సమానత- సుస్థిరాభివృద్ధి
ముఖ్యాంశాలు:
- అభివృద్ధిలో సామాజిక సూచికలైన విద్య, వైద్యం లాంటివి చోటు చేసుకునేలా ‘మానవాభివృద్ధి సూచిక’ (హెచ్‌డీఐ) చేస్తుంది.
- అధిక ఆదాయం, సంపద ఉన్న వాళ్లు ఏది కావాలన్నా కొనుక్కుని, వినియోగించుకునే స్థితిలో ఉండగా, అధిక శాతం ప్రజలు సరైన ఉద్యోగం, చాలినంత ఆదాయం లేక గౌరవప్రదంగా జీవించడానికి అవసరమయ్యే కనీస అవసరాలు కూడా అందని పరిస్థితిలో ఉన్నారు.
- పారిశ్రామికీకరణ వల్ల కొంత మందికి అనేక వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. అయితే, దీని ఫలితంగా ప్రపంచ సహజ వనరులు అంతరించి పోతున్నాయి, వాతావరణం కూడా అతలాకుతలమైపోయింది.
- ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలు వివిధ స్థాయిల్లో సహజ వనరుల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ వనరులను అందించడంలో పర్యావరణ సామర్థ్యాన్ని ‘పర్యావరణ వనరుల సరఫరానిధి’ అంటారు.
- వనరులు విస్తృతంగా వినియోగించడం, అవి కాలుష్యానికి గురికావడం వల్ల పర్యావరణ వనరుల సరఫరా నిధి తగ్గుతూ వుంది.
- సుస్థిరాభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలు తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బ తీయకుండా ప్రస్తుత తరాల అవసరాలు తీర్చుకోవడం. సుస్థిరాభివృద్ధి అందరికీ- ప్రస్తుత, రాబోయే తరాలకు నాణ్యమైన జీవనాన్ని కోరుకుంటుంది.
- పర్యావరణంపై స్థానిక ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నాయి. చెట్టు నరకటాన్ని అడ్డుకొని, గుత్తేదార్ల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న తమ సాంప్రదాయ, అటవీ హక్కుల కోసం చిప్కో ఉద్యమం మొదలైంది. భూమి, అడవులు, నదులపై ప్రజల హక్కుల కోసం నర్మద బచావో ఉద్యమం పోరాడుతుంది.
- సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యమైన ఒక లక్షణం స్థానిక వనరులు వినియోగించడం. హానికరమైన పురుగులు తినే జీవులను ప్రోత్సాహించడం, పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తెచ్చే నేలలోని సూక్ష్మజీవులను పెంపొందించడం, కృత్రిమ రసాయినిక పదార్థాల వినియోగాన్ని సాధ్యమైనంతగా తగ్గిస్తారు. దీని వల్ల జీవ వైవిధ్యత పెరుగుతుంది.
- సుస్థిర పద్ధతుల్లోని ఆహార ఉత్పత్తి, దాని సమాన పంపిణీకి ఉదాహరణ. ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ. దీనిని తెలంగాణలోని ‘జహీరాబాద్’ ప్రాంతంలో ప్రజా బృందాలు చేపట్టాయి.
- సమానతతో కూడిన సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరూ దీని సాధనకు తమ వంతు కృషి చేయాలి.
కీలక పదాలు:
- సుస్థిర అభివృద్ధి: భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బ తీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం. వేరొక మాటల్లో చెప్పాలంటే సుస్థిర అభివృద్ధి అందరికీ- ప్రస్తుత, రాబోయే తరాలకు నాణ్యమైన జీవనాన్ని కోరుకుంటుంది.
- పర్యావరణం: భూమి, నీరు, ఖనిజసంపద, వనసంపద, పశువులు వంటి సహజ వనరులు అన్నింటిని కలిపి పర్యావరణంగా వ్యవహరిస్తారు. మనం ప్రస్తుతం వనరులను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల దాని ప్రభావం పర్యావరణంపై పడి దాని సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
- వనరుల మూలం: ప్రకృతిలో మానవులకు ఉపయోగపడే భూమి, నీరు, ఖనిజాలు మొదలైనవి.
- ప్రజల హక్కులు: ప్రాథమిక హక్కులో జీవించే హక్కు ముఖ్యమైనది. జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్య రహిత నీటిని, గాలిని పొందే హక్కు ప్రజలకు ఉంది.
- సమానత: పర్యావరణ అంశాల్లో సమానత, న్యాయం భావనలను పరిగణనలోనికి తీసుకోవాలి. పేదరికం నుంచి బయటపడడానికి పర్యావరణరీత్య సుస్థిర మార్గాన్ని కనుగొనాలి.
