Skip to main content

ప్రపంచీకరణ

10th class study materialముఖ్యాంశాలు:

  1. దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ‘ప్రపంచీకరణ’ అంటారు.
  2. ప్రపంచీకరణ ప్రస్తుత దశలో ఒక ముఖ్యమైన అంశం. అపారసంపద ఉన్న బహుళజాతి కంపెనీల నియంత్రణలో పెట్టుబడులు, వాణిజ్యం ద్వారా మార్కెట్లు, ఉత్పత్తి అనుసంధానమవుతాయి.
  3. వాణిజ్యం, పెట్టుబడులకు ఉన్న సరళీకృత విధానం ద్వారా అవరోధాలను తొలగించడం వల్ల ప్రపంచీకరణ శక్తులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరచినట్లు అయ్యింది.
  4. ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా పంపిణీ కాలేదు. సుసంపన్న వినియోగదారులకు, నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తి దారులకు అది ప్రయోజనకరంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొన్ని సేవలు విస్తరించాయి.
  5. వేలాది మంది చిన్న ఉత్పత్తి దారులకు, కార్మికులకు వాళ్ల ఉపాధికి హక్కులకు భంగం కలుగుతుంది.
  6. వాణిజ్యం, పెట్టుబడులు, వలస వంటి అంతర్జాతీయ ఆర్థిక విధానంలో ధనిక పాశ్చాత్య దేశాలు మిగిలిన ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
  7. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రపంచ బ్యాంకు (IBRD) అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) వంటి అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనాలకు ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
  8. ప్రపంచీకరణ అభివృద్ధికి, సంపదకు అవకాశాలను అందిస్తుందని భావించగా ప్రపంచంపై ఆధిపత్యం కోసం కొన్ని పాశ్చాత్య దేశాలు ప్రయత్నంగా కొందరు భావించుతున్నారు.
  9. ప్రపంచీకరణ వల్ల ప్రజాస్వామ్యం, కార్మికుల హక్కులు, పర్యావరణానికి భంగం కలుగుతుంది అని విమర్శకులు వాదిస్తున్నారు.
  10. కొన్ని భాషలు విస్తృతంగా ఉపయోగించడం వల్ల ఇతర భాషలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని కొందరి వాదన.

కీలక పదాలు:

