Skip to main content

Success Stories : ఎన్ని కష్టాలు ఉన్నా.. ఎస్ఐ ఉద్యోగం కొట్టామిలా.. మా స‌క్సెస్‌కు కార‌ణం ఇదే..

ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ స్టేట్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుద‌ల చేసిన ఎస్ఐ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో ఎంతో మంది పెదింటి బిడ్డ‌లు త‌మ స‌త్తాచాటి.. అనుకున్న ల‌క్ష్యం సాధించారు. ప్రయత్నిస్తుండాగానీ ఎంతటి కష్టతరమైన ఉద్యోగమైనా వచ్చి తీరుతుందని నిరూపించారు. గట్టిగా అనుకుంటే... లోలోపల ఆశయం రగులుకుంటే... వీధి దీపాల కింద చదువుకునైనా విశ్వవిజేత కావొచ్చు. పెద్దోళ్లకే అందలం అనే మాట వెనుకటిది.
ap si jobs selected candidates success stories   AP SI Exam Achievements  AP Police SI Results  AP Police SI Exam Results Celebration

బీదాబిక్కీ సైతం ఊహించని ఎత్తుకు ఎదుగుతున్న కాలమిది. కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోండి’ అంటూ మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం చేసిన ఉద్బోధతో ప్రభావితమైన అనంతపురం ఉమ్మడి జిల్లాకు చెందిన యువత.. తమ సత్తా ఏమిటో చాటింది.  ఇటీవల ఏపీ స్టేట్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఊహించని విధంగా ర్యాంక్‌లు దక్కించుకున్న పలువురు ఎస్‌ఐ పోస్టుకు అర్హత సాధించారు. ఈ నేప‌థ్యంలో ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన వీరి స‌క్సెస్ స్టోరీలు మీకోసం..

లైబ్రరీలో చదివి ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా..

si jobs gowtham sai news telugu

కళ్యాణదుర్గం.. స్థానిక పార్వతీనగర్‌కు చెందిన కవిత, దేవదాసు దంపతుల రెండో కుమారుడు గౌతమ్‌సాయి అనంతపురంలోని జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తి చేశారు. సివిల్స్‌పై మక్కువతో యూపీఎస్‌సీ పరీక్ష రాశారు. అనంతరం గ్రూప్‌ 1 పరీక్షల్లో మెయిన్స్‌ వరకూ వెళ్లారు. అక్కడితో నిరుత్సాహపడకుండా అనంతపురంలోని పోలీస్‌ లైబ్రరీకెళ్లి పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ వచ్చారు.

ఈ క్రమంలోనే ఎస్‌ఐ పోస్టును దక్కించుకున్నారు. విషయం తెలియగానే ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. తన వద్ద పీఏగా పనిచేస్తున్న దేవదాసు కుమారుడు ఎస్‌ఐ పోస్టుకు అర్హత సాధించారన్న విషయం తెలుసుకున్న మంత్రి ఉషశ్రీచరణ్‌ ప్రత్యేకంగా గౌతమ్‌సాయికి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు.   

ఈ ఉద్యోగంతో.. ఆ పేదింట ఆనందం.. :

arunachalam si job news telugu

కంబదూరు.. మండలంలోని కుర్లపల్లి గ్రామానికి చెందిన అరుణాచలం ఎస్‌ఐ ఉద్యోగాన్ని సాధించాడు. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్న ఎరికుల దురగప్ప, రత్నమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్న కుమారుడు అరుణాచలం... ఆర్డీటీ సహకారంతో బీటెక్‌ పూర్తి చేశాడు. ఆపన్నులకు అండగా నిలవాలని భావించిన అరుణాచలం ఎలాగైనా ఎస్‌ఐ ఉద్యోగం సాధించాలని పరితపించాడు. ఈ క్రమంలో పోటీ పరీక్షలకు సిద్ధమై పరీక్ష రాశాడు. ఇటీవ‌లే విడుద‌లైన ఎస్ఐ ఫలితాలల్లో.. 222 మార్కులతో సివిల్‌ ఎస్‌ఐగా తాను కలలు కన్న ఉద్యోగానికి అర్హత సాధించాడు. పట్టుదలే తమ కుమారుడిని ఉన్నత స్థానానికి చేర్చిందంటూ ఈ సందర్భంగా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

