Students Talent in Tenth Board: బోర్డు పరీక్షల్లో ఏపీ టెన్త్ విద్యార్థుల ప్రతిభ.. ఈసారి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో తెచ్చిన సంస్కరణల ఫలాలు పదో తరగతి ఫలితాల్లో మరోసారి ప్రస్ఫుటించాయి. ఒకప్పుడు కార్పొరేట్ విద్యా రంగానికే పరిమితమైన అత్యుత్తమ ఫలితాలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు సొంతం చేసుకుంటున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు, బైజూస్ కంటెంట్ ట్యాబ్‌లు, బైలింగ్యువల్ టెక్ట్స్‌బుక్స్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో అందించిన డిజిటల్ బోధన ఫలాలు టెన్త్ ఉత్తీర్ణతలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పదో తరగతి ఫలితాల్లో గతేడాదితో పోలిస్తే 14.43 శాతం అధిక ఉత్తీర్ణతతో విద్యార్థులు సత్తాచాటారు. 2023–24 పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 6,16,615 మంది విద్యార్థులు హాజరు కాగా 5,34,574 (86.69 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతలో మరోసారి బాలురపై బాలికలు పైచేయి సాధించారు. బాలురు 84.32 శాతం పాసవగా బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించారు. వంద శాతం ఉత్తీర్ణత పొందిన పాఠశాలలు గతేడాది 933 ఉండగా, ఈ ఏడాది ఏకంగా 2,803కు పెరిగాయి. 114 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 590కిపైగా మార్కులు సాధించారు.
550కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 18 వేల మంది వరకు ఉండటం విశేషం. సున్నా శాతం ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలల సంఖ్య 38 నుంచి 17కు తగ్గిపోవడం బలోపేతమైన విద్యా విధానానికి అడ్డం పడుతోంది. వీటిల్లో ఒక్కటే ప్రభుత్వ పాఠశాల కాగా, 13 ప్రైవేట్ అన్ ఎయిడెడ్, 3 ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఈసారి కూడా ఉత్తరాంధ్ర విద్యార్థులు అదరగొట్టారు. వరుసగా రెండో ఏడాది పార్వతీపురం మన్యం జిల్లా 96.37 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. 93.35 శాతంతో శ్రీకాకుళం రెండో స్థానంలో ఉంది.
కర్నూలు జిల్లా 62.47 శాతం అత్యల్ప ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగియక ముందే టెన్త్ ఫలితాలను విడుదల చేసి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగ్గా, ఏప్రిల్ 1 నుంచి 8 వరకు మూల్యాంకనం చేసి విద్యా సంవత్సరం ముగింపునకు ఒక్కరోజు ముందే ఫలితాలను ప్రకటించింది.
UPSC CMS 2024 Notification: 827 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. రాత పరీక్షలో రాణించే మార్గాలు ఇవే..
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ సోమవారం విజయవాడలో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కేసులేవీ నమోదు కాకుండా పరీక్షలను విజయవంతంగా నిర్వహించామన్నారు. 70 వేల మందికిపైగా సిబ్బంది పరీక్షల్లో భాగస్వాములైనట్టు చెప్పారు. ఈ ఏడాది అత్యధిక ఉత్తీర్ణతతో విద్యార్థులు రికార్డు నెలకొల్పారని తెలిపారు. ఫలితాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. నాలుగు రోజుల్లో పూర్తిస్థాయి మార్కుల జాబితా, మైగ్రేషన్ సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో, విద్యార్థి డిజీలాకర్‌లో కూడా ఉంచుతామని చెప్పారు. నిర్ణీత సమయంలోనే మార్కుల జాబితాలను పాఠశాలలకు పంపుతామన్నారు.