  1. బహుళజాతి సంస్థలు (MNC): ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను బహుళజాతి సంస్థలు (MNC) అంటారు. కార్మికులు, ఇతర వనరులు చౌకగా లభించే ప్రాంతాలో్ల బహుళజాతి సంస్థలు తమ కార్యాలయాలను, కర్మాగారాలను నెలకొల్పుతాయి.
  2. జాతీయ రాజ్యం: దేశాల మధ్య వర్తక వాణి జ్యాల సంబంధాలు కలిగి వుండి, రాజకీయపరంగా అనేక అంశాలతో ముడిపడివున్న రాజ్యాలు.
  3. సాంకేతిక పరిజ్ఞానం: సమాచారం, రవాణా సదుపాయాలు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, కమ్యూనికేషన్ రంగాలలో అభివృద్ధిని సాంకేతిక పరిజ్ఞానంగా వ్యవహారిస్తారు.
  4. విదేశీపెట్టుబడి: బహుళజాతి సంస్ధలు(MNC) దేశంలో చేసే ఆస్తుల కొనుగోళ్లు, భవనాల నిర్మాణం, యంత్రాలు, ఇతర ఉత్పత్తి పరికరాలపై చెల్లించు మొత్తాన్ని విదేశీపెట్టుబడిగా పరిగణిస్తారు.
  5. విదేశీవాణిజ్యం: ఒక దేశం ఇతర దేశాలతో చేసే వాణిజ్యం. ఇది ఎగుమతులు, దిగుమతుల రూపంలో కనిపిస్తుంది.
  6. సరళీకృత ఆర్థిక విధానం: విదేశీ వాణిజ్యం, విదేశీపెట్టుబడులకు గల అవరోధాలను చాలా వరకు తొలగించడం. దేశంలోనికి సరుకులు స్వేచ్ఛగా దిగుమతి చేసుకోనివ్వడం, అలాగే ఎగుమతులపై ఆంక్షలు తొలగింపు, ప్రభుత్వ పరంగా నియంత్రణను తొలగించడాన్ని సరళీకృత ఆర్థిక విధానంగా పిలుస్తారు.
వ్యాసరూప ప్రశ్నలు
1. ‘‘ప్రపంచీకరణ ప్రభావం ఒకే రకంగా లేదు’’ ఈ వాక్యాన్ని వివరించండి.
జ:
  1. ప్రపంచీకరణ వల్ల వినియోగదారులకు, ప్రత్యేకించి పట్టణాలలోని సంపన్నులకు మేలు జరిగింది.
  2. అనేక ఉత్పత్తులలో నాణ్యత పెరిగి, ధరలు తగ్గాయి. ఫలితంగా ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలు అనుభవిస్తున్నారు.
  3. భారతదేశ అతిపెద్ద కంపెనీలలో అనేకం పెరిగిన పోటీ వల్ల ప్రయోజనం పొందాయి.
  4. ప్రపంచీకరణ వల్ల సేవలు, ప్రత్యేకించి IT(Information Technology) తో కూడిన సేవలు అందించే కంపెనీలకు కొత్త అవకాశాలు లభించాయి.
  5. ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా పంపిణీ కాలేదు. సంపన్న వినియోగదారులకు, నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తి దారులకు అది ప్రయోజనకరంగా ఉంది.
  6. వేలాది మంది చిన్న ఉత్పత్తి దారులకు, కార్మికులకు వాళ్ల ఉపాధికి, హక్కులకు భంగం కలుగుతోంది.
  7. వాణిజ్యం,పెట్టుబడులు, వలస వంటి అంతర్జాతీయ ఆర్థిక విధానాలలో ధనిక పాశ్చాత్య దేశాలు మిగిలిన ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
  8. పేద దేశాలలో దీని వల్ల ప్రజాస్వామ్యం, కార్మికుల హక్కులు, పర్యావరణానికి భంగం కలుగుతుంది అని విమర్శకులు వాదిస్తున్నారు.
  9. ప్రపంచీకరణ అతిపెద్ద ప్రభావం ఏవైనా ఉంటే అది జాతీయ భావనను పల్చబరచటమే.
  10. ప్రపంచీకరణ సాంస్కృతిక వైవిధ్యతకు దారితీస్తుందా! లేక సాంస్కృతిక మూస పోతకు దారితీస్తుందా! అన్నది.. స్థానిక, అల్పసంఖ్యాక వర్గాల సంస్కృతులు పక్కకు నె ట్టివేస్తున్నాయని కొందరి వాదన.
2. ప్రపంచీకరణ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది, ఇప్పటి నుంచి ఇరవై ఏళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందో మీ ఊహలకు కారణాలను పేర్కొనండి.
జ:
  1. ప్రపంచీకరణ వల్ల ప్రజాస్వామ్యం, కార్మికుల హక్కులు, పర్యావరణానికి భంగం కలుగుతుంది.
  2. అయితే, ప్రపంచీకరణ వల్ల సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందినది. బహుళజాతి సంస్థలు విస్తరించాయి.
  3. చిన్న ఉత్పత్తి దారులు పోటీకి నిలబడలేక కనుమరుగైపోతున్నారు. అయితే, అన్ని వినియోగ వస్తువుల ధరలు క్రమంగా తగ్గుతున్నాయి.
  4. విదేశీ వాణిజ్యం,పెట్టుబడులలో ఎక్కువ స్థాయిలో పోటీ పెరిగిపోయింది.
  5. ప్రపంచీకరణ వల్ల జాతీయ భావన, జాతీయ రాజ్యాలు అంతరించిపోనున్నాయి.
  6. ప్రపంచీకరణ సాంస్కృతిక వైవిధ్యతకు దారితీస్తుందా లేక సాంస్కృతిక మూసపోతకు దారితీస్తుందా అనేది ముఖ్యమైనది.
  7. కొన్ని భాషలు విస్తృతంగా ఉపయోగించి అంతర్జాతీయ ప్రసార సాధనాలకు వారధిగా ఉండి ఇతర భాషలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కొన్ని అంతరించి పోయే ప్రమాదంలో ఉన్నాయని కొందరు భావిస్తున్నారు.
  8. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO), పపంచ బ్యాంకు (IBRD), అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) వంటి అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చెందిన దేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రపంచీకరణ పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి దోహదం చేస్తుంది.
సంక్షిప్త సమాధాన ప్రశ్నలు
1. విదేశీ పెట్టుబడి, వాణిజ్యాలపై భారత ప్రభుత్వం అవరోధాలు కల్పించటానికి గల కారణాలు ఏమిటి? అవరోధాలను తొలగించాలని అది ఎందుకు అనుకుంది?
జ:
  1. స్వాతంత్య్రం పొందిన తరువాత భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు అవరోధాలు విధించింది. దేశంలోనే ఉత్పత్తి దారులకు విదేశీ పోటీ నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని భావించింది.