☛ Women SI Success Story : గృహిణిగా.. ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూ.. ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

లక్ష్యమే నడిపించింది ఇలా.. 

si job jyothi success story in telugu

చదువులే జీవిత గమనాన్ని మారుస్తాయన్న తల్లిదండ్రులు మాటలు స్ఫూర్తినిచ్చాయి. దీంతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఆమెను ఎస్‌ఐగా అర్హత సాధించేలా చేసింది. బ్రహ్మసముద్రం మండలం సూగేపల్లికి చెందిన కురుబ భూలక్ష్మి, వన్నారెడ్డి దంపతులు చదువు సంధ్యలకు నోచుకోలేదు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం తప్ప మరే పని తెలియదు. తమ కష్టం తమ కుమార్తె జ్యోతి పడకూడదని భావించిన వారు ఆమెను చదువుల వైపు దృష్టి సారించేలా చేశారు.

కష్టాలు ఎన్ని ఉన్నా... లక్ష్యం వైపే..
అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం చిన్నాన్న మల్లేష్‌ చొరవతో పోటీ పరీక్షలకు హైదరాబాద్‌లో ఆరు నెలల పాటు కోచింగ్‌ తీసుకుంది. ఆ సమయంలోనే తండ్రి వన్నారెడ్డి అనారోగ్యం బారినపడ్డాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులు అన్న మాటలు గుర్తుకు చేసుకుంది. ‘కష్టాలు ఎన్ని ఉన్నా... లక్ష్యం వైపే గురి ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతాం’ అన్న ఆ మాటలే ఆమెను ఎస్‌ఐ పోటీ పరీక్షల్లో తలపడేలా చేసింది. ఎస్‌ఐ ఉద్యోగానికి జ్యోతి అర్హత సాధించడంతో నిరుపేద కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.  

అనుకున్న ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా..

anil kumar si success story in telugu

బెళుగుప్ప.. మండలంలోని దుద్దేకుంటకు చెందిన దబ్బర వెంకటేశులు, కొండమ్మ దంపతుల కుమారుడు దబ్బర అనికుమార్‌ తిరుపతిలో ఎంబీఏ పూర్తి చేసిన తరువాత 2014లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం రాయదుర్గం ఎక్సైజ్‌ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. అయితే ఎస్‌ఐగా కావాలనే తపన ఆయనను స్థిరంగా ఉండనివ్వలేదు. దీంతో పోటీ పరీక్షలు రాసి తాను అనుకున్న లక్ష్యానికి చేరుకోవడంతో గ్రామస్తులు, మిత్రులు అభినందించారు. 

గిరిజన బిడ్డ‌.. ఎస్ఐ ఉద్యోగం కొట్టాడిలా..

si success story in telugu

బెళుగుప్ప.. మండలంలోని బ్రాహ్మణపల్లి తండాకు చెందిన వడిత్యా గోపాల్‌నాయక్, గీతాబాయి దంపతుల కుమారుడు వడిత్యా అశోక్‌కుమార్‌నాయక్‌ పోలీసు బోర్డు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఎస్‌ఐ పోస్టుకు అర్హత సాధించారు.కళ్యాణదుర్గంలోనే డిగ్రీ వరకూ చదువుకున్న ఆయన ఎస్‌ఐ కావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందారు. ఎస్‌ఐ పోస్టుకు అర్హత సాధించడంతో తండా వాసులు హర్షం వ్యక్తం చేశారు.  

