ప్రజలు-నివాస ప్రాంతాలు
Sakshi Education
ముఖ్యాంశాలు:
- ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతినే నివాస ప్రాంతం అంటారు. ఇది మనం నివసించే, పనిచేసే భౌగోళిక ప్రదేశం. ఇందులో విద్య, మతపరమైన, వాణిజ్యం వంటి విభిన్న కార్యకలాపాలు ఉంటాయి.
- తొలి మానవులు వేట, సేకరణ ద్వారా ఆహారాన్ని సమకూర్చుకునే వాళ్లు. అందుకనే వాళ్లని సేకరించే వాళ్లు, వేటగాళ్లు అనే వాళ్లు. వారు సంచార జీవులు. కాలక్రమంలో వారు వ్యవసాయం చేయడం వల్ల ఒక ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
- జనాభా పెరగడంతో నేత, కుండల తయారీ, లోహ పనిముట్లు తయారీ లాంటి వివిధ వృత్తులు పెరిగాయి. ఫలితంగా వర్తకం పెరిగింది. పట్టణ నివాస ప్రాంతాలు, అంటే వ్యవసాయేతర పనులు చేసే ప్రజలు ఉండే ప్రాంతాలుగా విస్తరించాయి.
- భారతదేశాన్ని పరిపాలించిన అనేక రాజ్యాలకు ఢిల్లీ కేంద్రంగా ఉంది. దేశ రాజధాని కావడం, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం వల్ల అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.
- ప్రతి నగరానికి వివిధ రకాల ప్రాంతాలు రూపొందించడానికి, కేటాయించడానికి సాధారణంగా ఒక మాస్టర్ ప్రణాళిక ఉంటుంది. వాస్తవానికి ఢిల్లీ ప్రణాళికబద్ధంగా పెరగలేదు.
- ప్రదేశం ఒక ప్రాంత లక్షణాలను తెలియ చేస్తుంది- మిట్ట పల్లాలు,సముద్రానికి ఎంత ఎత్తులో ఉంది, నీటి అంశాలు, నేల రకాలు, భద్రత, ప్రకృతి శక్తుల నుంచి రక్షణ మొదలైన అంశాలుంటాయి.
- ‘పరిస్థితి’ ఒక ప్రాంతం ఇతర ప్రదేశాలతో కలిగివున్న సంబంధాలను తెలియ చేస్తుంది.
- విశాఖ పట్టణానికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. వలస పాలకుల కంటే ముందు అనేక వంశాలు దానిని పరిపాలించాయి.
- ముంబై, చెన్నై వంటి నగరాలను పాలకులు భారతదేశ సహజ వనరులను కొల్లగొట్టడానికి మరింత అభివృద్ధి చేశారు.
- భారతదేశంలో 35 కోట్ల మంది ప్రజలు అంటే జనాభాలో మూడింట ఒక వంతు, నగరాలు, పట్టణాలలో నివసిస్తున్నారు. ప్రజలు ఎక్కువగా వ్యవసాయేతర పనులు చేపడుతూ నగరాలు, పట్టణాలలో నివాసం ఏర్పటు చేసుకుంటున్నారు.
కీలక పదాలు:
- నివాస ప్రాంతం: ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతినే నివాస ప్రాంతం అంటారు.ఇది మనం నివసించే, పనిచేసే భౌగోళిక ప్రదేశం. ఇందులో విద్య, మతపరమైన, వాణిజ్యం వంటి విభిన్న కార్యకలాపాలు ఉంటాయి.
- స్థలం: స్థలం లేదా ప్రదేశం ఒక ప్రాంత లక్షణాలను తెలియజేస్తుంది-మిట్ట పల్లాలు, సముద్రానికి ఎంత ఎత్తులో ఉంది, నీటి అంశాలు, నేల రకాలు, భద్రత, ప్రకృతి శక్తుల నుంచి రక్షణ వంటివి.
- పరిస్థితి: ప్రాంతాలు ఒంటరిగా ఉండవు. ఏదో ఒక విధంగా వాటికి ఇతర ప్రదేశాలతో సంబంధం ఉంటుంది.‘పరిస్థితి’ ఇతర ప్రదేశాలతో కలిగివున్న సంబంధాలను తెలియజేస్తుంది.
- పట్టణ, గ్రామీణ: పట్టణం నగరాలు, పట్టణాలు వున్న ప్రాంతాలు. కేవలం గ్రామాలతో వున్న ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలుగా వ్యవహరిస్తారు.
- మహానగరాలు(mega cities): కోటి జనాభాకి మించి ఉన్న నగరాలు. ఉదాహరణ-ఢిల్లీ, ముంబై.