  2. అత్యవసర వస్తువులు యంత్రాలు, రసాయనిక ఎరువులు, ముడి చమురు వంటి వాటి దిగుమతిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది.
  3. అయితే, 1991 నుంచి మొదలుకొని దీర్ఘకాల ప్రభావం చూపించేలా భారతదేశ విధానాలలో మార్పులు చేశారు.
  4. భారతీయ ఉత్పత్తి దారులు ప్రపంచ వ్యాప్త ఉత్పత్తి దారులతో పోటీ పడాల్సిన సమయం వచ్చిందని ప్రభుత్వం నిర్ణయించింది.
  5. పోటీ ఫలితంగా దేశంలోని ఉత్పత్తి దారులు తమ నాణ్యతను మెరుగుపరుచుకోవలసి ఉంటుంది కాబట్టి వాటి పనితీరు మెరుగు అవుతుంది అని భావించారు.
2. కార్మిక చట్టాల సడలింపు కంపెనీలకు ఏ విధంగా సహాయపడుతుంది?
జ:
  1. కార్మిక చట్టాల సడలింపు వల్ల కంపెనీలు తక్కువ వేతనాలకు పనిచేయించుకోడానికి తగినంత మంది కార్మికులు లభ్యమవుతుండడం వల్ల ఎక్కువ పని గంటలు వారిచే పనిచేయించుకొని అవి లాభించాయి.
  2. కార్మిక చట్టాల సడలింపు కంపెనీలకు ఉత్పత్తి పెంచుకోవడంలో సహాయపడ్డాయి.
3. ఉత్పత్తిని చేపట్టడానికి, దానిని నియంత్రించడానికి, ఇతర దేశాలలో స్థిరపడడానికి బహుళజాతి సంస్థలు అవలంబించే విధానాలు ఏమిటి?
జ:
  1. బహుళజాతి సంస్థలు చౌకగా లభ్యమగు శ్రామికులు, ఇతర సహజ వనరులు పుష్కలంగా వున్న దేశాలలో వస్తూత్పత్తి చేయడానికి తమ సంస్థలను నెలకొల్పుతారు.
  2. బహుళజాతి సంస్థలు తమ వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్నాయి.
  3. స్థానిక కంపెనీలతో బహుళజాతి సంస్థలు భాగస్వామ్యం ఏర్పర్చుకున్నాయి.
4. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాణిజ్యం, పెట్టుబడులలో సరళీకృత విధానాలను అవలంబించాలని అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు కోరుకుంటున్నాయి? దీనికి ప్రతిగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏ షరతులను కోరాలి?
జ:
  1. సరళీకృత విధానాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు అవలంబించడం వల్ల అభివృద్ధి చెందిన దేశాల బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తి కంపెనీలను ఆయా దేశాలలో నెలకొల్పగలుగుతున్నాయి.
  2. అధిక విదేశీ పెట్టుబడులు, అధిక విదేశీ వాణిజ్యం వల్ల వివిధ దేశాల ఉత్పత్తి, మార్కెట్ల మధ్య అనుసంధానం పెరిగింది.
  3. అంతర్జాతీయ వ్యాపారం అనగా ఎగుమతులు, దిగుమతుల పరిమాణం పెరగడం వల్ల అభివృద్ధి చెందిన దేశాలు లాభాలను సాధిస్తున్నాయి.
  4. తక్కువ వేత నానికి పని చేసే కార్మికుల లభ్యత అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండడం వల్ల, బహుళజాతీ సంస్థలకు ఉత్పత్తి వ్యయం తగ్గి వస్తువు ధరను సరసమైన విధంగా వుంచడం వల్ల లాభాలు చేకూర్చుకుంటున్నాయి.
  5. ప్రతిఫలంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు బహుళజాతి సంస్థల నుంచి దిగుమతి చేస్తున్న వస్తువులపై దిగుమతి సుంకాలు విధించరాదని, ఆయా దేశాల నుంచి వస్తువుల దిగుమతి పై ఎలాంటి షరతులు, అడ్డంకులు విధించరాదని కోరాలి.
5. వాణిజ్య, పెట్టుబడి విధానాలను సరళీకరించడం వల్ల ప్రపంచీకరణ ప్రక్రియకు మేలు ఎలా జరిగింది?
జ:
  1. సరళీకృత ఆర్థిక విధానం వల్ల అనేక బహుళజాతి సంస్థలు తమ వస్తు ఉత్పత్తి కార్యక్రమాలను, వాణిజ్య లావాదేవీలను అభివృద్ధి చెందిన దేశాలలో విస్తరించాయి.
  2. బహుళజాతి సంస్థలు స్థానిక సంస్థలతో సంబంధాలు ఏర్పర్చుకుని వాణిజ్యాన్ని విస్తరించాయి.
  3. నేరుగా విదేశీ పెట్టుబడులు పెరగడం వల్ల దేశీయ ఉపాధి కల్పనకు అవకాశాలు పెరిగాయి.
6. దేశాల మధ్య మార్కెట్ అనుసంధానానికి విదేశీ వాణిజ్యం ఎలా దోహదం చేస్తుంది? ఇక్కడ ఇచ్చినవి కాకుండా కొత్త ఉదాహరణలతో దీనిని వివరించండి.
జ:
  1. అధిక విదేశీ పెట్టుబడులు, అధిక విదేశీ వాణిజ్యం వల్ల వివిధ దేశాల ఉత్పత్తి, మార్కెట్ల మధ్య అనుసంధానం పెరిగింది.
  2. ప్రపంచీకరణ ప్రక్రియలో బహుళజాతి సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
  3. దేశాల మధ్య వస్తు సేవలు పెట్టుబడులు, సాంకేతిక విజ్ఞానం పెరుగుతున్నాయి.
  4. కొన్ని దశాబ్దాల క్రితంతో పోలిస్తే ప్రపంచంలోని ప్రాంతాల మధ్య దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి.
  5. భారతదేశం గల్ఫ్ దేశాలకు కావాల్సిన ఆహార పదార్థాలను ఎగుమతి చేసి, దేశానికి కావలసిన పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది.
7. ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం మీరు వింటున్నారు. ఒకరు ప్రపంచీకరణ మన దేశ అభివృద్ధిని కుంటుపరిచిందని అంటున్నారు. మరొకరు భారతదేశం అభివృద్ధి చెందడానికి ప్రపంచీకరణ సహాయపడుతోందని అంటున్నారు. వాదనలకు మీరు ఎలా స్పందిస్తారు?
జ:
ప్రపంచీకరణ భారతదేశం అభివృద్ధి చెందడానికి సహాయపడుతోందని నేను భావిస్తున్నాను. దీని వల్ల మన దేశంలో వాణిజ్యంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందని అభిప్రాయపడుతున్నాను.
ఖాళీలను పూరించండి

