ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం - భారతదేశం
ముఖ్యాంశాలు:
- రెండోప్రపంచ యుద్ధ ప్రభావం ఐరోపా దేశాలపై ఎక్కువగా ఉంది.
- యూఎస్‌ఎస్‌ఆర్, పోలాండ్, యుగోస్లావియాలలో తమ జనాభాలో 20 శాతం వరకు చనిపోయారు.
- రష్యాలో 1700 పట్టణాలు, 31,000 కర్మాగారాలు, 70,000 గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
- అమెరికా భూభాగం మీద యుద్ధం జరగలేదు కాబట్టి దానికి జరిగిన నష్టం తక్కువ.
- రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా పరిశ్రమలు, వ్యవసాయం వృద్ధి చెంది అధిక ఉపాధి,ఉత్పాదకత సాధించారు.
- యుద్ధం వల్ల మనం ప్రపంచంలోకెల్ల శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం. చరిత్రలో ఇంతటి శక్తివంతమైన దేశం మరొకటి లేదు అని అప్పటి అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్ అన్నాడు.
- యుద్ధానంతరం ప్రపంచం మూడు కొత్త ప్రక్రియలను చూసింది.
- ఐక్యరాజ్య సమితి ఏర్పాటు
- ప్రచ్ఛన్న యుద్ధం
- వలసపాలన నుంచి విముక్తి
- యుద్ధం ముగింపు దశలో బ్రిటన్, ఫ్రాన్‌స, అమెరికా, రష్యా, చైనాలు ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు ఒక పత్రాన్ని తయారు చేశాయి.
- ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రపంచ శాంతి, మానవ అభివృద్ధి అన్న రెండు ప్రధాన ఉద్దేశాలతో ఏర్పడింది.
- ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాల సంఖ్య-6. ఇవే కాకుండా అనేక ప్రత్యేక అంగాల ద్వారా ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది.
- హేగ్‌లో అంతర్జాతీయ న్యాయస్థానం, జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పారిస్‌లో ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యూఎన్‌ఈఎస్‌సీఓ), న్యూయార్‌కలో అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యూఎన్‌ఐసీఈఎఫ్) ఉన్నాయి.
- ఐక్యరాజ్యసమితి ముఖ్య అధికారి సెక్రెటరీ జనరల్.
- భద్రతా మండలిలో చైనా, ఫ్రాన్‌స, బ్రిటన్, అమెరికా, రష్యాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. వీటికి ‘వీటో అధికారం’ ఉంది.
- రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక పెట్టుబడిదారీ శిబిరం, యూఎస్‌ఎస్‌ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్టు శిబిరం ఏర్పడ్డాయి.
- ప్రపంచ దేశాలను తమ శిబిరాల్లో చేర్చుకోవడానికి ఈ రెండు అగ్రదేశాలు పోటీపడ్డాయి.
- 1945 నుంచి 1990 వరకు ఈ రెండు శిబిరాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది.
- అమెరికా, రష్యాలు ప్రత్యక్ష యుద్ధాలకు దిగక పోయినప్పటికి పరోక్ష యుద్ధాల్లో పాలుపంచుకున్నాయి.
- ఈ రెండు దేశాలు వేల కొద్ది అణ్వాయుధాలు తయారు చేశాయి.
- అనేక దేశాలతో సైనిక ఒప్పందాలు చేసుకున్నాయి.
- 1949లో అమెరికా తన మిత్ర దేశాలతో ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ (ఎన్‌ఏటీఓ)ను ఏర్పరుచుకుంది.
- దీనికి ప్రతి చర్యగా రష్యా తన మిత్రదేశాలతో ‘వార్సా’ ఒప్పందం చేసుకుంది.
- ఆ తర్వాత అమెరికా సౌత్‌వెస్ట్ ఏసియన్ ట్రీటీ ఆర్గనైజేషన్(ఎస్‌ఈఏటీఓ), సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ (సీఈఏటీఓ)లను కుదుర్చుకుంది.
- ఈ రెండు దేశాల మధ్య ఆయుధ పోటీతో పాటు అంతరిక్ష పోటీ కూడా జరిగింది. ఉపగ్రహాలు, మనుషులను అంతరిక్షంలోకి పంపడంలో పోటీ పడ్డాయి.
- రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్య్రం పొందిన దేశాలు అభద్రతాభావంతో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్నాయి.
- 1955లో ఇండోనేషియా, రాజధాని బాండుంగ్‌లో ఆసియా-ఆఫ్రికా దేశాలు సమావేశమై అలీన విధానానికి రూపకల్పన చేశాయి. అఅలీన విధాన రూపశిల్పి మన దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.
- అలీన దేశాల మొదటి సమావేశం 1961 సెప్టెంబర్‌లో యుగోస్లోవియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగింది. దీనికి 25 దేశాలు హజరయ్యాయి.
- అలీన విధానాన్ని అటు అమెరికా, ఇటు రష్యా రెండు కూడా విమర్శించాయి అయితే భారతదేశం వీటికి ధీటైన జవాబు ఇచ్చింది.
- యూరప్, ఆసియా మధ్య ప్రాంతాన్ని పశ్చిమ ఆసియా అని, మధ్య ప్రాచ్యం అని అంటారు.
- అరబ్బులకు, యూదులకు మధ్య జరిగిన ఘర్షణలను పశ్చిమ ఆసియా సంక్షోభం అని అంటారు.
- పాలస్తీనాలోని జెరూసలెం యూదులు, క్రైస్తవులు, ముస్లింలందరికీ పవిత్రస్థలం.
- యూదులు పాలస్తీనాను తమ ‘వాగ్దత్త భూమి’గా పరిగణిస్తారు.
- ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగిపొంది, యూదులకు ప్రత్యేక దేశం నిర్మించడానికి, యూదులు ‘జియానిస్ట్ ఉద్యమం’ ప్రారంభించారు.
- పాలస్తీనా కోసం యూదులు, అరబ్బుల మధ్య ఘర్షణ మొదలైంది.
- 1947లో ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానాన్ని ఆమోదిస్తూ పాలస్తీనాను రెండు భాగాలుగా విభజించింది :-
- పాలస్తీనా-అరబ్బులకు
- ఇజ్రాయిల్-యూదులకు
- ఈజిప్టు అధ్యక్షుడు నాజర్ సూయజ్ కాలువను జాతీయం చేశాడు.
- ఆస్వాన్ ఆనకట్ట కట్టినందుకు అమెరికా ఈజిప్టుకి ఆర్థిక సహాయాన్ని నిలిపివేసింది.
- 1956లో ఈజిప్టు పై ఇజ్రాయిల్ దాడి చేసింది.
- 1967లో అరబ్బులు ఇజ్రాయిల్ పై దాడి చేశారు.
- 1964లో జోర్డాన్‌లో పాలస్తీనా విముక్తి సంఘం (పీఎల్‌ఓ) ఆవిర్భవించింది.
- 1967లో యాసర్ అరాఫత్ నాయకత్వంలోని పీఎల్‌ఓ ఇజ్రాయిల్ పై దాడి చేయాల్సిందిగా అరబ్బు దేశాలపై ఒత్తిడి చేసింది.
