260 | 3,22,921 | 3,34,770 | 2,88,757 |
4. మూలధన వసూళ్లు (5+6+7) | 5,95,758 | 6,01,038 | 5,90,845 | 6,30,964 |
5) రుణాల రికవరీ | 20,835 | 10,634 | 11,071 | 11,932 |
6) ఇతర వసూళ్లు | 42,132 | 56,500 | 45,500 | 72,500 |
7) అప్పులు, ఇతరత్రా వసూళ్లు | 5,32,791 | 5,33,904 | 5,34,274 | 5,46,532 |
8) మొత్తం వసూళ్లు (1+4) | 17,90,783 | 19,78,060 | 20,14,407 | 21,46,735 |
9) పథకాలుకాక ఇతర వ్యయం(10+4) | 10,65,669 | 11,76,094 | 11,44,560 | 12,01,657 |
10) రెవెన్యూ ఖాతా | 9,92,142 | 11,29,137 | 11,03,049 | 11,62,877 |
11) వడ్డీ చెల్లింపులు | 4,41,659 | 4,92,670 | 4,83,069 | 5,23,078 |
12) మూలధన ఖాతా | 73,527 | 46,957 | 41,511 | 38,780 |
13) పథకాల వ్యయం (14+15) | 7,25,114 | 8,01,966 | 8,69,847 | 9,45,078 |
14) రెవెన్యూ ఖాతా | 5,45,619 | 6,01,900 | 6,31,511 | 6,74,057 |
15) మూలధన ఖాతా | 1,79,495 | 2,00,066 | 2,38,336 | 2,71,021 |
16) మొత్తం వ్యయం (9+13) | 17,90,783 | 19,78,060 | 20,14,407 | 21,46,735 |
17) రెవెన్యూ వ్యయం (10+14) | 15,37,761 | 17,31,037 | 17,34,560 | 18,36,934 |
18) మూలధన ఆస్తుల కోసం గ్రాంట్లు | 1,31,754 | 1,66,840 | 1,71,472 | 1,95,350 |
19) మూలధన వ్యయం (12+15) | 2,53,022 | 2,47,023 | 2,79,847 | 3,09,801 |
20) రెవెన్యూ లోటు (17-1) | 3,42,736 | 3,54,015 | 3,10,998 | 3,21,163 |
21) ద్రవ్య లోటు (16-(1+5+6)) | 5,32,791 | 5,33,904 | 5,34,274 | 5,46,532 |
22) ప్రాథమిక లోటు (21-11) | 91,132 | 41,234 | 51,205 | 23,454 |
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.87 లక్షల కోట్లు
వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ దిశగా 2017-18లో రైతులకు రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత బడ్జెట్‌లో ఇది 9 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం వృద్ధిరేటు 4.1 శాతం ఉంటుందని అంచనా వేశారు.
- 2016-17 బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయించిన రూ.52,821 కోట్లను 2017-18లో రూ.58,663 కోట్లకు పెంచారు.
- ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకానికి రూ.9 వేల కోట్లు కేటాయించారు. గతేడాది ఇది రూ.13,240 కోట్లు.
- రైతులకు సబ్సిడీ వడ్డీపై అందించే స్వల్పకాలిక రుణాలకు రూ.15 వేల కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు.
- సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు నాబార్డులో రూ.5 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు.
- నాబార్డులో ఇప్పటికే ఏర్పాటు చేసిన దీర్ఘకాలిక ఇరిగేషన్ ఫండ్ 20 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంపు.
- ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) వ్యవస్థ ప్రస్తుతం 250 మార్కెట్లలో అందుబాటులో ఉంది. దీన్ని 585 మార్కెట్లకు విస్తరించనున్నారు.
- భూసార పరీక్షల కోసం దేశంలోని 648 కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో మినీ ల్యాబ్‌ల ఏర్పాటు.
- ధరల స్థిరీకరణ నిధి(పీఎస్‌ఎఫ్)కి రూ.3,500 కోట్లు.
- పంటలకు గిట్టుబాటు ధర దక్కని సమయంలో మార్కెట్ ధరల్లో జోక్యం చేసుకునేందుకు ఉద్దేశించిన పథకానికి రూ.200 కోట్లు.
రూపాయి రాక (పైసల్లో)
అప్పులు : 19
కార్పొరేషన్ ట్యాక్స్ : 19
ఆదాయపు పన్ను : 16
కేంద్ర ఎక్సైజ్ పన్ను : 14
సేవా పన్ను, ఇతర పన్నులు : 10
పన్నేతర ఆదాయం : 10
కస్టమ్స్ : 9
రుణేతర మూలధన వసూళ్లు : 3
రూపాయి పోక (పైసల్లో)
ఇతర ప్రణాళికేతర వ్యయాలు : 5
రక్షణ రంగం : 9
సబ్సిడీలు : 10
రాష్ట్రాలు, యూటీలకు ప్రణాళిక సహకారం : 10
కేంద్ర ప్రణాళిక : 11
ప్రణాళికేతర గ్రాంట్లు : 13
వడ్డీ చెల్లింపులు : 18
రాష్ట్రాల వాటా : 24
ద్రవ్యలోటు 3.2 శాతం
ప్రభుత్వ ఆదాయం-వ్యయానికి మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు. దీనిని 2017-18 స్థూల దేశీయోత్పత్తిలో 3.2 శాతానికి కట్టడి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో ద్రవ్యలోటు బడ్జెట్ లక్ష్యం 3.5 శాతం కాగా 2018-19లో దీనిని 3 శాతంగా కొనసాగిస్తామనీ జైట్లీ స్పష్టం చేశారు.
- ఇక రెవెన్యూ లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం 2.3 శాతం నుంచి 2.1 శాతానికి తగ్గింది. దీనిని 2017-18లో 1.9 శాతంగా నిర్దేశించుకున్నారు.
మార్కెట్ రుణ సమీకరణ రూ.3.48 లక్షల కోట్లు
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నికర మార్కెట్ రుణ సమీకరణలు రూ. 4.25 లక్షల కోట్లుకాగా, 2017-18లో దీనిని రూ. 3.48 లక్షల కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఇది దాదాపు రూ.75,000 తక్కువ.
- ఇక స్థూల రుణ సమీకరణను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 6 లక్షల కోట్ల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.5.8 లక్షల కోట్లకు తగ్గించారు.
రైల్వే బడ్జెట్ 1.31 లక్షల కోట్లు
- 92 ఏళ్ల సంప్రదాయాన్ని తోసిరాజని తొలిసారి రైల్వే బడ్జెట్ ప్రణాళికను సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టారు.
- గత సంవత్సరం కన్నా పదివేల కోట్ల రూపాయలు అధికంగా.. రూ. 1.31 లక్షల కోట్లు రైల్వేలకు కేటాయించారు. ఇందులో రూ. 55 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకు అందిస్తుంది.
- రైల్వేల్లో ప్రమాదాల నివారణకు ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పున రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్లతో ప్రత్యేక జాతీయ రైలు భద్రత నిధి(నేషనల్ రైల్ సేఫ్టీ ఫండ్)ని ఏర్పాటు చేస్తారు.
- 2017-18 సంవత్సరంలో 3500 కిమీల మేర రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. గత సంవత్సరం అది 2800 కి.మీ. లుగా ఉంది.
- ఈ టికెటింగ్‌ను ప్రోత్సహించేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్లపై సర్వీస్ చార్జి మినహాయింపు. ఇప్పటివరకు స్లీపర్ కోచ్‌లకు రూ. 20, ఏసీ క్లాస్‌లకు రూ. 40 సర్వీస్ చార్జీగా ఉంది.