వ్యాసరూప ప్రశ్నలు:
1.‘‘చివరిగా వ్యర్థ పదార్థాలు, కాలుష్యం తక్కువగా ఉండేలా మన జీవన సరళిని మార్చుకోవడం పైనా పర్యావరణ సమస్యల పరిష్కారం ఆధారపడి ఉంది’’.
మన జీవన శైలి పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మీ నేపథ్యం నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకొని దీన్ని వివరించండి.
ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో చెత్త, కాలుష్య విడుదల సమస్యలను అధికమిస్తున్న వివిధ పద్ధతులను పేర్కొనండి.
జ:
- జీవన వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది. ప్రతి ఒక్కరు పర్యావరణంపై అవగాహన పెంపొందించుకుని దాని పరిరక్షణకు కృషి చేయాలి.
- మానవ జీవన శైలిలోని మార్పులు పర్యావరణాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మనం పీల్చుకునే గాలి పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యాల వల్ల కలుషితమవుతుంది. తగిన కాలుష్య నివారణా చర్యలు తీసుకోవాలి.
- పారిశ్రామికీకరణ వల్ల అనేక కాలుష్యాలు భూమిలోకి విడుదల చేయడంతో నేల, నీరు కలుషితం అవుతున్నాయి. కాలుష్యాన్ని అరికట్టాలి.
- సారవంతమైన నేలలు రసాయినిక కాలుష్యాల కారణంగా ప్రమాదకరమైనా ప్రాంతాలుగా మారిపోతున్నాయి. భూసార పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.
- విద్యుత్ శక్తి ఉత్పత్తి ప్రక్రియలో విడుదలవుతున్న కార్బన్-డై-ఆక్సైడ్ వాయువుల వల్లగాలి కాలుష్యం పెరిగి ‘గ్లోబల్ వార్మింగ్’కు దారితీస్తూ, ఆమ్లా వర్షాలకు కారణమవుతోంది.
- పారిశ్రామిక చెత్త, కాలుష్య కారకాలను గుర్తించి వాటిని సక్రమ యాజమాన్య పద్ధతుల ద్వారా తొలగించాలి. ప్రజలు వనరులను తెలివిగా, పొదుపుగా, సమర్థవంతంగా వినియోగించుకోవాలి. తద్వారా పర్యావరణానికి కలిగే హానిని తగ్గించ గలుగుతారు.
- సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సాహించాలి. కృత్రిమ రసాయినిక ఎరువుల వినియోగాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలి.
2. ఖనిజాలు, ఇతర సహజ వనరులను వేగంగా సంగ్రహించడం వల్ల భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. మీరు ఏకీభవిస్తారా!?
జ:
- ప్రస్తుత అవసరాల కోసం ఖనిజాలను అధిక మొత్తంలో వేగంగా వినియోగించుకోవడంవల్ల భవిష్యత్తు అవసరాలకు అవి మిగలవు.
- ఆధునిక పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి వల్ల సహజ వనరులు,ఖనిజాలు అధికంగా వెలికి తీసి వినియోగించడం వల్ల వాటి నిల్వలు తగ్గుతున్నాయి.
- ఉత్పత్తి ప్రక్రియలో భూమి, నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులువంటి సహజ వనరులు ఎంతో ముఖ్యమైనవి.
- వ్యవసాయం, గనుల తవ్వకం వంటి ప్రాథమిక రంగ కార్యకలాపాల్లోనే కాకుండాతయారీ, ఇంధన రంగాలలో కూడా సహజ వనరుల మీద ఉత్పత్తి ప్రధానంగాఆధారపడి ఉంది.
- వనరులు వినియోగిస్తూ ఉండడం వల్ల, అవి కాలుష్యానికి గురవుతుండడంతో ఈసామర్థ్యం తగ్గుతూ ఉంటుంది.
- పర్యావరణం శుద్ధి చేయగలిగిన దాని కంటే ఎక్కువ మోతాదులో వ్యర్థ పదార్థాలు ఉత్పన్నమవుతుంటే, పర్యావరణానికి దీర్ఘకాల నష్టం జరుగుతుంది.
- ప్రస్తుతం మనం వనరులను ఉపయోగిస్తున్న తీరు చూస్తే అరుదైన వనరులలో భవిష్యత్తు తరాలు తమ న్యాయమైన వాటాను పొందే అవకాశాలు దెబ్బతింటున్నాయి. అంతే కాకుండా, మనం ఉపయోగించే వనరుల ప్రభావం పర్యావరణంపై పడి దాని సామర్థ్యాన్ని శాశ్వతంగా దెబ్బతీసే అవకాశం ఉంది.