పరీక్షలో పాసవ్వని విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, వారికి విద్యా సంవత్సరం వృథా కాకుండా వచ్చే నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విద్యార్థుల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మస్థైర్యం, పట్టుదల నింపాలని సూచించారు. దీంతో పాటు రీ కౌంటింగుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1,000 రుసుమును చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంచేందుకే ర్యాంకుల సంస్కృతికి స్వస్తి చెప్పినట్టు వివరించారు. పాఠశాలలు మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి విద్యార్థికి ‘పెన్’ నంబర్
ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి పర్సనల్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్) పేరుతో యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయించామని తెలిపారు. దీని ద్వారా విద్యార్థి దేశంలో ఏ ప్రాంతానికైనా, ఏ యాజమాన్యానికైనా సులభంగా పాఠశాల మారవచ్చన్నారు. పాఠశాల, ఉన్నత విద్య నుంచి ఉద్యోగంలో చేరేవరకు విద్యార్థి వివరాలన్నీ పెన్ నంబర్ ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య, సమగ్ర శిక్ష ఏఎస్పీడీ కె.వి.శ్రీనివాసులు రెడ్డి, శామో డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి, పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవనంద రెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్ రెడ్డి, కేజీబీవీ సెక్రటరీ డి.మధుసూదన రావు, ఏపీఆర్‌ఐఈఎస్ సెక్రటరీ నరసింహారావు, ఏపీ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు, ఏపీ టెట్ జాయింట్ డైరెక్టర్ మేరీ చంద్రిక పాల్గొన్నారు.
మన ఆణిముత్యాలు
పేద పిల్లల్లో ప్రతిభను గుర్తించి, వారిని మరింతగా ప్రోత్సహించేందుకు, మిగతా పిల్లల్లో స్ఫూర్తిని నింపేందుకు జగన్ ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏటా టెన్త్, ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’గా గుర్తించి సత్కరిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహంతో విద్యార్థులు స్ఫూర్తి పొంది పట్టుదలతో చదివి, మంచి ఫలితాలు సాధిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2,803 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించి రికార్డు నెలకొల్పాయి.
ప్రభుత్వ పాఠశాలల్లోనూ అద్వితీయ మార్పులు వచ్చాయి. గతేడాది కేవలం 94 జిల్లా పరిషత్ పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధిస్తే, ఈ ఏడాది వాటి సంఖ్య 436కి పెరిగింది. అలాగే ఏపీ ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ పాఠశాలలు 4 నుంచి ఏకంగా 42కు, ఏపీ టీడబ్ల్యూఆర్ఈఐఎస్ పాఠశాలలు 9 నుంచి 28కి, కేజీబీవీలు 16 నుంచి 75కు, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు 11 నుంచి 54కు, ఆశ్రం పాఠశాలలు 40 నుంచి 69కు పెరిగాయి. రాష్ట్రంలోని 12 యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలలు ఏకంగా 98.43% ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచాయి.
ఇంగ్లిష్‌లో రాసి ఇరగదీశారు
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 4,50,304 మంది ఇంగ్లిష్ మీడియంలో రాయగా 4,15,743 (92.32శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. వాస్తవానికి ఈ ఏడాది పదో తరగతికి ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేయలేదు. కానీ, ప్రభుత్వం సబ్జెక్ట్ టీచర్లతో బోధన, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ అందించడంతో 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం వైపు ఆసక్తి చూపారు. స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నారు. ఏకంగా 2,23,270 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో టెన్త్ పరీక్షలు రాస్తే 1,96,067 (87.82 శాతం) మంది ఉత్తీర్ణులై రికార్డు సృష్టించారు. తెలుగు మీడియంలో 1,61,881 మంది పరీక్షలు రాస్తే 1,15,060 (71.08 శాతం) పాసయ్యారు.
Andhra Pradesh Schools: అమ్మ ఒడి.. సర్కారు బడి.. జగన్ ఇచ్చిన నమ్మకం
తల్లిదండ్రులపై భారం లేని విద్య
రాష్ట్రంలో పేదింటి బిడ్డలకు, వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా విద్యను అందించడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విజయం సాధించిందని విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఈ ఐదేళ్లలో విద్యా రంగం అభివృద్ధికి ఏకంగా రూ.73 వేల కోట్లు ఖర్చు చేయడం, వాటి ఫలితాలు కనిపిస్తుండటం భవిష్యత్తుకు శుభ సూచకంగా చెబుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ఇవ్వడం వల్ల తల్లిదండ్రులకు పుస్తకాలు, యూనిఫారం వంటి వాటి భారం తప్పింది.