- స్టాక్ ఎక్సేంజ్‌ల్లో రైల్వేలకు చెందిన సంస్థలైన ఐఆర్‌సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్), ఐఆర్‌ఎఫ్‌సీ(ఇండియన్ రైల్వే ఫైనాన్‌స కార్పొరేషన్), ఇర్కాన్‌ల నమోదు.
- 500 రైల్వే స్టేషన్లలో దివ్యాంగుల కోసం లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు.. తదితర సౌకర్యాల ఏర్పాటు.
- రైలు సేవలకు సంబంధించిన అన్ని ఫిర్యాదులు, సేవల కొరకు త్వరలో ‘క్లీన్ మిత్ర’ సింగిల్ విండో.
- దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లు కేటాయింపు
- తెలంగాణకు రూ.1,729 కోట్లు, (గత బడ్జెట్‌లో రూ.601 కోట్లు) ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,406 కోట్లు (గతంలో రూ.2,195 కోట్లు) కేటాయించారు.
- విజయవాడ-అమరావతి-గుంటూరులను కలుపుతూ 106 కి.మీ. మేర నిర్మించే అమరావతి రైలు మార్గానికి రూ.2,680 కోట్లు.
గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1,07,758 కోట్లు
- గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ‘ఫ్లాగ్‌షిప్’ పథకాలకు భారీ కేటాయింపులు చేశారు. ఈ శాఖకు 2016-17లో రూ.97,760 కోట్లుగా ఉన్న కేటాయింపులను 2017-18లో రూ.1,07,758 కోట్లకు పెంచారు.
- 2019 నాటికి దేశంలోని 50 వేల గ్రామ పంచాయతీలను పేదరిక రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- 2017-18 బడ్జెట్‌లో గ్రామీణ రంగానికి రూ.1,87,200 కోట్లు కేటాయించారు. ఇందులో గ్రామీణాభివృద్ధి శాఖకే రూ. 1,07,758 కోట్లు ఇచ్చారు.
ఉపాధి హామీకి 48,000 కోట్లు
2017-18 కేటాయింపులు 48,000 కోట్లు (25 శాతం పెంపు)
2016-17 కేటాయింపులు 38,500 కోట్లు (11 శాతం పెంపు)
2015-16 కేటాయింపులు 34,699 కోట్లు (12 శాతం పెంపు)
- 2016-17లో కేటాయించిన మొత్తాన్ని పూర్తిగా ఖర్చు చేయడమే కాకుండా.. 2017-18 ఏడాదికి ఏకంగా 25 శాతం కేటాయిపులు పెంచి రూ.48,000 కోట్లకు చేర్చారు.
- గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2005లో దీనికోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) చేశారు. 2008 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో ఇది అమలవుతోంది.
- ఈ స్కీమ్ ద్వారా 5 లక్షల వ్యవసాయ చెరువులు, బావుల తవ్వకంతో పాటు సేంద్రియ ఎరువుల తయారీ కోసం 10 లక్షల కంపోస్టు గుంతల ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
- ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళల సంఖ్య 48 శాతం నుంచి ఇప్పుడు 55 శాతానికి చేరింది.
‘స్వచ్ఛ భారత్’కు 13,948 కోట్లు
2017-18 కేటాయింపులు 13,948 కోట్లు (55 శాతం పెంపు)
2016-17 కేటాయింపులు 9,000 కోట్లు (148 శాతం పెంపు)
2015-16 కేటాయింపులు 3,625 కోట్లు
- భారత్‌ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ అభియాన్(ఏబీఏ) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- దీని కోసం నిధులను సమకూర్చేందుకుగాను అర శాతం స్వచ్ఛ భారత్ సెస్‌తో పాటు క్లీన్ ఎన్విరాన్‌మెంట్ సెస్‌ను కూడా వసూలు చేస్తున్నారు.
- కేటాయింపుల్లో రూ.1,395 కోట్లను ఈశాన్య రాష్ట్రాలు-సిక్కింలకు, రూ.3,069 కోట్లను దళితులకు(ఎస్‌సీ), రూ.1,395 కోట్లను గిరిజనులకు(ఎస్‌టీ)లకు కేటాయించనున్నారు.
- 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పారిశుధ్యాన్ని(సెప్టిక్ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం.
- దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఎస్‌బీఏ ప్రాజెక్టులో మొత్తం 9 కోట్ల టాయిలెట్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం.
- 2016-17లో 1.5 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 2016 డిసెంబర్ నాటికి 1.12 కోట్లు నిర్మితమయ్యాయి. రూ.6,917 కోట్లను ఖర్చు చేశారు.
- డిసెంబర్ నాటికి 66 జిల్లా, 702 బ్లాకులు, 56,769 గ్రామ పంచాయతీలు, 1,26,900 పల్లెల్లోని కుటుంబాలన్నీ సెప్టిక్ లెట్రిన్లనే ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (NRDWP)
2017-18 కేటాయింపులు 6,050 కోట్లు (21 శాతం పెంపు)
2016-17 కేటాయింపులు 5,000 కోట్లు (92 శాతం పెంపు)
2015-16 కేటాయింపులు 2,611 కోట్లు (76 శాతం పెంపు)
- దేశంలో తాగునీటి సౌకర్యం లేని (అన్‌కవర్డ్) అన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని (హ్యాండ్ పంపులు, పైపులు ఇతరత్రా మార్గాల్లో) అందించాలనేది ఈ పథకం లక్ష్యం.
- నాలుగేళ్లలో 28,000 ఆర్సినిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన
2017-18 కేటాయింపులు 10,635 కోట్లు (25 శాతం పెంపు)
2016-17 కేటాయింపులు 8,500 కోట్లు (25 శాతం పెంపు)
2015-16 కేటాయింపులు 6,800 కోట్లు (32 శాతం పెంపు)
- విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు, బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది.
- 2015 ఏప్రిల్ 1 నాటికి దేశంలో ఇంకా 18,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. - 2018 మే 1 నాటికల్లా దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించాలని తాజా బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకున్నారు.
- గ్రామీణ విద్యుదీకరణకు రూ.4,814 కోట్లు, ఉచిత విద్యుత్ కనెక్షన్లు, ఫీడర్లను వేరుచేయడం వంటి స్కీమ్స్(ఐపీడీఎస్)కు రూ.5,821 కోట్లు కేటాయించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY)
2017-18 కేటాయింపులు 23,000 కోట్లు (53.3 శాతం పెంపు)
2016-17 కేటాయింపులు 15,000 కోట్లు
2015-16 కేటాయింపులు 14,200 కోట్లు (11 శాతం పెంపు)
- 2019 నాటికి కోటి మందికి పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, 2022 కల్లా దేశంలో అందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలు, ఎస్‌సీ/ఎస్‌టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్దిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి.
- మైదాన ప్రాంతాల్లో పేదలకు ఒక్కో ఇంటికి రూ.1.2 లక్షలు..., కొండ ప్రాంతాలు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రూ.1.3 లక్షల చొప్పున సాయాన్ని అందిస్తారు.
- స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ సెప్టిక్ మరుగుదొడ్డి నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు.
- 2017-18 బడ్జెట్‌లో అందుబాటు గృహాల (Affordable houses) విభాగానికి మౌలిక రంగ హోదానిచ్చారు.
- గృహ రుణాలు అందించే బ్యాంకులకు 2017-18కి గాను నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రూ.20 వేల కోట్ల రుణాలను అందించనున్నారు.
ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY)
2017-18 కేటాయింపులు 19,000 కోట్లు (పెంపు లేదు)
2016-17 కేటాయింపులు 19,000 కోట్లు (33 శాతం పెంపు)
2015-16 కేటాయింపులు 14,291 కోట్లు (0.7 శాతం పెంపు)
- గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో అప్పటి వాజ్‌పేయి ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పథకం ఇది.
- 2011-14 మధ్య రోజుకు సగటు రోడ్డు నిర్మాణం 73 కిలోమీటర్లు కాగా, 2016-17లో ఇది 133 కిలోమీటర్లకు చేరింది.
- 2021 నాటికి మిగిలిన 65,000 అర్హత గల గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించేందుకు దాదాపు 2.3 లక్షల కి.మీ. మేర రోడ్లను నిర్మించాలన్నదే లక్ష్యం
- 2105-16; 16-17లో 10,894 రోడ్లను, 723 బ్రిడ్‌జలను(మొత్తం 44,947 కి.మీ) మంజూరు చేశారు. దీనికి అంచనా వ్యయం రూ.26,421 కోట్లు.
గ్రామీణ టెలిఫోనీ..
2017-18 కేటాయింపులు 11,636 (322 శాతం పెంపు)
2016-17 కేటాయింపులు 2,755 (15 శాతం పెంపు)
2015-16 కేటాయింపులు 2,400 (32 శాతం తగ్గింపు)
- భారత్ నెట్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ (జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్-ఎన్‌ఓఎఫ్‌ఎన్) ఇంటర్నెట్ కనెక్టివిటీని ఏర్పాటు చేయడం లక్ష్యం.
- భారత్ నెట్ కోసం రూ.10,000 కోట్లను కేటాయించారు. గ్రామాల్లో మొబైల్స్ వినియోగాన్ని పెంచడం, 2017 నాటికి టెలీ డెన్సిటీని 70 శాతానికి చేర్చాలన్నది లక్ష్యం.
- డిజిటల్ టెక్నాలజీ ద్వారా టెలీ మెడిసిన్, విద్య, నైపుణ్యాల కల్పన కోసం ‘డిజిగావ్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
‘రక్షణ రంగానికి 2.74 లక్షల కోట్లు
రక్షణ రంగానికి 2017-18 బడ్జెట్‌లో రూ.2.74 లక్షల కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో ఇది 12.77%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 6.2% ఎక్కువ.
- కొత్త పరికరాలు, ఆయుధాలు, ఎయిర్ క్రాప్ట్‌లు, యుద్ధనౌకలు తదితర సైనిక వాహనాల కొనుగోలు వంటి ఆధునీకరణ కార్యక్రమాల నిమిత్తం మూడు దళాలకు కలిపి రూ.86,488 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ మొత్తం రూ.78,586 కోట్లుగా ఉంది.
- రక్షణ రంగ పింఛన్ల నిమిత్తం రూ.85,737 కోట్ల బడ్జెట్ కేటాయించారు. సవరించిన అంచనాల తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పింఛన్ల బడ్జెట్ రూ.85,624 కోట్లకు చేరింది.
హోం శాఖకు రూ.83 వేల కోట్లు
కేంద్ర హోంశాఖకు రూ.83 వేల కోట్లు కేటాయించారు. 2016-17లో ఇచ్చిన దానికంటే ఇది 11.24 శాతం ఎక్కువ.
- గత ఏడాది రూ.75,355.48 కోట్లు ఇవ్వగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.83,823.30 కోట్లు కేటాయించారు.
- ఇంటెలిజెన్‌స బ్యూరో (ఐబీ)కు రూ.1,577.07 కోట్లు కేటాయింపులు చేశారు.
- కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 695.62 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే 8.31 శాతం పెంచింది. గత బడ్జెట్‌లో రూ. 727.75 కోట్లు కేటాయించగా.. సవరించిన అంచనాల్లో దానిని రూ. 642.24 కోట్లకు తగ్గించింది.
- తాజా బడ్జెట్‌లో హోంశాఖ అధీనంలోని ఏడు పారామిలిటరీ దళాలకు 54,985.11 కోట్లు ప్రతిపాదించారు. ఇది గత బడ్జెట్‌లో రూ.52,443 కోట్లుగా ఉంది.
- అంతర్గత భద్రతకు, మావోయిస్టులు, మిలిటెంట్ల ఆపరేషన్లు నిర్వహించే సీఆర్‌పీఎఫ్‌కు అత్యధికంగా రూ.17,868.53 కోట్లు దక్కింది.
- భారత్-పాక్, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని బీఎస్‌ఎఫ్‌కు రూ.15,569.11 కోట్లు ఇచ్చారు.
- సీఐఎస్‌ఎఫ్‌కు రూ.6,686.25 కోట్లు కేటాయించారు. ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ)కి రూ.4,824.31 కోట్లు, అస్సాం రైఫిల్స్‌కు రూ.4,801.84 కోట్లు కేటాయించారు.
- సశస్త్రసీమా బల్ (ఎస్‌ఎస్‌బీ)కు రూ.4,320.67 కోట్లు, ఉగ్రవాద నిరోధక చర్యల్లో పాలుపంచుకునే జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ)కి రూ.816.10 కోట్లు కేటాయించారు.
- కేంద్ర హోంశాఖ అధీనంలో పనిచేసే ఢిల్లీ పోలీస్‌కు బడ్జెట్‌లో రూ.5,910.28 కోట్లు ఇచ్చారు.
- పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ముళ్లకంచె ఏర్పాటుకు, రోడ్ల నిర్మాణానికి, నిఘా పరికరాల ఏర్పాటుకు బడ్జెట్‌లో రూ.2,355.68 కోట్లు ఇచ్చారు.
5 లక్షల లోపు ఆదాయంపై పన్ను 5 శాతానికి తగ్గింపు
- బేసిక్ లిమిట్ మార్చకుండా పన్ను చెల్లించాల్సిన మొత్తం రూ.2.5 లక్షలు దాటి రూ.5 లక్షల మధ్యలో ఉంటే దానిపై ఇప్పటిదాకా విధిస్తున్న 10 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారు.
- సెక్షన్ 87ఏ కింద ఇస్తున్న ట్యాక్స్ రిబేట్‌ను రూ.5 వేల నుంచి రూ.2,500కు కుదించారు. ఇది రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి వర్తించేది. దానిని ఇప్పుడు రూ.3.50 లక్షల ఆదాయం వరకు ఉన్నవారికి మాత్రమే వర్తింపజేశారు.
- పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉంటే 10 శాతం సర్‌చార్జీని కొత్తగా విధించారు. గతేడాది కోటి రూపాయలు దాటిన వారిపై విధించిన 15 శాతం సర్‌చార్జీని కొనసాగిస్తారు.
- అలాగే రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు సులభంగా రిటర్న్స్ దాఖలు చేసేలా సింగిల్‌పేజీ రిటర్న్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. రిటర్న్‌లు (ఐటీఆర్)లు ఆలస్యమైతే పదివేల రూపాయల జరిమానా విధించాలని ప్రతిపాదించారు. ఈ నిబంధన 2018-19 నుంచి అమల్లోకి వస్తుంది.