- మెట్రోపాలిటిన్ నగరాలు: పది లక్షలు- కోటి మధ్య జనాభా ఉన్న నగరాలు.ఉదాహరణ- చెన్నై, హైదరాబాద్.
- విమానాశ్రయనగరాలు(ఏరోట్రోపొలిస్): పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడిన నగరాలు.
వ్యాసరూప ప్రశ్నలు:
1. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంతో మానవ జీవన శైలి ఎలా మారింది?
జ:
1. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంతో మానవ జీవన శైలి ఎలా మారింది?
జ:
- స్థిర నివాసంవలన మానవ జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి.
- ఆహారం సంపాదించుకోవడం కోసం వాళ్లు చాలా దూరం తిరగాల్సిన పని తప్పింది.
- ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం నివసించడానికి వీలు కలిగింది.
- సేకరణ నుంచి ఆహారోత్పత్తి దశకు రావడం వల్ల స్థిర నివాసం అవసరం కలిగింది.
- వ్యవసాయాభివృద్ధి వల్ల వీరు ప్రకృతిలోని రీతులను అవగాహన చేసుకున్నారు.
- ఆకాశంలో గ్రహాల కదలికలు వంటివి గమనించడానికి వాళ్లకి తీరిక సమయం చిక్కింది.
- స్థిరనివాసం వల్ల జనాభా పెరిగింది.
- నేత, కుండల తయారీ, లోహ పనిముట్లు తయారీ లాంటి వివిధ వృత్తులు పెరిగాయి.
- ఉత్పత్తి చేసే వస్తువుల రవాణా సంఖ్య పెరిగి వర్తకం పెరిగింది.
- పట్టణ నివాస ప్రాంతాలు పెరిగాయి.
2. పదేశం, పరిస్థితి అంశాలను నిర్వచించండి. మీరు ఉంటున్న ప్రాంతం నుంచి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
జ:
జ:
- ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మూడు మౌలిక విషయాలు పరిశీలించాలి.
a) ప్రదేశం - ప్రదేశం ఒక ప్రాంత లక్షణాలను తెలియ చేస్తుంది-మిట్ట పల్లాలు, సముద్రానికి ఎంత ఎత్తులో ఉంది, నీటి వనరులు, నేల స్వభావం, భద్రత, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ మొదలైనవి.
b) పరిస్థితి - ప్రాంతాలు ఒంటరిగా ఉండవు. ఏదో ఒక విధంగా వాటికి ఇతర ప్రదేశాలతో సంబంధం ఉంటుంది. ‘పరిస్థితి’ ఇతర ప్రదేశాలతో కలిగివున్న సంబంధాలను తెలియ చేస్తుంది.
c) ఆ ప్రదేశం చరిత్ర - ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర, సంస్కృతులు వుంటాయి. - ప్రాచీన కాలంలో నీటి సరఫరా బాగా వున్న ప్రదేశాలను శత్రువుల నుంచి రక్షణనిచ్చే ప్రాంతాలను నివాసానికి యోగ్యమైనవిగా ఎంపిక చేసే వాళ్లు.
- ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలోని ప్రతాప్‌ఘడ్ కోట ఎత్తులో వుండి సైనికపరంగా భద్రతను కలిగి వుంది.
- విశాఖ తీర ప్రాంతం భారతదేశం లోపల, బయట అనేక ప్రదేశాలతో అనుసంధానం చేసి ఉంది.
- రేవులు నిర్మించే అవకాశం ఉన్నందు వల్ల పాలకులు తీరప్రాంతాలకు అధిక ప్రాముఖ్యతను ఇచ్చారు.
- ముంబై, చెన్నై వంటి నగరాలను పాలకులు భారతదేశ సహజ వనరులను కొల్లగొట్టడానికి అభివృద్ధి చేశారు.
సంక్షిప్త సమాధాన ప్రశ్నలు:
1. నివాస ప్రాంతం అంటే ఏమిటి? ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతినే నివాస ప్రాంతం అంటారు. ఇది..
1. మనం నివసించే, పనిచేసే భౌగోళిక ప్రదేశం.
2. నివాస ప్రాంతంలో విద్య, మతపరమైన, వాణిజ్యం వంటి విభిన్న కార్యకలాపాలు ఉంటాయి.
2. వివిధ ప్రాంతాలను భారతదేశ జనాభా గణన విభాగం ఎలా నిర్వచిస్తోంది? పరిమాణం, అంశాలరీత్యా వాటిని ఎలా వ్యవస్థీకరిస్తోంది?
