Skip to main content

IBPS PO Notification 2021: 4135 పీఓ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, అర్హతలు ఇవే..

IBPS PO exam Preparation Tips, Strategy and Guidence
IBPS PO exam Preparation Tips, Strategy and Guidence

బ్యాంకింగ్‌ రంగంలో కెరీర్‌ కోరుకునే అభ్యర్థులకు శుభవార్త! ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్‌ స్థాయి కొలువుకు చక్కటి అవకాశం!! ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. 4135 ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీఓ) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు పోటీ పడొచ్చు. ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. బ్యాంకింగ్‌ రంగంలో అద్భుతమైన కెరీర్‌ సొంతమవుతుంది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్‌ పీవో పోస్టులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ టిప్స్‌తో ప్రత్యేక కథనం.. 

  • 4135 పీఓ పోస్ట్‌ల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ 
  • ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు
  • మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ

ఐబీపీఎస్‌.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్, పీవో,స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాటైన అటానమస్‌ సంస్థ. ఐబీపీఎస్‌ ప్రతి ఏటా ఆయా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల
చేస్తోంది. తాజాగా 2022–23 సంవవత్సరానికి పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,135 పీఓ/ఎంటీ(మేనేజ్‌మెంట్‌ ట్రైనీ) పోస్ట్‌లకు దరఖాస్తులు కోరుతోంది.

చ‌ద‌వండి: IBPS‌ Recruitment: 4135 పీవో పోస్టులు.. దరఖాస్తుల‌కు చివరి తేదీ ఇదే..

8 బ్యాంకులు.. 4,135 పోస్ట్‌లు

  • ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం–మొత్తం ఎనిమిది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,135 పీఓ/ఎంటీ ఖాళీలు ఉన్నాయి. 
  • బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–588, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర–400, కెనరా బ్యాంకు–650, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–620, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌–98, పంజాబ్‌ అండ్‌ సిం«ద్‌ బ్యాంక్‌ –427, యూకో బ్యాంక్‌–440, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–912. 
  • వాస్తవానికి మరో మూడు ప్రభుత్వ బ్యాంకులు(బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌) కూడా ఐబీపీఎస్‌ ద్వారానే నియామకాలు చేపడుతుంటాయి. 2022–23 సంవత్సరంలో ఖాళీలకు సంబంధించి ఈ బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు రాలేదు. దాంతో ఎనిమిది బ్యాంకుల్లో పోస్ట్‌ల భర్తీకే ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

 అర్హతలు

  • నవంబర్‌ 10, 2021 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
  • వయసు: అక్టోబర్‌ 1, 2021 నాటికి 21–30ఏళ్లు(అక్టోబర్‌ 2, 1991–అక్టోబర్‌ 01, 2001 మధ్య జన్మించాలి) మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్‌ క్రిమి లేయర్‌) అభ్యర్థులకు మూడేళ్ల గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. 

చ‌ద‌వండి: ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్‌లో విభాగాల వారీగా పరీక్ష వ్యూహం..ఇలా ఉంటే మంచిది..

ఎంపిక ప్రక్రియ

ఐబీపీఎస్‌ పీఓ/ఎంటీ ఎంపిక ప్రక్రియను మూడు దశల్లో నిర్వహించనున్నారు. అవి..ప్రిలిమినరీ, మెయిన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు ఆబ్జెక్టివ్‌ తరహాలో,ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతాయి. 

ప్రిలిమినరీ పరీక్ష

ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్షను మూడు విభాగాల్లో వంద మార్కులకు నిర్వహిస్తారు. అవి..ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35
మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఒక్కో విభాగానికి 20 నిమిషాల చొప్పున మొత్తం పరీక్ష సమయం 60 నిమిషాలు. 

మెయిన్‌కు ఎంపిక

అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కులు, నిర్దేశిత కటాఫ్‌ ఆధారంగా మెయిన్‌కు ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతి విభాగంలోనూ నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు పొందాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్‌కు 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంటే.. ప్రతి పోస్టుకు పది మంది చొప్పున పోటీపడతారు. 

చ‌ద‌వండి: ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్‌లో విజయం సాధించాలంటే ఇవి ఎంతో ముఖ్యం..

మెయిన్‌ ఎగ్జామ్‌

మెయిన్‌లో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ పరీక్షలు ఉంటాయి. మెయిన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నాలుగు విభాగాల్లో మొత్తం 155 ప్రశ్నలు–200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. 

విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 45 60 60 ని
జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ 40 40 35 ని
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 35 40 40 ని
డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 35 60 45 ని
మొత్తం 155 200 3 గం

ఇంగ్లిష్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌

మెయిన్‌ పరీక్షలో భాగంగా ఇంగ్లిష్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. వ్యాసరూప తరహాలో ఉండే ఈ విభాగంలో అభ్యర్థులు ఇంగ్లిష్‌లో ఎస్సే, లెటర్‌ రైటింగ్‌ రాయాల్సి ఉంటుంది. దీనికి కేటాయించిన మార్కులు 25. పరీక్ష సమయం 30 నిమిషాలు. అభ్యర్థుల ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని పరీక్షించే ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్నారు.