ఫలితంగా విద్యార్థులు ప్రశాంతంగా పాఠశాలలకు వెళ్లి చదువుకోగల్గుతున్నారు. సకాలంలో అమ్మ ఒడి అందించడంతో డ్రాపవుట్లు తగ్గిపోయాయి. ‘మనబడి నాడు–నేడు’ పథకంతో రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలలు సమున్నతంగా మారాయి. కొత్త పాఠశాల భవనాలు, డబుల్ డెస్క్ బెంచీలు వంటి 12 రకాల సదుపాయాలు సమకూరాయి. పిల్లలకు మధ్యాహ్న భోజనంలో జగనన్న గోరుముద్ద కింద నాణ్యమైన పోషకాలతో కూడిన రుచికరమైన భోజనం అందుతోంది. దేశంలో ఈ తరహా భోజనం పిల్లలకు అందిస్తున్న రాష్ట్రం మరొకటి లేదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. దేశ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుతో పేదింటి పిల్లల చదువులు సమున్నత స్థాయికి చేరాయి. ఫలితంగా ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతం 72.74% నుంచి 86.69 శాతానికి వృద్ధి చెందింది.
10th Class Results: ప్రతిభ చాటిన పేదింటి పిల్లలు
► పరీక్షకు హాజరైన విద్యార్థులు 6,16,615
► ఉత్తీర్ణులు 5,35,574 మంది
► మొత్తం ఉత్తీర్ణత శాతం 86.69
► ఉత్తీర్ణులైన బాలికలు 89.17% ,బాలురు84.32%
► ప్రథమ శ్రేణి 4,27,067 మంది 69.26%
► ద్వితీయ శ్రేణి 73,200 మంది 11.87%
► తృతీయ శ్రేణి 34,307 మంది 5.56%
► ఏపీ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో ఉత్తీర్ణత 98.43%
► 100% ఉత్తీర్ణత సాధించిన స్కూళ్లు 2,803 గతేడాది 933
► సున్నా శాతం ఉత్తీర్ణత: 17 స్కూళ్లు.. గతేడాది: 38
► ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాసిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు 2.23 లక్షలు
► వీరిలో ఉత్తీర్ణులు 87.82 శాతం
► 590కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు 114 మంది
► 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 18 వేల మంది
► గతేడాది ఫెయిల్ అయిన వారిలో పరీక్ష రాసిన విద్యార్థులు 71,500 మంది
► ఉత్తీర్ణులైన వారు 29,373 మంది
అడ్వాన్స్ సప్లిమెంటరీ
అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు: మే 24 నుంచి జూన్ 3 వరకు
దరఖాస్తులు : మంగళవారం (నేటి) నుంచి పాఠశాలల హెచ్‌ఎంల ద్వారా ఆన్‌లైన్‌లో ఆలస్య రుసుము లేకుండా
దరఖాస్తు చివరి తేదీ : ఈ నెల 30
రూ.50 ఆలస్య రుసుముతో: మే 1 నుంచి 23 వరకు
Tags
- AP Tenth results
- Tenth Students
- poor students talent
- highest score in ap tenth board
- tenth results announcement
- ap tenth students talent
- ap tenth class results 2024
- 10th class results updates
- ap tenth supplementary
- students education
- talent and scores of tenth students
- topper in ap 10th board
- tenth supplementary schedule 2024 ap
- supplementary exam dates for ap tenth students
- applications for supplementary of ap tenth exams
- ap tenth supplementary exams 2024
- ap tenth exam supplementary dates
- highest percentage in girls of ap tenth class
- highest percentage in boys of ap tenth class
- education of students
- tenth results 2024
- School Education Commissioner S. Suresh Kumar
- tenth supplementary dates
- Education News
- Sakshi Education News
- amaravathi news
- andhra pradesh news