AP SI Job: ప్రస్తుతం ఖాకీ చొక్కా వేసుకుంటోంది.. తొందరలో దానికి స్టార్స్ బిగించనుంది.. కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐగా సుమతి..!
పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం ఇసుకనూతపల్లెకు చెందిన వేణుగోపాల్, భాగ్యమ్మ దంపతుల కుమార్తె బరినేపల్లె సుమతి (డబ్ల్యూపీసీ 1651) మహిళా పోలీస్ కానిస్టేబుల్‌గా నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఎస్‌ఐ ఎంపిక పరీక్ష తుది ఫలితాల్లో ఆమె ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఖాకీ చొక్కా వేసుకుంటున్న ఆమె తొందరలో దానికి స్టార్స్ బిగించనుంది. తండ్రి వేణుగోపాల్ కౌలు రైతు కాగా, తల్లి భాగ్యమ్మ పాడిఆవులు పోషించుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా మొదటి కుమార్తె అమరావతికి వివాహం అయింది. కుమారుడు రవికుమార్ వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు. చివరి సంతానమైన సుమతి ప్రాథమిక విద్యాభ్యాసం ఇసుకనూతిపల్లె ఎంపీయూపీ స్కూల్‌లో నూ, ఉన్నతవిద్య మదనపల్లె జెడ్పీ హైస్కూల్‌లోనూ, ఇంటర్మీడియెట్ విశ్వసాధన కాలేజ్‌లో, జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో 2017లో డిగ్రీ పూర్తి చేసింది.
AP SI Final Result: ఒకే ఊరు.. ఒకే కాలేజీ.. ఎస్‌ఐ జాబ్ కొట్టిన రైతు బిడ్డలు..!
2018లో విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా ఎంపికై అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి డీపీఓ కార్యాలయంలోనూ, నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పని చేశారు. 2022 డిసెంబర్‌లో విడుదలైన ఎస్‌ఐ పోస్టుల నోటిఫికేషన్ ద్వారా రెండో ప్రయత్నంలో ఎస్‌ఐ ఉద్యోగం సాధించింది. తన లక్ష్యాన్ని సాధించేందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతోపాటు అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ డాక్టర్ రాజ్‌కమల్, పోలీసు ఉన్నతాధికారులు సహాయ సహకారాలతోపాటు ప్రోత్సాహం అందించారని సుమతి తెలిపారు. ఎస్‌ఐ ఉద్యోగం పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు.