Skip to main content

AP SI Job Selected Candidates: కష్టపడ్డారు.. కొలువు సాధించారు.. ఖాకీ చొక్కా ధరించి, తలపై టోపీ పెట్టుకుని, చేతిలో లాఠీ పట్టుకోనున్నారు..

ఖాకీ చొక్కా ధరించి, తలపై టోపీ పెట్టుకుని, చేతిలో లాఠీ పట్టుకోవాలని ఎంతో మంది యువత కలలు కన్నారు.
AP SI Job Selected Candidates in Kurnool District

రాత్రి, పగలు కష్టపడి చదివి తాము కలలుగన్న కొలువును చేజిక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖలోని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖాళీలను భర్తీ చేసేందుకు గత ఏడాది నవంబర్‌ 5వ తేదీన నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రాయలసీమ రేంజ్‌ పరిధిలోని 105 ఎస్‌ఐ పోస్టుల కోసం 19,800 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరికీ ఈ ఏడాది ఫిబ్రవరి 18, 19 తేదీల్లో కర్నూలులో 39 కేంద్రాల్లో ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అర్హత పొందిన 16,108 మంది అభ్యర్థులకు ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 20వ తేదీ వరకు పీఈటీ, పీఎంటీ టెస్టులను నిర్వహించారు.
ఇందులో అర్హత పొందిన 8,521 మంది మెయిన్స్‌కు అర్హత పొందారు. వీరందరికీ అక్టోబర్‌ 14, 15 తేదీల్లో 14 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను ఈ నెల మొదటి వారంలో విడుదల చేశారు. ఇందులో మెరిట్‌ ప్రాతిపదికన ఉద్యోగాలకు ఎంపికైనవారి జాబితాను డిసెంబ‌ర్ 21(గురువారం) విడుదల చేశారు. ఇందులో కర్నూలు జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

హోంగార్డు కుమారుడు ఎస్‌ఐగా ఎంపిక.. 
కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన రేపల్లె ఉమా బ్రహ్మేశ్వరరావు, రేపల్లె సులోచనమ్మ దంపతుల కుమారుడు రేపల్లె కల్యాణ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యాడు. కోడుమూరు ఫైర్‌ స్టేషన్‌లో తండ్రి హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ప్రాథమిక విద్య కోడుమూరు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గోరంట్ల రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చదివాడు. ఇంటర్మీడియట్‌ చిన్నటేకూరు సోషల్‌ వెల్ఫేర్‌ కాలేజీలో చదివి డిగ్రీ సిల్వర్‌జూబ్లీ కాలేజ్‌లో అభ్యసించాడు. మొదటి ప్రయత్నంలోనే ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా 2020లో ఎంపికై ప్రస్తుతం పనిచేస్తున్నాడు. తాను డిగ్రీ చదువుతున్న సమయంలో ఎన్‌సీసీలో చేరడం, అక్కడ ఇచ్చే శిక్షణ తనలో స్పూర్తిని నింపడంతోనే ఈరోజు ఎస్‌ఐ ఉద్యోగం సాధించేందుకు కారణం అయిందని రేపల్లె కల్యాణ్‌ చెబుతున్నారు.

AP SI Job Selected Candidates: పేదింటి కుసుమాలు.. కాబోయే ఎస్‌ఐలు.. వీళ్లే..

శభాష్‌.. మల్లికార్జున
ఆదోని స్థానిక రైల్వే స్టేషన్‌లో సిగ్నల్‌ అపరేటర్‌గా పనిచేస్తున్న మల్లికార్జున ఎస్‌ఐ రాత పరీక్షలో విజయం సాధించాడు. సివిల్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. అనంతపురం జిల్లా పామిడి మండలం కట్టకంతపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున 2020లో సివిల్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. అదే సంవత్సరం రైల్వే సిగ్నల్‌ అపరేటర్‌గా ఉద్యోగం రావడంతో సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రైల్వే సిగ్నల్‌ అపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తూనే ఎస్‌ఐ పరీక్షలు రాసి విజయం సాధించాడు. తన తండ్రి సలా రామకృష్ణ, తల్లి పద్మావతి వ్యవసాయ పనులు చేస్తూ తనను చదివించారని మల్లికార్జున తెలిపారు.

