AP EAPCET 2022: కౌన్సెలింగ్ పూర్తి.. కాలేజీల్లో రిపోర్టు చేయడానికి చివరీ తేదీ ఇదే..
చివరి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొని ఆప్షన్లు నమోదు చేసిన అభ్యర్థులకు అక్టోబర్ 28న సీట్లు కేటాయించినట్లు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ సి.నాగరాణి తెలిపారు. ఈఏపీ సెట్ పరీక్ష రాసినవారిలో 1,73,572 మంది అర్హత సాధించారు. వీరిలో రెండో విడత కౌన్సెలింగ్‌కు 2,677 మంది నమోదు చేసుకున్నారు. వీరితోపాటు తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు దక్కినా వాటిని వదులుకొని 18,959 మంది రెండో విడత కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వీరు మొత్తం 55,227 ఆప్షన్లు నమోదు చేశారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారిలో 11,408 మందికి సీట్లు కేటాయించారు.
చదవండి: Tech skills: సైబర్ సెక్యూరిటీ.. కెరీర్ అవకాశాలు, అర్హతలు, నైపుణ్యాలు అందుకునేందుకు మార్గాలు
తొలి విడతలోనే 84 శాతం పైగా సీట్ల భర్తీ
రాష్ట్రంలోని 249 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో మొత్తం ఉన్న సీట్లు.. 1,12,696. వీటిలో 25 యూనివర్సిటీ కాలేజీల్లో 6,590 సీట్లు, 218 ప్రైవేటు కాలేజీల్లో 1,02,259 సీట్లు, ఆరు ప్రైవేటు యూనివర్సిటీల్లో 3,847 సీట్లు ఉన్నాయి. వీటిలో తొలి విడతలోనే 91,249 సీట్లు (84 శాతం) భర్తీ అయ్యాయి. కాగా మొత్తం రెండు విడతల కౌన్సెలింగ్‌లో 92,661 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 20,035 సీట్లు మిగిలిపోయాయి. వీటిలో యూనివర్సిటీ కాలేజీల్లో 1,233, ప్రైవేటు కాలేజీల్లో 18,593, ప్రైవేటు వర్సిటీల్లో 209 సీట్లు మిగిలి ఉన్నాయి.
చదవండి: Coding and Programming Skills: ఐటీలో కొలువులు.. లక్షల్లో వేతనం..
స్పోర్ట్స్ కేటగిరీలో 491 సీట్లకు సంబంధించి అభ్యర్థుల ఫైనల్ మెరిట్ జాబితా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నుంచి రాకపోవడంతో పెండింగ్‌లో పెట్టారు. త్వరలో వీటిని కూడా కేటాయించనున్నారు. కాగా సీట్లు పొందిన అభ్యర్థులు జాయినింగ్ రిపోర్టును ప్రింటవుట్ తీసుకుని సీటు లభించిన కాలేజీలో అక్టోబర్ 31లోగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కేటాయించిన సీటుకు అభ్యర్థి అడ్మిషన్ల వెబ్‌సైట్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ద్వారా అంగీకారం తెలపకపోయినా, కేటాయించిన కళాశాలలో నివేదించకపోయినా సీటు రద్దవుతుంది.
చదవండి: Job Skills: టెక్ నైపుణ్యాలతో టాప్ కొలువులు.. ప్రత్యేకతలు, నైపుణ్యాలు, భవిష్యత్ అవకాశాలు..