Skip to main content

ఆకాశంలో మెరుపులు వస్తున్నప్పుడు రేడియోలో గరగర.. శబ్దాలు వస్తుంటాయి. ఎందుకు?

విద్యుత్ ఆవేశాలు ఆడే ఆటల ప్రభావమే ఈ గరగర శబ్దాలు. అదెలాగంటే..
ఏదైనా వస్తువును మరొక వస్తువుతో రుద్దితే, ఘర్షణ ప్రభావం వల్ల ఆ వస్తువులు విద్యుదావేశాలను సంతరించుకొంటాయి. వాతావరణ పీడనంలో తటాలున సంభవించే మార్పుల వల్ల, ఆకాశంలోని మేఘాలకు కదలిక వస్తుంది. అప్పుడు మేఘాలలో ఉండే నీరు, మంచు ముక్కలు కొంతవేగంతో చెల్లా చెదురవుతాయి. ఈ తీవ్రమైన చలనం వల్ల నీరు, మంచు ముక్కల మధ్య జరిగే ఘర్షణ మూలంగా మేఘాలకు విద్యుదావేశం కలుగుతుంది. ఈ ప్రక్రియలవల్ల మేఘాలకు రుణావేశం సంక్రమిస్తే, భూమిపై ఉండే వస్తువులకు ధనావేశం సంక్రమిస్తుంది. ఈ వ్యతిరేక విద్యుదావేశాల మధ్య అనుసంధానం కుదిరితే ఒక్కసారిగా అతి తీవ్రమైన విద్యుత్ ఉత్సర్గం వెలువడుతుంది. అదే... ప్రకాశవంతమైన మెరుపు.. తీవ్రమైన ఎలక్ట్రిక్ స్పార్క్! ఈ స్పార్క్ వల్ల విద్యుత్ అయస్కాంత తరంగాలు ఏర్పడతాయి.
మనం రేడియో వింటున్నప్పుడు రేడియో స్టేషన్ నుంచి మన రేడియోలోకి ప్రసారమయ్యేవి ఈ విద్యుదయస్కాంత తరంగాలే. రేడియో స్టేషన్‌లో ధ్వనితరంగాలను విద్యుత్ ఆయస్కాంత తరంగాలుగా మారుస్తారు. మనరేడియో, రేడియో స్టేషన్ నుంచి అందుకొనే విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యము ఆకాశంలోని మెరుపుల వల్ల జనించే విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యం సమానంగా ఉంటే మెరుపు వల్ల జనించే తరంగాలు కూడా రేడియోలు వినిపిస్తాయి. అయితే.. మెరుపు వల్ల వచ్చే తరంగాల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల రేడియో నుంచి ‘గరగర’ మనే వింత శబ్దాలు వెలువడి మనం వినే ప్రోగ్రామ్‌కు అంతరాయం ఏర్పడుతుంది.

- లక్ష్మీ ఈమని
Published date : 13 Jul 2013 11:05AM

Photo Stories