పన్ను స్లాబులు
60 ఏళ్లలోపు వ్యక్తులు
ఆదాయం | గతంలో | ప్రస్తుతం |
0-2,50,000 | లేదు | లేదు |
2,50,001-5,00,000 | 10% | 5% |
5,00,001-10,00,000 | 20% | 20% |
10 లక్షలు- 50 లక్షలు | 30% | 30% |
50 లక్షలు - రూ.కోటి | 30% | 40% + (10 శాతం సర్‌చార్జీ) |
రూ. కోటి దాటితే | 45% | 45% + (15 శాతం సర్‌చార్జీ) |
60 దాటి 80 ఏళ్లలోపు.. | ||
0-3,00,000 | లేదు | లేదు |
3,00,001-5,00,000 | 10% | 5% |
5,00,001-10,00,000 | 20% | 20% |
10 లక్షలు- 50 లక్షలు | 30% | 30% |
50 లక్షలు - రూ.కోటి | 30% | 40% + (10 శాతం సర్‌చార్జీ) |
రూ. కోటి దాటితే | 45% | 45% + (15 శాతం సర్‌చార్జీ) |
80 ఏళ్లు దాటితే.. | ||
0-5,00,000 | లేదు | లేదు |
5,00,001-10,00,000 | 20% | 20% |
10 లక్షలు- 50 లక్షలు | 30% | 30% |
50 లక్షలు - రూ.కోటి | 30% | 40% + (10 శాతం సర్‌చార్జీ) |
రూ. కోటి దాటితే | 45% | 45% + (15 శాతం సర్‌చార్జీ) |
విద్యారంగానికి 79,685 కోట్లు
- బడ్జెట్‌లో పాఠశాల విద్య, అక్షరాస్యతకు రూ.46,356 కోట్లు, ఉన్నత విద్యకు రూ.33,329 కోట్లు కేటాయించారు.
- దేశంలోని 3.5 కోట్ల మందికి మార్కెట్ అవసరాలకు సరిపోయే శిక్షణ ఇచ్చేందుకు రూ. 4 వేల కోట్లతో Skill Acquisition and Knowledge Awareness for Livelihood Promotion (SAnKALP)ను 2017-18లో ప్రారంభించనున్నారు.
- ప్రస్తుతం 60 జిల్లాల్లో ఉన్న ప్రధాన్‌మంత్రి కౌశల్ కేంద్రాలను 600కుపైగా జిల్లాలకు విస్తరిస్తారు.
- విదేశాల్లో ఉద్యోగాల కోసం యత్నించే వారికి అధునాతన శిక్షణ, విదేశీ భాషా కోర్సులు అందించేందుకు దేశవ్యాప్తంగా 110 ఇండియా ఇంటర్నేషనల్ స్కిల్ సెంటర్ల ఏర్పాటు.
- పరిశ్రమల కోసం నైపుణ్యాల వృద్ధికి సంబంధించిన స్కిల్ Skills Strengthening for Industrial Value Enhancement(SStrIVE) పథకం రెండో దశ ప్రారంభం. దీని కోసం రూ. 2,200 కోట్ల కేటాయింపు. దీని కింద ఐటీఐలలో ఇచ్చే శిక్షణను బలోపేతం చేస్తారు.
- పాఠశాలల్లో అభ్యసన ఫలితాల విశ్లేషణ కోసం వార్షిక మూల్యాంకన విధానం.
- స్థానికంగా నవకల్పనల ప్రోత్సాహం, లింగ సమానత్వం కోసం ‘ఇన్నోవేషన్ ఫండ్ సెకండరీ ఎడ్యుకేషన్’ ఏర్పాటు.
- ప్రపంచ బ్యాంకు మద్దతు ఉన్న సంకల్ప్, స్ట్రరుువ్ ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తారుు.
- ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం అన్ని రకాల ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు స్వయం ప్రతిపత్తి గల ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ఏర్పాటు.
- ‘SWAYAM (Study Webs of Active-Learning for Young Aspiring Minds) ’ వేదిక ద్వారా అత్యుత్తమ నాణ్యతతో కూడిన 350 ఆన్‌లైన్ కోర్సులను అందించనున్నారు.
- జార్ఖండ్, గుజరాత్‌లోఎయిమ్స్‌లు ఏర్పాటు చేయనున్నారు.
- పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, పరిశోధకులకు అవసరమయ్యే సమాచారం కోసం హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు.
వైద్య రంగానికి రూ. 47,352 కోట్లు
- 2017-18లో వైద్య రంగానికి రూ. 47,352.51 కోట్లు కేటాయించారు. ఇది 2016-17లో కేటాయించిన రూ. 37,061.55 కోట్ల 27.76 శాతం అధికం.
- ఆయుష్ మంత్రిత్వశాఖకు రూ.1,428.65 కోట్లు, వైద్య పరిశోధన విభాగానికి రూ. 1,500 కోట్లు (గతేడాది కేటాయింపులు రూ. 1,144.80 కోట్లు) కేటాయించారు.
- దేశంలో స్పెషలిస్టు వైద్యుల సంఖ్యను పెంచడానికి ఏటా అదనంగా 5 వేల పీజీ సీట్లను సృష్టించనున్నారు.
- 2017కల్లా కాలా-అజర్, బోదకాలు వ్యాధులను, 2018కల్లా కుష్టు, 2020కల్లా తట్టును, అలాగే 2025 నాటికి క్షయను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- 2014లో ప్రతి వెయ్యి జననాలకు 39గా ఉన్న శిశు మరణాల రేటును 2019కల్లా 28కి తగ్గించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
- 2011-13 కాలానికి ప్రతి లక్ష శిశు జననాలకు 167గా నమోదైన బాలింతల మరణాల రేటును 2018-20కల్లా 100కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మహిళా శిశు అభివృద్ధి శాఖకు రూ.22,095 కోట్లు
- 2017-18 బడ్జెట్‌లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.22,095 కేటాయించారు. ఇది గతేడాది కేటాయించిన రూ.17,640 కోట్లు కంటే 26 శాతం అధికం.
- ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగ్ యోజనకు 2016-17 లో రూ.634 కోట్ల నిధులుండగా, ఈసారి నాలుగు రెట్లు పెంచి రూ.2,700 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద కాన్పు, టీకాల ఖర్చుల నిమిత్తం గర్భిణులకు రూ.6 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతా ల్లో జమ చేస్తారు.
- బేటీ బచావో-బేటీ పఢావో’ పథకానికి ఈ బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. ఇది గతేడాదితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ.
- నిర్భయ నిధికి గతేడాది లాగే ఈ సారి కూడా రూ.500 కోట్లు ఇచ్చారు. 2013లో ప్రారంభమైన ఈ ఫండ్‌కు ఇప్పటిదాకా రూ.3 వేల కోట్లు మంజూరయ్యాయి.
- శిశు సంరక్షణ పథకానికి గతేడాది రూ.400 కోట్లుండగా, ఈసారి సమగ్ర శిశు వికాస పథకం కింద ఈ కార్యక్రమాన్ని కలిపేసి మొత్తంగా రూ.648 కోట్లు కేటాయించారు.
- అన్ని మంత్రిత్వ శాఖలలో మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి 2016-17లో రూ.1,56,528 కోట్లుగా ఉన్న నిధులను 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ.1,84,632 కోట్లకు పెంచారు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రూ.6,74,565 కోట్లు
2017-18 బడ్జెట్ ప్రకారం వివిధ రకాల పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయంలో రూ.6,74,565 కోట్లు రాష్ట్రాలకు దక్కనున్నాయి. ఇలా సమకూరే మొత్తంలో రాష్ట్రాలకు 42 శాతం కేటాయించలన్న 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం ఈ కేటాయింపులు చేసింది.
- అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,21,406 కోట్లు దక్కాయి. మొత్తం కేటాయింపుల్లో ఇది 17.94 శాతం.