నెగెటివ్‌ మార్కింగ్‌

ఆన్‌లైన్‌ విధానంలో.. ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌లుగా నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్‌ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.

చ‌ద‌వండి: Banks - Study Material

పర్సనల్‌ ఇంటర్వ్యూ

మెయిన్‌కు సెక్షన్‌ వారీ కటాఫ్, ఓవరాల్‌ కటాఫ్‌లను నిర్దేశించి.. ఆ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 100. ఇందులో అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించాల్సి
ఉంటుంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం మార్కులు, రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాలి. 

తుది జాబితా 80:20 వెయిటేజీ

  • అభ్యర్థుల తుది జాబితా రూపకల్పనలో మెయిన్‌ మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూకు నిర్దేశిత వెయిటేజీలు పేర్కొన్నారు.
  • మెయిన్‌ పరీక్షలో మార్కులకు 80 శాతం వెయిటేజీ, పర్సనల్‌ ఇంటర్వ్యూ మార్కులకు 20 శాతం వెయిటేజీని నిర్దేశించారు. అంటే.. అభ్యర్థులు మెయిన్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కులను వంద మార్కుల వెయిటేజీకి క్రోడీకరించి.. తుది జాబితా ప్రకటిస్తారు. 

విజయం సాధించాలంటే

  • ఎస్‌బీఐ పీఓకు పోటీ పడే అభ్యర్థులు.. ఐబీపీఎస్‌ పీవోకు కూడా దరఖాస్తు చేసుకుంటే.. ఒకే సమయంలో రెండు పరీక్షలకు సిద్ధం కావొచ్చు. 
  • మొదట ప్రిలిమ్స్, మెయిన్‌ రెండింటిలో కీలకంగా నిలిచే రీజనింగ్‌పై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్‌–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై అవగాహన పెంచుకోవాలి.
  • క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ విభాగానికి సంబంధించి అర్థమెటిక్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ వర్క్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ సంబంధిత ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. వీటితోపాటు నంబర్‌ సిరీస్, డేటా అనాలిసిస్‌ విభాగాలను కూడా అధ్యయనం చేయాలి. ఫలితంగా ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలోనూ మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
  • అభ్యర్థుల్లోని విశ్లేషణ సామర్థ్యం, తులనాత్మకతను పరిశీలించే డేటా అనాలిసిస్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో రాణించేందుకు కాలిక్యులేషన్‌ స్కిల్స్‌ను పెంచుకోవాలి. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్‌ డేటా, లైన్‌ గ్రాఫ్, బార్‌ గ్రాఫ్‌ తదితర గ్రాఫ్‌ ఆధారిత డేటాలోని సమాచారాన్ని క్రోడీకరించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి.
  • జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి ఇటీవల కాలంలో జాతీయ ఆర్థిక రంగంలో మార్పులు, బ్యాంకుల విధి విధానాలు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో వినియోగించే పదజాలంపై పట్టు సాధించాలి. 
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కోసం బేసిక్‌ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
  • డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉండే ఇంగ్లిష్‌ ఎస్సే రైటింగ్, లెటర్‌ రైటింగ్‌ కోసం ఇంగ్లిష్‌ దినపత్రికలు చదవడం, ఎడిటోరియల్స్‌ చదవడం మేలు చేస్తుంది.

ఐబీపీఎస్‌ పీఓ/ఎంటీ –(11)–2022–23 సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 10.11.2021
  • ప్రిలిమినరీ కాల్‌ లెటర్స్‌ డౌన్‌లోడ్‌: నవంబర్‌/డిసెంబర్, 2021
  • ప్రిలిమినరీ పరీక్ష(ఆన్‌లైన్‌) తేదీలు: డిసెంబర్‌ 4, 11 తేదీల్లో
  • ప్రిలిమినరీ ఫలితాలు: డిసెంబర్‌ 2021/జనవరి 2022.
  • మెయిన్‌ కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌: డిసెంబర్‌ 2021/జనవరి 2022.
  • మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: జనవరి 2022
  • మెయిన్‌ ఫలితాల వెల్లడి: జనవరి/ఫిబ్రవరి 2022
  • ఇంటర్వ్యూ కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌: ఫిబ్రవరి 2022
  • పర్సనల్‌ ఇంటర్వ్యూలు: ఫిబ్రవరి/మార్చి 2022
  • ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: 2022 ఏప్రిల్‌

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ibps.in/

ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://ibpsonline.ibps.in/crppo11jul21

చ‌ద‌వండి: Banks - Guidance
Banking & Insurance Careers

 

Published date : 02 Nov 2021 06:48PM

Photo Stories