Skip to main content

Andhra Pradesh: ఇంటర్‌ విద్యార్థులకు బంపర్‌ ఆఫర్‌

విశాఖ విద్య: ఇంటర్‌తోనే ఐటీ కొలువులు దక్కించుకోవచ్చు. ఉద్యోగం చేస్తూనే పేరొందిన యూనివర్సిటీల్లో డిగ్రీ, ఆ పైకోర్సులను చదువుకోవచ్చు.
 Bumper offer for inter students   Career Growth  Visakha Vidya

హెచ్‌సీఎల్‌ టెక్‌–బీ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఇలాంటి అరుదైన అవకాశం లభించనుంది. ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కాలేజీలకే వచ్చి నైపుణ్యం గల విద్యార్థులను ఎంపిక చేసుకొని వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి, ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ కోర్సులు చేసిన వారికే ఇలాంటి అవకాశం దక్కుతుండగా, తాజాగా ఇంటర్‌ విద్యార్థులకు సైతం చక్కటి అవకాశం లభించనుంది.

చదవండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

16లోగా దరఖాస్తు చేసుకోవాలి

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. https://bit.ly/Tech beeGoAP వెబ్‌సైట్‌లో విద్యార్థుల పూర్తి వివరాలను నమోదు చేసి డిసెంబ‌ర్ 16లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. విద్యార్థులు మూడు దశల్లో పరీక్షలు రాయాలి. తొలుత రాత పరీక్ష, ఆ తరువాత ఇంగ్లిష్‌ నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఈ రెండింటిలో ప్రతిభ చూపిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీనిలో అర్హత సాధించిన వారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో ఏడో నెల నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున స్టైఫండ్‌ ఇస్తారు. అనంతరం మంచి వేతనంతో కూడిన ఉద్యోగం దక్కనుంది.

ఫోన్లలో పరీక్ష రాసే అవకాశం

విశాఖ జిల్లాకు చెందిన విద్యార్థులకు డిసెంబ‌ర్ 20న, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 22న పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.30గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌ కాట్‌ టెస్టు పేరిట నిర్వహించే ఈ పరీక్షకు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చదివే విద్యార్థులంతా అర్హులే. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు విద్యార్థులు తమ సొంత సెల్‌ఫోన్లు కూడా ఉపయోగించుకోవచ్చు.

ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు

ఇంటర్‌ బోర్డుతో హెచ్‌సీఎల్‌ టెక్‌–బీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ చేసుకున్న ఒప్పందం మేరకు విద్యార్థులకు ఇటువంటి అరుదైన అవకాశం లభించనుంది. ఇంటర్‌లో ఎంపీసీ, ఎంఈసీ గ్రూపు విద్యార్థులకు ఐటీ రంగంలోనూ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్‌ కోర్సులు చదివిన వారికి అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి డీపీవో విభాగంలో ఉద్యోగాలు కల్పించనున్నారు. ఎంపికై న విద్యార్థులు ఉద్యోగం చేసుకుంటూనే డిగ్రీ, ఆ పైస్థాయి కోర్సులను చదువుకోవచ్చు. కోర్సు ఫీజులో ఏడాదికి రూ.15 వేలకు తక్కువ కాకుండా హెచ్‌సీఎల్‌ కంపెనీ చెల్లించనుంది.

సద్వినియోగం చేసుకోవాలి

ఇంటర్‌తోనే ఉద్యోగం దక్కించుకునేలా ప్రభుత్వం విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తోంది. చదువుల్లో రాణించే విద్యార్థులకు ఇదో చక్కటి అవకాశం. దీనిని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కువ మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా కాలేజీల ప్రిన్సిపాళ్లు బాధ్యత తీసుకోవాలి. దీనిపై కాలేజీల స్థాయిలో అవగాహన సదస్సులను కూడా నిర్వహిస్తున్నాం.
– రాయల సత్యనారాయణ, ఆర్‌ఐవో, ఉమ్మడి విశాఖ జిల్లా

Published date : 06 Dec 2023 10:29AM

Photo Stories