- భారతదేశ జనాభా గణన కొన్ని ప్రామాణికాల ఆధారంగా నివాస ప్రాంతాలను వర్గీకరిస్తుంది.
- రెవెన్యూ గ్రామం లోపల కొన్ని ఇళ్లను ఆవాస ప్రాంతాలుగా, నిర్దిష్ట సరిహద్దులు వుంటే రెవెన్యూ గ్రామాలుగా, 5000 నుంచి ఒక లక్ష మధ్య జనాభా వున్న పట్టణ ప్రాంతాలను పట్టణాలుగా వర్గీకరిస్తారు.
- ఒక లక్ష - పది లక్షల మధ్య జనాభా వుంటే క్లాస్-1 నగరాలుగా, పది లక్షల - కోటి మధ్య జనాభా వుంటే మెట్రోపాలిటన్ నగరాలుగా, కోటి జనాభా మించి వున్న నగరాలను మహానగరాలుగా వర్గీకరించారు.
నివాస ప్రాంత రకం | ఉపయోగించిన ప్రామాణికాలు | ఉదాహరణలు |
మహానగరాలు(mega cities) | కోటి జనాభాకి మించి ఉన్న నగరాలు |
ముంబై మహానగర ప్రాంతం(1.84 కోట్లు)
ఢిల్లీ మహానగరం (1.63 కోట్లు) కోల్‌కతా మహానగరం (1.41 కోట్లు) |
మెట్రోపాలిటన్ నగరాలు / పది లక్షలు దాటిన నగరాలు | పది లక్షల - కోటి మధ్య జనాభా వున్న నగరాలు |
చెన్నై (86 లక్షలు)
హైదరాబాదు ( 78 లక్షలు) అహ్మదాబాదు(62 లక్షలు) |
క్లాస్-1 నగరాలు | ఒక లక్ష - పది లక్షల మధ్య గల జనాభా ఉన్న పట్టణ ప్రాంతాలు | మీ టీచరు సహాయంతో ఈ కోవలో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలను గుర్తించి వాటి జనాభా ఇవ్వండి. |
పట్టణాలు | 5000 నుంచి ఒక లక్ష మధ్య గల జనాభా ఉన్న పట్టణ ప్రాంతాలు | మీ టీచరు సహాయంతో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఇటువంటి మూడు పట్టణాలను పేర్కొని వాటి జనాభా ఇవ్వండి. |
రెవెన్యూ గ్రామాలు | నిర్దిష్ట సరిహద్దులు ఉన్న గ్రామం | మీ టీచరు సహాయంతో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఇటువంటి మూడు గ్రామాలను పేర్కొని వాటి జనాభా ఇవ్వండి. |
ఆవాస ప్రాంతాలు | రెవెన్యూ గ్రామం లోపల కొన్ని ( హామ్లెట్) ఇళ్ల సముదాయం | మీ రెవెన్యూ గ్రామాలు లేదా చుట్టుపక్కల ఉన్న రెవెన్యూ గ్రామాలలో ఒకటి, రెండు హామ్లెట్‌ను మీ టీచరు సహాయంతో గుర్తించండి. |
నివాస ప్రాంతాల వర్గీకరణ
-------------diagram -----------------
3. విమానాశ్రయ నగరం అంటే ఏమిటి? దాని నిర్మాణ స్వరూపం ఏమిటి?
జ: పట్టణ ప్రాంతంలో విమానాశ్రయాల వల్ల ఏర్పడే సౌకర్యాలు, సదుపాయాలు వల్ల ప్రజలు విమానాశ్రయం చుట్టు పక్కల స్థిర నివాసాలు ఏర్పర్చుకోనేవారు. ఇలా అభివృద్ధి చెందిన ప్రాంతాలను ‘‘విమానాశ్రయ నగరాలు’’ గా వ్యవహారిస్తారు. ఈ ప్రాంతాలలో రవాణా, కమ్యూనికేషన్, విద్య, ఆరోగ్య, వైద్య ఇతర సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో వుంటాయి. హోటల్స్, షాపింగ్ మాల్స్, వినోదం, వ్యాపారం కొరకు సమావేశపు గదులు మొదలైనవి కలిగి వుంటాయి. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా వివిధ దేశాల నుంచి వ్యాపార ప్రముఖులు ఈ నగరాలకు విమానయానం ద్వారా వచ్చి భాగస్వామ్యులతో సమావేశాలు జరుపుటకు విమానాశ్రయ నగరాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి.
Published date : 09 Oct 2023 10:28AM