భారతీయ కొనుగోలుదారులకు రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సరుకుల ఎంపికకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ______ (ప్రపంచీకరణ) ప్రక్రియ వల్ల ఇది సాధ్యమయ్యింది. అనేక ఇతర దేశాలలో ఉత్పత్తి అయిన సరుకులను భారతదేశ మార్కెట్లలో అమ్ముతున్నారు. దీని అర్థం ఇతర దేశాలతో ______ (వాణిజ్యం) పెరుగుతోంది. అంతేకాకుండా మనం మార్కెట్లో చూస్తున్న అనేక బ్రాండ్లను బహుళజాతి సంస్థలు భారతదేశంలోనే ఉత్పత్తి చేసి ఉండవచ్చు. బహుళజాతి సంస్థలు______ (చౌకగా దొరకు శ్రామికులు, వనరుల) కారణంగా భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. మార్కెట్లో వినియోగదారుల ఎంపికకు అవకాశాలు పెరిగాయి కానీ ______ (నాణ్యత, ధరల) వల్ల ఉత్పత్తిదారుల మధ్య ______(పోటీ) తీవ్రతరం అయ్యింది.

కిందివాటిని జతపరచండి
1. బహుళజాతి సంస్థలు తక్కువ ధరకు చిన్న ఉత్పత్తిదారుల నుంచి కొంటాయి.

( )

(అ) వాహనాలు
2. వస్తువుల వాణిజ్యాన్ని నియంత్రించడానికి కోటాలు, పన్నులు ఉపయోగిస్తారు.

( )

(ఆ) దుస్తులు, పాదరక్షలు, కీడాపరికరాలు
3. విదేశాలలో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలు

( )

(ఇ) కాల్ సెంటర్లు
4. సేవల ఉత్పత్తి విస్తరించడానికి సమాచార సాంకేతిక రంగం (IT) దోహదపడింది

( )

(ఈ) టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, రాన్‌బాక్సి
5. భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి అనేక బహుళజాతి సంస్థలు కర్మాగారాల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాయి.

( )

(ఉ) వాణిజ్య అవరోధాలు
Published date : 06 Dec 2023 01:09PM

Photo Stories