AP Govt To Issue Income, Caste Certificates to Students For Free: ఇంటికే ఫ్రీగా... ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు
మూడేళ్ల కిందటి వరకు వీటి కోసం విద్యార్థులు నానా తిప్పలు పడేవారు. పట్టణాలకో, మండల కేంద్రాలకో వెళ్లి మీ– సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేయాలి. ఒక్కొక్క సర్టిఫికెట్‌కు రూ. 40 నుంచి 50 వరకు ఫీజు చెల్లించాల్సి వచ్చేది. రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. లంచాలు సరేసరి.
సచివాలయాల రాకతో తగ్గిన వ్యయప్రయాసలు...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విప్లవాత్మకంగా తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో పేదలకు ఈ ఇబ్బందులు తప్పాయి. గ్రామంలో, వార్డుల్లో ఉండే సచివాలయాల్లోనే సర్టిఫికెట్ల జారీ ప్రారంభమైంది. ఇంటికి దగ్గరలోనే ఉండే సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకొంటే నాలుగైదు రోజుల్లో సర్టిఫికెట్లు వచ్చేవి. ఫీజు మామూలుగానే చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి, పేదలకు ఈమాత్రం కష్టంకూడా లేకుండా, అసలు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, పైసా ఖర్చు లేకుండా సర్టిఫికెట్లను ఇంటి వద్దకే అందజేసే ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ శాఖ సూచన మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఈ ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టింది.
జారీ ఇలా..
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో పది, ఇంటర్మీడియట్ విద్యార్థుల జాబితాలను రాష్ట్రంలో అన్ని సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోల మొబైల్ యాప్‌కు అనుసంధానం చేశారు. వీఆర్వోలు ఆ జాబితా ప్రకారం తమ పరిధిలోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితిని పరిశీలిస్తారు. దాని ఆధారంగా అర్హులందరికీ ఆదాయ, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీకి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ)కి నివేదిక ఇస్తారు. ఆర్‌ఐ పరిశీలన చేసి మండల తహసీల్దార్‌కు సిఫార్సు చేస్తారు. తహసీల్దార్ అర్హులకు సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్లను సచివాలయాల వారీగా డౌన్‌లోడ్ చేస్తారు. వలంటీర్లు విద్యార్థుల ఇళ్లకే వెళ్లి ఆ సర్టిఫికెట్లను అందజేస్తారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ సోమవారంలోగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనుంది.
టెన్త్‌లో 6 లక్షల మంది, ఇంటర్‌లో 10 లక్షల మంది...
రాష్ట్రంలో ఏటా పదో తరగతిలో 6 లక్షల నుంచి 6.5 లక్షల మంది, ఇంటర్ రెండు సంవత్సరాలు దాదాపు 10 లక్షల మంది చదువుతుంటారని అంచనా. వీరిలో దాదాపు 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారేనని అధికార వర్గాలు చెప్పాయి. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను ఇళ్ల వద్దే ఉచితంగా పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో 10లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతారని అధికారులు చెబుతున్నారు.
సచివాలయ వ్యవస్థ కారణంగానే ఈ వెసులుబాట్లు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కారణంగా రాష్ట్రంలో పరిపాలనలోనే విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అప్పటివరకు ప్రజలకు కష్టసాధ్యంగా ఉండే ప్రభుత్వ సేవలు కూడా ఇప్పుడు ఇంటి వద్దే అందుతున్నాయి. కుగ్రామంలో ఉండే ప్రజలు కూడా ఊరు దాటి బయటకు రావాల్సిన అవసరం లేకుండానే సేవలను ఈ ‘సచివాలయా’లే అందించాయి.