3.‘‘స్థానిక జనజీవనానికి, జీవనోపాధులు, పరిసరాలతో సహజీవనం చేసే జీవన విధానానికి పర్యావరణం చాలా ముఖ్యమైనది’’వివరించండి.
జ:
- గ్రామీణ ప్రాంతంలో ఉండే చాలా మంది ప్రజల జీవితాలకు, పర్యావరణానికి మధ్య బలమైనసంబంధం ఉంది.
- పర్యావరణం అందుబాటులో ఉన్నప్పుడు దాని నుంచి వాళ్లు అనేక అవసరాలు తీర్చుకుంటారు. అదే లేకపోతే, వాటికి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.
- నిర్వాసితులకు స్థానిక పర్యావరణం లేకపోతే వాళ్ల జీవితాలు శూన్యమైపోతాయి. స్వయం సంవృద్ధి దశ నుంచి ఒక్కసారిగా కొరతలోకి విసిరేసినట్లు ఉంటుంది. వాళ్లు ‘పేదరికం’లోకి వెళ్లిపోతారు.
- నిర్వాసితులు వారి పర్యావరణం కలుషితమైనా, విధ్వంసమైనా ఎక్కువగా నష్టపోతారు.
- పర్యావరణం, సుస్థిరత అంశాలు సమానత అన్న అంశంతో బలంగా ముడిపడి ఉన్నాయి.
- ప్రజలతో పాటు సాంప్రదాయ జ్ఞానం మాయమైపోతుంది. సుసంపన్నమైన పర్యావరణ జీవవైవిధ్యత అంతరించిపోతుంది.
సంక్షిప్త సమాధాన ప్రశ్నలు:
1. మీరు తినే ఆహార పదార్థాలలో పదింటిని తీసుకుని మీ వద్దకు చేరటానికి ఉత్పత్తి అయిన స్థలం నుంచి ఎంత దూరం ప్రయాణించాయో తెలుసుకోండి.
క్ర.సం. | ఆహార పదార్థం | ప్రయాణించిన దూరం |
1 | బియ్యం | |
2 | వంటనూనె | |
3 | అరటి పళ్లు |
చాలా మంది ఆహారం దూర ప్రాంతాలకు రవాణా చేయడం కాకుండా స్థానికంగా ఉత్పత్తి చెయ్యాలని అంటారు. స్థానికంగా ఆహారం ఉత్పత్తి చెయ్యటానికీ, పర్యావరణానికీ సంబంధం ఏమిటి? స్థానికంగా ఆహారాన్ని పండించి, వినియోగించాలన్న ఉద్యమం గురించి మరింత తెలుసుకుని తరగతి గదిలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించండి. (మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటేయుట్యూబ్‌లో కింద లింకులో ఉన్న హెలెనా నార్బెర్గ్-హాడ్జ్ ఉపన్యాసాన్ని వినండి: http://www.youtube.com/watch?v=4r06_F2F1KM
జ:
క్ర.సం. | ఆహార పదార్థం | దూరం |
1. | కొబ్బరికాయలు | 200 కి.మీ |
2. | వంట నూనెలు | 100 కి.మీ |
3. | నెయ్యి | 50 కి.మీ |
4. | కూరగాయలు | 20 కి.మీ |
5. | కమలాపండ్లు | 300 కి.మీ |
6. | కందిపప్పు | 250 కి.మీ |
7. | శనగలు | 20 కి.మీ |
8. | బియ్యం | 30 కి.మీ |
9. | గోధుమలు | 10 కి.మీ |
10. | పంచదార | 100 కి.మీ |
2. జల సింధి గ్రామ ప్రజలు తమ ఊరి నుంచి తరలి వెళ్లడాన్ని ఎందుకు తిరస్కరించారు?
జ: ఝబువా జిల్లాలోని జలసింధి గ్రామ ప్రజలు గుజరాత్‌లోని మైదానంలోకి వెళ్లడానికి వ్యతిరేకించారు. వారి భూములను నర్మదా నది తీరాన ఎన్నో తరాల నుంచి సేద్యం చేస్తూ జీవిస్తున్నారు. వారి శ్రమతో అనేక రకాల ఆహార ధాన్యాలు వారు పండిస్తారు. వారికి డబ్బుతో పని లేదు. వారు వాగులకు కాలువలు చేసి వారి పంటలకు నీళ్లు పెట్టుకుంటారు. వారికి వ్యవసాయంతో పాటు పశు సంపద ఎంతో ముఖ్యమైనది. వారి పశువులను మేపుటకు కావలసినంత మేత, నీళ్లు సంవృద్ధిగా అక్కడ దొరుకుతున్నాయి. వారికి అనారోగ్యం కలిగితే, స్థానికంగా అడవిలో దొరుకు ఔషధాలను వైద్యులు తెచ్చినయం చేస్తారు. వారు నర్మదా నది తల్లి చల్లని కడుపులో సంతృప్తికరమైన జీవితాలు గడుపుతున్నారు.