- 1972 సెప్టెంబర్‌లో మ్యూనిచ్ ఒలంపిక్స్‌లో ఇజ్రాయిల్‌కు చెందిన ఒలంపిక్ బృందాన్ని అపహరించి అనేక మంది క్రీడాకారులను చంపేశారు.
- యాసర్ అరాఫత్ 2004లో చనిపోయాడు.
- గల్ఫ్ (మధ్యప్రాచ్యం) ప్రాంతంలో జాతీయతా వాదం పెరిగింది.
- 1968లో ఇరాక్‌లో తిరుగుబాటు చేసి సద్దాం హుస్సేన్ అధికారంలోకి వచ్చాడు. ఇతడి నినాదాలు-అరబ్బు జాతీయవాదం, సోషలిజం.
- 1979లో ఇరాన్‌లో విప్లవం సంభవించింది.
- ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వ చ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
- తాలిబన్ ఉగ్రవాదులు అమెరికాకు చెందిన రెండు విమానాలను హైజాక్ చేసి వాటితో న్యూయార్‌కలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం (డబ్ల్యూటీసీ)లోకి దూసుకెళ్లడంతో వేలాది మంది చనిపోయారు.
- కాలం గడుస్తున్న కొద్ది అమెరికా, యూఎస్‌ఎస్‌ఆర్‌లోని ప్రజలు ఆయుధాలను తగ్గించి, అణ్వాయుధాలు నాశనం చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు.
- 1985-9191 మధ్య అణు పరీక్షలపై నిషేధం విధించారు.
- యూఎస్‌ఎస్‌ఆర్‌లో మిఖాయిల్ గోర్బచేవ్ అధ్యక్షుడుగా ఎన్నికైనా తర్వాత అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టాడు. వీటిని ‘గ్లాస్‌నోస్ట్’ , ‘ పెరిస్ట్రోయికా’గా పిలుస్తారు.
- 1991లో బోరిస్ ఎల్సిన్ అధ్యక్షునిగా ఉన్న కాలంలో యూఎస్‌ఎస్‌ఆర్ రద్దయింది.
భారత దేశం
- గాంధేయవాద సిద్ధాంతాలైన శాంతి, అహింస ఆధారంగా తన విదేశాంగ నీతిని భారతదేశం ఏర్పర్చుకుంది. అందుకనుగుణంగా అలీన విధానాన్ని అనుసరించింది.
- పొరుగు దేశాలు అనుసరించాల్సిన నీతి సూత్రాలను తెలుపుతూ ‘పంచశీల’ రూపొందించింది.
- 1949లో చైనా కమ్యూనిస్టు గణతంత్ర రాజ్యమైన తర్వాత దానిని గుర్తించిన తొలిదేశాలలో భారతదేశం ఒకటి.
- భారతదేశం, చైనా రెండుదేశాలు పంచశీల ఒప్పందంపై 1954 ఏప్రిల్ 29న సంతకాలు చేశాయి.
- భారత్, చైనాల మధ్య సరిహద్దు రేఖ ‘మెక్‌మోహన్ రేఖ’.
- భారత్, చైనాల మధ్య బఫర్ ప్రాంతం టిబెట్.
- 1950లో టిబెట్‌ని చైనా తనలో కలిపేసుకుంది.
- టిబెట్ బౌద్ధమత గురువు దలైలామా నాయకత్వంలో తిరుగుబాటు జరిగితే చైనా దాన్ని అణచివేసింది. దలైలామా భారతదేశంలో తలదాచుకున్నాడు.
- 1962లో చైనా భారత దేశంపై దాడి చేసింది.
- 1947లో బ్రిటిష్ ఇండియా విభజించడం ద్వారా భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాలు ఏర్పడ్డాయి.
- రెండుదేశాల మధ్య మొదటి యుద్ధం 1947-48లో కాశ్మీర్ కోసం జరిగింది.
- లాల్‌బహదుర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 1965లో పాకిస్థాన్ మరోసారి కాశ్మీర్ విషయంలో భారత్‌పై దాడి చేసింది. దీన్ని భారత్ తిప్పికొట్టింది.
- 1966లో తాష్కెంట్ ఒప్పందంతో యుద్ధం ముగిసింది.
- 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం మరోసారి పాకిస్థాన్‌తో యుద్ధం వచ్చింది.
- ఈ యుద్ధ ఫలితంగా తూర్పు పాకిస్థాన్ ప్రాంతం బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా ఏర్పడింది.
- 1972లో భారత, పాకిస్తాన్‌ల మధ్య ‘సిమ్లా ఒప్పందం’ జరిగింది.
- 1971లో భారత సైనికుల సహాయంతో విముక్తి పొందిన బంగ్లాదేశ్ భారతదేశంతో 25 సంవత్సరాల శాంతి ఒప్పందంపై సంతకం పెట్టింది.
- రెండు దేశాల మధ్య బ్రహ్మపుత్ర, గంగా నదీ జలాల పంపకం, చొరబాటు దారుల సమస్య మొదలైన అంశాలపై విభేదాలు ఉన్నాయి.
- భారతదేశానికి దక్షిణాన, హిందూమహాసముద్రంలోని ద్వీపం శ్రీలంక.
- శ్రీలంక 1948లో స్వాతంత్య్రం పొందింది.
- తమిళ ప్రజలు అధిక సంఖ్యలో శ్రీలంకలో స్థిర పడ్డారు. కాని వారికి ఎలాంటి హక్కులను, సౌకర్యాలను శ్రీలంక అందించలేదు. వీరు తీవ్రవాద పోరాటం జరిపారు.
- ఈ సమస్యను పరిష్కరించడానికి రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా భారత సైన్యాన్ని శ్రీలంకకు పంపడం జరిగింది. దీంతో రాజీవ్‌గాంధీని 1991లో తమిళ తీవ్రవాదులు హత్య చేశారు.
- తర్వాత కాలంలో శ్రీలంక తమిళ తీవ్రవాదులపై పూర్తిస్థాయి యుద్ధానికి దిగి అక్కడ తీవ్రవాదాన్ని అణచివేసింది.
4 మార్కుల ప్రశ్నలు-(విషయావగాహన)
- రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ అధికారంలో ఎలాంటి మార్పులు వచ్చాయి?
జ. రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగింది. ఈ యుద్ధం అనంతరం ప్రపంచ అధికారంలో వచ్చిన మార్పులను కింది విధంగా తెలపవచ్చు.
1) ఈ యుద్ధానికి ముందు బ్రిటన్, ఫ్రాన్‌స, జర్మనీలు ప్రపంచానికి నాయకత్వం వహించాయి. ఇవి అగ్ర రాజ్యాలుగా కొనసాగుతూ ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించాయి.
2) యుద్ధం వల్ల ఈ దేశాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అపారమైన ఆస్తి, ప్రాణనష్టం జరిగింది.
3) ఈ దేశాలు తమ ఆధీనంలో ఉన్న వలసరాజ్యాలను పరిపాలించలేక స్వాతంత్య్రం ఇవ్వక తప్పలేదు.
4) యుద్ధ రంగానికి దూరంగా ఉన్న అమెరికా ఈ యుద్ధం వల్ల నష్టపోలేదు. పైగా ఆదేశంలో పరిశ్రమలు, వ్యవసాయం వృద్ధి చెందాయి.
5) ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ డిమాండు ఉన్న కారణంగా అధిక ఉత్పాదకత, అధిక ఉపాధిని అమెరికా సాధించింది. ఈ చర్యల మూలంగా అమెరికా ఒక శక్తి వంతమైనదేశంగా అవతరించింది.
6) మరొవైపు యూరప్‌లోని రష్యాదేశం యుద్ధ రంగంలో పాల్గొని అపారనష్టాలను చవి చూసినప్పటికి త్వరలోనే వాటి నుంచి తేరుకుని శక్తివంతంగా తయారయ్యింది.
7) ఈ యుద్ధం తర్వాత ప్రపంచంలో రెండు ప్రధాన సైద్ధాంతిక, రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి.
8) అమెరికా నాయకత్వంలో ప్రజాస్వామిక-పెట్టుబడిదారీ కూటమి, రష్యా నాయకత్వంలో కమ్యూనిస్టు కూటమి ఏర్పడ్డాయి.
9) పశ్చిమ యూరపు దేశాలైన బ్రిటన్, ఫ్రాన్‌స, స్పెయిన్ వంటివి అమెరికా పక్షాన తూర్పు యూరప్ దేశాలైన పోలాండ్, హంగెరీ, తూర్పుజర్మనీ మొదలైనవి రష్యా పక్షాన నిలిచాయి.
10) ఈ రెండు కూటముల మధ్య 45 సంవత్సరాల పాటు ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది.
11) ఈ కాలంలో ఈ రెండు శిబిరాలు పరోక్షయుద్ధాలు, సైనిక ఒప్పందాలు, ఆయుధ పోటీ వంటి ఎత్తుగడలను అవలంబించాయి.
12) మరొవైపు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్య్రం సంపాదించుకున్న అనేక ఆసియా, ఆఫ్రికా, దేశాలు ఈ రెండు కూటములలో దేనిలో చేరకుండా ‘అలీన విధానాన్ని’ అనుసరించాయి. - ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి ఐక్యరాజ్య సమితి నిర్వహించే వివిధ పాత్రలు ఏవి?
జ. ఐక్యరాజ్య సమితి 1945, అక్టోబర్ 24న ఏర్పడింది. దీనిలో ఆరు ప్రధాన అంగాలున్నాయి. అనేక ప్రత్యేక అంగాలు ఉన్నాయి. వీటన్నిటీ ద్వారా ఐక్యరాజ్య సమితి పనిచేస్తోంది. ప్రపంచ శాంతిని నెలకొల్పడమే ఐ.రా.స ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ఇది ఈ కింది విధులను నిర్వర్తిస్తుంది.
1) శాంతి భద్రతలను కాపాడటం:-ప్రపంచ శాంతిని, దేశాల ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కృషి చేస్తోంది. ఇందుకోసం పనిచేసే అంగము ‘భద్రతాసమితి’ ప్రపంచంలోని అనేక దేశాల మధ్య వచ్చిన వివాదాలు పెద్దవి కాకుండా, యుద్ధానికి దారితీయకుండా శాంతి యుతంగా పరిష్కరించింది.
2) సాధారణ సభ:- ఇది ఐక్యరాజ్య సమితి ముఖ్య అంగము. అన్ని దేశాలకు సభ్యత్వం ఉంటుంది. ఇది ప్రపంచ పార్లమెంటులాగా పని చేస్తుంది.
3) విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక విషయాల పరిరక్షణ:- ఐక్యరాజ్య సమితి తన ప్రత్యేక అనుబంధ సంస్థ అయిన యూఎన్‌ఈఎస్‌సీఓ ద్వారా వివిధ దేశాల్లో విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేస్తోంది.
4) ఆరోగ్య పరిరక్షణ:-ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ బ్ల్యూహెచ్‌ఓ) ద్వారా వెనకబడిన దేశాల ప్రజలు ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు ఆరోగ్యపరిరక్షణకు కృషి చేస్తోంది.
5) పేదరిక నిర్మూలన:-వెనకబడిన దేశాలలో పేదరిక నిర్మూలన కోసం ఆర్థిక, సాంఘిక మండలి ద్వారా కృషి చేస్తోంది.
6) బాలల హక్కుల పరిరక్షణ:-ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పిల్లలు ముఖ్యంగా వెనకబడిన దేశాలకు చెందిన పిల్లల కోసం ‘అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి’ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది.
7) అంతర్జాతీయ న్యాయ స్థానం:-వివిధ దేశాల మధ్య వచ్చిన వివాదాలను విచారించి వాటికి శాంతియుత పరిష్కారం కనుక్కోనే విధంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని దిహేగ్‌లో ఏర్పాటు చేశారు.
8) అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) :-ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికుల సంక్షేమం కోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ పని చేస్తుంది.
ఈ విధంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం వివిధ పాత్రలు నిర్వహిస్తూ ఉంటుంది. - సైనిక ఒప్పందాలతో అగ్రరాజ్యాలు ఎలా లాభపడ్డాయి?
జ. 1) రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, రష్యాలు పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన శిబిరాలుగా విడిపోయాయి.
2) ఈ రెండు శిబిరాలు ఒక దానిపై ఒకటి అనుమానంలో సైన్యాన్ని పెంచుకున్నాయి. ఆయుధాలు పెంచుకున్నాయి. అణ్వాయుధాలు కూడా ఉన్నాయి.
3) 1949లో అమెరికా తన మిత్రదేశాలతో కలిసి ఉత్తర అంట్లాంటిక్ సంధివ్యవస్థ (ఎన్‌ఏటీఓ)ను ఏర్పాటు చేసింది. ఇది ఒక సైనిక ఒప్పందం.
4) దీనికి ప్రతిగా రష్యా కమ్యూనిస్టు దేశాలతో కలిసి వార్సా ఒప్పందం కుదుర్చు కున్నాయి.
5) ఈ సైనిక ఒప్పందాల ద్వారా అగ్ర రాజ్యాల ప్రభావ పరిధి పెరిగి వాటికి ఈ కింద పేర్కొన్నవి అందుబాటులోకి వచ్చాయి.- చమురు, ఖనిజాలు వంటి కీలక వనరులు
- తమ ఉత్పత్తులకు మార్కెట్
- తమ పెట్టుబడులు పెట్టడానికి ప్రమాదకరం లేని ప్రదేశాలు.
- తమ సైనికులను, ఆయుధాలను ఉపయోగించడానికి సైనిక స్థావరాలు.
- తమ భావ జాలం వ్యాప్తి
- పెద్ద మొత్తంలోని సైనిక ఖర్చుకి ఆర్థిక మద్దతు.
- ప్రచ్ఛన్న యుద్ధం వల్ల ఆయుధపోటీ, ఆయుధ నియంత్రణ రెండూ ఎలా జరిగాయి?
జ. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం 1945 నుంచి 1991 వరకు కొనసాగింది. ఈ మధ్య కాలంలో వీరి మధ్య తీవ్రమైన ఆయుధపోటీ కొనసాగింది. అదే సమయంలో వాటికవి ఆయుధాలను నియంత్రించుకున్నాయి. ఈ పరిణామాలు కింది విధంగా ఉన్నాయి.
