Skip to main content

పెద్ద స్టీలు గిన్నెను, స్టీలు గరిటెతో కొడితే వచ్చే శబ్దం గిన్నె నుంచా? లేక గరిట నుంచా?

శబ్దం ఎప్పుడూ కంపనాలు చేసే వస్తువు నుంచే వస్తుంది. ఉదాహరణకు, గుడిలో గంటను అందులో ఉండే సుత్తిలాంటి దానితో బాదినా, వీణలో బిగించిన తన్యతతో కూడిన తీగెను మీటినా లేక తబలాపై సాగదీసి అమర్చిన చర్మాన్ని చేతివేళ్లతో తట్టినా, వాటి నుండి కొద్ది సేపు శబ్దం స్థిరంగా వినబడుతుంది. అంటే, కంపనాలు స్థితిస్థాపకత కలిగి తన్యతతో ఉన్న వస్తువులలోనే జనిస్తాయి. ఈ కంపనాలను ‘స్వేచ్ఛా కంపనాలు’ అంటారు.

ఒకపెద్ద స్టీలు గిన్నెను మనం స్టీలు గరిటతో కొట్టినపుడు తన్యతతో ఉన్న గిన్నె నుండి స్వేచ్ఛా కంపనాలు వెలువడుతాయి. వీటికితోడు గిన్నెలో ఉండే గాలిలో బలాత్కృత కంపనాలు జనించడంతో శబదతీవ్రత ఎక్కువగా ఉంటుంది. స్టీలు గరిటలో కూడా కొన్ని కంపనాలు జనించినా, మనం గరిటను పట్టుకొని ఉండడంతో ఆ కంపనాలు తద్వారా జనించే శబ్దం చేతిలోనే లీనమైపోతుంది.

అదే స్టీలు గరిటను మనం కొంత ఎత్తు నుంచి వదిలేస్తే.. అది సిమెంట్ చేసిన గచ్చు నేలపై పడినపుడు ‘ఘల్లు’ మనే శబ్దం వస్తుంది. ఈ శబ్దం గరిట చేసే స్వేచ్ఛా కంపనాల వల్ల వస్తుంది.

- లక్ష్మీ ఈమని
Published date : 20 Jul 2013 04:50PM

Photo Stories