Skip to main content

ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2012-13

విపరీతమైన విద్యుత్ కోతలు, రాజకీయ అస్థిరత నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రంగాలు సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. పారిశ్రామిక రంగంలో వృద్ధి తగ్గిపోవడం, వ్యవసాయ రంగం కోలుకోలేక పోవడం, సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోవడం, ఆహారధాన్యాల ఉత్పత్తి క్షీణించడం, నిరుద్యోగం పెరిగిపోవడమే ఇందుకు నిదర్శనాలు. ఉభయసభల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్చి 18న ప్రవేశపెట్టిన 2012-13 ఆర్థిక సంవత్సరపు ‘సామాజిక, ఆర్థిక సర్వే’ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

సర్వేలోని ముఖ్యాంశాలు
  1. 2012-13 ఆర్థిక సంవత్సరం ముందస్తు అంచనాల్లో రాష్ట్రంలో పారిశ్రామికరంగం వృద్ధిరేటు 2004-05 స్థిర ధరల్లో లెక్కిస్తే కేవలం 0.73 శాతం మాత్రమే నమోదైంది. 2011-12 ముందస్తు సవరించిన అంచనాల్లో ఇది 7.71 శాతంగా ఉంది. అంటే పారిశ్రామిక వృద్ధిరేటు ఏకంగా 6.98 శాతం పడిపోయింది. ఇదే సమయంలో జాతీయ పారిశ్రామిక వృద్ధిరేటు 2004-05 స్థిర ధరల్లో లెక్కిస్తే 3.12 శాతంగా నమోదైంది. అయితే, 2005-06లో 10.05 శాతం, 2006-07లో 17.60 శాతం మేరకు రాష్ట్ర పారిశ్రామికవృద్ధిరేటు నమోదయింది.
  2. వ్యవసాయరంగానికి ప్రభుత్వ సహాయం తగ్గిపోవడంతో ఈ ఏడాది కూడా వ్యవసాయరంగంలో నెగెటివ్ వృద్ధిరేటు నమోదైంది. 2012-13 ముందస్తు అంచనాల్లో వ్యవసాయ వృద్ధిరేటు -2.69 శాతంగా తేలింది. అదే సమయంలో పశుసంపద వృద్ధిరేటు కూడా 2011-12తో పోలిస్తే 8.32 శాతం నుంచి 6.31 శాతానికి తగ్గిపోయింది. మొత్తంగా వ్యవసాయ వృద్ధిరేటు 2012-13 ముందస్తు అంచనాల్లో 1.96 శాతంగా నమోదైంది.
  3. విద్యుత్ కోతల దెబ్బతో ఆహారధాన్యాల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం పడిపోయింది. రాష్ట్రంలో ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం 2011-12లో 72.89 లక్షల హెక్టార్ల నుంచి 2012-13లో ముందస్తు అంచనాల ప్రకారం 66.32 లక్షల హెక్టార్లకు పడిపోగా, ఆహారధాన్యాల ఉత్పత్తి 184.02 లక్షల టన్నుల నుంచి 170.78 లక్షల టన్నులకు పడిపోయింది.
  4. 2011-12 మొదటి సవరించిన అంచనాల్లో సేవారంగం వాటా 10.53 శాతం ఉండగా, 2012-13 ముందస్తు అంచనాల్లో ఇది కాస్తా 8.45 శాతానికి పడిపోయింది. సేవారంగంలోని రియల్ ఎస్టేట్, బిజినెస్ సర్వీసెస్‌లో 9.06 శాతం నుంచి 6.62 శాతానికి వృద్ధిరేటు పడిపోయింది.
  5. మొత్తం మీద రాష్ట్ర వృద్ధిరేటు 2011-12 మొదట సవరించిన అంచనాల్లో 7.82 శాతం ఉండగా, 2012-13 ముందస్తు అంచనాల్లో కాస్తా 5.29 శాతానికి పడిపోయింది. మరోవైపు జాతీయ సగటు వృద్ధిరేటు కూడా మందగించింది. 2004-05 స్థిర ధరల్లో లెక్కిస్తే జాతీయ సగటు వృద్ధిరేటు 4.96 శాతం ఉండగా, వ్యవసాయరంగ వృద్ధిరేటు 1.79 శాతం, పారిశ్రామికరంగం -3.12 శాతం, సేవా రంగం వృద్ధిరేటు 6.59 శాతంగా ఉంది.