అందువల్ల ఆ గ్రామ ప్రజలు వారి ఊరు వదిలి వెళ్లరు.
3. ‘‘ఇది మా పూర్వీకుల భూమి. దీనిపై మాకు హక్కు ఉంది. దీనిని కోల్పోతే మా చేతికి పారలు, గడ్డపారలు వస్తాయి తప్ప ఇంకేమి మిగలదు’’.....అన్న బావా మహాలియా మాటలు వివరించండి.
జ: జలసింధి గ్రామ ప్రజలు నర్మదా నది తీరానతరతరాలగా సేద్యం చేస్తూ ప్రకృతితో మమేకమై జీవితాలను కొనసాగిస్తున్నారు. వారు అడవిని నమ్ముకొని జీవితాలు గడుపుతున్నారు. స్థానికంగా దొరికే టేకు, వెదురుతో ఇళ్లు నిర్మించుకుంటారు. కరువు సమయంలో వీళ్లు దుంపలు తిని బతుకుతారు. నదులలో చేపలు పుష్కలంగా దొరుకుతాయి. నదీ తల్లి చల్లని కడుపులో సంతృప్తికరమైన జీవితాలు గడుపుతున్నారు.
వాళ్లు గుజరాత్ వెళ్లడానికి ఇష్టపడడం లేదు.
4. వాతావరణ మార్పు ప్రభావం అన్ని దేశాలపై ఉంటుందని ఎందుకనుకుంటున్నారు?
జ: వాతావరణ మార్పు వల్ల అన్ని దేశాలు, ప్రజలు అందరూ స్థాయి భేదాలతో ప్రభావితం అవుతాయి. ఈ మార్పులలో అనేకం మనం అర్థం చేసుకొనే స్థితిలో లేము. చాలా వాటిని ముందుగా ఊహించలేము. హరిత గృహ ఉద్గారాలను తగ్గించడానికి ఒక దేశం నిర్ణయించుకోవచ్చు. అయితే, ఇతర దేశాలు తమ ఉద్గారాలను నియంత్రించుకోకపోతే ఆ దేశ పర్యావరణ క్షీణత కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలు కలిసి చేపట్టే పరిష్కారాలు అవసరమవుతాయి.
5. భూమి సగటు ఉష్ణోగ్రతలను ప్రజలందరికీ సహజ వనరుగా పరిగణించాలా?
జ:
- భూమి సగటు ఉష్ణోగ్రత13 డిగ్రీల సెంటిమీటర్లు.
- దీని వల్ల భూమిపై మానవ జీవనం గడపడం సాధ్యమవుతుంది.
- ప్రపంచంలో శీతష్ణస్థితులలో పలు మార్పులు సంభవించడం వల్ల ఉష్ణోగ్రతలు 3 నుంచి5 డిగ్రీ సెంటీమీటర్లు పెరుగుతున్నాయి.
- జీవవైవిధ్యంలో మార్పులు కలిగి పర్యావరణ సమతూకం దెబ్బతింటుంది.
- ‘గ్లోబల్ వార్మింగ్’ వల్ల ప్రపంచంలోని దేశాలు పలు సవాళ్లు ఎదుర్కొవలసిన స్థితిఏర్పడింది.
- వేగవంతమైన పారిశ్రామిక ప్రగతి వల్ల పర్యావరణం కాలుష్యానికి గురై భూమిపై సగటుఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
- భూమి సగటు ఉష్ణోగ్రతలు కాపాడుకోవలసిన బాధ్యత ప్రజల అందరిపైఉంది.
జ:
- ‘సంప్రదాయ పంటల నమూనా’పై సేద్యం కొనసాగించడం వల్ల వర్షధారంగా భూములను సాగుచేయవచ్చు.
- చిరుధాన్యాల వల్ల ఎక్కువ పోషకాలు పొందవచ్చు.
- ఆహారంలో స్వయం సమృద్ధికి చిరుధాన్యాల సాగు మేలైనది.
- ఆహార కొరత తగ్గించి ఆహార భద్రత పెంపొందించును.
- జహీరాబాద్ రైతులు తమ పూర్వీకుల సంప్రదాయక ఆహార ధాన్యాల విలువను గ్రహించి పంటలు పండిస్తున్నారు.
Tags
- AP 10th
- AP 10th Study Material
- AP 10th Social
- Equity- Sustainable Development
- sakshi education study materials
- ap10thclass social study materials
- ap10th class study materials
- ap10thclass study materials pdfs
- 10thclass studymaterial
- 10thclass social study materials
- 10th class study materials pdfs
- Sustainable –Development with Equity