కల నెరవేరింది..
తుగ్గలి: ఎస్‌ఐ కావాలనే కలను మండల పరిధిలోని రామకొండ గ్రామానికి చెందిన కుడుముల క్రాంతి కుమార్‌ నెరవేర్చుకున్నారు. తల్లిదండ్రులు ప్రసాద్‌, పార్వతి వ్యవసాయ పనులు చేస్తూ కుమారున్ని బీటెక్‌ వరకు చదివించారు. మొదట 2017లో విజయవాడ సిటీ యూనియన్‌ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేశాడు. పోలీస్‌ శాఖలో కొలువు సాధించాలనే బలమైన కోరికతో రెండు నెలల 15రోజులకే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 2018, 2019లో పరీక్ష రాసినా ఉద్యోగం సాధించలేకపోయాడు. పట్టుదలతో చదివి 2023లో ఉద్యోగం సాధించాడు. తన తమ్ముడు రాము కాన్పూర్‌ ఐఐటీలో చదివి ఉద్యోగం చేస్తున్నాడని, తల్లిదండ్రుల సహకారంతో తన కలను నెరవేర్చుకున్నట్లు క్రాంతికుమార్‌ తెలిపారు.

వి‘జయశ్రీ’.. 
నందవరం మండలంలోని ముగతి గ్రామానికి చెందిన బోయ జయశ్రీ ఎస్‌ఐ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎస్‌ఐగా ఎంపికయ్యారు. గ్రామంలోని నరసింహులు, లక్ష్మీ దంపతులకు ముగ్గురు సంతానం. అందులో పెద్దకుమార్తె ధనలక్ష్మీ, రెండో కుమార్తె జయశ్రీ, మూడవ వాడు విజయ్‌. రెండో కుమార్తెన జయశ్రీ డిగ్రీ పూర్తి చేసి ఎస్‌ఐ పరీక్షలకు కోచింగ్‌ తీసుకున్నారు. గత ఏడాది నవంబరులో ప్రభుత్వం కానిస్టేబుల్స్‌, ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబరు 14, 15వ తేదీల్లో పరీక్ష రాయగా.. గురువారం రాత్రి విడుదలైన జాబితాలో జయశ్రీ ఉతీర్ణత సాధించి ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యారు. గ్రామంలో మొదటి మహిళగా ఎస్‌ఐ పోస్టుకు ఎంపికై నందుకు జయశ్రీకి గ్రామ పెద్దలు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
తిమ్మనాయినపేట

ఆటోవాలా అయ్యాడు ఎస్‌ఐ..

Auto Drivar SI


ఆటో నడుపుతూ కుటుంబానికి ఆసరాగా ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు కష్టపడి చదివి ఎస్‌ఐ ఉద్యోగాన్ని సాధించారు. సి.బెళగల్‌ మండలంలోని ఇనగండ్ల గ్రామంలో భగమంతు సోమేష్‌, ఈశ్వరమ్మ దంపతుల మొదటి కుమారుడు చిన్నరాయుడు కర్నూలు ప్రభుత్వ పురుషుల కళాశాలలో 2018లో బీకామ్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత కుటుంబ ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో చిన్నరాయుడు తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులు చేసుకునేవారు. 2021లో ఆటో కొనుగోలు చేసి దాదాపు రెండు సంవత్సరాల పాటు ఆటో నడుపుతూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం ఎస్‌ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వడంతో కర్నూలు రూమ్‌లో ఉంటూ పోలీస్‌ ఉద్యోగానికి సిద్ధమవుతూ విజయాన్ని అందుకున్నారు. ‘ కుటుంబంలో ఆర్థిక కష్టాలు ఉన్నా అమ్మనాన్నతో పాటు చిన్నాన్న, చిన్నమ్మలు ఎంతో ప్రోత్సహించారు. ఎస్‌ఐ ఉద్యోగం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని చిన్నరాయుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

యువకుడి ప్రతిభ..
రైతు కుటుంబానికి చెందిన ఓ యువకుడు ఎస్‌ఐ రాత పరీక్షల్లో విజయం సాధించాడు. కొలిమిగుండ్ల మండల పరిధిలోని తిమ్మనాయినపేటకు చెందిన ఎగ్గోని పాపా సాహెబ్‌, మాబీ దంపతుల కుమారుడు చిన్న దస్తగిరి 2019లో బీటెక్‌ పూర్తి చేశాడు. ఎస్‌ఐ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2020లో హైదరాబాద్‌లో యూనిక్‌ అకాడమిలో కోచింగ్‌ తీసుకునేవాడు. కరోనా కారణంగా ఇంటి వద్ద వ్యవసాయం చేసుకుంటూనే మరో పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. 2022 నుంచి కర్నూలులో కోచింగ్‌ తీసుకుంటూ వచ్చాడు. ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే తాను ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యాయని చిన్న దస్తగిరి తెలిపారు.

