Skip to main content

Inspiring Story: బాల కార్మికురాలు.. నేడు ప్ర‌భుత్వ ఉద్యోగి.. అది నుంచే కన్నీటి కష్టాలే..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన ఫలితాల్లో మహిళా విభాగంగా జిల్లా స్థాయిలో ఆమె ఏడో ర్యాంకు కైవసం చేసుకుంది.
సుభాషిణి
సుభాషిణి దంపతులు

అయితే.. ఏంటి అనే ప్రశ్న వెంటనే ఇక్కడ ఉత్పన్నం కావడం సహజం. కానీ ఆమె నేపథ్యం తెలిస్తే ఔరా.. అని మాత్రం అనిపించక మానదు. బాల్యంలో ఆమెది దీనగాధ. చదువుకోవాలనే జిజ్ఞాస మాత్రం ఉంది. తప్పని పరిస్థితుల్లో వివాహం.. ఆపై భర్త వెంకటరత్నం ప్రోత్సాహం.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగాల కల్పన వెరసి ఆమె నేడు కష్టాల కొలిమి నుంచి బయట పడి ఒక స్థిరమైన జీవితాన్ని అందుకోగిలిగింది. ఆమే ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం.. ఎండ్లూరు గ్రామానికి చెందిన కోరుకొండ సుభాషిణి.

తప్పనిసరి పరిస్థితిలో..
సుభాషిణి జీవితం ఆదిలో ముళ్లపాన్పే. 9వ తగరతి చదువుతుండగానే తండ్రి కన్నుమూశాడు. ఆర్థిక బాధలు ప్రారంభమయ్యాయి. ఇద్దరు అన్నయ్యలు ఒక వైపు చదువుకుంటుండగా ఆమె బాల కార్మికురాలిగా మారింది. ఇలా నాలుగేళ్లు గడిచాయి. ఆమెకు తన మేనమామ ఐసీడీఎస్‌లో పనిచేస్తున్న కోరుకొండ రామారావు అండగా నిలిచాడు. చిన్నపిల్లను పనిలోకి పంపడం ఏమిటంటూ చదువుకోమన్నాడు. పెళ్లి చేయాలనుకుంటుంటే బడి అంటారేంటంటూ తల్లి ఒప్పుకోలేదు. అయినా ఒప్పించి నెల్లూరులోని డ్రాపౌట్స్‌ ఉండే సర్వీస్‌ హోమ్‌లో చేర్పించారు. అక్కడ ఉండి చదువుకుంటూ సంతనూతలపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రైవేటుగా పదో తరగతి పరీక్ష రాసి ఫస్ట్‌ క్లాస్‌లో పాసైంది. ఆ సమయంలోనూ పెళ్లి చేసుకోవాల్సిందే.. అంటూ తల్లి పట్టుబట్టింది. అప్పటికే తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటం, తన కళ్ల ముందే పెళ్లి జరగాలని పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితిలో మెడలు వంచి తాళి కట్టించుకుంది. ఇక తన చదువుకు ఫుల్‌స్టాప్‌ పడినట్లే అని భావించింది.

భర్త స‌హాకారంతో..
భర్త బంధువే కావడంతో చదువుకోవాలన్న తన ఆసక్తిని అతడి ఎదుట బయట పెట్టింది. ఆయన ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుండంతో సరే అన్నాడు. బీఏ డిగ్రీతో పాటు బీఎల్‌ఐసీలో కరస్పాండెన్స్‌ కోర్సు పూర్తి చేసింది. అంతటితో ఆగలేదు. ఎంఏ సోషియాలజీతో పాటు ఎంఎల్‌ఐసీ, ఆపై బీఈడీ కూడా సుభాషిణి పూర్తి చేసింది. సాధారణంగా వివాహమైన తర్వాత చదువు అంటేనే చాలామంది వెనుకాడే పరిస్థితి. అటువంటి దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె రెండు డిగ్రీలు, రెండు పీజీలు, బీఈడీ కోర్సు పూర్తి చేయడం వెనుక ఆమె భర్త ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇదే క్రమంలో ఆమె ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది.

గ్రూప్‌–2, గ్రూప్‌–3 పరీక్షలు రాసింది.. కానీ..
సుభాషిణీ డిగ్రీలు పూర్తి చేస్తున్నా ఎక్కడో అసంతృప్తి. చదువు కోవడం వరకు ఒకే. కానీ ఉద్యోగం సంగతి ఏంటి. రెండు సార్లు గ్రూప్‌–2, గ్రూప్‌–3 పరీక్షలు రాసింది. కానీ ఒకదాంట్లో రెండు మార్కులు, మరోదాంట్లో నాలుగున్నర మార్కుల తేడాతో అవకాశాన్ని కోల్పోయింది. ఈ సమయంలోనే గతేడాది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ/వార్డు సచివాలయాలకు నోటిఫికేషన్‌ విడదల చేసిన సంగతి విదితమే. ఈ సారి ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంది. తమ మండంలోనే చండ్రపాలెం పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై ప్రస్తుతం ఉద్యోగం చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రూప్‌–3కి మళ్లీ రాసింది. ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా జిల్లాస్థాయిలో మహిళా విభాగంలో ఏడో ర్యాంకు కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగాల కల్పన ద్వారా తనకు ఆర్థిక భరోసా లభించిందని, అదే తాను గ్రూప్‌–3కి ఎంపిక అయ్యేందుకు తోడ్పడిందని పేర్కొంటోంది. త్వరలోనే గ్రూప్‌–2ను సైతం సొంతం చేసుకుంటానని ధీమాగా చెబుతోంది. ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. కానీ తన విజయం వెనుక తన భర్తే ఉన్నారు అంటూ సగర్వంగా చెబుతున్న ఈ జంట నేటి తరానికి ఆదర్శం అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

Published date : 04 Mar 2022 06:52PM

Photo Stories