ఆయుధ పోటి:-
1) రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా, రష్యాలు పరస్పర విరుద్ధ సిద్ధాంతాలతో అగ్రరాజ్యాలుగా అవతరించాయి.
2) 1949 అమెరికా ఎన్‌ఏటీఓ ఒప్పందం చేసుకుంది. దీని ప్రతిగా రష్యా ‘వార్సా’ ఒప్పందాన్ని చేసుకుంది. ఇవి సైనిక ఒప్పందాలు.
3) ఈ ఒప్పందాల ప్రకారం అమెరికా, రష్యాలు వాటి మిత్ర దేశాలకు ఆయుధ సరఫరా చేశాయి.
4) అమెరికా, రష్యాలు రెండూ కూడా వేల కొద్ది అణ్వాయధాలు తయారు చేశాయి.
5) ఆయుధ పరిశోధనలు, ఖండాంతర్గత క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వలపైనా ఈ రెండు దేశాలు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి.
6) ఈ రెండు దేశాల దగ్గర ఈ ప్రపంచం మొత్తాన్ని పలుమార్లు మట్టుబెట్ట గల ఆణ్వాయుధాలు ఉన్నాయి.
7) కాలక్రమంలో వాటి మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్‌స, చైనాలు కూడా అణ్వాయుధాలను సమకూర్చుకున్నాయి.
ఆయుధ నియంత్రణ:-
1) ఒక వేళ యుద్ధమే చెలరేగితే మొత్తం నాగరికతకే ముప్పు తెచ్చే స్థాయిలో మానవ నష్టం జరుగుతుందని ఈ శిబిరాలకు తెలుసు.
2) కాలం గడుస్తున్న కొద్దీ ఈ రెండు దేశాల ప్రజలు ఆయుధ పోటీని తగ్గించి, అణ్వాయుధాలను నాశనం చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు.
3) ఇదే సమయంలో అలీన విధానాన్ని అనుసరిస్తున్న దేశాల నుంచి కూడా ఇలాంటి డిమాండే వచ్చింది.
4) ఫలితంగా ఈ రెండు దేశాలు సంప్రదింపులు జరిపి ఆయుధపోటీని, నిల్వలను తగ్గించుకోవలసి వచ్చింది.
5) 1985-1991 మధ్య అణు పరీక్షలపై నిషేదం విధించారు.
6) 1991లో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (ఎస్‌ఏఎల్‌టీ) మీద సంతకాలు చేశాయి.
7) 2001లో ఈ ఒప్పందం ప్రకారం తమదగ్గర నిల్వ ఉన్న ఆయుధాలలో 80 శాతం ఆయుధాలను తొలగించారు.
8) 1995లో సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం (comprehensive test ban treaty) జరిగింది. - ప్రపంచంలో ఘర్షణలకు కేంద్రంగా పశ్చిమాసియా ఎందుకు మారింది?
జ. పశ్చిమాసియా:-యూరప్, ఆసియా మధ్య ప్రాంతాన్ని పశ్చిమ ఆసియా అంటారు. దీనినే మధ్య ప్రాచ్యం అని కూడా అంటారు. ఇక్కడ ప్రధానంగా ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య నిత్యం ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీనికి కారణాలను కింది విధంగా చెప్పవచ్చు.
1) ఇక్కడ ప్రధానంగా అరబ్బులు, యూదులకు మధ్య ఘర్షణ కొనసాగుతోంది.
2) అరబ్బులు ఉంటున్న పాలస్తీనా ఒకప్పుడు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది. ఇక్కడి జెరూసలెం నగరం యూదులు, క్రైస్తవులు, ముస్లింలందరికీ పవిత్రమైనది.
3) ప్రాచీన కాలంలో యూదులను అక్కడి నుంచి వెళ్లగొట్టడంతో వారు యూరప్, ఆసియా అంతటా వలస పోయారు. క్రైస్తవులతో కూడా వీరికి విభేదాలున్నాయి. జర్మనీలో హిట్లర్ కాలంలో వీరు అనేకరకాలుగా హింసకి గురయ్యారు.
4) తమ ప్రాచీన దేశమైన పాలస్తీనాను తిరిగి పొంది, యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించడానికి యూదులలో ‘జియానిస్ట్ ఉద్యమం’ మొదలైంది.
5) అయితే అప్పటికే అక్కడ అరబ్బులు, ముస్లింలు నివసిస్తుండంతో యూదులకు వీరికి ఘర్షణ మొదలైంది.
6) అరబ్బు దేశాలలో పెద్ద ఎత్తున చమురు నిల్వలను కనుక్కోవడంతో ఈ సమస్య పెద్దదైంది. అమెరికా, రష్యాలు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నించాయి.
7) 1947లో ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం పాలస్తీనా దేశాన్ని విభజించి యూదులకు ‘ఇజ్రాయిల్’ అనే కొత్త దేశాన్ని ఇచ్చారు.
8) ఆ తర్వాత ఈ రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అరబ్బులు తమ ఆస్తులు, ఇళ్లు వదిలి ఇతర అరబ్బు దేశాలకు వలసపోవాల్సి వచ్చింది.
9) ఈజిప్టుకు అధ్యక్షుడు నాజర్ అరబ్బులను ఏకం చేయడానికి ప్రయత్నించాడు బ్రిటిష్, ఫ్రాన్‌సలకు వ్యతిరేకంగా తీవ్ర విధానాలు అనుసరించాడు.
10) ఈజిప్టుకు రష్యా నుంచి సహాయం అందింది. ఈ మద్దతుతో నాజర్ సూయజ్ కాలువను జాతీయం చేశాడు.
11) 1956లో ఇజ్రాయిల్ ఈజిప్టుపై దాడి చేసింది. 1967లో అరబ్బులు ఇజ్రాయిల్‌పై దాడి చేశారు.
12) 1964లో పాలస్తీనా విముక్తి సంఘం (పీఎల్‌ఓ) ఆవిర్భవించింది. దీని ప్రధాన నాయకుడు యాసర్ అరాఫత్.
13) వీరు శాంతియుత పద్ధతులతో పాటు హింసాత్మక పద్ధతులు అనుసరించి ఇజ్రాయిల్‌పై పోరాటం చేశారు.
14) విమానాల హైజాకింగ్, ఇజ్రాయిల్‌కు చెందిన ఒలంపిక్ బృందాన్ని అపహరించడం, చంపడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
15) దాడులు, ప్రతి దాడులతో ఈ ప్రాంతంలో నిత్యం యుద్ధ వాతావరణం కొనసాగుతోంది.
చివరకు యాసర్ అరాఫత్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టి శాంతి యుత పద్ధతులతో ఇజ్రాయిల్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అయినా పాలస్తీనియన్లు ఇంకా గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటున్నారు. - 20వ శతాబ్దం చివరి నాటికి ఒక్క దేశమే ప్రపంచం మీద పెత్తనం వహిస్తోంది. ఈ నేపథ్యంలో అలీనోద్యమం పాత్ర ఏమై ఉంటుంది?