  6. విద్యుత్ కోతలు, ఇతర కారణాల వల్ల ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. మార్చి 2011 నాటికి 7,82,457 మంది ఉన్న ప్రైవేటు ఉద్యోగుల సంఖ్య మార్చి 2012 నాటికి 7,51,854 మందికి తగ్గిపోయింది. అంటే ఏడాదిలో 30,603 మంది ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కూడా 12,77,371 నుంచి 12,76,054 మందికి తగ్గిపోయింది.
ప్రస్తుత ధరల్లో రాష్ర్ట వృద్ధిరేటు వివరాలు
  1. ప్రస్తుత ధరల్లో 2012-13లో రాష్ట్ర వృద్ధిరేటు 12.72 శాతంగా నమోదైంది. ఇందులో వ్యవసాయరంగ వాటా 10.79 శాతం కాగా, పారిశ్రామికరంగం వాటా 8.35 శాతం(ఇది 2011-12లో 16.03 శాతం), సేవారంగం వాటా 15.83 శాతంగా తేలింది. 2011-12లో రాష్ట్ర వృద్ధిరేటు 14.74 శాతంగా ఉండేది.
  2. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7,38,497 కోట్లుగా నమోదైంది.
  3. 2004-05 స్థిర ధరల్లో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4,26,470 కోట్లుగా తేలింది. 2011-12 మొదటి సవరణ అంచనాల ప్రకారం ఇది 4,05,046 కోట్లు.
  4. రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో లెక్కిస్తే 2012-13 ఆర్థిక సంవత్సరంలో ముందస్తు అంచనాల ప్రకారం రూ.77,277గా తేలింది. జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.68,747 కంటే ఇది అధికం. 2010-11 రెండో సవరించిన అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల ఆధారంగా జిల్లాలవారీగా తలసరి ఆదాయంలో రూ.99,706తో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, రూ.39,293తో శ్రీకాకుళం చివరిస్థానంలో ఉంది.
  5. 2010-11లో 203.14 లక్షల టన్నులున్న ఆహారధాన్యాల దిగుబడి... 2011-12 సవరించిన అంచనాల ప్రకారం 173.05 లక్షల టన్నులకు పడిపోయింది. 2009-10 మూడో సవరించిన అంచనాల ప్రకారం రూ.18,402 కోట్లుగా ఉన్న రాష్ట్ర వ్యవసాయ స్థూల స్థిర మూలధనం.. 2010-11 రెండో సవరించిన అంచనాల ప్రకారం రూ.17,931 కోట్లకు తగ్గిపోయింది.
  6. ఆహారధాన్యాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2011లో రూ.17.82 ఉన్న బియ్యం (రెండో రకం) ధర 2012లో రూ.19.84కు పెరిగింది. కందిపప్పు ధర రూ.56.68 నుంచి రూ.59.74కి; పల్లీ నూనె ధర రూ.88.68 నుంచి రూ.114.14కు పెరిగింది.
  7. ధరల సూచీ ప్రతినెలా పెరుగుతోంది. జనవరి 2012లో రాష్ట్రంలో ధరల సూచీ 113.3 పాయింట్లు (గ్రామాల్లో 113.8, పట్టణాల్లో 112.6) ఉండగా, డిసెంబర్ 2012 నాటికి 125.8 పాయింట్లకు (గ్రామాల్లో 126, పట్టణాల్లో 125.4) పెరిగింది. ఇది జాతీయ ధరల సూచీ కంటే ఎక్కువ. జాతీయ స్థాయిలో ఇది 114 పాయింట్ల నుంచి 125.6 పాయింట్లకు పెరిగింది.