- రూ.2,477 కోట్లతో సిక్కింకు అన్ని రాష్ట్రాలకన్నా తక్కువ వాటా దక్కింది.
- ఆంధ్రప్రదేశ్‌కు రూ.29,138 కోట్ల్లు(4.3 శాతం), తెలంగాణకు రూ.16,505 కోట్లు (2.43 శాతం) అందనున్నాయి.
రాజకీయ పార్టీల విరాళాలపై కఠిన ఆంక్షలు
- రాజకీయ పార్టీలు ఇకపై తీసుకునే ప్రతి విరాళానికి లెక్క చూపించాలి. ఇందుకు రూ.2 వేలు దాటిన ప్రతి విరాళంను చెక్కు లేదా డిజిటల్ రూపంలో లేదా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది.
- ప్రతి పార్టీ ట్యాక్స్ రిటర్న్స్ పత్రాలు దాఖలు చేయడం తప్పనిసరి
- ‘‘ప్రస్తుతం ఒక వ్యక్తి రూ.20 వేల వరకు పార్టీకి విరాళంగా ఇవ్వొచ్చు. అరుుతే దీన్ని రూ.2 వేలకే పరిమితం చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.
3 లక్షలు మించిన నగదు లావాదేవీలపై నిషేధం
- నల్లధనం నియంత్రణలో భాగంగా బడ్జెట్‌లో నగదు లావాదేవీలపై పరిమితి విధించారు. ఈ మేరకు అన్ని రకాల లావాదేవీల్లో నగదు రూ.3 లక్షలకు మించకూడదు. ఇది 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
- నగదు లావాదేవీలపై పరిమితి విధించాలంటూ నల్లధనంపై సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) సూచించింది.
- ఎవరైనా వ్యక్తి మూడు లక్షల రూపాయలకు మించి ఎవరి నుంచైనా తీసుకుంటే అతడికి జరిమానా విధించాలని కూడా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. నిర్దేశిత లావాదేవీ ఎంత మొత్తంలో జరిపితే ఆ విలువకు సమాన మొత్తంలో జరిమానా వేయనున్నారు.
పరిమితులు
ఎ) ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి ఏక మొత్తంలో తీసుకోకూడదు;
బి) ఒక లావాదేవీలో తీసుకోకూడదు;
సి) ఒక వ్యక్తికి సంబంధించిన ఒక ఈవెంట్ లావాదేవీల్లో తీసుకోకూడదు.
ఈ ప్రతిపాదిత పరిమితులు ప్రభుత్వానికి, బ్యాంకింగ్ కంపెనీలకు, పోస్టాఫీసు సేవింగ్‌స బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్‌లకు వర్తించవు.
- దేశం విడిచి వెళ్లిన ఆర్థిక నేరస్తుల ఆస్తులను జప్తు చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నారు.
సబ్సిడీల అంచనా రూ. 2,40,338 కోట్లు
- 2017-18 ఆర్థిక సంవత్సరానికి సబ్సిడీ అంచనా రూ. 2,40,338 కోట్లు. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే 3% పెరిగింది.
- ఇందులో ఆహార సబ్సిడీ రూ.1,45,338 కోట్లు కాగా ఎరువుల సబ్సిడీ రూ.70 వేల కోట్లు. ఇందులో రూ.49,768 కోట్లు యూరియాకు, రూ.20,232 కోట్లు ఫాస్పారిక్, పొటాసిక్ ఎరువులకు ఇవ్వనున్నారు.
- పెట్రోలియం సబ్సిడీ గతేడాది రూ. 27,531.71 కోట్లు ఉండగా ఈ ఏడాది దీన్ని రూ. 25వేల కోట్లకు తగ్గించారు.
- చక్కెరపై సబ్సిడీని కేంద్రం ఎత్తి వేసింది. కిలోపై ఇప్పటిదాకా రాష్ట్రాలకు రూ. 18.50 సబ్సిడీ ఇచ్చేవారు.
కార్పొరేట్ ట్యాక్స్ 30 నుంచి 25 శాతానికి తగ్గింపు
- బడ్జెట్లో రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలకు పన్నుని 30 నుంచి 25 శాతానికి తగ్గించేశారు. సెస్‌లతో కలిపి ఇది 28.84 శాతం అవుతుంది. మొత్తం పన్ను చెల్లిస్తున్న కంపెనీల్లో ఈ కేటగిరీలోనివే 96% ఉన్నాయి. దీంతో 96% కంపెనీలకు లాభం కలుగుతుందని జైట్లీ చెప్పారు.
- 2015-16లో 6.94 లక్షల కంపెనీలు రిటర్నులు దాఖలు చేయగా రూ.50 కోట్ల టర్నోవర్ పరిధిలో 6.67 లక్షల కంపెనీలున్నాయని, ఈ నిర్ణయం వల్ల కేంద్రం రూ.7,200 కోట్ల ఆదాయాన్ని కోల్పోనుందని జైట్లీ పేర్కొన్నారు
- రూ.2 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలు ఎలాంటి పద్దులూ నిర్వహించాల్సిన అవసరం లేదు. వారు తమ టర్నోవర్‌లో 8 శాతాన్ని లాభంగా ఊహించుకుని దానిపై పన్ను చెల్లించాల్సి వచ్చేది. దీన్ని తగ్గించారు. ఇలా ఖాతాలూ నిర్వహించకుండా ఉండే రూ.2 కోట్ల లోపు టర్నోవర్ కంపెనీలు ఇకపై తమ లాభాన్ని 6% ఊహించుకుని దానిపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా ఇది వర్తిస్తుంది.
- స్టార్టప్ కంపెనీలకు మినిమమ్ ఆల్టర్నేట్ ట్యాక్స్ (మ్యాట్) క్రెడిట్‌ను 15 ఏళ్ల వరకు చూపించుకోవడానికి అనుమతించారు. ఇది ఇప్పటి వరకు 10 ఏళ్లుగా ఉండేది.
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ.72,500 కోట్లు
- కొత్త ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా 72,500 కోట్ల రూపాయలు సమీకరించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది.
- గతేడాది తొలుత పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.56 వేల కోట్లుగా నిర్ణయించుకున్నా, చివరకు రూ. 45వేల కోట్లనే సమీకరించింది.
- విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆటోమేటిక్ మార్గంలోనే వస్తున్న నేపథ్యంలో వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే విధంగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ)ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఇకపై ప్రభుత్వ అనుమతి అవసరమైన విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలపై .. సంబంధిత మంత్రిత్వ శాఖలే తగు నిర్ణయాలు తీసుకుంటాయి.
- 1990లలో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తొలినాళ్లలో ప్రధాని కార్యాలయం (పీఎంవో) కింద ఎఫ్‌ఐపీబీ ఏర్పాటైంది. ఆ తర్వాత 1996లో దీన్ని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ)కి బదలాయించారు. 2003లో ఆర్థిక వ్యవహారాల విభాగం కింద చేర్చారు.
- సహకార సంస్థల ముసుగులో అక్రమంగా డిపాజిట్లు సమీకరించే (పోంజీ స్కీములు) మోసపూరిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం కొత్త చట్టం ప్రవేశపెట్టనుంది. బహుళ రాష్ట్రాల సహకార సొసైటీల (ఎంఎస్‌సీఎస్) చట్టం 2002కు సవరణలు చేయనున్నారు.
- చెక్కు బౌన్‌స కేసుల విచారణ వేగవంతంగా పూర్తి చేసేందుకు ‘నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్’ చట్టానికి సవరణలు చేయనున్నారు.
- ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా బడ్జెట్‌లో రూ.10,000 కోట్లు కేటాయించారు
- ఇంద్రధనస్సు పథకంలో భాగంగా నాలుగేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు సమకూర్చాలన్నది కేంద్రం లక్ష్యం. ఈ పథకం కింద అంతర్జాతీయ బ్యాంకింగ్ మూలధన ప్రమాణాలు బాసెల్ 3కి అనుగుణంగా బ్యాంకులు రూ.1.1 లక్షల కోట్ల నిధులను సమీకరించుకోడానికీ వీలుంటుంది.
- రూపాయి ఆధారిత మసాలా బాండ్లపై పన్ను ప్రయోజనాలు కల్పిస్తారు. ప్రవాసీల మధ్య ఈ బాండ్ల బదలాయింపుపై పన్ను ఉండదు.
- విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) భారత్‌లో పెట్టుబడి ఉపసంహరణ సందర్భంగా విదేశీ కంపెనీల్లో ఆస్తులు, షేర్లు విక్రయించినప్పుడు పన్ను చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు.
- చెల్లింపు వ్యవస్థల పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించి ఆరుగురు సభ్యులతో పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న బోర్డ్ ఆఫ్ రెగ్యులేషన్ అండ్ సూపర్‌విజన్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ స్థానంలో రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ఉండే ఈ బోర్డుకు.. ఆర్‌బీఐ గవర్నర్ సారథ్యం వహిస్తారు.
- స్టాక్ మార్కెట్‌లో చిన్న మదుపరుల వాటాను పెంచడమే లక్ష్యంగా అమల్లోకి వచ్చిన రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీం (ఆర్‌జీఈఎస్‌ఎస్)పై అందుతున్న పన్ను ప్రయోజనాన్ని తొలగించారు. ఇది 2018-19 నుంచి అమల్లోకొస్తుంది.
- ముందెన్నడు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టని వారు.. తొలిసారిగా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే, అటువంటి వారి పెట్టుబడిని పన్నుమినహాయింపుగా చూపించే వెసులుబాటుని కల్పిస్తూ 2012 ఫైనాన్స్ చట్టం ద్వారా యూపీఏ ప్రభుత్వం దీనిని ప్రకటించింది. ఈ స్కీంలో గరిష్టపన్ను ప్రయోజనం రూ.50,000. వార్షిక ఆదాయం రూ.12 లక్షలున్న వారికి వర్తిస్తుంది.
కంపెనీల పన్ను ప్రోత్సాహకాల భారం రూ.83,492 కోట్లు
- కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్న పన్ను ప్రోత్సాహకాల వల్ల ప్రభుత్వం కోల్పోయే ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.63 శాతానికి పెరగనుంది. 2017-18 బడ్జెట్ ప్రకారం పన్ను ప్రోత్సాహకాల భారం రూ.83,492 కోట్లుగా తేలింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.76,857.70 కోట్ల విలువైన పన్ను ప్రోత్సాహకాలను అందించారు. ఈ మొత్తంతో పోల్చితే ఈసారి భారం 8.63 శాతానికి పెరిగింది.
శాస్త్ర, సాంకేతిక రంగానికి రూ.37,435 కోట్లు
- శాస్త్రసాంకేతిక రంగాల మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.37,435 కోట్లను కేటాయించారు.
- గతేడాది డీఓఎస్- అణు శక్తి (డీఏఈ), శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖలు రెండింటికీ కలిపి కేటాయించిన మొత్తం రూ.32,030.72 కోట్లు.
- అలాగే డీఏఈ పరిధిలోని బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్), ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం (ఐజీసీఏఆర్), రాజారమణ సెంటర్ ఫర్ అడ్వాన్‌సడ్ టెక్నాలజీ, అటామిక్ మినరల్స్ డెరైక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్‌లకు రూ.3,062 కోట్లు (గతేడాదితో పోలిస్తే రూ.814.42 కోట్లు అదనం) కేటాయించారు. - శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ది కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్)కు రూ.4,446 కోట్లు (గతేడాది రూ.4,062 కోట్లు) ఇచ్చారు.
- సైన్‌స అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ విభాగాలకు వరుసగా రూ.4,817.27, రూ.2,222.11 కోట్ల కేటాయింపులు జరిగారుు.
- భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు రూ.1,719.48 కోట్లు (గతేడాది రూ.1,576.14 కోట్లు) ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం
- తాజా బడ్జెట్‌లో దళితుల సంక్షేమానికి 2016-17లో కేటాయించిన రూ.38,833 కోట్లను ఈసారి రూ.52,393కోట్లకు పెంచింది. గతంతో పోలిస్తే ఇది 35 శాతం అదనం.
- గిరిజన సంక్షేమ శాఖకు గతేడాదితో పోలిస్తే అదనంగా రూ.5,329 కోట్లు (10 శాతం అదనం) కేటాయించారు. 2016-17 బడ్జెట్ లో ఈ శాఖకు రూ. 24,005కోట్లు కేటాయించగా.. ఈసారి దీన్ని రూ.31, 920 కోట్లకు పెంచారు.
- మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.4,195 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్ కంటే 10 శాతం అధికం. ఇందులో రూ.2,053.54 కోట్లు మైనారిటీల్లో విద్యా సాధికారత పెంచేందుకు, రూ.1200 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు, రూ.634.95 కోట్లను నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నారు.
మౌలిక రంగానికి 3.96 లక్షల కోట్లు
- మౌలిక సదుపాయాల వృద్ధికి బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో మొత్తం రూ. 3,96,135 కోట్లు కేటాయించారు.
- సదుపాయాలకు 2016-17 బడ్జెట్ అంచనాలు రూ. 3,48,952 కోట్లు కాగా సవరించిన అంచనాలు రూ. 3,58,634 కోట్లు.
- విద్యుత్ శాఖకు రూ. 13,881 కోట్లు, నూతన, పునర్వినియోగ మంత్రిత్వ శాఖకు రూ. 5,473 కోట్లు కేటాయించారు.
జాతీయ రహదారులకు రూ. 64,900 కోట్లు
- 2017-18లో నేషనల్ హైవేలకు కేటాయింపులను 12 శాతం పెంచి రూ. 64,900 కోట్లు కేటాయించారు.
- హైవేల రంగానికి సంబంధించి 2016-17 బడ్జెట్ అంచనాలు రూ.57,976 కోట్లుగా ఉండగా.. సవరించిన అంచనాలు రూ. 52,447 కోట్లు.
పొగాకు ఉత్పత్తులపై పెరిగిన పన్నులు
- తాజా బడ్జెట్‌లో మొబైల్ ఫోన్లు, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు పన్నులను పెంచారు. ముడి పొగాకుపై 4.2 శాతం నుంచి ఏకంగా 8.3 శాతానికి... పాన్ మసాలాలపై 6 శాతం నుంచి 9 శాతానికి ఎక్సైజ్ సుంకాలు పెంచారు.
- ఆర్‌ఓ వాటర్ ప్యూరిఫయర్స్‌లో ఉపయోగించే ఫిల్టర్లపై కస్టమ్స్ డ్యూటీని 12.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. అలాగే దేశీయ ఆర్‌ఓ ఫిల్టర్లను ప్రోత్సహించేందుకు దిగుమతులపై పన్నును 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచారు.
- తోళ్ల పరిశ్రమకు ఊతమిచ్చేలా వీటి ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే కూరగాయల నుంచి సేకరించే పదార్థాలపై 7.5 శాతం ఉన్న పన్నును 2.5 శాతానికి తగ్గించారు.