జ. 20వ శతాబ్దం చివరినాటికి ఏకైక అగ్ర రాజ్యంగా అమెరికా అవతరించింది. దాదాపు 45 సంవత్సరాల పాటు కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం 1991లో యూఎస్‌ఎస్‌ఆర్ పతనంతో ముగిసింది. ఇదే సమయంలో క్రమక్రమంగా ఎదుగుతూ వస్తున్న ‘అలీనోద్యమం’ పాత్ర కీలకంగా మారింది.
1) అమెరికా, రష్యా కూటములలో దేనిలో చేరకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కలిగి ఉండటమే అలీన విధానం.
2) 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్‌లో జరిగిన ఆసియా, ఆఫ్రికాదేశాల సమావేశంలో అలీనోద్యమానికి రూపకల్పన చేశారు. ఇందులో మన ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కీలక పాత్ర వహించారు.
3) 1961లో యుగోస్లోవియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో అలీన దేశాల మొదటి సమావేశం జరిగింది.
4) రెండు అగ్రరాజ్యాలు పోటీపడుతూ వివిధ దేశాలను తమవైపుకి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారతదేశం వంటి దేశాలు స్వతంత్ర వైఖరిని వ్యక్తపరచడానికి అలీనోద్యమం తోడ్పడింది.
5) మొదట రెండు అగ్రరాజ్యాలు అలీనోద్యమాన్ని అనుమానపు దృష్టితో చూశాయి.
6) అలీన దేశాల సంఖ్య ప్రారంభంలో 25 మాత్రమే ఉండగా తర్వాత కాలంలో అది 125కు చేరుకుంది.
7) 1991లో యూఎస్‌ఎస్‌ఆర్ పతనమైన తర్వాత అలీనోద్యమం పాత్ర ఇంకా పెరిగింది.
8) అమెరికా, రష్యాలు రెండూ కూడా అలీన దేశాలు అనుసరిస్తున్న విధానాలను గుర్తించాయి.
9) ప్రపంచంలో దాడులకు గురిైయెున దేశాలకు, జాతి వివక్షతకు గురిైయెున దేశాలకు, అలీన దేశాలు అండగా నిలబడ్డాయి.
10) పేదరికం, అనారోగ్యం, వలసవాదం, అసమానత్వం మొదలైనవి నిర్మూలించడానికి అలీన దేశాలు కృషి చేస్తున్నాయి.
11) ప్రపంచ శాంతి నెలకొల్పడంలో అలీన దేశాల పాత్ర కీలకమైనది.
12) అలీన దేశాలు లేకపోతే అమెరికా, రష్యాల మధ్య కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధం ప్రత్యక్ష యుద్ధంగా మారి ఉండేది.
13) మానవ హక్కుల పరిరక్షణకు, బాలల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ మొదలైన వాటిలో ఐక్యరాజ్య సమితి చేస్తున్న ప్రయత్నాలకు అలీన దేశాలు ఎంతో సహకరిస్తున్నాయి. - భారత దేశానికి పొరుగు దేశాలతో ఈ దిగువ అంశాలతో సంబంధాన్ని చూపడానికి ఒక పట్టిక తయారు చేయండి?
1) ఘర్షణకు కారణమైన అంశాలు
2) యుద్ధ సంఘటనలు
3) సహాయ, సహకారఘటనలు.భారత పొరుగుదేశం
ఘర్షణకు కారణమైన అంశాలు
యుద్ధ సంఘటనలు
సహాయ, సహకార ఘటనలు
చైనా
1) జమ్మూ - కాశ్మీర్ , సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లతో సరిహద్దు వివాదం 2) టిబెట్ వివాదం
1) 1962లో భారత్‌పై చైనా దాడి, భారత్ ప్రతి దాడి
1) 1954లో పంచశీల ఒప్పందం 2) ఇటీవలి కాలంలో రెండు దేశాల ప్రధానమంత్రులు చేసుకున్న ఒప్పందాలు
పాకిస్తాన్
1) కాశ్మీర్ సమస్య 2) సరిహద్దు వివాదాలు 3) తీవ్రవాద సమస్య 4) నదీ జలాల పంపకం సమస్య
1) 1941-48లో కాశ్మీర్ విషయంలో యుద్ధం 2) 1965లో కాశ్మీర్ విషయంలో యుద్ధం 3) 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం యుద్ధం 4) 1998-99లో కార్గిల్ ఆక్రమణ సందర్భంగా యుద్ధం
1) 1965లో తాష్కెంట్ ఒప్పందం 2) 1972లో సిమ్లా ఒప్పందం 3) వాణిజ్యం, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక రంగాలలో సహకారం
బంగ్లాదేశ్
1) సరిహద్దు సమస్య 2) చొరబాటు సమస్య 3) నదీ జలాల పంపకం సమస్య
1) 1971లో పాకిస్తాన్ నుంచి వేరుపడటానికి చేసిన పోరాటంలో భారతదేశం సహకరించి పాకిస్తాన్‌తో యుద్ధం చేసింది.
1) 1971లో బంగ్లాదేశ్ ఏర్పడిన వెంటనే 25 సంవత్సరాల శాంతి ఒప్పందం 2)వాణిజ్యం, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో సహకారం
శ్రీలంక
1) తమిళుల సమస్య
1) ప్రత్యక్ష యుద్ధం ఏదీ జరగలేదు 2) తమిళ తీవ్రవాదులను అణచివేయడానికి మన దేశ సైన్యం వెళ్లింది.
1) క్రీడలు, సాంస్కృతిక, పర్యాటకం మొద లైన విషయాల్లో సహకారం
4. మార్కుల ప్రశ్నలు-(చదివి వ్యాఖ్యానించడం) -
కింది పేరాను చదివి నీ అభిప్రాయాన్ని తెలుపుము?
ఆయుధ పరిశోధనలపైనా, ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వలపైనా అమెరికా, రష్యాలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశాయి. ఈ రెండు దేశాలలో ఒక్కొక్క దాని దగ్గర ప్రపంచాన్ని పలుమార్లు మట్టుబెట్టగల అణ్వాయుధాలు ఉన్నాయి. కాలక్రమంలో వాటి మిత్ర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్‌స, చైనాలు కూడా అణ్వాయుధాలను సమకూర్చుకున్నాయి. గూఢచర్యం, క్షిపణులను నిర్దేశించడంలో ఉపగ్రహాలు దోహదం చేయడంతో ఇప్పుడు పోటీ అంతరిక్షంలోకి కూడా విస్తరించింది. మొదటి ఉపగ్రహం అయిన స్పుట్నిక్‌ని రష్యా ప్రయోగించింది. అలాగే అంతరిక్షంలోకి మొదటి వ్యక్తి యూరిగగారిన్ ని రష్యా పంపించింది. దీంతో రెండు అగ్ర రాజ్యాల మధ్య ఉపగ్రహాలను ప్రయోగించడంలో పోటీ మొదలైంది. నీల్‌ఆర్‌మస్ట్రాంగ్‌ని , ఇతరులను చంద్రమండలం మీదికి పంపడంలో 1969లో అమెరికా సఫలమైంది.
జ. 1) ఈ పేరాగ్రాఫ్ అమెరికా, రష్యాల మధ్య జరిగిన ఆయుధపోటీ, అంతరిక్ష పోటీ గురించి తెలియజేస్తుంది.
2) రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1945 నుంచి ప్రపంచంపై ఆధిపత్యం కోసం ఈ రెండు దేశాలు పోటీ పడుతూ వచ్చాయి.
3) దీని కోసం తమ మిత్రదేశాలతో అనేక సైనిక ఒప్పందాలు చేసుకున్నాయి.
4) రెండు దేశాలు కూడా ఒక దానిని చూస్తూ మరొకటి ఆయుధ పరిశోధనలపైనా, ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వలపైనా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశాయి.
5) ఒక్కొక్క దేశం ప్రపంచాన్ని పలుమార్లు మట్టుబెట్టగల అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి అన్న విషయం వాస్తవం.
6) అంతేకాకుండా కొత్తగా అభివృద్ధి చెందిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇవి తమ పోటీకి ఉపయోగించుకున్నాయి.
7) గూఢచర్యం, క్షిపణులను నిర్దేశించటంలో ఉపగ్రహాలు దోహదం చేయడంతో పోటీ అంతరిక్షంలోకి విస్తరించింది.
8) రష్యా మొదటి ఉపగ్రహం స్పుట్నిక్, మొదటి వ్యక్తి యూరిగగారిన్‌ను అంతరిక్షంలోకి పంపగా అమెరికా ఒక అడుగు ముందుకేసి ఏకంగా వ్యక్తి (నీల్‌ఆర్‌మస్ట్రాంగ్)ని చంద్రమండలం మీదకి పంపింది.
9) ఆ తర్వాత కాలంలో అనేక ఉపగ్రహాలను ఇవి అంతరిక్షంలోకి పంపాయి. అంతేకాకుండా ఈ పరిజ్ఞానాన్ని తమ కూటమిలోని దేశాలకు అందించి అంతరిక్ష వ్యాపారాన్ని కూడా చేశాయి.
10) ఈ ప్రయోగాలతో ఒక దేశం చర్యలను మరొక దేశం నియంత్రిస్తూ, గూఢచర్యం చేస్తూ పోటీ పడ్డాయి.
ఈ విధంగా అమెరికా, రష్యాలు ఆయుధ పోటీ, అంతరిక్ష పోటీకి దిగి యుద్ధం అంచువరకు వెళ్లినప్పటికి ఒకదానిని మరొకటి నియంత్రణ చేసుకోవడం వల్ల, అలీన దేశాల ప్రభావం వల్ల ప్రత్యక్ష యుద్ధం జరగలేదు.
4-మార్కుల ప్రశ్నలు-సమాచార నైపుణ్యాలు - కింది గ్రాఫ్‌ను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు వ్రాయండి?
1955 సంవత్సరంలో అమెరికా వద్ద ఉన్న అణ్వాయుధ నిల్వలు సుమారు ఎన్ని?
ఏదేశం 1985 నాటికి అత్యధిక అణ్వాయుధ నిల్వలను సమకూర్చుకుంది?
1975-1985 మధ్య అమెరికా అణ్వాయుధ నిల్వలు పరిశీలించి నీవు ఏమి గమనించావు?
2005 నాటిని రెండు దేశాలు కూడా అణ్వాయుధ నిల్వలను భారీగా తగ్గించుకోవడానికి కారణమేంటి?
జ. 1) సుమారు 4000
2) రష్యా
3) కొద్దిపాటి హెచ్చు, తగ్గులతో దాదాపు స్థిరంగా ఉన్నాయి.
4) రెండు దేశాల మధ్య కుదిరిన అనేక అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాల ఫలితంగా వాటి నిల్వలను భారీగా తగ్గించుకున్నాయి. - కింది గ్రాఫ్‌ను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు వ్రాయుము?
ఈ గ్రాఫ్ దేని గురించి తెలియజేస్తుంది?
అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది?
ఏదేశం సైనిక ఖర్చు ఎక్కువగా ఉంది?
ఏదేశం సైనిక ఖర్చు ఆదేశ జీడీపీలో శాతంగా చూసినప్పుడు ఎక్కువగా ఉంది?
జ. 1) భారతదేశం, పాకిస్తాన్‌ల సైనిక ఖర్చు తెలియజేస్తుంది.
2) స్టాక్ హోంలో ఉంది.
3) భారతదేశం
4) పాకిస్తాన్
2-మార్కుల ప్రశ్నలు
- ఐక్యరాజ్య సమితి ముఖ్య ఆశయాలు ఏమిటి?
జ. ఐక్యరాజ్య సమితి ఆశయాలు:-
1) ప్రపంచ శాంతి, భద్రతలు కాపాడడం
2) ప్రపంచ దేశాలలో ముఖ్యంగా వెనకబడిన దేశాలలో విద్య, ఆరోగ్య వైజ్ఞానిక సదుపాయాలు మెరుగుపర్చడం.
3) మానవహక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడం
4) అంతర్జాతీయ నేరాలపై విచారించి న్యాయాన్ని అందించడం. - ‘వీటో అధికారం’ గురించి నీకేమి తెలుసు?
జ. వీటో అధికారం:-
1) ఐక్యరాజ్య సమితిలోని భద్రతా సమితిలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్‌స, చైనా దేశాలకు వీటో అధికారం ఉంది.
2) ఈ అధికారం ప్రకారం భద్రతా సమితి తీసుకున్న నిర్ణయాలను ఈ 5 దేశాలలో ఏ ఒక్క దేశం తిరస్కరించినా ఆ నిర్ణయం వీగిపోతుంది.
3) ఈ అధికారం వల్ల ఐక్యరాజ్య సమితిని ఏ ఒక్క దేశం తన నియంత్రణలో పెట్టుకోవడానికి వీలు కాలేదు.
4) అయితే కొన్ని సార్లు ఈ అధికారాన్ని తమ స్వలాభం కోసం ఉపయోగించుకున్నాయి.
5) తన ప్రత్యక్ష పాత్ర ఉన్న సంఘటనలలో ఐక్యరాజ్య సమితి ఎలాంటి చర్య తీసుకోకుండా అడ్డుకునేవి. - ప్రచ్ఛన్న యుద్ధ పరిణామాలు ఏవి?
జ. ప్రచ్ఛన్న యుద్ధ పరిణామాలు:-
1) రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1945 నుంచి 1990 వరకు 45 సంవత్సరాలు అమెరికా, రష్యాల మధ్య జరిగిన పరోక్ష యుద్ధమే ప్రచ్ఛన్న యుద్ధం.
2) ప్రత్యక్ష యుద్ధం జరగకపోయినప్పటికి ఏ రెండు చిన్న దేశాల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు ఈ అగ్రరాజ్యాలు చెరొక పక్షం వహించి ఘర్షణలు పెంచాయి.
3) ఈ కాలంలో జరిగిన చిన్న చిన్న యుద్ధాలలో దాదాపు రెండు కోట్ల మంది చనిపోయారు.
4) ఈ చనిపోయిన వాళ్ళలో దాదాపు అందరూ మూడో ప్రపంచపు దేశాల వాళ్లే.