  8. రాష్ట్రంలో సగటు కమతాల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. 2005-06లో సగటు కమతాల విస్తీర్ణం 1.20 హెక్టార్లుగా ఉండగా, 2010-11 నాటికి 1.08 హెక్టార్లకు తగ్గిపోయింది. అయితే, సూక్ష్మ, చిన్నతరహా రైతుల్లో మాత్రం సగటు కమతాల విస్తీర్ణం (0.44 హెక్టార్లు) మారలేదు.
  9. సగటు ఎరువుల వినియోగం తగ్గిపోతోంది. 2010-11లో 71.80 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2011-12 నాటికి 70.83 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది.
  10. రాష్ట్రంలో మోటారు వాహనాల సంఖ్య కోటి దాటిపోయింది. 30 నవంబర్ 2012 నాటికి రాష్ట్రంలో 1,33,89,470 మోటారు వాహనాలు రిజిస్టరయ్యాయి.
  11. పదో తరగతి పాసయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2010-11లో 83.10 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, 2011-12 నాటికి అది 87.85 శాతానికి పెరిగింది. బడి మానేసే పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఒకటి నుంచి పదో తరగతిలోపు పిల్లల్లో ఇది 2010-11లో 46.21 శాతం ఉండగా, 2011-12లో 45.71 శాతానికి తగ్గింది. ఇది 5వ తరగతిలోపు 15.6 శాతం ఉండగా 1 నుంచి 7వ తరగతి వరకు 20.79 శాతం మంది పిల్లలు బడి మానేస్తున్నారు.
  12. రాష్ర్టంలో అక్షరాస్యతా శాతం 67.66 మాత్రమే. పురుషుల్లో ఇది 75.56 శాతం కాగా మహిళల్లో 59.74 శాతం మాత్రమే. జాతీయ అక్షరాస్యత సగటు 74.04 కంటే ఇది తక్కువగా ఉంది.
  13. 2007 నాటికి రాష్ట్రంలో 112.23 లక్షల ఆవులు, 132.72 లక్షల గేదెలు, 255.39 లక్షల గొర్రెలు, 4.39 లక్షల పందులు ఉన్నాయి.
  14. రాష్ట్రానికి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏడాదికేడాది తగ్గిపోతున్నాయి. 2012 ఆగష్టు వరకు రాష్ట్రానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రూ. 1805 కోట్లు.
సంవత్సరం రూ. కోట్లలో
2010 5753
2011 4039
2012 1805


రాష్ర్టంలో పన్నుల భారం ఏడాదికేడాది పెరుగుతుంది. పన్నుల భారం వివరాలిలా ఉన్నాయి.
సంవత్సరం పన్నుల భారం (రూ. కోట్లలో)
2004-05 16255
2011-12 53285
2012-13 62572


  1. రాష్ర్టంలో శిశు మరణాల రేటు అధికంగా ఉంది. ప్రస్తుత సర్వే ప్రకారం ప్రతి వెయ్యి మంది జననాలకు 43 మంది మరణిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రసవ సమయంలో ప్రతి లక్షమంది మహిళల్లో 134 మంది తల్లులు మరణిస్తున్నారు.
  2. రాష్ర్టంలో పరిశ్రమల రంగంలో వచ్చిన 7636 ప్రతిపాదనల్లో దాదాపు 1824 ప్రతిపాదనలు వెనుతిరిగిపోయాయి. దీనివల్ల రూ. 1,31,538 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాకుండా పోవడంతోపాటు దాదాపు 3 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కోల్పోయారు.
Published date : 30 Mar 2013 07:25PM

Photo Stories