ఇద్దరూ ఇద్దరే.. కానీ..

two brother si success story in telugu

ప్రస్తుతం తిరుపతిలో కానిస్టేబుల్‌గా  పని చేస్తున్న పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామానికి చెందిన సుధీర్‌రెడ్డి ఎస్‌ఐ పోస్టుకు అర్హత సాధించడంతో తల్లిదండ్రులు మద్దిలేటిరెడ్డి, సావిత్రమ్మ హర్షం వ్యక్తం చేశారు. అలాగే తాడిపత్రి మండలం యర్రగుంటపల్లికి చెందిన నరేయాదవ్‌ 2020లో స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ఈ ఏడాది తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో 5వ ర్యాంక్‌ సాధించి ఎస్‌ఐగా శిక్షణ పొందుతున్నారు. 

ఈ క్రమంలోనే ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించి ఎస్‌ఐ పోస్టుకు అర్హత సాధించడంతో తల్లిదండ్రులు లక్ష్మీనారాయణమ్మ, శ్రీరాములు హర్షం వ్యక్తం చేశారు. అలాగే  నార్పల మండలం నాయనపల్లికి చెందిన లావణ్య, నార్పలకు చెందిన జగదీశ్వరరెడ్డి కూడా ఎస్‌ఐ పోస్టులకు ఎంపికయ్యారు.   

కానిస్టేబుల్ టూ.. ఎస్ఐ కొలువు..

women si success story in telugu

ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలనే కసి ఆమెలో పట్టుదలను పెంచింది. అదే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరువ చేసింది. గుత్తి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రావణిరెడ్డి ఎస్‌ఐ ఉద్యోగానికి అర్హత సాధించారు. గుత్తిలోని పెద్ద పప్పూరు మండలం పెద్ద యక్కలూరు గ్రామానికి చెందిన శ్రావణిరెడ్డి... 2018లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం గుత్తిలో పోస్టింగ్‌ పొందారు. ఎస్‌ఐ కావాలనే బలమైన ఆశయం ఆమెను పోటీ పరీక్షలకు సిద్ధపడేలా చేసింది. అనుకున్నది సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలు రాసిన ఆమె గురువారం వెలువడిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించడంతో గుత్తి పోలీసుల్లో హర్షం వ్యక్తమైంది. సీఐ వెంకట్రామిరెడ్డి, ఎస్‌ఐ నబీరసూల్, ఏఎస్‌ఐ నాగమాణిక్యం, తదితరులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.  

తెలియకుండా ఎస్‌ఐ పోటీ పరీక్షలకు.. వ‌చ్చానిలా..

si haritha success story

వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లికి చెందిన బాలగొండ చిన్న బాబయ్య, శివమ్మ దంపతులు తమ కుమారుడితో పాటు ఇద్దరు కుమార్తెలనూ సమానంగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించారు. రెండో కుమార్తె హరిత అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకూ చదువుకుంది. 8 నుంచి ఇంటర్‌ వరకు ధర్మవరం పంగల్‌ రోడ్డు సమీపంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో,  ఎస్‌ఎల్‌ఎన్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే  ఐఎఫ్‌ఎస్‌ సాధించాలనే తపనతో హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుంటుండగా ఆమెకు తెలియకుండా ఎస్‌ఐ పోటీ పరీక్షలకు నాన్న బాబయ్య దరఖాస్తు చేశాడు. ఈ విషయాన్ని తండ్రి ద్వారా తెలుసుకున్న ఆమె ఆయన ఆశయాన్ని నెరవేరుస్తూ తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐ పోస్టుకు అర్హత సాధించారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఎలాగైనా ఐఎఫ్‌ఎస్‌ సాధించి తీరుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.  

ఈ కేటగిరిలో మూడో స్థానంలో..

si lahari success story

ముదిగుబ్బ.. మండల కేంద్రానికి చెందిన చిగిచెర్ల గురుప్రసాద్, నాగరత్నమ్మ దంపతుల కుమార్తె చిగిచెర్ల లహరి... ఎస్‌ఐ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. 225 మార్కులతో ఓపెన్‌ కేటగిరి మహిళల విభాగంలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్న ఆమెను గ్రామస్తులు, బంధువులు, తల్లిదండ్రులు అభినందించారు.  