- రక్షణ రంగంలోని వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గ్రూప్ ఇన్సూరెన్‌స పథకాలపైనున్న 14 శాతం సేవా పన్ను నుంచి మినహాయిపునిచ్చారు.
ధరలు పెరిగేవి
మొబైల్ ఫోన్లు, సిగరెట్, సిగార్, బీడీలు, ఖైనీ, పాన్ మసాలాలు, దిగుమతి చేసుకున్న జీడిపప్పు (రోస్టెడ్, సాల్టెడ్), ఎల్‌ఈడీ బల్బులు, దిగుమతి చేసుకున్న వెండి నాణేలు, పతకాలు, వస్తువులు, ముడి అల్యూమినియం, ఆప్టికల్ ఫైబర్స్ తయారీలో ఉపయోగించే పాలిమర్ పూత కలిగిన ఎంఎస్ టేపులు
ధరలు తగ్గేవి
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్ల బుకింగ్, గృహావసరాలకు వినియోగించే ఆర్‌ఓ వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ప్యానెల్‌లో ఉపయోగించే గాజు, ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ, గాలిమర ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే జనరేటర్లు, తోలు ఉత్పత్తుల తయారీకి వాడే కూరగాయల నుంచి సేకరించే పదార్థాలు, స్వైపింగ్ మెషీన్లు, వేలిముద్రను చదివే పరికరాలు, రక్షణ రంగంలోని వారికి గ్రూప్ ఇన్సూరెన్‌స
పర్యావరణ శాఖకు రూ.2,250.34 కోట్లు
- 2017-18 బడ్జెట్‌లో పర్యావరణ శాఖకు రూ.2,250.34 కోట్లను కేటాయించింది. ఇది గతేడాదికన్నా సుమారు 19 శాతం ఎక్కువ.
- ఇక పులుల సంతతిని సంరక్షించేందుకు చేపట్టిన ‘ది ప్రాజెక్ట్ టైగర్’కార్యక్రమానికి గతేడాదికన్నా రూ.30 కోట్లు తక్కువగా రూ.345 కోట్లు కేటాయిచారు.
- ఇక ఏనుగుల సంరక్షణకు ఉద్దేశించిన ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’కు కూడా గతేడాదికన్నా రెండున్నర కోట్లు ఎక్కువగా రూ.27.5 కోట్లు ఇచ్చారు.
- కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు రూ.74.3 కోట్లు మాత్రమే కేటాయించారు.
క్రీడలకు రూ. 1,943 కోట్లు
- కేంద్ర ప్రభుత్వం 2017-18 బడ్జెట్‌లో క్రీడల అభివృద్ధి కోసం రూ. 1,943 కోట్లు కేటాయించారు.
- గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ. 350 కోట్లు ఎక్కువ కావడం విశేషం.
- ఇందులో జాతీయ స్థాయి శిక్షణ శిబిరాల నిర్వహణకు రూ. 481 కోట్లు, క్రీడా సమాఖ్యలకు రూ. 302 కోట్లు ఇస్తారు. ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి కూడా భారీగా రూ. 350 కోట్లు కేటాయించారు.
పర్యాటకానికి రూ. 1,840 కోట్లు
కేంద్ర బడ్జెట్‌లో టూరిజం శాఖకు రూ.1,840.77 కోట్లు కేటాయించారు. దీనిలో రూ.959.91 కోట్లు ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ టూరిస్ట్ సర్క్యూట్ (స్వదేశ్ దర్శన్) నిధులు కూడా ఉన్నాయి. గత బడ్జెట్ కన్నా ఈసారి రూ. 250 కోట్లు ఎక్కువగా కేటాయించారు. దీనికి అదనంగా పిలిగ్రిమేజ్ రెజునవేషన్ అండ్ స్పిరిట్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) పథకానికి మరో రూ. వంద కోట్లు ఇచ్చారు.
ఇతర కేటాయింపులు
- తాజా బడ్జెట్ కేటాయింపుల్లో సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ. 180 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని అధికారులకు శిక్షణనిచ్చేందుకు వినియోగిస్తారు.
- కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ), పబ్లిక్ ఎంటర్ ప్రెజైస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ)లకోసం రూ.25.42 కోట్లు కేటాయించారు. గతేడాది ఈ కేటాయింపులు రూ. 28 కోట్లు.
- సీఐసీకి నూతన భవన నిర్మాణానికి రూ.25.47 కోట్లు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)కు రూ.105.81 కోట్లు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ)కు రూ. 197.32 కోట్ల కేటాయింపులు చేశారు.
- డెబిట్ కార్డులు, మొబైల్ ఫోన్లు, మొబైల్ వ్యాలెట్లు లేని వారి కోసం ఆధార్ అనుసంధానిత వాణిజ్య చెల్లింపుల వ్యవస్థ ‘ఆధార్ పే’ను త్వరలో ప్రారంభిస్తారు
- తోళ్ల శుద్ధికి వాడే వెజిటబుల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకం 7.5 నుంచి 2.5కు తగ్గించారు.
- జూన్, 2016లో చేనేత, జౌళి రంగానికి ప్రభుత్వం రూ.6వేల కోట్లు కేటాయించింది. మూడేళ్లలో కొత్త ఉద్యోగాలు కల్పించడంతో పాటు దాదాపు రూ. 74,800 కోట్ల పెట్టుబడుల్ని ఆక్షరించడం పథకం ప్రధాన లక్ష్యం.
బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు
- పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి, ప్రత్యేక ప్యాకేజీ కింద ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
- విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాల అభివృద్ధిలాంటి కీలక హామీలకు బడ్జెట్‌లో చోటు కల్పించలేదు.
- రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు పరిహారం కింద సీఆర్‌డీఏ ఇచ్చే స్థలాలను (ప్లాట్లను) విక్రయించగా వచ్చే సొమ్ముకు క్యాపిటల్ గెయిన్‌స (మూలధన పన్ను) మినహాయింపు కల్పించారు. అయితే, 2014 జూన్ 2 నాటికి భూములు కలిగి ఉన్నవారికి మాత్రమే ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
- 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రూ.16,000 కోట్ల రెవెన్యూ లోటులో ఇప్పటివరకు కేవలం రూ.4,000 కోట్ల మాత్రమే కేంద్రం భర్తీ చేసింది.
- హైదరాబాద్‌లోని ఐఐటీకి ఎంప్లాయి అసిస్టెన్‌స ప్రోగ్రాం కింద రూ. 75 కోట్లు కేంద్రం బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయించింది.
- విభజన చట్టం హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ట్రైబల్ యూనివర్సిటీ కోసం రూ. 10 కోట్లు కేటాయించింది.
ఏపీలోని వివిధ రంగాలకు కేటాయింపులు
రంగం | కోట్లు |
కార్పొరేట్ పన్ను | 8,583.74 |
ఆదాయపు పన్ను | 7,504.42 |
కస్టమ్స్ పన్ను | 4,096.97 |
కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ | 4,282.50 |
సర్వీసు పన్ను | 4,671.47 |
మొత్తం | 29,139.82 |
వివిధ సంస్థలకు బడ్జెట్‌లో కేంద్రం కేటాయించిన నిధులు(రూ.కోట్లలో)
ఏపీ, తెలంగాణ పరిశ్రమలకు వడ్డీ రాయితీ | 100 |
కేంద్రీయ విశ్వవిద్యాలయం | 10 |
ఏపీ, తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయం | 20 |
ఐఐటీ-ఏపీ | 50 |
ఐఐఎం-ఏపీ | 40 |
ఎన్‌ఐటీ-ఏపీ | 50 |
ఐఐఎస్‌ఈఆర్ | 50 |
ట్రిపుల్ ఐటీ-ఏపీ | 30 |
ఐఐపీఈ(పెట్రో వర్సిటీ) | 145.20 |
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో..