ఉదా:- వియత్నాం, కొరియా, అంగోలా, ఆఫ్ఘనిస్తాన్
5) ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయి ఉండడం వల్ల భౌగోళికంగా పక్కపక్కన ఉన్న దేశాలు, ఒకే మూలాలు గల ప్రజలున్న దేశాలు శత్రువులుగా మారి వాటి మధ్య వినాశకర యుద్ధాలు చెలరేగాయి. - అలీనోద్యమ దేశాల మొదటి సమావేశం ఉద్దేశాలు ఏవి?
జ. అలీనోద్యమ దేశాల మొదటి సమావేశ ఉద్దేశాలు:-
అలీన విధానాన్ని అనుసరించే దేశాల మొదటి సమావేశం 1961లో యుగోస్లోవియాలోని బెల్‌గ్రేడ్‌లో
జరిగింది. దాని ముఖ్య ఉద్దేశాలు....
1) అలీనోద్యమ సభ్యదేశాల మధ్య సహకారం.
2) వలసపాలిత ప్రాంతాలకు విముక్తి కల్పించడం.
3) వలస పాలన నుంచి విముక్తి అయిన దేశాలు ఏ సైనిక శిబిరంలో చేరకుండా చూడడం
4) ప్రచ్ఛన్న యుద్ధ ప్రభావం మిగిలిన ప్రపంచ దేశాలపై పడకుండా చూడడం.
5) వివిధ దేశాల మధ్య వచ్చే తగాదాలు, ఘర్షణలు నివారించడానికి శాంతియుత పరిష్కారం కోసం కృషి చేయడం. - యూఎస్‌ఎస్‌ఆర్ గోర్బచెవ్ ప్రవేశ పెట్టిన సంస్కరణలు ఏవి?
జ. 1) యూఎస్‌ఎస్‌ఆర్ గోర్బచెవ్ అధికారంలోకి వచ్చాక రష్యా రాజకీయాలను మార్చడానికి ప్రయత్నించాడు.
2) అతడు ఉదారవాద సిద్ధాంతాలు కలవాడు. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాడు.
3) పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నించాడు.
4) కఠినమైన కమ్యూనిజం స్థానంలో కొద్దిపాటి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టాడు.
5) ఇతడు ప్రవేశ పెట్టిన సంస్కరణలను ‘గ్లాస్‌నోస్ట్’ ‘పెరిస్ట్రోయికా’గా వ్యవహరిస్తారు. - ‘పంచశీల’ సూత్రాలను తెలపండి?
జ. ‘పంచశీల’:-పంచశీల సూత్రాలను మన ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రతిపాదించారు.
1) ఒకరి సర్వసత్తాకతను, భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించడం.
2) ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం.
3) దాడులకు దిగక పోవడం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం.
4) అంతర్జాతీయ సంబంధాలలో పరస్పర గౌరవం, సహకారాల కోసం కృషి చేయడం.
5) శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడం. ఈ సూత్రాల ఆధారంగా 1954లో చైనాలో ఒప్పందం చేసుకోవడం జరిగింది.
1. మార్కు-ప్రశ్నలు
- ఐక్యరాజ్య సమితి ఏర్పడిన రెండు ప్రధాన ఉద్దేశాలు ఏవి?
జ. ఐక్యరాజ్య సమితి ప్రధాన ఉద్దేశాలు:-
1) శాశ్వత ప్రపంచ శాంతి
2) మానవ అభివృద్ధి - రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడ్డ రెండు ప్రధాన శిభిరాలు ఏవి?
జ. 1) యూఎస్‌ఎస్‌ఆర్ (రష్యా) నేతృత్వంలో ఏర్పడిన కమ్యూనిస్టు శిబిరం
2) అమెరికా నేతృత్వంలో ఏర్పడిన ప్రజాస్వామిక-పెట్టుబడిదారీ శిబిరం - NATO ను విస్తరించండి?
జ. NATO:-North Atlantic Treaty Organization, ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ - SEATO ను విస్తరించుము?
జ. SEATO:- South East Assian Treaty Organization, ఆగ్నేయాసియా సంధి వ్యవస్థ. - CENTO ను విస్తరించుము?
జ. CENTO:- Central Treaty Organization, కేంద్ర సంధి వ్యవస్థ. - చంద్రమండలం పైకి మొదటిసారిగా అమెరికా మనిషిని పంపింది దీనిపై నీఅభిప్రాయం ఏమిటి?
జ. అమెరికా 1969లో నీల్ ఆర్‌మస్ట్రాంగ్‌ను చంద్రమండలంపైకి పంపింది. ఇది ఆ దేశం సాధించిన గొప్ప ఘనతగా చెప్పవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ఇది పరాకాష్ఠ. - మూడో ప్రపంచ దేశాలు ఏ శిబిరంలో చేరకుండా అలీన విధానాన్ని అనుసరించాయి. దీన్ని నీవు ఏ విధంగా సమర్థిస్తావు?
జ. 1) రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్య్రం పొందిన దేశాలను మూడో ప్రపంచ దేశాలు అంటారు.
2) ఇవి అమెరికా, రష్యా శిబిరాలలో దేనిలో చేరకుండా అలీన విధానాన్ని అనుసరించడం ప్రపంచ శాంతికి ముందుడుగుగా నేను భావిస్తాను. - అలీన విధాన రూపకల్పనలో ముఖ్య పాత్ర వహించిన వారు ఎవరు?
జ. 1) జవహర్ లాల్ నెహ్రూ-భారతదేశం
2) గమల్ అబ్దుల్ నాసర్- ఈజిప్టు
3) జొసెఫ్‌బ్రిజ్ టిటో- యుగోస్లోవియా - పశ్చిమాసియా అంటే ఏ ప్రాంతం? దీనికి మరో పేరు ఏమిటి?
జ. 1) యూర ప్, ఆసియాల మధ్య ప్రాంతాన్ని పశ్చిమాసియా అంటారు.
2) దీనినే మధ్య ప్రాచ్యం అని కూడా అంటారు. - ‘జియానిస్ట్ ఉద్యమం’ అనగా నేమి?
జ. జియానిస్ట్ ఉద్యమం:-ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి తమ మాతృ భూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది, యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించటానికి యూదులు ప్రారంభించిన ఉద్యమమే ‘జియానిస్ట్ ఉద్యమం’. - సద్దాం హుస్సేన్ ఏ నినాదాలతో అధికారంలోకి వచ్చాడు?
జ. 1) జాతియా వాదం
2) సోషలిజం. - ‘ముక్తి బాహిని’ అంటే ఏమిటి?
జ. ముక్తి బాహిని:-పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ ప్రజలకు విముక్తి కలిగించడానికి ముజబుర్ రెహ్మన్ మద్దతుదారులు చేసిన పోరాటం. - తమిళ తీవ్ర వాదులకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం యుద్ధానికి దిగి మానవ హక్కుల ఉల్లంఘన, తీవ్ర రక్తపాతం సంభవించాయి. దీనిని ఏ విధంగా సమర్థిస్తావు?
జ. 1) తమిళ తీవ్ర వాదులు శ్రీలంకలో అనేక అల్లర్లు సృష్టించి శాంతికి విఘాతం కలిగించారు.