రాయలసీమ‌లోనే..

si akil kumar success story

బత్తలపల్లి.. మండలంలోని మాల్యవంతం పంచాయతీ ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట అఖిల్‌కుమార్‌ వివిధ ఉద్యోగాల్లో మౌనంగానే ఎదుగుతూ వచ్చారు.  లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడైన అఖిల్‌కుమార్‌... టెక్‌ మహేంద్రలో సాప్‌్టవేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం అగళి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నా.. టెక్నాలజీపై పూర్తి పట్టు ఉండడంతో డిప్యూటేషన్‌పై పుట్టపర్తిలోని సైబర్‌ కంట్రోల్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్‌ఐ పోటీ పరీక్షల్లో రాయలసీమ జోన్‌ పరిధిలో ఏడో ర్యాంక్‌ను దక్కించుకోవడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.    

చిరకాల వాంఛగా ఉన్న ఎస్‌ఐ ఉద్యోగం సాధించాలనే..

si manjunath success stroy

బెళుగుప్ప.. మండలంలోని రామినేపల్లికి చెందిన ఆంజనేయులు, సాలమ్మ దంపతుల కుమారుడు మంజునాథ్‌ చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడుగా ఉంటూ వచ్చేవాడు. ఈ క్రమంలో అగ్రీ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు.అయితే తన చిరకాల వాంఛగా ఉన్న ఎస్‌ఐ ఉద్యోగం సాధించాలనే తపన అతన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా చేసింది. అనుకున్నట్లుగానే లక్ష్యాన్ని చేరకోవడంతో నిరుపేద రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. 

ఒకే ఊళ్లో ఇద్దరు ఎస్ఐ ఉద్యోగాలు కొట్టారిలా.. 

si story in telugu

కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లికి చెందిన గజేంద్ర, కురబ శ్రీవాణి ఎస్‌ఐ ఉద్యోగానికి అర్హత సాధించారు. గ్రామానికి చెందిన మాలమ్మ, గంజన్నకు ముగ్గురు కుమారులు కాగా, వీరిలో చివరి వాడు గజేంద్ర. కూలి పనులతో జీవనం సాగిస్తునే ఎస్‌ఐ రాత పరీక్షల్లో సత్తా చాటారు. అలాగే శ్రీవాణి తల్లిదండ్రులు నాగలక్ష్మీ, బాలాజీ...  వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. తమ గ్రామానికి చెందిన ఇద్దరూ ఎస్‌ఐలుగా ఉద్యోగాలు సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.   

వీరి సహకారంతో.. ఎస్ఐ ఉద్యోగం కొట్టానిలా..

si success story

బెళుగుప్ప.. మండలంలోని కాలువపల్లికి చెందిన వడ్డే వెంకటేశులు, భాగ్యమ్మ దంపతుల కుమారుడు అశోక్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి వరకూ చదువుకున్నాడు. అనంతరం ఇంజనీరింగ్‌ పూర్తి చేసి తన పెద్దనాన్న, మాజీ సర్పంచ్‌ తిమ్మన్న సూచన మేరకు సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు.ఈ క్రమంలో మిత్రులు వెంకటేశ్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, అశోక్, సిద్దేశ్వర్, లలిత్, మంథేష్‌ అన్నింటా సహకరిస్తూ వచ్చారు. అయితే ఊహించని విధంగా పోలీస్‌ బోర్డు నిర్వహించిన రాత పరీక్షల్లో విజయం సాధించి ఎస్‌ఐ పోస్టుకు అర్హత సాధించారు. దీంతో కుటుంబసభ్యులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

☛ IFS Officer Success Story : ఈ కిక్ కోస‌మే.. IAS ఉద్యోగం వ‌చ్చినా.. కాద‌ని IFS ఉద్యోగం ఎంచుకున్నా..

Published date : 25 Dec 2023 08:01PM

Photo Stories