రైతులు: 1 1.88 కోట్లు
మహిళలు : 58.6 కోట్లు
ప్రభుత్వ ఉద్యోగులు : 30,87,278
వృద్ధులు : 10.39 కోట్లు
విద్యార్థులు : 31.5 కోట్లు
యువత : 35.6 కోట్లు (10-24 ఏళ్లు) (2014 ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం)
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు:1,703 (2015 ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం)
కంపెనీల సంఖ్య: 13.94 లక్షలు (2017-18 బడ్జెట్ లెక్కల ప్రకారం)
ప్లాస్టిక్ కరెన్సీ
- ప్లాస్టిక్ కరెన్సీని ఆస్ట్రేలియా మొట్టమొదటిసారిగా 1988లో అందుబాటులోకి తెచ్చింది. ఆస్ట్రేలియాతో పాటు కెనడా, ఫిజి, మారిషష్, న్యూజిలాండ్, పపువా న్యూ గునియా, రుమేనియా, వియత్నాం, బ్రిటన్ తదితర 20 దేశాలు ప్లాస్టిక్ కరెన్సీని వినియోగిస్తున్నాయి.
- బ్యాంక్ ఆఫ్ కెనడా 2011లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్లాస్టిక్ కరెన్సీ వల్ల భూతాపం 32 % తగ్గుతుందని వెల్లడైంది.
- ప్లాస్టిక్ కరెన్సీ పర్యావరణ హితం కావడంతో పాటు భద్రతా ప్రమాణాలు, మన్నిక పరంగా కూడా మేలైనవి. అయితే ప్లాస్టిక్ కరెన్సీ ఉత్పత్తి వ్యయం ఎక్కువ.
- పారిస్ ఒప్పందం అనంతరం మరిన్ని దేశాలు పాలిమర్ నోట్లపై దృష్టి సారించాయి. గతేడాది సెప్టెంబర్‌లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 5 యూరోల పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టింది.
డెబిట్ కార్డ్స్/క్రెడిట్ కార్డ్స్
డెబిట్‌కార్డ్స్, క్రెడిట్ కార్డుల మూలాలు అమెరికాలో ఉన్నాయి. 1920లలో ఆయిల్ కంపెనీలు, హోటల్ యాజమాన్యాలు తమ ఔట్‌లెట్లలో కొనుగోళ్లు చేసే వినియోగదారులకు క్రెడిట్ కార్డులు మంజూరు చేసేవి.
- మొదటి యూనివర్సల్ క్రెడిట్ కార్డు(అనేకచోట్ల అనుమతించేవారు)ను మాత్రం 1950లో డైనర్స్ క్లబ్ అనే కంపెనీ ప్రవేశపెట్టింది.
- 1958లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కంపెనీ ట్రావెల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్డును తెచ్చింది. దీనిపై వినియోగదారుల నుంచి వార్షిక రుసుము వసూలు చేసేది. నెలవారీగా బిల్లులు వసూలు చేసేది. తరువాత బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ సిస్టమ్ మొదలైంది.
- 1958లో మొదటిసారి బ్యాంక్ ఆఫ్ అమెరికా జాతీయ స్థాయిలో క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది.
- 1970 మధ్యనాటికి డెబిట్ కార్డులు వినియోగంలోకి వచ్చాయి.
భారత్‌లో లావాదేవీల విలువ (రూ.లో) - 2016 అక్టోబర్ నాటికి
క్రెడిట్ కార్డులు - 2,73,44,842
డెబిట్ కార్డులు - 73,92,81,001
ఆధారం: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారత్‌లో టాప్ 10 శ్రీమంతులు (2016 ఫోర్బ్స్ జాబితా)
1 | పెట్రోకెమికల్స్, ఆయిల్, గ్యాస్ | ముకేశ్ అంబానీ | 1,54,360 కోట్లు |
2 | ఫార్మా సూటికల్స్ | దిలీప్ సంఘ్వీ | 1,14,920 కోట్లు |
3 | హిందుజా గ్రూప్ | హిందుజా కుటుంబం | 1,03,360 కోట్లు |
4 | సాఫ్ట్‌వేర్ సర్వీసులు | అజీమ్ ప్రేమ్‌జీ | 1,02,000 కోట్లు |
5 | నిర్మాణరంగం | పల్లోంజి మిస్త్రీ | 94,520 కోట్లు |
6 | స్టీల్ | లక్ష్మీ మిట్టల్ | 85,000 కోట్లు |
7 | గోద్రెజ్ గ్రూప్ | గోద్రెజ్ కుటుంబం | 84,320 కోట్లు |
8 | సాఫ్ట్‌వేర్ సర్వీసులు | శివ్ నాడార్ | 77,520 కోట్లు |
9 | కమోడిటీస్ | కుమార మంగళం బిర్లా | 59,840 కోట్లు |
10 | వ్యాక్సిన్స్ | సైరస్ పూనావాలా | 58,480 కోట్లు |
ప్రపంచంలో టాప్ 5 కుబేరులు
01 - బిల్‌గేట్స్ - 5,02,500 కోట్లు
సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. 2000 సంవత్సరంలో సీఈవో పదవి నుంచి, 2008లో మైక్రోసాఫ్ట్ చైర్మన్ హోదా నుంచి తప్పుకొన్న బిల్‌గేట్స్ ప్రస్తుతం తమ దాతృత్వ సంస్థ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌కే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. ప్రస్తుత మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు బిల్‌గేట్స్ టెక్నాలజీ అడ్వైజర్‌గా ఉన్నారు.
02 - అమాన్షియా - 4,55,600 కోట్లు
స్పెయిన్‌కు చెందిన అమాన్షియా ఒర్టెగాఇండిటెక్స్ ఫ్యాషన్ గ్రూపు చైర్మన్. ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైన ‘జారా’ బ్రాండ్ వీరిదే.
03 - వారెన్ బఫెట్ - 4,13,440 కోట్లు
ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్ ఈయన. బెర్క్‌షైర్ హాత్‌వే హోల్డింగ్ కంపెనీకి సీఈవో. బిల్‌గేట్స్‌తో కలసి దాతృత్వ ప్రతిజ్ఞను ప్రారంభించిన బఫెట్ ఇప్పటివరకు లక్షా 90 కోట్ల రూపాయల పైచిలుకు వివిధ చారిటీలకు ఇచ్చేశారు.
04 - కార్లోస్ స్లిమ్ - 3,40,000 కోట్లు
మెక్సికో వారెన్ బఫెట్‌గా కార్లోస్ స్లిమ్ హెలూకు పేరు. తన హోల్డింగ్ కంపెనీ ‘గ్రూపో కార్సో’ ద్వారా మెక్సికోలోని పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కార్లోస్ ప్రపంచంలోనే నాలుగో ధనవంతుడి స్థాయికి చేరుకున్నారు.
05-జెఫ్ బెజోస్ - 3,07,360 కోట్లు
ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ‘అమెజాన్’ వ్యవస్థాపక చైర్మన్. ఏరోస్పేస్, పాత్రికేయ రంగాల్లోనూ ఈయన పెట్టుబడులు ఉన్నాయి. 2013లో వాషింగ్టన్ పోస్ట్ పత్రికను కొన్నారు.