2) వారిని అణచి వేయడానికి శ్రీలంక ప్రభుత్వం యుద్ధానికి దిగింది. దీనిలో మానవ హక్కుల ఉల్లంఘన, రక్తపాతం జరిగి ఉండవచ్చు. దీని వల్ల శ్రీలంకలో తమిళ తీవ్రవాదులు ఉనికి కోల్పోయి శాంతి నెలకొంది. ఇది అభినందనీయమే.
1/2 మార్కు ప్రశ్నలు-బహుళైచ్ఛిక ప్రశ్నలు
- రెండో ప్రపంచ యుద్ధంలో అతితక్కువ నష్టం సంభవించిన దేశం?
1) రష్యా
2) అమెరికా
3) బ్రిటన్
4) జర్మనీ - ‘యుద్ధం వల్ల మనం ప్రపంచంలోకెల్ల శక్తి వంతమైన దేశంగా ఆవిర్భవించాం.. చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంతమైన దేశం మరొకటి లేదు’ అని అన్నది ఎవరు?
1) హారి ట్రూమన్
2) విన్‌స్టన్ చర్చిల్
3) జవహర్ లాల్‌నెహ్రూ
4) చౌ-విన్-లై - ఐక్యరాజ్యసమితి కి చెందిన భద్రతా సమితి శాశ్వత సభ్యత్వం లేని దేశం?
1) ఫ్రాన్స్
2) చైనా
3) ఇంగ్లండ్
4) భారతదేశం - ఇది అమెరికా కూటమికి చెందని దేశం?
1) బ్రిటన్
2) ఫ్రాన్స్
3) తూర్పు జర్మనీ
4) స్పెయిన్ - అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ద్ధం ఈ సంవత్సరంలో ముగిసింది అని చెప్పవచ్చా?
1) 1989
2) 1990
3) 1991
4) 1992 - కమ్యూనిస్ట్ నాయకుడైన పాట్రిక్ లుముంబా ఏ దేశస్థుడు?
1) కాంగో
2) క్యూబా
3) నైజీరియా
4) పోలండ్ - రష్యాతో సంబంధాలు తెంచుకోవాలని చైనా ఈ సంవత్సరంలో నిర్ణయించుకుంది?
1) 1960
2) 1965
3) 1966
4) 1971 - ఇది రష్యా దేశానికి చెందిన సైనిక ఒప్పందం?
1) ఎన్‌ఏటీఓ
2) ఎస్‌ఈఏటీఓ
3) సీఈఎన్‌టిఓ
4) వార్సా - అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహం ‘స్ఫుట్నిక్’ను పంపిన దేశం?
1) అమెరికా
2) ఫ్రాన్‌స
3) చైనా
4) రష్యా - అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మనిషి ?
1) యూరిగగారిన్
2) నీల్ ఆర్‌మస్ట్రాంగ్
3) రాకేష్ శర్మ
4) విలియం సార్జెంట్ - మొదటి ఆసియా-ఆఫ్రికా దేశాల సమావేశం ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ
2) బెల్‌గ్రేడ్
3) బాండుంగ్
4) కైరో - అలీన దేశాల మొదటి సమావేశం జరిగిన బెల్‌గ్రేడ్ ఏ దేశంలో ఉంది?
1) ఈజిప్టు
2) ఇండోనేషియా
3) యుగోస్లోవియా
4) శ్రీలంక - పశ్చిమాసియాలో ప్రధానంగా ఈ దేశాల మధ్య ఘర్షణలున్నాయి?
1) ఇరాన్-ఇరాక్
2) ఇజ్రాయిల్-పాలస్తీనా
3) భారత్-పాకిస్తాన్
4) జపాన్-కొరియా - సద్దాం హుస్సేన్ ఈ దేశానికి చెందినవాడు?
1) ఇరాక్
2) ఇరాన్
3) పాలస్తీనా
4) ఆఫ్ఘనిస్తాన్ - తాలిబన్లు ఈ దేశంలో తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు?
1) పాకిస్తాన్
2) బంగ్లాదేశ్
3) ఆఫ్ఘనిస్తాన్
4) పాలస్తీనా - రష్యాలో ‘గ్లాస్‌నోస్ట్ , పెరిస్ట్రోయికా’ వంటి సంస్కరణలను ప్రవేశ పెట్టింది ఎవరు?
1) బోరిస్ ఎల్సిన్
2) మిహాయిల్ గోర్బచెవ్
3) స్టాలిన్
4) పుతిన్ - చైనా కమ్యూనిస్టు గణతంత్ర రాజ్యం ఎప్పుడు అయింది?
1) 1947
2) 1948
3) 1949
4) 1950 - ‘పంచశీల’ ఒప్పందం పై భారత చైనాలు ఏ తేదీన సంతకాలు చేశాయి?
1) 1954 ఏప్రిల్ 29
2) 1955 ఏప్రిల్ 24
3) 1957 ఆగస్టు 29
4) 1951 అక్టోబర్ 24 - భారత చైనాల మధ్య ఉన్న బఫర్ ప్రాంతం ఏది?
1) నేపాల్
2) సిక్కిం
3) టిబెట్
4) భూటాన్ - ‘మెక్-మోహన్ రేఖ’ ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు రేఖ?
1) భారత్-పాకిస్తాన్
2) భారత్-చైనా
3) భారత్-నేపాల్
4) భారత్-బంగ్లాదేశ్ - 1965 భారత-పాకిస్తాన్‌ల యుద్ధానికి కారణం?
1) బంగ్లాదేశ్ విముక్తి
2) కాశ్మీర్ అంశము
3) తీవ్రవాద సమస్య
4) నదీ జలాల సమస్య - తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన భారత ప్రధాన మంత్రి?
1) ఇందిరా గాంధీ
2) జవహర్ లాల్ నెహ్రూ
3) గుల్‌జారీ లాల్ నందా
4) లాల్ బహుదుర్ శాస్త్రి - సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేసిన భారత్-పాకిస్తాన్ ప్రధాన మంత్రులు?
1) ఇందిరా గాంధీ-జుల్ఫీకర్ అలీ భుట్టో
2) ఇందిరా గాంధీ-ఆయుబ్‌ఖాన్
3) లాల్ బహుదుర్ శాస్త్రి-జుల్ఫీకర్ అలీభుట్టో
4) లాల్‌బహుదుర్ శాస్త్రి-ఆయుబ్ ఖాన్ - బ్రహ్మపుత్ర, గంగానదీ జలాల పంపకం విషయంలో ఈ దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి?
1) భారత్-పాకిస్తాన్
2) భారత్-బంగ్లాదేశ్
3) భారత్-నేపాల్
4) భారత్-భూటాన్ - భారత-శ్రీలంకాల మధ్య విభేదాలకు కారణమైన ప్రధాన అంశము?
1) చొరబాట్ల సమస్య
2) సముద్ర జలాలలో అధికార ప్రాంత వివాదం
3) తమిళుల సమస్య
4) ఏదీకాదు
జవాబులు
1) 2 2) 1 3) 4 4) 3 5) 3
6) 1 7) 1 8) 4 9) 4 10) 1
11) 3 12) 3 13) 2 14) 1 15) 3
16) 2 17) 3 18) 1 19) 3 20) 2
21) 2 22) 4 23) 1 24) 2 25) 3