▶ ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించారు.. ఎస్‌ఐ ఫ‌లితాల్లో విజ‌యం సాధించారు.. వారు వీరే..

ఉద్యోగం చేస్తూనే..
సి.బెళగల్‌: మండల కేంద్రం సి.బెళగల్‌లోని గ్రామ సచివాలయం –2లో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్‌ ఎస్‌ఐగా ఎంపిక అయ్యారు. ప్రభుత్వం విడుదల చేసిన ఎస్‌ఐ రాత పరీక్షల ఫలితాలలో 240 మార్కులతో సివిల్‌ ఎస్‌ఐగా ఎంపిక కావడంతో సహచర ఉద్యోగులు, మండల అధికారులు, వలంటీర్లు రాజశేఖర్‌కు అభినందనలు తెలుపుతున్నారు. గూడూరు మండలం చనుగండ్ల గ్రామానికి చెందిన జులుగారి సోమేష్‌, లక్ష్మీదేవి దంపతులు కుమారుడు రాజశేఖర్‌ మండలంలోని ఇనగండ్ల గ్రామ సచివాలయంలో 2019 అక్టోబర్‌ నెలలో గ్రేడ్‌ – 5 పంచాయతీ కార్యదర్శి విధులలో చేరారు. ఈ ఏడాది సి.బెళగల్‌ గ్రామ సచివాలయం –2కు బదిలీ అయ్యారు. కాగా తమ కుమారుడు ఎస్‌ఐ ఉద్యోగం పొందటంపై తల్లిదండ్రులు జులుగారి సోమేష్‌, లక్ష్మిదేవి స్వీట్‌ తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు.

రాయలసీమ జోన్‌లో ప్రథమ ర్యాంకు..
ఎస్‌ఐ ఫలితాల్లో ఆళ్లగడ్డ యువకుడు సత్తా చాటాడు. రాష్ట్ర వ్యాప్తంగా 5వ ర్యాంక్‌, రాయలసీమ జోన్‌లో ప్రథమ ర్యాంక్‌ సాధించాడు. రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామానికి చెందిన అంకిరెడ్డి కుమారుడు శివనాగిరెడ్డి ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్‌ మీడియట్‌ వరకు ఆళ్లగడ్డలో విధ్యనభ్యసించాడు. డిగ్రీ కర్నూలు సిల్వర్‌జూబ్లీ కళాశాలలో పూర్తి చేశాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇతను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఎస్‌ఐ నియామక ఫలితాల్లో సత్తా చాటి రాష్ట్ర స్థాయిలో ఐదోర్యాంకు, రాయలసీమ జోన్‌లో ప్రథమ ర్యాంకు సాధించాడు. కష్టపడి విజయం సాధించిన యువకుడిని చూసి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివనాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించడమేగాక.. శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడుతానని తెలిపారు.

మధ్యాహ్న భోజనం కార్మికురాలి కుమారుడు..

SI Job


కర్నూలు నగరానికి చెందిన కె.మల్లికార్జున, కె.పద్మావతి దంపతుల కుమారుడు కె.సాయికుమార్‌ ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రాథమిక విద్య కల్లూరులోని జ్యోతి ప్రియాంక స్కూల్‌లో, 6 నుంచి 10వ తరగతి వరకు కల్లూరు జెడ్పీ హైస్కూల్‌, ఇంటర్మీడియట్‌ సీవీ రామన్‌ జూనియర్‌ కాలేజ్‌లో చదివి జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో 2019లో బీటెక్‌ పూర్తి చేశారు. తన స్నేహితులు డిగ్రీ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేవారు. వారిని చూసి చదువుతూ ఈ ఏడాది మే నెలలో పోస్టల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. తండ్రి మరణించినా తల్లి జిల్లాపరిషత్‌ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలిగా పనిచేస్తూ ఎంతో కష్టపడి తనను చదివించారని సాయికుమార్‌ తెలిపారు. తన చిన్నతనంలో తనను పోలీసుగా చూడాలని తాత నాగముని కోరేవారని, ఎట్టకేలకు ఎస్‌ఐ ఉద్యోగం సాధించి మా తాత కలను నెరవేర్చానని సంతోషం వ్యక్తం చేశారు.

SI Candidates Selection List: ఎస్‌ఐ అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల.. టాపర్లు వీరే..

Published date : 25 Dec 2023 11:55AM

Photo Stories