Skip to main content

పుస్తకాల నిలయం.. ఆట పాటల సమయం

మదనపల్లె సిటీ : వేసవి సెలవుల్లో ఆటపాటలు, విజ్ఞానంతో కూడిన శిక్షణ ఇవ్వడానికి గ్రంథాలయాలు సిద్ధమయ్యాయి. జిల్లాలోని శాఖా గ్రంథాలయాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జూన్‌ 11 వరకు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 10 నుంచి 15 ఏళ్లలోపు బాలబాలికలంతా వీటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
Home of books
పుస్తకాల నిలయం.. ఆట పాటల సమయం

గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. సమీపంలోని విద్యార్థులను రప్పించి గ్రంథాలయాల్లో రోజూ వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా పిల్లలకు విజ్ఞానం పెంపొందించే కార్యక్రమాలు, మానసిక వికాసానికి ఆటపాటలు నిర్వహిస్తుంటారు. ఒక్కో గ్రంథాలయంలో సగటున 50 మంది వరకు వచ్చి వీటిని వినియోగించుకుంటారు. సోమవారం నుంచి మొదలైన శిక్షణ కోసం అవసరమైన అన్ని ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీటిని నిర్వహిస్తారు. ఇందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులు కేటాయించింది.

ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల సహకారంతో చేపట్టేలా అధికారులు ఆదేశాలిచ్చారు. ప్రజాప్రతినిధులు, విశ్రాంత ఉద్యోగులు, రచయితలు తదితరుల సహకారం తీసుకోవాలన్నారు. శిక్షణకు సంబంధించి ఆయా అంశాల్లో అనుభవం ఉన్న వారిని గుర్తించి వారితో పిల్లలకు తర్ఫీదు ఇప్పించాలి. ఈ కార్యక్రమంపై ఇప్పటికే గ్రంథాలయాధికారులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఇటీవల పాఠశాలలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి కార్యక్రమాన్ని వివరించారు.

నిర్వహణ ఇలా..

● ఉదయం 8 గంటల నుంచి 8.30 వరకు కథలు వినడం

● 8.30 నుంచి 10 గంట వరకు పుస్తకాలు చదవడం, తర్వాత పది నిమిషాలు విరామం

● 10.30 నుంచి చదివిన అంశాలపై సమీక్ష

● 10.30 నుంచి 11 గంటల వరకు కథలు చెప్పడం

● 11 గంటల నుంచి 12 వరకు స్పోకెన్‌ ఇంగ్లీషు, క్రాఫ్ట్‌, నృత్యాలు, నాటికలు, బొమ్మలు తయారీ, ఆటలు ఆడించడం, అతిథులతో స్ఫూర్తిదాయక ప్రసంగాలు.

Published date : 09 May 2023 06:17PM

Photo Stories